
మానవ చరిత్రలో ఆ ఆదివారం ఎన్నటికీ మరపురానిది. ఎందుకంటే యేసుక్రీస్తు అన్ని కుట్రలనూ, దుర్మార్గాలనూ, దౌర్జన్యాలనూ పటాపంచలు చేసి సమాధినీ, మరణాన్నీ గెలిచి సజీవుడు కావడం ద్వారా దీనులు, పాపులు, నిరాశ్రయులందరికీ నవోదయాన్నిచ్చిన దినం ఆ ఆదివారం...
యేసుక్రీస్తు మానవరూప ధారియైన రక్షకుడుగా ఈ లోకానికి తన పరమ తండ్రి ఆదేశాలు, సంకల్పాలను అమలుపర్చడానికి విచ్చేసిన దైవకుమారుడు, అంటే అన్నివిధాలా దేవుడే!!!. అలాగైతే జననానికి, మరణానికి, పునరుత్థానానికి దేవుడు అతీతుడు కదా... మరి ఇదంతా ఎందుకు జరిగింది? అన్న ప్రశ్న తప్పక రావాలి.
నాలుగేళ్ల ఒక బాలుడు నీళ్లు పెద్దగా లేని ఒక బావిలో పడ్డాడు. అయ్యో అంటూ జనం బావి చుట్టూ గుమికూడారు. వాడసలే భయకంపితుడై ఉన్నాడు. పైగా పసితనం, అంతా గందరగోళం.. గట్టిగా ఏడుస్తున్నాడు. ఇంతలో ఒకాయన బావి వద్దకొచ్చి లోనికి తొంగి చూశాడు. వెంటనే అక్కడున్న ఒక తాడు తన నడుముకు కట్టుకొని అక్కడున్న వారితో తనను లోనికి దించమన్నాడు. అతన్ని చూసి పిల్లాడు మహదానందంతో ‘డాడీ’ అని గట్టిగా అరిచి తండ్రిని కరిచి పట్టుకున్నాడు. తండ్రి వాడిని చంకకేసుకొని గట్టిగా కరుచుకొని తమను పైకి లాగమన్నాడు.
పిల్లాడు బావిలో పడిపోతే అందరికీ సానుభూతే!! కాని పర్యవసానాలాలోచించకుండా చనిపోయేందుకు కూడా తెగించి కొడుకును కాపాడుకునే శక్తి ఒక్క తల్లి, తండ్రి ప్రేమకు మాత్రమే ఉంటుంది. శుక్రవారం నాడు సిలువలో అదే జరిగింది. పాపిని కాపాడేందుకు పరమ తండ్రి కుమారుడిగా, రక్షకుడుగా చనిపోయేందుకు కూడా సిద్ధపడి యేసుప్రభువు బావిలోకి దూకాడు. నేను చనిపోయినా ఫరవాలేదు, నా కుమారుడు బతికితే చాలు అనుకునేదే నిజమైన తండ్రి ప్రేమ. పరమ తండ్రిలో ఆయన అద్వితీయ కుమారుడు, కుమారునిలో పరమ తండ్రి సంపూర్ణంగా విలీనమైన అపారమైన ప్రేమ ఆ దైవత్వానిది. బావిలోనుండి కొడుకుతో సహా బయటికొచ్చిన సమయమే యేసు మరణాన్నీ గెలిచి సజీవుడైన ఈస్టర్ ఆదివారపు నవోదయం.
నేనే పునరుత్థానాన్ని... నేనే జీవాన్ని
ఆయన ఆరోహణుడు కావడం కళ్లారా చూసిన అనుభవంతో ఆయన అనుచరుల జీవితాలు సమూలంగా పరివర్తన చెందాయి. ఆయన సజీవుడైన దేవుడు అన్న నిత్యసత్యం వారి జీవితాల్లో లోతుగా ప్రతిష్ఠితమై వారంతా ఒక బలమైన చర్చిగా శక్తిగా ఏర్పడి, ఆ తర్వాత సువార్త సత్యం కోసం ప్రాణాలు కూడా త్యాగం చేసేందుకు సంసిద్ధమయ్యే ధైర్యాన్ని వారికిచ్చింది. మరణానికి మనిషిపై పట్టు లేకుండా చేసిన నాటి ఉదంతమే ఈస్టర్ అనుభవం.
యేసుప్రభువు నేనే పునరుత్థానాన్ని, జీవాన్ని అని కూడా ప్రకటించి, తానన్నట్టే చనిపోయి తిరిగి లేవడం ద్వారా తానే జీవాన్నని రుజువు చేసుకున్నాడు. తనలాగే విశ్వాసులు కూడా పురుత్థానం చెంది పరలోకంలో తమ దేవుని సహవాసంలో నిత్య జీవితాన్ని పొందుతారని ప్రభువు బోధించాడు.
– డా. సుభక్త