4 వేల ఏళ్ల నాటి శ్మశానం!
పాలస్తీనాలోని బెత్లెహాం సమీపంలో 4 వేల ఏళ్ల నాటి శ్మశానాన్ని పురావస్తు శాస్త్రవేత్తలు కనుగొన్నారు. ఓ కొండ పక్కనే ఇది ఉంది. పారిశ్రామిక పార్కు కోసం తవ్వకాలు జరుపుతున్నప్పుడు ఇది బయటపడింది. సుమారుగా క్రీస్తుశకం 2200, 650 సంవత్సరాల మధ్య దీన్ని ఉపయోగించి ఉంటారని అంటున్నారు. ఇందులో దాదాపు వంద వరకు సమాధులు ఉన్నాయని, సమీపంలో ఉండే ఏదో ప్రాంతం వాళ్లు దీన్ని ఉపయోగించి ఉంటారని చెబుతున్నారు. ఈ ప్రాంతంలో ఇటలీ - పాలస్తీనా దేశాలకు చెందిన పురావస్తు శాస్త్రవేత్తల సంయుక్త బృందం పరిశోధనలు సాగించింది.
ఈ ప్రాంతం కచ్చితంగా ఆ కాలం నాటి పట్టణం అయి ఉండొచ్చని సపైంజా యూనివర్సిటీ ఆఫ్ రోమ్‌కు చెందిన లారెంజో నిగ్రో తెలిపారు. ఇక్కడ సమాధులలో మృతదేహాలతో పాటు కొన్ని గిన్నెలు, దీపాలు, రెండు లేదా నాలుగు హ్యాండిళ్లు ఉన్న జార్లు, ఇత్తడి కత్తులు కూడా ఉన్నట్లు ఆయన వివరించారు. నిర్మాణాలు, దోపిడీల వల్ల కొంతమేర ఇది పాడైనా, దాదాపు 30 సమాధులను పురావస్తు శాస్త్రవేత్తలు కనుగొన్నారు.