మరణమా నీ ముల్లెక్కడ? | Story of Resurrection of Jesus special story | Sakshi
Sakshi News home page

మరణమా నీ ముల్లెక్కడ?

Published Sun, Apr 20 2025 12:40 AM | Last Updated on Sun, Apr 20 2025 12:40 AM

Story of Resurrection of Jesus special story

 దేవుని విమోచన కార్యక్రమంలో అత్యంత శకిమంతమైనది క్రీస్తు పునరుత్థాన శక్తే. మానవునికి మరణం తోనే జీవితం అంతం కాదని పునరుత్థానం తెలియజేసింది. 
ప్రతి మనిషి సదాకాలము దేవునితో కలిసి జీవించవచ్చన్న గొప్ప నిరీక్షణ కలిగింది. ఎందుకంటే యేసు అంటున్నాడు ‘పునరుత్థానం జీవం నేనే. నా యందు విశ్వాసముంచు వాడు చనిపోయినను బ్రతుకును. బతికి నాయందు విశ్వాసముంచు వాడు ప్రతివాడును ఎన్నటికిని చనిపోడు’.

శుక్రవారం సిలువ వేయబడిన యేసును తలచుకొని యూదా మతపెద్దలు యేసు ఇక శాశ్వతంగా మట్టిలో కలిసి పోయాడని సంబర పడ్డారు. వారిలో ఆ దుష్ట తలంపు పెట్టిన అపవాదియైన సాతాను దేవునిపై విజయం సాధించానని ఇక ఈ లోకం అంతా తన చెప్పు చేతల్లో ఉండిపోతుందని భ్రమ పడ్డాడు. అయినా ఎందుకైనా మంచిదని క్రీస్తును ప్రత్యేకంగా అరిమత్తయి ఏర్పాటు చేసిన సమాధి చుట్టూ ఎవరు తొలగించలేని పెద్ద రాతిని ఏర్పాటు చేశారు. 

బలమైన రోమా సైనికులను సమాధికి కాపలాగా పెట్టారు. క్రీస్తు మూడవ దినమున లేస్తానని చెప్పిన మాట నెరవేరకుండా శతవిధాలుగా తమ ప్రయత్నం వారు చేశారు. ఇక ఏసు చరిత్ర శాశ్వతంగా ఖననం చేశామని ఇక ఎప్పటికీ తామే మతపెద్దలుగా యూదా ప్రజలను తమ అధీనంలోనే వుంచుకోవచ్చని రోమా అధికారులకు లంచం కడుతూ తమ పబ్బం గడుపుకోవచ్చని కలలుగంటూ శనివారం అంతా హాయిగా నిద్రపోయారు. మరోపక్క యేసు చేసిన అద్భుత సూచక క్రియలు చూసి ఆయన పరలోక దివ్య వాక్కులు విన్న ప్రజలు యేసు సిలువ మరణాన్ని జీర్ణించు కోలేని స్థితిలో వుండిపోయారు. 

యూదా గలిలయా సమరియ ప్రాంతాల్లో క్రీస్తు ద్వారా స్వస్థత పొందిన గుడ్డి, కుంటి, మూగ, చెవిటి వారు, కుష్టు రోగులు మరణించి క్రీస్తుతో బతికింపబడినవారు, క్రీస్తును అభిమానించేవారు, వివిధ అద్భుతాలను చూసినవారు యేసు మరణంతో శోకసంద్రంలో మునిగిపోయారు. చివరకు యేసుతో మూడున్నర సంవత్సరాలు తిరిగిన ఆయన శిష్యులు యూదా మతపెద్దలకు భయపడి యెరూషలేము పట్టణంలో ఓ గదిలో దాక్కుండి పోయారు. అయినా దేవుని ప్రవచనాలు నెరవేరక తప్పవు కదా! భూమి పునాదులు వేయక ముందే ఆయన ఏర్పాటు చేసిన రక్షణ ప్రణాళిక అనాది సంకల్పం నెరవేరక తప్పదు కదా!

తొలగింపబడిన రాయి
ఆదివారం ఉదయమే ఇంకా తెల్లవారకముందు యేసుద్వారా స్వస్థత పొందిన మగ్ధలేని మరియ, కొంతమంది ధైర్యవంతులైన స్త్రీలు సుగంధ ద్రవ్యాలను తీసుకొని యేసును సమాధి చేసిన చోటుకు చేరుకున్నారు. రోమా అధికారక ముద్రతో వేయబడ్డ ఆ పెద్ద రాయి ఎవరు తొలగిస్తారన్న ఆలోచన ఆ మహిళకు కలిగింది. తీరా సమాధి వద్దకు వచ్చి చూస్తే వారి జీవితంలో ఎన్నడు కలుగనంత విభ్రాంతికి లోనయ్యారు. అప్పటికే సమాధి మీద రాయి తొలగించబడింది. 

