సంక్రాంతి పండగ సంబరాలను ప్రజలు ఉత్సాహంగా జరుపుకుంటున్నారు. ముచ్చటగా మూడు రోజుల వేడుకలో తొలి రోజు భోగి. భోగి మంటల వెచ్చటి వెలుగులతో పరిపూర్ణమైన ఆరోగ్యాన్ని పొందాలని ప్రార్థిస్తారు. రెండో రోజు మకర సంక్రాంతి కాంతులతో , సౌభాగ్యాలతో ప్రతీ ఇల్లూ శోభాయమానంగా వెలుగొందాలని కోరుకుంటారు. కొత్తబియ్యంతో పొంగలి తయారు చేసుకుంటారు. మూడో రోజు కనుమ. పల్లెసీమలు పశుసంపద, వ్యవసాయ, పంటలతో సుభిక్షంగా కలకళలాడాలని ఆకాంక్షిస్తారు. పశువులను ప్రత్యేకంగా అలంకరించి, మొక్కుకుంటారు. అసలు ఈ రోజున పశువులను ఎందుకు పూజిస్తారు? ప్రయాణాలు చెయ్యరు ఎందుకు? తెలుసుకుందామా.!
పశువులకు పూజలు, అందంగా ముస్తాబు
సంక్రాంతి ముఖ్యంగా రైతన్నల సంతోషానికి మారుపేరైన పండగ. వ్యవసాయంలో ప్రధాన భూమిక పశువులదే. రైతులు ఎల్లవేళలా అండగా ఉంటాయి.అందుకే వాటిని దైవంతో సమానంగా భావిస్తున్నారు. పంట చేతికొచ్చి సంబరంలో ఉన్న రైతన్నలు కనుమ రోజున పశువులను ఈ రోజున అందంగా అలంకరించి పూజిస్తారు. కనుమ రోజున పశువులను శుభ్రంగా కడిగి, వాటికి పసుపు కుంకుమ పెట్టి, మెడలో గజ్జెల పట్టీ, కాళ్లకు మువ్వలుతొడిగి అలంకరించి కన్నబిడ్డల్ని చూసినట్టు మురిసిపోతారు.
ఇలాఅలంకరించిన పశువులతో ఎద్దుల బండ్లు కట్టి పిల్లాపాపలతో సహా కాటమరాయుడి గుడికి లేదా గ్రామ దేవత గుడిలో నైవేద్యం సమర్పిస్తారు. ఏడాదంతా సమృద్ధిగా పంటలు పండాలని, పశువులు ఆరోగ్యంగా ఉండాలని మొక్కుకుంటారు. మాంసాహారంతో విందు చేసుకుంటారు.
అంతేకాదు గతంలో ఔషధ వృక్షాలైన నేరేడు, మద్ది, మారేడు, నల్లేరు, మోదుగ చెట్ల పూలు, ఆకులు, కాండం, వేర్లు సేకరించి, ఉప్పువేసి దంచి పొడి చేసి తినిపించేవారట. తద్వారా వాటిలో సంవత్సరానికి సరిపడా రోగనిరోధక శక్తి వస్తుందని నమ్మేవారు.
ప్రయాణాలు ఎందుకు వద్దనేవారు
రవాణా సౌకర్యాలు బాగా లేని రోజుల్లో ప్రయాణాలకు ఎక్కువగా ఎడ్ల బండ్లను ఉపయోగించేవారు. కనుమ రోజున ఎద్దులను పూజించే ఆరాధించేవారు. అందుకే ఆ ఒక్కరోజైనా వాటిని కష్టపెట్టకుండా ఉండాలనే ఉద్దేశంలో ఈ రోజు ప్రయాణాలను మానుకునేవారట మన పెద్దలు.
కనుమ రోజు ‘కనుమ రోజు కాకి కూడా కదలదు’ అనే ఒక నానుడి ఇప్పటికీ ప్రచారంలో ఉంది. ఈ రోజు ఎక్కడికైనా ప్రయాణం చేస్తే వెళ్లిన పని పూర్తికాదని, ఆటంకాలు తప్పవనే విశ్వాసం బాగా ఉంది. మరోవైపు సంక్రాంతి పండుగ రోజుల్లో ప్రతీ ఇల్లూ బంధువులతో కళకళాలాడుతూ కన్నుల పండువగా ఉంటుంది. కొత్త అల్లుళ్లు, పెళ్లి అయ్యి అత్తారింటికి వెళ్లి తిరిగి పుట్టింటికి ఆడబిడ్డలు ఎంతో ఉత్సాహంతో వస్తారు. మరి వారితో సమయం గడిపేలా, కొత్త అల్లుడికి సకల మర్యాదలు చేసేలా బహుశా కనుమ రోజు ప్రయాణం చేయొద్దనే నియమం పెట్టారేమో! ఏది ఏమైనా ఈ నియమాలు కట్టుబాట్లు, ఎవరి ఇష్టాఇష్టాలు, నమ్మకాల మీద ఆధారపడి ఉంటాయి.
Comments
Please login to add a commentAdd a comment