అమావాస్య రోజుని పున్నమి వెలుగులా మార్చే వేడుక..! | Why is Diwali celebrated on Amavasya | Sakshi
Sakshi News home page

Diwali 2024: అమావాస్య రోజుని పున్నమి వెలుగులా మార్చే వేడుక..!

Published Sun, Oct 27 2024 8:06 AM | Last Updated on Thu, Oct 31 2024 10:07 AM

Why is Diwali celebrated on Amavasya

దీపావళి అమావాస్య రోజున జరుపుకొనే వెలుగుల వేడుక. సాధారణంగా పండుగలు ఏదో ఒక మతానికి చెందినవి అయి ఉంటాయి. దీపావళి ఒక మతానికి మాత్రమే పరిమితం కాదు, నాలుగు మతాల వారు జరుపుకొనే అరుదైన పండుగ. దీపావళి పండుగ రోజున ఊరూరా ఇంటింటా ముంగిళ్లలో అసంఖ్యాకంగా దీపాలు వెలుగుతాయి. అమావాస్య రాత్రిని పున్నమిని మించిన వెలుగులతో వెలిగిస్తాయి. ముంగిళ్లలో వెలిగించే గోరంత దీపాలు జగమంతటికీ వెలుగులు పంచుతాయి.

దీపావళి నేపథ్యానికి సంబంధించి అనేక పురాణగాథలు ఉన్నాయి. దీపావళి మూలాలు భారత్‌లోనే ఉన్నా, ఇది దేశదేశాల పండుగగా విస్తరించింది. చాలా పండుగల మాదిరిగానే అధర్మంపై ధర్మం సాధించిన విజయానికి ప్రతీకగా దీపావళిని జరుపుకొంటారు. దీపావళికి మూలంగా నరకాసుర సంహారం గాథ బాగా ప్రాచుర్యంలో ఉంది. రావణ సంహారం తర్వాత శ్రీరాముడు సీతా సమేతంగా ఇదేరోజున అయోధ్యకు తిరిగి చేరుకున్నట్లు పురాణగాథలు ఉన్నాయి.

ఐదు రోజుల ఆనందాల పండుగ
దీపావళి వేడుకలు ఒకరోజుకు మాత్రమే పరిమితం కాదు. ఇది ఐదురోజుల ఆనందాల పండుగ. ఆశ్వయుజ అమావాస్య రోజున దీపావళి జరుపుకొంటే, అంతకు ముందు వచ్చే ఆశ్వయుజ బహుళ త్రయోదశిని ధన త్రయోదశిగా, చతుర్దశిని నరక చతుర్దశిగా జరుపుకొంటారు. దీపావళి మరునాడు కార్తీక శుక్ల పాడ్యమిని బలి పాడ్యమిగా, కార్తీక శుక్ల విదియను యమ ద్వితీయగా జరుపుకొంటారు. ఈ ఐదురోజులకు సంబంధించి వేర్వేరు పురాణగాథలు ప్రాచుర్యంలో ఉన్నాయి.

ధన త్రయోదశి: అమృతం కోసం దేవదానవులు క్షీరసాగర మథనం చేసినప్పుడు అమృతకలశ హస్తుడై ఆరోగ్య ప్రదాతగా ధన్వంతరి ఆవిర్భవించాడు. క్షీరసాగర మథనంలో లక్ష్మీదేవి కూడా ఉద్భవించింది. ధన త్రయోదశి రోజున «నదీ స్నానాలు, సముద్ర స్నానాలు ఆచరించి, ధన్వంతరిని పూజిస్తారు. అలాగే లక్ష్మీదేవి పూజలు కూడా చేస్తారు. ధన త్రయోదశి రోజున బంగారం అమ్మకాలు బాగా జరుగుతాయి. ఈ రోజున బంగారం కొన్నట్లయితే, సంపద పెరుగుతుందని చాలామంది నమ్మకం.

నరక చతుర్దశి: ముల్లోకాలనూ పీడించిన నరకాసురుడిని ఇదే రోజు సత్యభామా సమేతుడై యుద్ధానికి వెళ్లిన శ్రీకృష్ణుడు సంహరించాడు. నరకాసురుడి పీడ విరగడైనందున మరునాడు ద్వారకాపురికి చేరుకున్న సత్యభామా శ్రీకృష్ణులను జనాలు దీపాలు వెలిగించి స్వాగతం పలికారని, అప్పటి నుంచి దీపావళి జరుపుకోవడం ఆనవాయితీగా మారిందని ప్రతీతి.

దీపావళి: దీపావళికి సంబంధించి ఒక ఆసక్తికరమైన పురాణగాథ ఉంది. ముక్కోపిగా పేరుపొందిన దుర్వాస మహర్షి ఒకసారి స్వర్గానికి వెళ్లాడు. దేవేంద్రుడు ఆయనకు అద్భుతమైన ఆతిథ్యం ఇచ్చాడు. ఇంద్రుడి ఆతిథ్యానికి సంతోషించిన దుర్వాసుడు అతడికి కానుకగా ఒక హారాన్ని బహూకరించాడు. ఇంద్రుడు ఆ హారాన్ని తాను ధరించకుండా, దానిని తన పట్టపుటేనుగైన ఐరావతం మెడలో వేశాడు. ఐరావతం ఆ హారాన్ని నేల మీదకు పడవేసి, కాలితో తొక్కింది. ఆ దృశ్యం చూసిన దుర్వాసుడు మండిపడి, ఇంధ్రుణ్ణి శపించాడు. దుర్వాసుడి శాపంతో ఇంద్రుడు స్వర్గాన్ని, సర్వసంపదలను కోల్పోయి రాజ్యభ్రష్టుడయ్యాడు. 

దిక్కుతోచని ఇంద్రుడు విష్ణువు వద్దకు వెళ్లి మొరపెట్టుకున్నాడు. ‘అమావాస్య రోజున ఒక జ్యోతిని వెలిగించి, దానిని శ్రీమహాలక్ష్మీ స్వరూపంగా తలచి ప్రార్థించు. నీకు పునర్వైభవం ప్రాప్తిస్తుంది’ అని చెప్పాడు విష్ణువు. అమావాస్య రోజున జ్యోతిని వెలిగించి పూజించిన ఇంద్రుడు తిరిగి స్వర్గాధిపత్యాన్ని పొందాడు. పోగొట్టుకున్న సంపదలన్నీ మళ్లీ పొందాడు. అందువల్ల దీపావళి అమావాస్య రోజున లక్ష్మీదేవిని పూజించడం ఆచారంగా మారినట్లు చెబుతారు. లక్ష్మీపూజ తర్వాత ప్రజలు కొత్త వస్త్రాలు ధరించి, విందు వినోదాలతో సరదాగా కాలక్షేపం చేస్తారు. 

బలి పాడ్యమి: దీపావళి మరునాడు కార్తీక శుక్ల పాడ్యమి. దీనినే బలి పాడ్యమి అంటారు. వామనావతారం దాల్చిన శ్రీమహావిష్ణువు బాలవటువులా వెళ్లి బలి చక్రవర్తిని దానంగా మూడడుగుల చోటు కోరుకున్నాడు. త్రివిక్రముడిగా మారిన వామనుడు రెండు పాదాలతోనూ భూమ్యాకాశాలను ఆక్రమించుకున్నాడు. మూడో అడుగు ఎక్కడ మోపాలో చోటు చూపించమని బలి చక్రవర్తిని అడిగాడు. అప్పుడు బలి చక్రవర్తి త్రివిక్రముడి పాదాల ముందు శిరసు వంచి, తన తల మీదనే మూడో అడుగు మోపమన్నాడు. వెంటనే బలి తలపై వామనుడు తన పాదాన్ని మోపి, అతణ్ణి పాతాళానికి అణగదొక్కాడు. ఇది కార్తీక శుక్ల పాడ్యమి నాడు జరిగింది. విష్ణువు ఇచ్చిన వరం మేరకు ఈ రోజున బలి చక్రవర్తి భూమ్మీదకు వస్తాడని పలువురు నమ్ముతారు. అందువల్ల కొన్ని ప్రాంతాల్లో బలి చక్రవర్తి గౌరవార్థం వివిధ పద్ధతుల్లో ప్రత్యేక పూజలు జరుపుతారు. జమ్ము, హిమాచల్‌ ప్రదేశ్, గుజరాత్, కర్ణాటక, మహారాష్ట్రలోని పలు ప్రాంతాల్లో బలి పాడ్యమిని విశేషంగా జరుపుకొంటారు.

యమ ద్వితీయ: దీపావళి తర్వాత వచ్చే కార్తీక శుక్ల విదియ రోజును యమ ద్వితీయగా పాటిస్తారు. ఈ రోజున యముడిని, చిత్రగుప్తుడిని పూజిస్తారు. ఈ రోజున యముడికి ఆయన సోదరి యమున ఇంటికి పిలిచి, భోజనం పెట్టిందని, ఎన్ని పనులు ఉన్నా ఏడాదికి ఒకసారి ఇలా తన ఇంటికి వచ్చి తన ఆతిథ్యం స్వీకరించాలని యమున కోరిన కోరికను యముడు సరేనని వరమిచ్చినట్లు పురాణాల కథనం. అందుకే ఈ రోజును ‘భగినీ హస్తభోజనం’, ‘భాయీ దూజ్‌’ పేర్లతో జరుపుకొంటారు. ఈ రోజున ఆడపడుచులు తమ సోదరులను ఆహ్వానించి విందు భోజనాలు పెడతారు. యమ ద్వితీయ రోజున సోదరులను ఇంటికి ఆహ్వానించి ఆతిథ్యమిచ్చే ఆడపడుచులు సౌభాగ్యంతో వర్ధిల్లుతారని, సోదరీమణుల చేతి భోజనం తిన్న సోదరులు దీర్ఘాయుష్మంతులు అవుతారని నమ్మకం.

దేశదేశాల దీపావళి
దీపావళి పండుగను దాదాపు రెండువేల ఏళ్ల కిందట భారత ఉపఖండం సహా అన్ని దక్షిణాసియా దేశాల్లోనూ జరుపుకొనే వారు. ఇటీవలి కాలంలో ఈ పండుగ ప్రపంచవ్యాప్తంగా విస్తరించింది. హిందువులు, జైనులు, బౌద్ధులు, సిక్కులు ఈ పండుగను జరుపుకొంటారు. ఈ నాలుగు మతాలూ భారత భూభాగంలోనే పుట్టాయి. ఈ నాలుగు మతాల వారు ఎక్కువగా ఉండే దేశాల్లో ఈ పండుగ ఘనంగా జరుగుతుంది. బౌద్ధ మతం తొలిరోజుల్లోనే దక్షిణాసియా ప్రాంతమంతటా విస్తరించింది. ఇరవయ్యో శతాబ్ది నుంచి పాశ్చాత్య దేశాలకు భారతీయుల వలసలు పెరిగాయి.

ప్రస్తుతం అమెరికా, కెనడా, బ్రిటన్, ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికా తదితర దేశాల్లో భారత సంతతివారి సంఖ్య గణనీయంగా పెరిగింది. పలు దేశాల్లో భారత సంతతి ప్రజలు రాజకీయంగా కూడా క్రియాశీలక పాత్ర పోషిస్తున్నారు. దాదాపు డజను దేశాల్లో దీపావళి అధికారిక సెలవు దినం. ఇంకొన్ని దేశాల్లో దీపావళి అధికారిక సెలవుదినం కాకపోయినా, ఆ దేశాల్లో దీపావళి వేడుకలను అధికారికంగా జరుపుకోవడం కొన్నేళ్లుగా కొనసాగుతోంది. అమెరికాలో దీపావళి వేడుకలను అధికారికంగా జరుపుకోవడం 2003 నుంచి కొనసాగుతోంది. దీపావళి రోజున అమెరికా అధ్యక్ష భవనం వైట్‌హౌస్‌లో ఘనంగా వేడుకలు జరుగుతాయి. 

నేపాల్, భూటాన్, ఇండోనేసియా, మలేసియా, శ్రీలంక, థాయ్‌లండ్, లావోస్, తైవాన్, కంబోడియా తదితర దేశాల్లో బౌద్ధులు, హిందువులు దీపావళిని తమ తమ సంప్రదాయ పద్ధతుల్లో జరుపుకొంటారు. బౌద్ధారామాల్లోను, హిందూ దేవాలయాల్లోనూ దీపాలు వెలిగించి, ప్రార్థనలు, పూజలు జరుపుతారు. కెనడాలో స్థిరపడిన భారతీయుల్లో హిందువులతో పాటు సిక్కులు కూడా పెద్దసంఖ్యలో ఉంటున్నారు. సిక్కులు దీపావళిని ‘బందీ ఛోడ్‌ దివస్‌’– అంటే చెర నుంచి విడుదలైన రోజుగా జరుపుకొంటారు. గురుద్వారాలను దీపాలతో అలంకరించి, బాణసంచా కాల్పులు జరుపుతారు. భారత సంతతి ప్రజలు నివసించే పలు ఇతర దేశాల్లోనూ ఇటీవలి కాలంలో దీపావళి వేడుకలను విశేషంగా జరుపుకొంటున్నారు. ప్రపంచవ్యాప్తంగా దాదాపు వందకోట్ల మందికి పైగా జనాలు దీపావళి వేడుకలను జరుపుకొంటారు. 

అరుదైన విశేషాలు
దీపావళికి సంబంధించి రకరకాల ఆచారాలు, సంప్రదాయాలు ఉన్నాయి. కొన్నింటికి విశేష ప్రాచుర్యం ఉంటే, ఇంకొన్ని చాలా అరుదైనవి. దీపావళికి సంబంధించి కొన్ని ప్రాంతాల్లో కొద్దిమందికే పరిమితమైన ఆచారాలు ఉన్నాయి. వీటిలో కొన్ని ఆచారాలకు సంబంధించి ఆసక్తికరమైన కథనాలు ఉన్నాయి. వీటిలో ఉదాహరణకు చెప్పుకోవాలంటే, బిహార్‌లో దీపావళి సందర్భంగా ‘హుక్కా పాతీ’ అనే ఆచారం ఉంది. దీని వెనుక కర్ణుడికి సంబంధించిన కథ ఉంది. మహాభారత కాలంలో కర్ణుడు అంగరాజ్యాన్ని పరిపాలించాడు. ఆనాటి అంగరాజ్యం ఇప్పటి బిహార్, ఝార్ఖండ్‌లలోని అంగ, మిథిలాంచల్, కోసి ప్రాంతాలలో ఉండేది. ఈ ప్రాంతాల్లో ఇప్పటికీ ఈ ఆచారం కొనసాగుతుండటం విశేషం. 

ఈ ఆచారం ప్రకారం దీపావళి రోజున మధ్యాహ్నం భోజనాలయ్యాక ఇంటిపెద్ద ‘హుక్కా పాతీ’ని సిద్ధం చేస్తారు. జనప కట్టెలను, గోగునారతో పేనిన తాడును కట్టి, ఎండబెడతారు. సాయంత్రం దీపాలు వెలిగించిన తర్వాత ఇంటిలోని పూజా మందిరాల్లో గాని, ఇంటికి చేరువలోని ఆలయ ప్రాంగణాల్లో గాని వాటిని దహనం చేస్తారు. దీపావళి రోజున కర్ణుడు ఈ ఆచారం పాటించేవాడని ఇక్కడి ప్రజలు చెబుతారు. ‘హుక్కా పాతి’ వలన ఐశ్వర్యాభివృద్ధి, కుటుంబాభివృద్ధి, ఆయురారోగ్యాలు కలుగుతాయని వారు నమ్ముతారు.

దీపావళికి ముందు రోజును ఎక్కువమంది ప్రజలు నరక చతుర్దశిగా జరుపుకొంటే, పశ్చిమ బెంగాల్‌లోని కొందరు ప్రజలు మాత్రం దీనిని ‘భూత చతుర్దశి’గా పాటిస్తారు. భూత చతుర్దశి రోజు రాత్రివేళ ఇంటి ముంగిళ్లలో మట్టి ప్రమిదల్లో పద్నాలుగు దీపాలను వెలిగిస్తారు. ఈ పద్నాలుగు దీపాలూ పద్నాలుగు లోకాలలో ఉండే తమ పూర్వీకుల ఆత్మలకు దారి చూపుతాయని, తద్వారా వారు తమ ఇళ్లలోకి దుష్టశక్తులు చొరబడకుండా నిలువరిస్తారని నమ్ముతారు.

దీపావళి సందర్భంగా పశ్చిమ భారత ప్రాంతంలో కొందరు కొత్త సంవత్సరం వేడుకలు జరుపుకొంటారు. వ్యాపారులు తమ వ్యాపారాల జమా ఖర్చులకు సంబంధించిన కొత్త ఖాతాలను ప్రారంభిస్తారు. మహారాష్ట్రలో ఈ సందర్భంగా ‘చోప్డా పూజ’ జరుపుతారు. ‘చోప్డా’ అంటే జమా ఖర్చుల పుస్తకం. దీపావళి రోజున వారు కొత్త జమా ఖర్చుల పుస్తకాలను ప్రారంభించి, వాటిని లక్ష్మీనారాయణుల పటాల ముందు పెట్టి శాస్త్రోక్తంగా పూజలు జరుపుతారు. కొందరు ఇప్పటికీ జమా ఖర్చుల పుస్తకాలకు పూజలు చేస్తుంటే, ఆధునికత సంతరించుకున్న యువతరం తమ వ్యాపారాల జమా ఖర్చుల వివరాలను నిక్షిప్తం చేసుకున్న లాప్‌టాప్‌లకు, కంప్యూటర్లకు కూడా ‘చోప్డా పూజ’ జరుపుతూ ఈ ఆచారాన్ని కొనసాగిస్తుండటం విశేషం.

మనకు దసరా పాటలు తెలుసు. బడుల్లో చదువుకునే పిల్లలు తమ ఉపాధ్యాయులతో కలసి ఇంటింటికీ వెళ్లి దసరా పాటలు పాడుతూ, వారు ఇచ్చే కానుకలు పుచ్చుకునేవారు. దాదాపు ఇలాంటి ఆచారాన్నే దీపావళి సందర్భంగా ఉత్తరాఖండ్‌లో పాటిస్తారు. ఉత్తరాఖండ్‌లోని కుమావూ ప్రాంతంలో ఇప్పటికీ ఈ ఆచారం మిగిలి ఉంది. దీపావళి రోజున మధ్యాహ్నం వేళ బడుల్లో చదువుకునే పిల్లలు తమ చుట్టు పక్కల ఇళ్ల ముంగిళ్లలో నిలిచి, పాటలు పాడతారు. ఇళ్లలోని వారు పిల్లలకు కానుకగా డబ్బులు, బాణసంచా వస్తువులు, మిఠాయిలు ఇస్తారు. దీపావళి రాత్రివేళ వీరంతా ఆరుబయట కట్టెలతో చలిమంటలు వేసుకుని, ఆట పాటలతో ఆనందంగా గడుపుతారు.

దీపావళి రోజున అన్ని ప్రాంతాల వారు విరివిగా మిఠాయిలు, పిండివంటలు దేవతలకు నివేదించి, వాటిని ఆరగిస్తారు. తమిళనాడులో మిఠాయిలు, పిండివంటలతో పాటు ప్రత్యేకంగా దీపావళి లేహ్యాన్ని తయారు చేస్తారు. ఇతర పదార్థాలతో పాటు ఈ లేహ్యాన్ని కూడా దేవతలకు నివేదిస్తారు. దీనిని తమిళులు ‘దీపావళి లేగియం’ అని, ‘దీపావళి మరుందు’ అని అంటారు. దీపావళి రోజున వేకువ జామునే పూజలు జరిపి, ఈ లేహ్యాన్ని నివేదించి, పరగడుపునే ఆరగిస్తారు. ధనియాలు, వాము, జీలకర్ర, మిరియాలు, సొంఠి, నెయ్యి, బెల్లంతో తయారు చేసే ఈ లేహ్యం ఆరోగ్యాన్ని కాపాడుతుందని చెబుతారు.

దీపావళి తర్వాత కార్తీక శుక్ల విదియ రోజున కొందరు గోవర్ధన పూజ నిర్వహిస్తారు. ఈ ఆచారం పాటించే పలు ప్రాంతాల్లో ఆవుపేడతో గోవర్ధన పర్వత ప్రతిమను రూపొందించి, పూజలు జరుపుతారు. ప్రసిద్ధ శ్రీకృష్ణ క్షేత్రమైన బృందావనంలో గోవర్ధన పూజ సందర్భంగా ‘అన్నకూట పూజ’ నిర్వహిస్తారు. అన్నాన్ని పర్వతాకారంలో రాశిగా పోసి పూజిస్తారు. తర్వాత శ్రీకృష్ణుడికి ఛప్పన్న నైవేద్యాలను సమర్పిస్తారు.

దీపావళికి ముందు ధనత్రయోదశి నాడు దేశంలో పలుచోట్ల ధన్వంతరి పూజలు, లక్ష్మీపూజలు ఘనంగా జరుగుతాయి. మహారాష్ట్రలో మాత్రం పలుచోట్ల ఈరోజున యమధర్మరాజును పూజిస్తారు. మరాఠీ మహిళలు తమ కుటుంబంలో ఉన్న 
పురుషులందరి పేరిట చెరొక దీపం చొప్పున వెలిగిస్తారు. ఈ క్రతువును ‘యమ దీపదానం’ 
అంటారు.

మొఘల్‌ సామ్రాజ్యంలో బాణసంచాకు రాజాదరణ మొదలైంది. బాణసంచా తయారు చేసే నిపుణులను ఔరంగజేబు మినహా మిగిలిన మొఘల్‌ చక్రవర్తులు, వారి సామంతులు బాగా ఆదరించేవారు. అక్బర్‌ చక్రవర్తి బాణసంచా కాల్పులను, వాటి తయారీ నిపుణులను బాగా ప్రోత్సహించేవారు. బాణసంచా తయారీ నిపుణులకు భారీ నజరానాలను చెల్లించేవారు.

మొఘల్‌ చక్రవర్తి ఔరంగజేబు బాణసంచా కాల్పులపై నిషేధం విధించాడు. ఆయన 1667లో విధించిన నిషేధం ఆయన మరణించేంత వరకు కొనసాగింది. మొఘల్‌ పాలన అంతరించి, బ్రిటిష్‌ పాలన మొదలైన తర్వాత బాణసంచాకు పునర్వైభవం మొదలైంది. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement