ఇటలీలోని మిలాన్ పాలిటెక్నిక్ వర్సిటీలో వైరస్ భయంతో విద్యార్థులు లేక ఖాళీగా ఉన్న క్లాస్‌రూం. ఆన్‌లైన్‌లోనే విద్యార్థుల థీసిస్‌ను వింటున్న ఎగ్జామినర్లు
న్యూఢిల్లీ: ప్రపంచం నలుమూలలకీ అత్యంత వేగంగా విస్తరిస్తోన్న కోవిడ్ ప్రజలను బెంబేలెత్తిస్తోంది. వైరస్ విజృంభణతో ప్రపంచ ప్రజల దైనందిన జీవితంలోనూ పెనుమార్పులు సంభవిస్తున్నాయి. విదేశీయుల రాకపోకలపై ఆంక్షలు పెరిగాయి. పాఠశాలలు, ప్రార్థనాలయాలు మూతపడ్డాయి. చైనాలో వైరస్ ప్రభావం తగ్గుముఖం పడుతోంటే, ఇటలీ, ఇరాన్ లాంటి ఇతర దేశాల్లో తీవ్రతరమౌతోంది. కరోనా కలకలం అంతర్జాతీయంగా దాదాపు 30 కోట్ల మంది విద్యార్థులను వారంపాటు విద్యాలయాలకు దూరం చేసింది. భారత్‌లో కరోనా బాధితుల సంఖ్య 30కి చేరడంతో ఢిల్లీలో ప్రాథమిక పాఠశాలలను ప్రభుత్వం మూసివేసింది. ఇటలీ, దక్షిణ కొరియాల నుంచి వచ్చే వారిపై ఆంక్షలు కొనసాగుతున్నాయి. విదేశీయులను కోవిడ్ సోకలేదని వైద్యుల ధృవీకరణ పత్రాన్ని సమర్పించాలని భారత్ కోరుతోంది.
భారత్‌లో 30 కోవిడ్ కేసులు
ఇటలీకి చెందిన పర్యాటకులతో సహా మార్చి 4వ నాటికి భారత్‌లో 29 కరోనా వైరస్ కేసులు నమోదైనట్టు ఆరోగ్య మంత్రి హర్షవర్ధన్ పార్లమెంట్‌లో ప్రకటించారు. 28,529 మందిని వైద్యపరిశీలనలో ఉంచినట్టు వెల్లడించారు. ఇటీవలే ఇరాన్‌లో పర్యటించి వచ్చిన ఘజియాబాద్‌కు చెందిన వ్యక్తికి ఈ వైరస్ సోకినట్టు నిర్ధారణ అయ్యింది. దీంతో భారత్‌లో కరోనా కేసుల సంఖ్య 30కి చేరింది. వైరస్‌ను గుర్తించేందుకు జిల్లా, గ్రామస్థాయిల్లో బృందాలను ఏర్పాటు చేయాలని కేంద్రం రాష్ట్రాలను కోరింది. (చదవండి: కోవిడ్‌ను జయించిన కేరళ విద్యార్థిని)
మొత్తం 95 వేల మంది..
ప్రపంచవ్యాప్తంగా 95,000 మంది ప్రజలకు వైరస్ సోకగా, 3,200 మంది మరణించారు. ఇప్పటి వరకు 80 దేశాలకు కోవిడ్–19 వ్యాపించింది. చైనాలో తగ్గుముఖం పట్టిన వైరస్ వ్యాప్తి, చైనాలో కన్నా ఇతర ప్రాంతాల్లో ఎక్కువగా విస్తరిస్తోంది. గురువారం 31 మంది మృతిచెందగా ఇప్పటి వరకు మరణాల సంఖ్య 3,012కి చేరింది. 80,400 మందికి వైరస్ సోకినట్టు తేలింది. అమెరికాలో కోవిడ్ మృతుల సంఖ్య 11కు చేరడంతో కరోనాపై పోరాడేందుకు 8 బిలియన్ డాలర్లను వెచ్చించాలని అమెరికన్ కాంగ్రెస్ తీర్మానించింది. ఇరాన్‌లో మృతుల సంఖ్య 107కి చేరింది. 3,515 మందికి వైరస్ సోకినట్టు చేరింది. ఇటలీలోనూ కరోనా మృతుల సంఖ్య 107, బాధితులు 3000 మంది. దక్షిణ కొరియాలో బాధితుల సంఖ్య 6,000కు చేరింది. జీసస్ జన్మస్థలమైన పాలస్తీనాలోని బెత్లెహాం చర్చ్‌ని తాత్కాలికంగా మూసివేశారు. జపాన్, ఫ్రాన్స్‌లలో పాఠశాలలు మూసివేశారు.
