మంచిర్యాల అర్బన్/ఆదిలాబాద్ కల్చరల్, న్యూస్‌లైన్ : శ్రీ సీతారాముల కల్యాణం అంతటా కన్నులపండువగా జరుపుకుంటారు. సీతారాముల కల్యాణాన్ని భక్తులు లోక కల్యాణంగా భావిస్తుంటారు. మిథిలా రాజ్య పాలకుడు జనక మహరాజు తనయ సీతాదేవి. శ్రీరాముడు శివ ధనస్సు విరిచి సీతను వివాహామాడుతాడు. వారి కల్యాణం ఎంతో ఘనంగా జరుగుతుంది. అందుకే త్రేతాయుగం నాటి రామాయణాన్ని వాల్మికీ రాసి లక్ష వసంతాలు అవుతున్నా ఇప్పటికి సీతారాముల కల్యాణాన్ని భక్తులు తమ ఇంటిలో వివాహ వేడుకలా భావిస్తారు. వేద పండితుల మంత్రోచ్ఛరణల మధ్య మంగళ సూత్రధారణ, తలంబ్రాలు, పట్టు వస్త్రాల సమర్పణ.. తదితర ఘట్టాలు అంగరంగవైభంగా నిర్వహిస్తారు. మానవాళికి ఆదర్శ దంపతులైన సీతారాముల కల్యాణం చూసినా ఎంతో పుణ్యమని భక్తులు విశ్వసిస్తారు.
ఏకపత్ని వ్రతుడు...
శ్రీరాముడు ఏకపత్ని వ్రతుడు. సీతాదేవిని తప్ప పర స్త్రీని ఎరగని యుగపురుషుడు. సీతాదేవికి దూరమయ్యాక రాముడు తల్లడిల్లిపోతాడు. అశ్వమేధ యాగం సందర్భంగా సీతాదేవి విగ్రహంతో యాగం చేస్తాడు.
పితృ వాక్య పరిపాలన దక్షుడు
శ్రీరాముడు మంచి భర్తే కాదు తండ్రి మాట జవదాటని పుత్రుడు కూడా. అందుకే ఆయనకు పితృవాక్య పరిపాలకుడన్న పేరుంది. తండ్రి దశరథునికిచ్చిన మాట కోసం రాజ్యాన్ని, పాలనను త్యజించి వనవాసం చేశాడు. ఎన్ని కష్టాలు వచ్చినా తండ్రి మాటను గౌరవించాలే తప్ప ఎదురు చెప్పవద్దనే నీతి ధర్మాన్ని శ్రీరాముడు బోధించాడు. రాజ్య పాలన కోసం తగువు పెట్టుకోలేదు. తమ్ముళ్లనే రాజ్యం ఏలాలని సూచించాడు. రాముడు వనవాసానికి వెళితే సోదరుడు లక్ష్మణుడు కూడా వెంట ఉన్నాడు. భరతునికీ రాముడంటే ఎంతో గౌరవం, భక్తిభావం. సోదరులంతా ఐక్యంగా ఉన్నారు. ఉమ్మడి కుటుంబాలకు ఆరాధ్యుడు శ్రీరాముడు.
సకల గుణాభిరాముడు.
శ్రీరామునికి సకల గుణాభిరాముడనే నామకరణం ఉంది. ఏ కోణం నుంచి చూసినా సద్గుణాలు తప్ప దుర్గుణాలనేవి మచ్చుకైనా కనిపించవు. పితృ వాక్య పరిపాలకుడిగా, ఏకపత్ని వ్రతునిగా, ప్రజాపరిపాలకుడిగా, గురువుగా, సోదరునిగా, తండ్రిగా, యుద్ధ వీరునిగా ఖ్యాతి గడించారు. ఇప్పటికీ రాముడు మంచి బాలుడనే మాట వాడుకలో ఉంది. పరిపాలన దక్షునిగా పేరు సంపాదించారు. ఎవరైనా మంచి పాలన అందిస్తామనే బదులు గ్రామాన్ని రామరాజ్యంగా తీర్చిదిద్దుతామని అంటారు. అంటే రాముని పాలన ఎలా సాగిందో వాల్మికీ మహర్షి రామాయణంలో చక్కగా కీర్తించారు. వానర సేనకూ రాముడంటే అపారమైన భక్తిభావం ఉంది. సీతాదేవిని దశకంఠుడు అపహరించిన సమయంలో సముద్రంలో రామసేతు నిర్మించి లంకకు దారి చూపింది, అశోకవనంలో ఉన్న సీతమ్మను కనుగొన్నది వానరసేనే. ఇలా రాముడు అందరివాడుగా త్రేతా యుగం నుంచి కలియుగం వరకు ఆదర్శ పురుషుడిగా చిరస్థాయిగా నిలిచిపోయారు. సత్యాన్ని నమ్ముకుని ప్రపంచాన్ని జయించి సత్యమేవ జయతే అనే సూక్తిని ప్రాచుర్యంలోకి తెచ్చారు.
విద్యుద్దీపాలతో అలంకరణ
శ్రీరామ నవమి సందర్భంగా రామాలయాలు, ఇతర ఆల యాలు అందంగా ముస్తాబయ్యాయి. రంగురంగుల వి ద్యుద్దీపాలతో కళకళలాడుతున్నాయి. ఆలయాల ఆవరణ లో, ఎదుట చలువ పందిళ్లు వేశారు. మామిడి తోరణాలు కట్టారు. ఆలయాల్లో ఇప్పటికే ప్రత్యేక పూజాకార్యక్రమాలు కొనసాగుతుండగా మంగళవారం శ్రీరామనవమి కోసం ఆ యా ఆలయ కమిటీలు ప్రత్యేక ఏర్పాట్లు చేశాయి. స్వామివారి కల్యాణానికి ప్రత్యేకంగా ముత్యాల పందిరి ఏర్పాటు చేసి, భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా సౌకర్యా లు కల్పించారు. ఈ మేరకు మంచిర్యాల ఏసీసీలోని కోదండ రామాలయం, గౌతమినగర్‌లోని ఆలయం, సాయిబాబా ఆలయం, రైల్వే కాలనీలోని విశ్వనాథ ఆలయం, గర్మిళ్ల, హమాలివాడ, మారుతీనగర్‌లోని ఆలయాలు విద్యుత్ దీపాలతో దేదీప్యమానంగా వెలుగొందుతున్నాయి.
జిల్లా కేంద్రంలోని హౌసింగ్‌బోర్టుకాలనీ రామాలయం, చాంద(టి), మావల, తలమడుగు మండలం కజ్జర్లలోని రామాలయాలు, మల్లిఖార్జునస్వామి ఆలయాలు, నిర్మల్‌లోని బాగులవాడ, మందమర్రి మూడో జోన్‌లోని కోదండ రామాలయం, చెన్నూర్ మండల సుద్దాల, బెల్లంపల్లి, కాగజ్‌నగర్, బోథ్ ప్రాంతాల్లోని రామాలయాలు, హనుమాన్ దేవస్థానాలు అందంగా ముస్తాబయ్యాయి.
పానకం.. ప్రత్యేకం..
శ్రీరామ నవమి పర్వదినం రోజున పానకం ప్రత్యేకంగా ఉంటుంది. బెల్లం, మిరియాలు కలిపి పానకం తయారు చేస్తారు. వడ పప్పును ప్రసాదంగా ఆలయాల్లో భక్తులకు అందజేస్తారు.
నేడు శ్రీరామనవమి
Published Tue, Apr 8 2014 2:52 AM | Last Updated on Tue, Nov 6 2018 5:52 PM
Advertisement