హెదరాబాద్, బిజినెస్ బ్యూరో: ప్లంబింగ్, ఎలక్ట్రిషన్, లాండ్రీ వంటి హోమ్ సర్వీసెస్ రంగంలో ఉన్న హౌస్‌జాయ్.. గృహ నిర్మాణ, నిర్వహణ, అలంకరణ రంగంలోకి దిగనుంది. ప్రస్తుతం బెంగళూరులో అందుబాటులో ఉన్న ఈ సేవలను త్వరలోనే హైదరాబాద్‌లో ప్రారంభించనున్నట్లు కంపెనీ సీఈఓ శరన్ చటర్జీ ‘స్టార్టప్ డైరీ’తో చెప్పారు. కన్‌స్ట్రక్షన్, డెకరేషన్ విభాగాల్లో హైదరాబాద్ అతిపెద్ద మార్కెట్ అని.. 20 శాతం వరకూ మార్జిన్లుంటాయని అందుకే ఎంట్రీ ఇచ్చామని తెలిపారు. మరిన్ని వివరాలు ఆయన మాటల్లోనే..
గృహ సేవల రంగంలో ప్రధాన సవాళ్లు.. కార్మికుల లభ్యత, విశ్వసనీయత, పనిలో నాణ్యత! కారణం.. ఈ సేవలన్నీ అసంఘటిత రంగంలో ఉండటమే. టెక్నాలజీ సహాయంతో కార్మికులను, నాణ్యమైన సేవలను ఒకే వేదిక మీదికి తీసుకొస్తే అనే ఆలోచన నుంచే ‘హౌస్‌జాయ్’ పుట్టింది. అర్జున్ కుమార్, సునీల్ గోయెల్‌లు 2015 జనవరిలో బెంగళూరు కేంద్రంగా ఆన్‌లైన్ హోమ్ సర్వీసెస్ స్టార్టప్ హౌస్‌జాయ్‌ను ప్రారంభించారు.
గృహ సేవలన్నీ ఒక్క చోటే..
ప్రస్తుతం హైదరాబాద్, విజయవాడ, చెన్నై, బెంగళూరు, అహ్మదాబాద్, సూరత్, ఢిల్లీ, కోయంబత్తూరు, పుణె, ముంబై, గుర్గావ్ నగరాల్లో సేవలందిస్తున్నాం. క్లీనింగ్, హోమ్ రిపేర్, ప్లంబింగ్, ఎలక్ట్రికల్ సర్వీసెస్, లాండ్రీ, కంప్యూటర్ రిపేర్, ప్యాకర్స్ అండ్ మూవర్స్, బ్యూటీ, పెస్ట్ కంట్రోల్, పెయింటింగ్, గృహోపకరణాల రిపేర్లు వంటి 14 విభాగాల్లో సేవలను అందిస్తున్నాం. ఆయా విభాగాల్లో 65 వేల మంది కార్మికులు నమోదయ్యారు. ఆయా విభాగంలో 8 ఏళ్ల అనుభవం ఉన్న వాళ్లను నిపుణులు, వాళ్ల వ్యక్తిగత వివరాలు, పూర్వాపరాలు, క్రిమినల్ రికార్డులు అన్నీ క్షుణ్నంగా పరిశీలించాకే రిజిస్టర్ చేసుకుంటాం. హౌస్‌జాయ్ అగ్రిగేట్ మోడలే. కానీ, 100 శాతం నిర్వహణ బాధ్యత కంపెనీదే.
నగరం వాటా 20 శాతం..
ఇప్పటివరకు 20 లక్షల మంది కస్టమర్లు మా సేవలను వినియోగించుకున్నారు. హైదరాబాద్ వాటా 20 శాతం వరకుంటుంది. ప్రస్తుతం రోజుకు లక్షకు పైగా ఆర్డర్లు వస్తున్నాయి. పనికి సంబంధించి 30 రోజుల పాటు గ్యారంటీ, అన్ని ఎలక్ట్రానిక్ ఉపకరణాల మీద రూ.10 వేల బీమా కూడా ఉంటుంది. ప్రస్తుతం మా కంపెనీలో 350కి పైగా ఉద్యోగులున్నారు. ఇప్పటివరకు లాండ్రీ స్టార్టప్ మైవాష్, ఫిట్‌నెస్ స్టార్టప్ ఓరోబిండ్‌లను కొనుగోలు చేశాం.
నిర్మాణం, అలంకరణలోకి..
గృహ సేవల విభాగం నుంచి తాజాగా గృహ మరమ్మతులు, అలంకరణ, నిర్మాణం, నిర్వహణ విభాగంలోకి ఎంట్రీ ఇచ్చాం. ప్రస్తుతం బెంగళూరులో సేవలందిస్తున్నాం. గృహ రెనోవేషన్ ప్రారంభ ధరలు రూ.1–1.5 లక్షలు, ఇంటీరియర్ డిజైన్ రూ.3.5 లక్షలు, ఇంటి నిర్మాణం చ.అ.కు రూ.1,600లుగా ఉంటాయి. ధరలు నగరం, ప్రాజెక్ట్ విస్తీర్ణాలను బట్టి మారుతుంటాయి. ఇప్పటికే 25–30 భారీ ప్రాజెక్ట్ ఆర్డర్లు వచ్చాయి. ఆయా విభాగాల్లో సీనియర్ మేనేజ్‌మెంట్ హోదాలో ఉద్యోగులను తీసుకోనున్నాం.
300 శాతం ఆదాయ వృద్ధి..
ఇప్పటివరకు రెండు రౌండ్లలో కలిపి రూ.215 కోట్ల నిధులను సమీకరించాం. అమెజాన్, మ్యాట్రిక్స్ పార్టనర్స్ ఇండియా, సామా ఫ్యామిలీ ట్రస్ట్, వెర్టెక్స్ వెంచర్స్, క్వాల్కమ్ ఏషియా పసిఫిక్, రు–నెట్ సౌత్ ఏషియా ఈ పెట్టుబడులు పెట్టాయి. 2017 ఆర్థిక సంవత్సరంలో రూ.31.79 కోట్లుగా ఉన్న ఆదాయం.. 2018 నాటికి 19 శాతం వృద్ధితో రూ.37.85 కోట్లకు చేరింది. వచ్చే ఆర్ధిక సంవత్సరంలో 300 శాతం వృద్ధిని లకి‡్ష్యంచామని’’ శరన్ వివరించారు.
గృహాలంకరణలోకి హౌస్‌జాయ్!
Published Sat, Feb 23 2019 1:07 AM | Last Updated on Sat, Feb 23 2019 1:07 AM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment