
శ్రీరామ చంద్రుడు అఖిల ప్రపంచానికీ ఆరాధ్య దైవం. ఆదర్శ పురుషుడు. మన తెలుగువారికి మరీ మరీ ప్రీతిపాత్రుడు. శ్రీరామనామ స్మరణతోనే మనకు తెల్లవారుతుంది. రాముడి పేరు లేని తెలుగు ఇల్లు ఉండదు.రామాలయం లేని ఊరు ఉండదు. నిరంతరం రామనామ ధ్యానమే తెలుగువారి శ్వాస. ఆదికవి వాల్మీకి మహర్షి భూమి జనుల కోసం అత్యంత రమణీయంగా చెప్పిన ఆ రామ కథనే ఈ శ్రీరామ నవమి శుభ సమయాన మనం మళ్ళీ చెప్పుకుంటున్నాం.
భూమి మీద రాక్షసుల దుర్మార్గాలు మితిమీరి పోయి, సాధువులకూ సన్మార్గులకూ నిలువ నీడ లేకుండా పోతోంది. దేవతలూ భూదేవీ బ్రహ్మదేవుడి సలహాతో శ్రీ మహా విష్ణువు వద్దకు వెళ్లి మొర పెట్టుకున్నారు. దుష్ట రాక్షస సంహారానికీ, ధర్మ రక్షణకూ భూమికి దిగి రమ్మని వేడుకున్నారు. వారి వేడుకోలును మన్నించాడు మహా విష్ణువు. తన పరివారంతో కూడా భూమికి బయలు దేరాడు. అనంతమైన తన శక్తులనన్నిటికీ వేర్వేరు రూపాలు కల్పించి వారితో పాటు భూమి మీదకు అవతరించాడు.
అయోధ్య రాజు దశరథుడు పుత్ర సంతానం కోరి తన ముగ్గురు భార్యలతో కూడా పుత్ర కామేష్టి చేశాడు. యజ్ఞఫలంగా మహావిష్ణువు దశరథుడికి నలుగురు పుత్రులుగా జన్మించాడు. ఆనాడు చైత్ర శుద్ధ నవమి. అదే శ్రీరామ నవమి పుణ్యదినం. రామ లక్ష్మణ భరత శత్రుఘ్నులు నలుగురూ కులగురువు వశిష్ట మహర్షి వద్ద సకల విద్యలూ నేర్చారు. ధనుర్వేదం అభ్యసించారు. పురాణ ఇతిహాసాలు చెప్పుకున్నారు. లౌకిక వ్యవహార జ్ఞానం సంపాదించారు. నలుగురూ లోకహితాచరణ పరాయణులు. సర్వజన మనోహరులు. తేజోవంతులు. పితృసేవా తత్పరులు.
కడుపులో చల్ల కదలకుండా ఇంట్లో కూర్చుంటే దుష్ట సంహారం ఎలాగ? బయటి ప్రపంచంలో నువ్వు చెయ్య వలసిన పని చాలా ఉంది. రా నాతో ––అని విశ్వామిత్ర మహర్షి దశరథ మహారాజు అనుమతితో తను తలపెట్టిన యాగానికి విఘ్నం కలిగిస్తున్న రాక్షసులను కట్టడి చేయటానికి రామలక్ష్మణు లను తనతో అడవులకు తీసుకువెళ్ళాడు. తపస్సు చేసి తను సంపాదించుకున్న శస్త్రాస్త్ర సంపదనంతటినీ రామ లక్ష్మణులకు ధారపోశాడు. యాగానికి ఆటంకం కలిగిస్తున్న రాక్షసులను సంహరించి విశ్వామిత్రుడి ఆశీస్సులు పొందారు రామ లక్ష్మణులు.
మిథిలాధిపతి జనక మహారాజు చేస్తున్న ధనుర్యాగం చూపించటానికి రామ లక్ష్మణులను మిథిలకు తీసుకు వెళ్ళాడు విశ్వామిత్రుడు. తన వద్ద ఉన్న శివధనుస్సును రాముడికి చూపించాడు జనకుడు. ఆ శివధనుస్సును ఎక్కు పెట్ట గలిగితే రాముడికి సీతను ఇచ్చి పెళ్లి చేస్తానన్నాడు జనకుడు. రాముడు ఆ శివ ధనుస్సును అవలీలగా ఎక్కుపెట్టడమే కాకుండా అప్రయత్నంగానే నారి సారించాడు. విల్లు ఫెళ్ళున విరిగింది.
జనక మహారాజు చాలా సంతోషించాడు. సంతృప్తి చెందాడు. సీతాదేవి రాముడి కంఠాన్ని వరమాలతో అలంకరించింది. సీతారామ కల్యాణానికి సుముహూర్తం నిశ్చయించారు. అయోధ్య నుంచి దశరథ మహారాజు సకుటుంబంగా కొడుకు పెళ్ళికి తరలి వచ్చాడు.
సీతా రాముల కళ్యాణంతో పాటే రామ సహోదరులు భరత లక్ష్మణ శత్రుఘ్నులకు ... సీతాదేవి చెల్లెళ్ళయిన మాండవి, ఊర్మిళ, శ్రుతకీర్తులతో కూడా అదే ముహూర్తాన కళ్యాణాలు జరిగాయి.
వృద్ధుడైన దశరథ మహారాజు అయోధ్యా రాజ్యానికి ఉత్తరాధికారిగా పెద్దకొడుకు రాముడికి పట్టాభిషేకం చెయ్యడానికి ముహూర్తం ప్రకటించాడు. ప్రజలంతా సంతోషించారు. కాని దశరథుడి మూడవ భార్య కైకేయి ఒప్పుకోలేదు. తన కొడుకు భరతుడికి పట్టం కట్టమని, రాముడిని పద్నాలుగేళ్ళపాటు వనవాసానికి పంపమని కోరింది. మహారాజు ఒప్పుకోక తప్పలేదు. తండ్రి మాట జవదాటని రాముడు నిర్వికారంగా అడవులకు బయలుదేరాడు. సీతాలక్ష్మణులు రాముడిని అనుసరించారు. పుత్ర వియోగం భరించలేక దశరథుడు రామా రామా అంటూనే ప్రాణాలు వదిలాడు.
అడవులలో పద్నాలుగేళ్ళ పాటు పడరాని కష్టాలు పడ్డారు సీతా రామ లక్ష్మణులు. అయితే రాముడు అయోధ్యలో తండ్రి చాటు బిడ్డగా ఎంత సుఖంగా ఉన్నాడో అడవులలో కూడా అంత స్థిమితంగా ఉన్నాడు.. పుట్టిన నాటినుంచి రాజ భోగాలలో పెరిగిన రాముడు అడవిలో కందమూలాలు తిని, గడ్డి పాన్పు మీద పడుకోవలసి వచ్చినా కష్ట పెట్టుకోలేదు. తండ్రి మాట నిలపడం కోసం సంతోషంగా అన్ని కష్టాలూ భరించాడు. మునుల సేవ చేస్తూ,వారిని రాక్షసుల బారినుంచి కాపాడుతూ , వారి వల్ల మంచి మాటలు వింటూ గడిపాడు.
సీతాపహరణం
లంకాధిపతి రావణాసురుడు మాయలతో, మోసాలతో సీతాదేవిని ఎత్తుకు పోయి తన లంకా నగరంలో అశోక వనంలో ఉంచాడు. రామ లక్ష్మణులు సీతాదేవిని వెతుకుతూ ఋష్య మూక పర్వతం మీద కపిరాజు సుగ్రీవుడిని కలుసుకుని సఖ్యం చేశారు. రాముడు సుగ్రీవుడి అన్న వాలిని చంపి సుగ్రీవుడిని కిష్కింధా రాజ్యానికి రాజును చేశాడు. సుగ్రీవుడి మంత్రి హనుమంతుడి ప్రయత్నంతో సీతాదేవి లంకలో రావణుడి చెరలో ఉన్నదని తెలుసుకున్నాడు. దక్షిణ సముద్రానికి అవతల ఉన్న లంకకు సైన్యంతో చేరడానికి సముద్రానికి కొండరాళ్ళతో బండరాళ్ళతో వారధి కట్టారు వానరులు.
రావణాసురుడి తమ్ముడు విభీషణుడు అన్నకు హితవు చెప్పబోయాడు గౌరవంగా . సీతను రాముడికి అప్పచెప్పి రాముడిని శరణు కోరిప్రాణాలు నిలుపుకోమని అన్నను హెచ్చరించాడు విభీషణుడు. రావణుడు వినకపోగా కోపంతో తమ్ముడిని లంకనుంచి వెళ్ళగొట్టాడు. విభీషణుడు రాముడిని శరణు కోరాడు. రావణుడిని చంపి విభీషణుడిని లంకకు రాజుని చేస్తానని మాట ఇచ్చాడు రాముడు.
రాక్షసులకూ, రామ లక్ష్మణుల వానర సైన్యానికీ యుద్ధం జరిగింది. రామ రావణ సంగ్రామం భయంకరంగా సాగింది. చివరకు రాముడు బ్రహ్మాస్త్రంతో రావణుడిని సంహరించాడు.
యుద్ధంలో వీరమరణం పొందిన రావణుడికి అతడి తమ్ముడు విభీషణుడు యధావిధిగా అంత్య కర్మలు నిర్వర్తించాడు. మాట ఇచ్చిన ప్రకారం రాముడు విభీషణుడిని లంకా నగరానికి రాజును చేశాడు. విభీషణుడు హనుమంతుడిని వెంటబెట్టుకుని అశోకవనానికి వెళ్ళాడు. సీతాదేవికి రాముడి విజయ వార్త చెప్పి సంతోష పెట్టాడు. ఆమెను గౌరవమర్యాదలతో యుద్ధభూమిలో ఉన్న రాముడి వద్దకు తీసుకువెళ్ళి అప్పగించాడు. సీత అగ్ని శుద్ధి పొంది తన పాతివ్రత్యం నిరూపించుకుంది. పది నెలల వియోగం అనుభవించిన సీతారాములు ఇప్పుడు సంతోషంతో కలుసుకున్నారు. విభీషణుడు సిద్ధం చేసిన పుష్పక విమానంలో సీతారామ లక్ష్మణులు అయోధ్యకు బయలుదేరారు. విభీషణుడు, సుగ్రీవుడు, హనుమంతుడు, సమస్త వానర సైన్యం రాముడితో కూడా పుష్పకంలో బయలు దేరారు.
పట్టాభిరాముడు
అయోధ్యానగరం దగ్గర నంది గ్రామంలో సీతారామ లక్ష్మణుల రాకకై ఎదురు చూస్తున్న భరతశత్రుఘ్నులు, అయోధ్య ప్రజలు వారికి ఘన స్వాగతం చె΄్పారు. సీతారామ లక్ష్మణులు తల్లులకు, గురువులకు నమస్కరించారు. కులగురువు వశిష్టమహర్షి నిశ్చయించిన శుభ ముహూర్తంలో శ్రీ రాముడికి అయోధ్యా మహా సామ్రాజ్య పట్టాభిషేకం వైభవంగా జరిగింది. ఆనాడు చైత్రశుద్ధ నవమి. అదే మనకు శ్రీరామనవమి.
శ్రీరామ రామ రక్ష–సర్వ జగద్రక్ష !
శ్రీరామ జననం, శ్రీ సీతారామ కల్యాణం, శ్రీ రామ పట్టాభిషేకం –ఈ మూడింటికీ కూడా చైత్ర శుద్ధ నవమే శుభ ముహూర్తం. ఆంధ్రదేశంలో ఊరూరా శ్రీరామ నవమికి పందిళ్ళు వేస్తారు. అరటి స్తంభాలతో, మామిడి తోరణాలతో, పూలమాలలతో పందిళ్లను అలంకరిస్తారు. ఊరి ప్రజలంతా తమ ఇంటి పెళ్ళికి లాగానే ఇళ్ళను అలంకరించుకుంటారు. ఊరి రామాలయంలో కళ్యాణ వేదిక ఏర్పాటు చేస్తారు. ఊరివారంతా ఉమ్మడి బాధ్యతతో సీతారామ కల్యాణం వైభవంగా జరుపుతారు. పానకం, వడపప్పు, కొబ్బరి ముక్కలు, చెరుకు ముక్కలు, అరటి పళ్ళు, ఇతర పిండి వంటలను సీతారాములకు నివేదించి, ఆ ప్రసాదం భక్తులందరికీ పంచి పెడతారు.
– ముళ్లపూడి శ్రీదేవి