ఢిల్లీలోని మొగల్ గార్డెన్‌లోకి ప్రజల సందర్శనలను నిలిపి వేస్తున్నట్టు రాష్ట్రపతి భవన్ వెల్లడించింది. ఫ్లూతో బాధపడే ఉద్యోగులకు ఇంటినుంచి పనిచేసే అవకాశం ఇవ్వాలని కర్ణాటక ప్రభుత్వం యోచిస్తోంది. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్‌లో 16 ఏళ్ల భారతీయ బాలికకు కోవిడ్ సోకినట్టు తేలింది.
చాలా దేశాలు ఏమీ చేయడం లేదు..
ప్రపంచంలోని చాలా దేశాలు కోవిడ్‌ను ఎదుర్కొనేందుకు తగు చర్యలు తీసుకోవడం లేదని, ఇది సరైన విధానం కాదని ప్రపంచ ఆరోగ్య సంస్థ పేర్కొంది. ముప్పునకు తగ్గ చర్యలు తీసుకోవడంలో పట్టుదల చూపడం లేదని తెలిపింది.
మోదీ బెల్జియం పర్యటన వాయిదా
యూరోపియన్ యూనియన్‌తో వాణిజ్య ఒప్పందాల కోసం ప్రధాని నరేంద్ర మోదీ బెల్జియం రాజధాని బ్రస్సెల్స్‌లో జరగాల్సిన సదస్సు వాయిదా పడినట్లు భారత్ తెలిపింది. ఈ నెల 13న ఈ సమావేశం కోవిడ్ కారణంగా ఈ పర్యటన వాయిదా పడింది. ఇరు వర్గాలకూ కుదిరే మరో సమయంలో భేటీ జరుగనుంది.
ఆక్టెమ్‌రాతో కోవిడ్‌కు చెక్?
ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా వైరస్‌కు విరుగుడు దొరికిందా? అవును అంటోంది స్విట్జర్లాండ్ ఫార్మా కంపెనీ రోష్! ఆర్థరైటిస్ రోగుల్లో మంట/వాపులను తగ్గించేందుకు ఉపయోగించే అక్టెమ్‌రా అనే మందు కరోనా వైరస్ కట్టడికీ ఉపయోగపడవచ్చునని రోష్ చెబుతోంది. వ్యాధికి కేంద్రబిందువైన చైనాలో అక్టెమ్‌రాను వాడేందుకు ఇప్పటికే చైనా ప్రభుత్వ అనుమతి పొందిన రోష్ సుమారు 20 లక్షల డాలర్ల విలువైన మందులను చైనా ప్రభుత్వానికి ఉచితంగా అందజేసింది. అక్టెమ్‌రాను వైద్య పరిభాషలో టోసిలిజుమాబ్ అని పిలుస్తారు. 2010 నుంచి దీనిని అమెరికాలో ఆర్థరైటిస్ చికిత్సలో వాడుతున్నారు. దీంట్లో అత్యధిక మోతాదులో తెల్ల రక్తకణాలు విడుదల చేసే ప్రొటీన్లు ఉంటాయి. చైనా ప్రచురించిన మార్గదర్శకాల ప్రకారం కరోనా కారణంగా ఊపిరితిత్తులు దెబ్బతిన్న వారికి అక్టెమ్‌రాను వాడవచ్చు.
Comments
Please login to add a commentAdd a comment