అంతకు క్రితమే యేసు సమాధిమీద ఉన్నరాయి పరలోకం నుండి ప్రభువుదూత దొర్లించినట్లు లేఖనాలలో రాయబడింది. ఆప్రాంతంలో భూకంపం వచ్చింది. అక్కడ కావలి వున్న రోమా సైనికులు భయపడి చచ్చినవారిలా పరుండిపోయారు. స్త్రీలు అక్కడికి వచ్చినప్పుడు రాయి దొర్లించబడి ఉండటం చూశారు. సమాధి లోపల యేసు దేహం వారికి కనిపించలేదు. అప్పుడు దూత ప్రత్యక్షమై ‘‘సజీవుడైన క్రీస్తును మృతులలో ఎందుకు వెదుకుచున్నారు? ఆయన ముందుగా చెప్పిన విధంగా లేచి యున్నాడు. ఈ శుభవర్తమానం శిష్యులకు తెలియ జేయండి’’ అని చెప్పడంతో స్త్రీలు మహానందంతో వెనుకకు తిరిగారు.

పునరుత్థానుడైన క్రీస్తు
యేసు చెప్పిన విధంగానే చనిపోయిన మూడవరోజు మృత్యుంజయుడై లేచాడు. దానితో ప్రపంచ చరిత్రలో మరణాన్ని గెలిచి లేచిన చారిత్రాత్మిక పురుషుడిగా నిలిచి పోయాడు. ప్రపంచ చరిత్ర క్రీస్తుపూర్వం క్రీస్తు శకంగా చీలిపోయింది. పునరుత్థానుడైన యేసు ముందుగా తనను వెదకడానికి వచ్చిన స్త్రీలకు కన్పించి వారికి శుభమని చెప్పి ముందు మీరు వెళ్ళి నా శిష్యులకు గలిలయ వెళ్ళమని చెప్పి అక్కడ వారిని కలుస్తానని చెప్పాడు.

ఈలోగా సమాధికి కాపలాగా ఉన్న రోమా సైనికులు ప్రధాన యాజకుల వద్దకు పోయి యేసు మరణం నుండి లేచిన సంగతి వివరించారు. వారు రోమా సైనికులకు లంచం ఇచ్చి ఈ విషయం ఎవ్వరికీ చెప్పవద్దని చెబుతూ మేము రాత్రివేళ నిద్దుర పోతుంటే యేసు శిష్యులు వచ్చి యేసు శరీరాన్ని ఎత్తుకు వెళ్ళారని అబద్ధం చెప్పండి ఒకవేళ అధికారులు ఏమన్నా హడావుడి చేస్తే వారిని మేము చూసుకుంటామని నచ్చచెప్పి పంపించి వేశారు. అయితే యేసు చెప్పిన విధంగానే గలిలయ శిష్యులకు దర్శనం ఇచ్చాడు. ఈ ఈస్టర్‌ పండుగ సమయంలో యేసు పునరుత్థాన శక్తి ప్రతి ఒక్కరం పొందుదం గాక! ఆమేన్‌!!

యేసు పునరుత్థాన శక్తి
యేసు తన శరీరంలో సిలువ ద్వారా పాపానికి శిక్ష విధించి బలి అర్పణగా శరీరాన్ని సమర్పించడం ద్వారా మరణంపై సాతానుకున్న అధికారాన్ని నాశనం చేశాడు. మనుషుల్లో మరణం పట్ల ఉన్న భయాన్ని పునరుత్థాన శక్తితో  తీసివేయడం ద్వారా దేవునితో ధైర్యంగా విశ్వాసంతో ముందుకు కొనసాగడానికి బాటలు వేశాడు. ప్రథమ మానవుడైన ఆదామును సాతాను లోబరుచుకొని మరణానికి ΄ాత్రుడుగా చేశాడు. ఫలితంగా పుట్టిన ప్రతి మనిషి గిట్టక తప్పని పరిస్థితి నెలకొంది. అయితే కడపటి ఆదాముగా వచ్చిన యేసు పునరుత్థానం ద్వారా ఆ శాపం పూర్తిగా తొలగించబడింది. అంటే మనుష్యుని ద్వారా ఎలా మరణం వచ్చిందో మనుష్యుని ద్వారానే మృతుల పునరుత్థానం కలిగింది. ఈ ప్రక్రియ ద్వారా క్రీస్తులా ప్రతి ఒక్కరూ పునరుత్థానం పొందే అవకాశం లభించింది.

– మన్య జ్యోత్స్న రావు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement