Amavasya
-
అమావాస్య రోజుని పున్నమి వెలుగులా మార్చే వేడుక..!
దీపావళి అమావాస్య రోజున జరుపుకొనే వెలుగుల వేడుక. సాధారణంగా పండుగలు ఏదో ఒక మతానికి చెందినవి అయి ఉంటాయి. దీపావళి ఒక మతానికి మాత్రమే పరిమితం కాదు, నాలుగు మతాల వారు జరుపుకొనే అరుదైన పండుగ. దీపావళి పండుగ రోజున ఊరూరా ఇంటింటా ముంగిళ్లలో అసంఖ్యాకంగా దీపాలు వెలుగుతాయి. అమావాస్య రాత్రిని పున్నమిని మించిన వెలుగులతో వెలిగిస్తాయి. ముంగిళ్లలో వెలిగించే గోరంత దీపాలు జగమంతటికీ వెలుగులు పంచుతాయి.దీపావళి నేపథ్యానికి సంబంధించి అనేక పురాణగాథలు ఉన్నాయి. దీపావళి మూలాలు భారత్‌లోనే ఉన్నా, ఇది దేశదేశాల పండుగగా విస్తరించింది. చాలా పండుగల మాదిరిగానే అధర్మంపై ధర్మం సాధించిన విజయానికి ప్రతీకగా దీపావళిని జరుపుకొంటారు. దీపావళికి మూలంగా నరకాసుర సంహారం గాథ బాగా ప్రాచుర్యంలో ఉంది. రావణ సంహారం తర్వాత శ్రీరాముడు సీతా సమేతంగా ఇదేరోజున అయోధ్యకు తిరిగి చేరుకున్నట్లు పురాణగాథలు ఉన్నాయి.ఐదు రోజుల ఆనందాల పండుగదీపావళి వేడుకలు ఒకరోజుకు మాత్రమే పరిమితం కాదు. ఇది ఐదురోజుల ఆనందాల పండుగ. ఆశ్వయుజ అమావాస్య రోజున దీపావళి జరుపుకొంటే, అంతకు ముందు వచ్చే ఆశ్వయుజ బహుళ త్రయోదశిని ధన త్రయోదశిగా, చతుర్దశిని నరక చతుర్దశిగా జరుపుకొంటారు. దీపావళి మరునాడు కార్తీక శుక్ల పాడ్యమిని బలి పాడ్యమిగా, కార్తీక శుక్ల విదియను యమ ద్వితీయగా జరుపుకొంటారు. ఈ ఐదురోజులకు సంబంధించి వేర్వేరు పురాణగాథలు ప్రాచుర్యంలో ఉన్నాయి.ధన త్రయోదశి: అమృతం కోసం దేవదానవులు క్షీరసాగర మథనం చేసినప్పుడు అమృతకలశ హస్తుడై ఆరోగ్య ప్రదాతగా ధన్వంతరి ఆవిర్భవించాడు. క్షీరసాగర మథనంలో లక్ష్మీదేవి కూడా ఉద్భవించింది. ధన త్రయోదశి రోజున «నదీ స్నానాలు, సముద్ర స్నానాలు ఆచరించి, ధన్వంతరిని పూజిస్తారు. అలాగే లక్ష్మీదేవి పూజలు కూడా చేస్తారు. ధన త్రయోదశి రోజున బంగారం అమ్మకాలు బాగా జరుగుతాయి. ఈ రోజున బంగారం కొన్నట్లయితే, సంపద పెరుగుతుందని చాలామంది నమ్మకం.నరక చతుర్దశి: ముల్లోకాలనూ పీడించిన నరకాసురుడిని ఇదే రోజు సత్యభామా సమేతుడై యుద్ధానికి వెళ్లిన శ్రీకృష్ణుడు సంహరించాడు. నరకాసురుడి పీడ విరగడైనందున మరునాడు ద్వారకాపురికి చేరుకున్న సత్యభామా శ్రీకృష్ణులను జనాలు దీపాలు వెలిగించి స్వాగతం పలికారని, అప్పటి నుంచి దీపావళి జరుపుకోవడం ఆనవాయితీగా మారిందని ప్రతీతి.దీపావళి: దీపావళికి సంబంధించి ఒక ఆసక్తికరమైన పురాణగాథ ఉంది. ముక్కోపిగా పేరుపొందిన దుర్వాస మహర్షి ఒకసారి స్వర్గానికి వెళ్లాడు. దేవేంద్రుడు ఆయనకు అద్భుతమైన ఆతిథ్యం ఇచ్చాడు. ఇంద్రుడి ఆతిథ్యానికి సంతోషించిన దుర్వాసుడు అతడికి కానుకగా ఒక హారాన్ని బహూకరించాడు. ఇంద్రుడు ఆ హారాన్ని తాను ధరించకుండా, దానిని తన పట్టపుటేనుగైన ఐరావతం మెడలో వేశాడు. ఐరావతం ఆ హారాన్ని నేల మీదకు పడవేసి, కాలితో తొక్కింది. ఆ దృశ్యం చూసిన దుర్వాసుడు మండిపడి, ఇంధ్రుణ్ణి శపించాడు. దుర్వాసుడి శాపంతో ఇంద్రుడు స్వర్గాన్ని, సర్వసంపదలను కోల్పోయి రాజ్యభ్రష్టుడయ్యాడు. దిక్కుతోచని ఇంద్రుడు విష్ణువు వద్దకు వెళ్లి మొరపెట్టుకున్నాడు. ‘అమావాస్య రోజున ఒక జ్యోతిని వెలిగించి, దానిని శ్రీమహాలక్ష్మీ స్వరూపంగా తలచి ప్రార్థించు. నీకు పునర్వైభవం ప్రాప్తిస్తుంది’ అని చెప్పాడు విష్ణువు. అమావాస్య రోజున జ్యోతిని వెలిగించి పూజించిన ఇంద్రుడు తిరిగి స్వర్గాధిపత్యాన్ని పొందాడు. పోగొట్టుకున్న సంపదలన్నీ మళ్లీ పొందాడు. అందువల్ల దీపావళి అమావాస్య రోజున లక్ష్మీదేవిని పూజించడం ఆచారంగా మారినట్లు చెబుతారు. లక్ష్మీపూజ తర్వాత ప్రజలు కొత్త వస్త్రాలు ధరించి, విందు వినోదాలతో సరదాగా కాలక్షేపం చేస్తారు. బలి పాడ్యమి: దీపావళి మరునాడు కార్తీక శుక్ల పాడ్యమి. దీనినే బలి పాడ్యమి అంటారు. వామనావతారం దాల్చిన శ్రీమహావిష్ణువు బాలవటువులా వెళ్లి బలి చక్రవర్తిని దానంగా మూడడుగుల చోటు కోరుకున్నాడు. త్రివిక్రముడిగా మారిన వామనుడు రెండు పాదాలతోనూ భూమ్యాకాశాలను ఆక్రమించుకున్నాడు. మూడో అడుగు ఎక్కడ మోపాలో చోటు చూపించమని బలి చక్రవర్తిని అడిగాడు. అప్పుడు బలి చక్రవర్తి త్రివిక్రముడి పాదాల ముందు శిరసు వంచి, తన తల మీదనే మూడో అడుగు మోపమన్నాడు. వెంటనే బలి తలపై వామనుడు తన పాదాన్ని మోపి, అతణ్ణి పాతాళానికి అణగదొక్కాడు. ఇది కార్తీక శుక్ల పాడ్యమి నాడు జరిగింది. విష్ణువు ఇచ్చిన వరం మేరకు ఈ రోజున బలి చక్రవర్తి భూమ్మీదకు వస్తాడని పలువురు నమ్ముతారు. అందువల్ల కొన్ని ప్రాంతాల్లో బలి చక్రవర్తి గౌరవార్థం వివిధ పద్ధతుల్లో ప్రత్యేక పూజలు జరుపుతారు. జమ్ము, హిమాచల్ ప్రదేశ్, గుజరాత్, కర్ణాటక, మహారాష్ట్రలోని పలు ప్రాంతాల్లో బలి పాడ్యమిని విశేషంగా జరుపుకొంటారు.యమ ద్వితీయ: దీపావళి తర్వాత వచ్చే కార్తీక శుక్ల విదియ రోజును యమ ద్వితీయగా పాటిస్తారు. ఈ రోజున యముడిని, చిత్రగుప్తుడిని పూజిస్తారు. ఈ రోజున యముడికి ఆయన సోదరి యమున ఇంటికి పిలిచి, భోజనం పెట్టిందని, ఎన్ని పనులు ఉన్నా ఏడాదికి ఒకసారి ఇలా తన ఇంటికి వచ్చి తన ఆతిథ్యం స్వీకరించాలని యమున కోరిన కోరికను యముడు సరేనని వరమిచ్చినట్లు పురాణాల కథనం. అందుకే ఈ రోజును ‘భగినీ హస్తభోజనం’, ‘భాయీ దూజ్’ పేర్లతో జరుపుకొంటారు. ఈ రోజున ఆడపడుచులు తమ సోదరులను ఆహ్వానించి విందు భోజనాలు పెడతారు. యమ ద్వితీయ రోజున సోదరులను ఇంటికి ఆహ్వానించి ఆతిథ్యమిచ్చే ఆడపడుచులు సౌభాగ్యంతో వర్ధిల్లుతారని, సోదరీమణుల చేతి భోజనం తిన్న సోదరులు దీర్ఘాయుష్మంతులు అవుతారని నమ్మకం.దేశదేశాల దీపావళిదీపావళి పండుగను దాదాపు రెండువేల ఏళ్ల కిందట భారత ఉపఖండం సహా అన్ని దక్షిణాసియా దేశాల్లోనూ జరుపుకొనే వారు. ఇటీవలి కాలంలో ఈ పండుగ ప్రపంచవ్యాప్తంగా విస్తరించింది. హిందువులు, జైనులు, బౌద్ధులు, సిక్కులు ఈ పండుగను జరుపుకొంటారు. ఈ నాలుగు మతాలూ భారత భూభాగంలోనే పుట్టాయి. ఈ నాలుగు మతాల వారు ఎక్కువగా ఉండే దేశాల్లో ఈ పండుగ ఘనంగా జరుగుతుంది. బౌద్ధ మతం తొలిరోజుల్లోనే దక్షిణాసియా ప్రాంతమంతటా విస్తరించింది. ఇరవయ్యో శతాబ్ది నుంచి పాశ్చాత్య దేశాలకు భారతీయుల వలసలు పెరిగాయి.ప్రస్తుతం అమెరికా, కెనడా, బ్రిటన్, ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికా తదితర దేశాల్లో భారత సంతతివారి సంఖ్య గణనీయంగా పెరిగింది. పలు దేశాల్లో భారత సంతతి ప్రజలు రాజకీయంగా కూడా క్రియాశీలక పాత్ర పోషిస్తున్నారు. దాదాపు డజను దేశాల్లో దీపావళి అధికారిక సెలవు దినం. ఇంకొన్ని దేశాల్లో దీపావళి అధికారిక సెలవుదినం కాకపోయినా, ఆ దేశాల్లో దీపావళి వేడుకలను అధికారికంగా జరుపుకోవడం కొన్నేళ్లుగా కొనసాగుతోంది. అమెరికాలో దీపావళి వేడుకలను అధికారికంగా జరుపుకోవడం 2003 నుంచి కొనసాగుతోంది. దీపావళి రోజున అమెరికా అధ్యక్ష భవనం వైట్‌హౌస్‌లో ఘనంగా వేడుకలు జరుగుతాయి. నేపాల్, భూటాన్, ఇండోనేసియా, మలేసియా, శ్రీలంక, థాయ్‌లండ్, లావోస్, తైవాన్, కంబోడియా తదితర దేశాల్లో బౌద్ధులు, హిందువులు దీపావళిని తమ తమ సంప్రదాయ పద్ధతుల్లో జరుపుకొంటారు. బౌద్ధారామాల్లోను, హిందూ దేవాలయాల్లోనూ దీపాలు వెలిగించి, ప్రార్థనలు, పూజలు జరుపుతారు. కెనడాలో స్థిరపడిన భారతీయుల్లో హిందువులతో పాటు సిక్కులు కూడా పెద్దసంఖ్యలో ఉంటున్నారు. సిక్కులు దీపావళిని ‘బందీ ఛోడ్ దివస్’– అంటే చెర నుంచి విడుదలైన రోజుగా జరుపుకొంటారు. గురుద్వారాలను దీపాలతో అలంకరించి, బాణసంచా కాల్పులు జరుపుతారు. భారత సంతతి ప్రజలు నివసించే పలు ఇతర దేశాల్లోనూ ఇటీవలి కాలంలో దీపావళి వేడుకలను విశేషంగా జరుపుకొంటున్నారు. ప్రపంచవ్యాప్తంగా దాదాపు వందకోట్ల మందికి పైగా జనాలు దీపావళి వేడుకలను జరుపుకొంటారు. అరుదైన విశేషాలుదీపావళికి సంబంధించి రకరకాల ఆచారాలు, సంప్రదాయాలు ఉన్నాయి. కొన్నింటికి విశేష ప్రాచుర్యం ఉంటే, ఇంకొన్ని చాలా అరుదైనవి. దీపావళికి సంబంధించి కొన్ని ప్రాంతాల్లో కొద్దిమందికే పరిమితమైన ఆచారాలు ఉన్నాయి. వీటిలో కొన్ని ఆచారాలకు సంబంధించి ఆసక్తికరమైన కథనాలు ఉన్నాయి. వీటిలో ఉదాహరణకు చెప్పుకోవాలంటే, బిహార్‌లో దీపావళి సందర్భంగా ‘హుక్కా పాతీ’ అనే ఆచారం ఉంది. దీని వెనుక కర్ణుడికి సంబంధించిన కథ ఉంది. మహాభారత కాలంలో కర్ణుడు అంగరాజ్యాన్ని పరిపాలించాడు. ఆనాటి అంగరాజ్యం ఇప్పటి బిహార్, ఝార్ఖండ్‌లలోని అంగ, మిథిలాంచల్, కోసి ప్రాంతాలలో ఉండేది. ఈ ప్రాంతాల్లో ఇప్పటికీ ఈ ఆచారం కొనసాగుతుండటం విశేషం. ఈ ఆచారం ప్రకారం దీపావళి రోజున మధ్యాహ్నం భోజనాలయ్యాక ఇంటిపెద్ద ‘హుక్కా పాతీ’ని సిద్ధం చేస్తారు. జనప కట్టెలను, గోగునారతో పేనిన తాడును కట్టి, ఎండబెడతారు. సాయంత్రం దీపాలు వెలిగించిన తర్వాత ఇంటిలోని పూజా మందిరాల్లో గాని, ఇంటికి చేరువలోని ఆలయ ప్రాంగణాల్లో గాని వాటిని దహనం చేస్తారు. దీపావళి రోజున కర్ణుడు ఈ ఆచారం పాటించేవాడని ఇక్కడి ప్రజలు చెబుతారు. ‘హుక్కా పాతి’ వలన ఐశ్వర్యాభివృద్ధి, కుటుంబాభివృద్ధి, ఆయురారోగ్యాలు కలుగుతాయని వారు నమ్ముతారు.దీపావళికి ముందు రోజును ఎక్కువమంది ప్రజలు నరక చతుర్దశిగా జరుపుకొంటే, పశ్చిమ బెంగాల్‌లోని కొందరు ప్రజలు మాత్రం దీనిని ‘భూత చతుర్దశి’గా పాటిస్తారు. భూత చతుర్దశి రోజు రాత్రివేళ ఇంటి ముంగిళ్లలో మట్టి ప్రమిదల్లో పద్నాలుగు దీపాలను వెలిగిస్తారు. ఈ పద్నాలుగు దీపాలూ పద్నాలుగు లోకాలలో ఉండే తమ పూర్వీకుల ఆత్మలకు దారి చూపుతాయని, తద్వారా వారు తమ ఇళ్లలోకి దుష్టశక్తులు చొరబడకుండా నిలువరిస్తారని నమ్ముతారు.దీపావళి సందర్భంగా పశ్చిమ భారత ప్రాంతంలో కొందరు కొత్త సంవత్సరం వేడుకలు జరుపుకొంటారు. వ్యాపారులు తమ వ్యాపారాల జమా ఖర్చులకు సంబంధించిన కొత్త ఖాతాలను ప్రారంభిస్తారు. మహారాష్ట్రలో ఈ సందర్భంగా ‘చోప్డా పూజ’ జరుపుతారు. ‘చోప్డా’ అంటే జమా ఖర్చుల పుస్తకం. దీపావళి రోజున వారు కొత్త జమా ఖర్చుల పుస్తకాలను ప్రారంభించి, వాటిని లక్ష్మీనారాయణుల పటాల ముందు పెట్టి శాస్త్రోక్తంగా పూజలు జరుపుతారు. కొందరు ఇప్పటికీ జమా ఖర్చుల పుస్తకాలకు పూజలు చేస్తుంటే, ఆధునికత సంతరించుకున్న యువతరం తమ వ్యాపారాల జమా ఖర్చుల వివరాలను నిక్షిప్తం చేసుకున్న లాప్‌టాప్‌లకు, కంప్యూటర్లకు కూడా ‘చోప్డా పూజ’ జరుపుతూ ఈ ఆచారాన్ని కొనసాగిస్తుండటం విశేషం.మనకు దసరా పాటలు తెలుసు. బడుల్లో చదువుకునే పిల్లలు తమ ఉపాధ్యాయులతో కలసి ఇంటింటికీ వెళ్లి దసరా పాటలు పాడుతూ, వారు ఇచ్చే కానుకలు పుచ్చుకునేవారు. దాదాపు ఇలాంటి ఆచారాన్నే దీపావళి సందర్భంగా ఉత్తరాఖండ్‌లో పాటిస్తారు. ఉత్తరాఖండ్‌లోని కుమావూ ప్రాంతంలో ఇప్పటికీ ఈ ఆచారం మిగిలి ఉంది. దీపావళి రోజున మధ్యాహ్నం వేళ బడుల్లో చదువుకునే పిల్లలు తమ చుట్టు పక్కల ఇళ్ల ముంగిళ్లలో నిలిచి, పాటలు పాడతారు. ఇళ్లలోని వారు పిల్లలకు కానుకగా డబ్బులు, బాణసంచా వస్తువులు, మిఠాయిలు ఇస్తారు. దీపావళి రాత్రివేళ వీరంతా ఆరుబయట కట్టెలతో చలిమంటలు వేసుకుని, ఆట పాటలతో ఆనందంగా గడుపుతారు.దీపావళి రోజున అన్ని ప్రాంతాల వారు విరివిగా మిఠాయిలు, పిండివంటలు దేవతలకు నివేదించి, వాటిని ఆరగిస్తారు. తమిళనాడులో మిఠాయిలు, పిండివంటలతో పాటు ప్రత్యేకంగా దీపావళి లేహ్యాన్ని తయారు చేస్తారు. ఇతర పదార్థాలతో పాటు ఈ లేహ్యాన్ని కూడా దేవతలకు నివేదిస్తారు. దీనిని తమిళులు ‘దీపావళి లేగియం’ అని, ‘దీపావళి మరుందు’ అని అంటారు. దీపావళి రోజున వేకువ జామునే పూజలు జరిపి, ఈ లేహ్యాన్ని నివేదించి, పరగడుపునే ఆరగిస్తారు. ధనియాలు, వాము, జీలకర్ర, మిరియాలు, సొంఠి, నెయ్యి, బెల్లంతో తయారు చేసే ఈ లేహ్యం ఆరోగ్యాన్ని కాపాడుతుందని చెబుతారు.దీపావళి తర్వాత కార్తీక శుక్ల విదియ రోజున కొందరు గోవర్ధన పూజ నిర్వహిస్తారు. ఈ ఆచారం పాటించే పలు ప్రాంతాల్లో ఆవుపేడతో గోవర్ధన పర్వత ప్రతిమను రూపొందించి, పూజలు జరుపుతారు. ప్రసిద్ధ శ్రీకృష్ణ క్షేత్రమైన బృందావనంలో గోవర్ధన పూజ సందర్భంగా ‘అన్నకూట పూజ’ నిర్వహిస్తారు. అన్నాన్ని పర్వతాకారంలో రాశిగా పోసి పూజిస్తారు. తర్వాత శ్రీకృష్ణుడికి ఛప్పన్న నైవేద్యాలను సమర్పిస్తారు.దీపావళికి ముందు ధనత్రయోదశి నాడు దేశంలో పలుచోట్ల ధన్వంతరి పూజలు, లక్ష్మీపూజలు ఘనంగా జరుగుతాయి. మహారాష్ట్రలో మాత్రం పలుచోట్ల ఈరోజున యమధర్మరాజును పూజిస్తారు. మరాఠీ మహిళలు తమ కుటుంబంలో ఉన్న పురుషులందరి పేరిట చెరొక దీపం చొప్పున వెలిగిస్తారు. ఈ క్రతువును ‘యమ దీపదానం’ అంటారు.మొఘల్ సామ్రాజ్యంలో బాణసంచాకు రాజాదరణ మొదలైంది. బాణసంచా తయారు చేసే నిపుణులను ఔరంగజేబు మినహా మిగిలిన మొఘల్ చక్రవర్తులు, వారి సామంతులు బాగా ఆదరించేవారు. అక్బర్ చక్రవర్తి బాణసంచా కాల్పులను, వాటి తయారీ నిపుణులను బాగా ప్రోత్సహించేవారు. బాణసంచా తయారీ నిపుణులకు భారీ నజరానాలను చెల్లించేవారు.మొఘల్ చక్రవర్తి ఔరంగజేబు బాణసంచా కాల్పులపై నిషేధం విధించాడు. ఆయన 1667లో విధించిన నిషేధం ఆయన మరణించేంత వరకు కొనసాగింది. మొఘల్ పాలన అంతరించి, బ్రిటిష్ పాలన మొదలైన తర్వాత బాణసంచాకు పునర్వైభవం మొదలైంది. -
సోమావతి అమావాస్య అంటే.. రావిచెట్టుకి ప్రదక్షిణాలు ఎందుకు?
అమావాస్య గనుక సోమవారం నాడు వస్తే ఎంతో పుణ్యప్రదమైనది. మన దక్షిణాదిన కన్నా ఉత్తరాదిన దీనిని చాలామంది ఆచరించడం మనం చూస్తాం. హరిద్వార్‌లోని ప్రయాగలో ఈరోజు పది లక్షల మంది స్నానాలు ఆచరిస్తారు. అంత పవిత్రమైన రోజునే పాశ్చాత్య దేశాల్లో సూర్యగ్రహణం ఏర్పడుతోంది. అందువల్ల ఈ అమావాస్య మరింత విశేషమైనది. సోమావారంతో కూడిన అమావాస్య కావడంతో దీన్ని సోమావతి అమావాస్య అనిపిలుస్తారు. ఈ రోజు ఏం చేస్తారు?, ఏ దేవుడిని పూజిస్తారు? సవివరంగా తెలుసుకుందామా..! అమావాస్యా తు_సోమేన, సప్తమీ_భానునాయుతా చతుర్థీ భౌమవారేణ బుధవారేణ చాష్టమీ। చతస్రస్తిథయస్త్వేతాస్సూర్యగ్రహణ సన్నిభాః స్నానం, దానం, తథాశ్రాద్ధం సర్వం తత్రాక్షయం భవేత్ ॥ ఎప్పటి నుంచి ఆచరిస్తున్నారంటే.. దక్ష ప్రజాపతి తాను చేస్తున్న యజ్ఞానికి తన కుమార్తె సతీదేవిని అలాగే అల్లుడైన పరమశివున్ని ఆహ్వానించకుండా వారిని అవమానిస్తాడు. శివుడు వద్దన్నా వినకుండా యజ్ఞానికి ఆహ్వానం లేకుండా వెళ్లిన సతీదేవి అవమానానికి గురై శరీరాన్ని త్యాగం చేస్తుంది. సతీదేవి మరణ వార్త తెలిసి ఆగ్రహించిన శివుడు తన జటాజూటం నుంచి వీరభద్రుడిని సృష్టిస్తాడు. సమస్త ప్రమథ గణాలతో కలిసి వీరభద్రుడు దక్ష యజ్ఞాన్ని ధ్వంసం చేసి యాగానికి వచ్చిన వారందరిని చితకబాదుతాడు. శివుడిని అవమానించే కార్యక్రమంలో పాల్గొన్నందుకు శివగణాల చేతిలో చంద్రుడు కూడా చావు దెబ్బలు తింటాడు. ఆ సమయంలో ఒంటినిండా గాయాలతో తీవ్రమైన బాధతో చంద్రుడు పరమశివున్ని శరణు వేడుకుంటాడు. చంద్రుని అవస్థను చూసి మనసు కరిగిన భోళాశంకరుడు త్వరలో రానున్న అమావాస్యతో కూడిన సోమవారం నాడు తనకు అభిషేకం జరిపిస్తే తిరిగి చంద్రుడు సంపూర్ణ ఆరోగ్యవంతుడు అవుతాడని అభయమిస్తాడు. ఆనాటి నుంచి సోముడు అంటే చంద్రుడి పేరిట సోమవారం అమావాస్య కలిసి వచ్చిన రోజును సోమవతి అమావాస్యగా మనం జరుపుకుంటున్నాం. ఇవాళ ఉదయం అమావాస్య ఉన్నందువలన ఉదయం మనం ఆచరించే స్నాన, దానాదులకుశ్రాద్ధకర్మకు అక్షయమైన ( తరిగిపోని ) పుణ్యఫలమని మన ధర్మశాస్త్రాలు చెబుతున్నాయి. ఇవాళ ఉదయం నదీస్నానం , పితృతర్పణం, శక్తి కొలది దానము చేయాలి. ఆడవారు సోమవతీ అమావాస్య వ్రత కథ చదువుకుని,ఉపవాసముతో ఉండి అశ్వత్థ వృక్ష ప్రదక్షిణ ( రావి చెట్టు చుట్టూ ప్రదక్షిణలు ) 108 చేస్తే మంచిది. అంతేగాదు ఈ సోమావతి అమావాస్య రోజున శివారాధన చేసి.. రావిచెట్టుకు ప్రదక్షిణలు చేసి.. సోమావతి కథను ఒకసారి గుర్తు చేసుకుని.. ఉపవాస దీక్షను తీసుకుంటే జాతక దోషాలన్ని తొలగిపోతాయనేది భక్తుల నమ్మకం. ఈ రోజు విష్ణువుని, తులిసీ చెట్టుని పూజిస్తే ధనానికి లోటు ఉండదు. చేయకూడనవి.. ఈరోజు జుట్టు గోర్లు కత్తిరించకూడదు. మహిళలు తలస్నానం చేయకూడదు. మాంసము మద్యానికి దూరంగా ఉండాలి. ఈ రోజున సొరకాయ, దోసకాయ శనగలు, జీలకర్ర, ఆవాలు, ఆకుకూరలు తినకూడదు. ఎటువంటి శుభకార్యాలు ప్రారంభించకూడదు. ఈరోజు వస్తువులు కొనడం మానుకోవాలి. గొడవలకు దూరంగా ఉండాలి. -
Diwali 2023: వెలుగుల ఉషస్సు
‘‘సాజ్యం త్రివర్తి సంయుక్తం వహ్నినా యోజితం మయా గృహాణ మంగళం దీపం త్రైలోక్య తిమిరాపహం!’’ మన ఇంట్లో వెలిగించింది ఒక్క దీపమైనా ముల్లోకాల చీకట్లను పోగొట్టాలన్నది భారతీయుల ఆశంస. ప్రపంచంలోని అన్ని దేశాలవారు, అన్ని జాతుల వారు ఏదో ఒక సందర్భంలో దీపాల పండగ చేసుకుంటారు. చీకటి అంటే ఎవరికీ ఇష్టం ఉండదు కదా! ఎవరు ఏ కారణంగా జరుపుకున్నా మనస్సులలో ఉన్న ఆనందాన్ని వ్యక్తపరచటానికి సంకేతంగా దీపాలను వెలిగిస్తారు. లోపల ఉన్న ఆనందమనే వెలుగుని బహిర్గతం చేసి, పరిసరాలని వెలిగేలా చేయటం దీపం వెలిగించటంలోని ఉద్దేశం. చీకటి, వెలుగు అనే మాటలని కాంతి అనే సందర్భంలోనే కాక ఎన్నింటికో ఉపయోగిస్తుంటాము. లోకంలో కావలసిన వాటిని కోరుకోదగిన వాటిని వెలుగుగాను, పనికి రానివాటిని, హాని కలిగించే వాటిని చీకటిగాను చెప్పు తుంటాము. అవిద్య, అజ్ఞానం, అనారోగ్యం, దుఖం, బాధ, చికాకు, దరిద్రం, అపకీర్తి, అవమానం, పాపం మొదలైన మనిషి నాశనానికి, నిరాశా నిస్పృహలకి హేతువులైనవన్నీ చీకటిగాను, జ్ఞానం, ఆరోగ్యం, సంతోషం, ఆనందం, ఆహ్లాదం, కీర్తి, పుణ్యం మొదలైన మానవునికి కోరుకోదగిన, ఉపయోగపడే వన్ని వెలుగుగాను సంకేతించటం జరిగింది. అందువలననే అన్నివిధాలైన చీకట్లను పోగొట్టే వెలుగు అంటే ఇష్టపడే జాతి భారతజాతి. కనుకనే దీపాన్ని ఆరాధిస్తాము. పూజిస్తాము. ‘‘దీపం జ్యోతి పరమ్ బ్రహ్మ దీపం సర్వ తమోపహమ్ దీపేన సాధ్యతే సర్వం సంధ్యాదీపం నమోస్తుతే!’’ అని దీపాన్ని ్రపార్థిస్తాము. ఇది నిత్యకృత్యం. వరుసలుగా వందలాది, వేలాది దీపాలు వెలిగించటానికి ఎంతటి సంతోషం ఉ΄÷్పంగి ఉండాలో కదా! అటువంటి సందర్భం ద్వాపరయుగం చివర లో వచ్చింది. దానికి బీజం కృతయుగంలోనే పడి త్రేతాయుగంలో మొలకెత్తింది. యజ్ఞవరాహమూర్తిగా తనను ఉద్ధరించిన మహావిష్ణువుని చూసి వలచింది భూదేవి. తనకు కుమారుని ప్రసాదించమని కోరింది. ఆ సమయంలో గర్భధారణ జరిగితే అసుర లక్షణాలతో... లోకకంటకుడు అయిన కుమారుడు జన్మిస్తాడని అన్నాడు విష్ణువు. భూదేవి తమకంతో బలవంతం చేసింది. తప్పలేదు. లోకకంటకుడు భూదేవి గర్భంలో ఉన్నాడని తెలిసిన దేవతలు ఆ బాలుడు గర్భంలో నుండి బయటకు రాకుండా చూశారు. భూదేవి విష్ణువుని వేడుకుంది. త్రేతాయుగం చివరలో కుమారుడు ఉదయిస్తాడని అభయం ఇచ్చాడు. ఆ బాలుడే నరకుడు. అతడికి పదహారు సంవత్సరాలు వచ్చిన తరువాత బ్రహ్మపుత్రానది పరీవాహక ్రపాంతంలో ్రపాగ్జ్యోతిషం రాజధానిగా కామరూపదేశానికి రాజుని చేస్తూ, ధర్మం తప్పవద్దని, గోబ్రాహ్మణులకు హాని తలపెట్టవద్దని, అలా చేస్తే కీడు వాటిల్లుతుందని హెచ్చరించాడు. ఆ మాట ననుసరించి చాలా కాలం భుజబలంతో తనకెవ్వరు ఎదురు లేని విధంగా ధర్మబద్ధంగానే పరిపాలించాడు. కాని, ద్వాపరయుగం చివరలో అతడిలోని అసురలక్షణాలు బహిర్గత మయ్యాయి. వేదధర్మానికి దూరమై, తాంత్రికసాధన సత్వర ఫలవంతమని అనుసరించటం మొదలుపెట్టాడు. దానికోసం కామాఖ్యాదేవికి బలి ఇవ్వటానికి ఎంతోమంది రాజకుమారులను, పదునారు వేలమంది రాజకుమార్తెలను చెరపట్టి ఉంచాడు. అదితి కుండలాలను, వరుణుని ఛత్రాన్ని హరించాడు. దేవతలకు నిలువ నీడ లేకుండా చేశాడు. మరెన్నో దురంతాలు చేయ సాగాడు. ఇంద్రుడి అభ్యర్థన మేరకు శ్రీ కృష్ణుడు నరకునిపై యుద్ధానికి వెడుతుంటే భూదేవి అవతారమైన సత్యభామ తానూ వెంట వస్తానని ముచ్చట పడింది. అక్కడ కృష్ణుడు మూర్ఛపోతే అతడికి సేదతీర్చుతూనే యుద్ధంలో నరకుని నిలువరించింది. సత్యభామ ఉపచారాలతో తేరుకున్న కృష్ణుడు చక్రంతో నరకుని తెగటార్చాడు. అది ఆశ్వయుజ కృష్ణ చతుర్దశి. సత్యభామ కోరిక మేరకు ఆ రోజుని నరకుడి పేరుతో నరక చతుర్దశి అని పిలవటం జరిగింది. ఆ మరునాడు, అంటే, అమావాస్య నాడు ప్రజలందరు దీపాలు వెలిగించుకొని సంబరాలు చేసుకున్నారు. ఏదైనా శుభసంఘటన జరిగినప్పుడు కాని, ఎవరైనా మహానుభావులు పుట్టినప్పుడు కాని పండుగలు, వేడుకలు, సంబరాలు చేసుకుంటారు. కాని, ఈ సందర్భంలో ఒకరు చనిపోతే అతడి పేరు మీద చేసుకోవటం జరుగుతోంది. అతడి చావు ఎందు కంతగా సంతోష ప్రదమయింది? నరకుడు భూదేవి పుత్రుడు. భూమి వసుంధర. అన్ని రకాలైన ఓషధులు, ఖనిజాలు ఇచ్చేది భూదేవియే. భూపుత్రుడైన నరకునికి వాటన్నిటి మీద వారసత్వపు అధికారం ఉంది. కాని అతడు ఆ అధికారాన్ని దుర్వినియోగం చేశాడు. సంపదలతో పాటు వెలుగుని కూడా ఎవరికీ అందకుండా తానే స్వంతం చేసుకున్నాడు. ్రపాగ్జ్యోతిషమంటే ముందుగా వెలుగు ప్రసరించే ్రపాంతం. భారతదేశంలో మొదటి సూర్యకిరణం భూమిని సోకేది అక్కడే కదా! ముందుగా తనకి అందిన వెలుగుని ఇతరులకి చేరకుండా అడ్డుపడేవాడట! నరకుని భయానికి పగటిపూట బయటకు రావటానికి భయం. వద్దామన్నా వెలుగు లేదు. రాత్రిపూట దీపం వెలిగిస్తే తమ ఉనికి తెలుస్తుందనే భయం. మొత్తానికి చీకట్లో, భయమనే చీకట్లో మగ్గారు. భయ కారణం పోగానే ఇన్నాళ్ళ దీపాలు, కరువుతీరా వెలిగించుకొని పండుగలు, వేడుకలు, సంబరాలు చేసుకున్నారు. ఆ శుభ సంఘటనని స్మరించుకుంటూ ప్రతి సంవత్సరం ఆశ్వయుజ కృష్ణ అమావాస్యనాడు దీపాలు వెలిగించటం సంప్రదాయం అయింది. ఆశ్వయుజ బహుళ అమావాస్య నాడు లక్ష్మీదేవి క్షీరసాగరం నుండి ఆవిర్భవించి, విష్ణువుని వివాహ మాడింది. దానితో దేవతలకు పోయిన స్వర్గలక్ష్మి లభించింది. కనుక దేవతలు కూడా దీపావళిని ఆనందంగా జరుపుకుంటారు. మనలోనూ, కుటుంబంలోనూ, సమాజంలోనూ, దేశంలోనూ, భూమండలం అంతా కప్పిన అన్నివిధాలైన అంధకారాలు పటాపంచాలు అయ్యే విధంగా దీపాలని వెలిగించి దీపావళిని దివ్య దీపావళిగా ఆనందోత్సాలతో జరుపుకుందాం. వెలుగులని పంచుదాం. నరకుని సంహరించినదెవరు? స్వంత కొడుకునైనా దుష్టుడైతే సంహరించటానికి అంగీకరించే, సహకరించే ఉత్తమ మాతృ హృదయానికి సంకేతం సత్యభామ. సౌందర్యానికి, స్వాభిమానానికి, మితిమీరిన కృష్ణుడి పట్ల ఉన్న ప్రేమకి, పరాక్రమానికి పరాకాష్ఠగా మాత్రమే సత్యభామ ప్రసిద్ధం. కాని, మూర్తీభవించిన మాతృత్వం కూడా. ఒక్క దుష్టుడైన కుమారుడు లేకపోతే కోటానుకోట్ల బిడ్డలకి మేలు కలుగుతుంది అంటే అతడిని శిక్షించటానికి అంగీకరించేది విశ్వమాతృ హృదయం. ఆ శిక్ష అతడు మరిన్ని దుష్కృత్యాలు చేసి, మరింత పాపం మూట కట్టుకోకుండా కాపాడుతుంది. ఇది బిడ్డపై ఉన్న ప్రేమ కాదా! బిడ్డ సంహారాన్ని ప్రత్యక్షంగా చూడటమే కాదు, ్రపోత్సహించి, సహాయం చేసిన కారణంగా కాబోలు, నరకాసురుణ్ణి సత్యభామయే సంహరించింది అనే అపోహ ఉన్నది. లక్ష్మీపూజ ఎందుకు? దీపావళి నాడు లక్ష్మీదేవిని పూజించటం సంప్రదాయం. ఆనాడు లక్ష్మీదేవి పాలసముద్రం నుండి ఆవిర్భవించి, నారాయణుణ్ణి చేపట్టింది. వ్యాపారస్తులు లక్ష్మీదేవిని పూజించి ఈ రోజే కొత్త లెక్కల పుస్తకాలు మొదలుపెడతారు. లక్ష్మీదేవి ఆ నాడు సంధ్యాసమయం తరువాత తన వాహనమైన గుడ్లగూబని అధిరోహించి విహారానికి బయలుదేరి, తన స్వరూపాలైన దీపాలు ఉన్న ఇంట ప్రవేశిస్తుంది. కనుక లక్ష్మీదేవికి ఆహ్వానం పలుకుతూ ఎన్నో దీపాలు వెలిగిస్తారు. తరువాత బాణసంచా పేలుస్తారు. దీపాలు వరుసగా వెలిగిస్తారు కనుక ఈ పండగను దీపావళి అంటారు. జ్ఞాన జ్యోతులు అన్ని సంప్రదాయాల వారు దీపావళి జరుపుకోవటానికి వారి కారణాలు వారికి ఉన్నాయి. ఎవరు ఏ కారణంగా జరుపుకున్నా మనస్సులలో ఉన్న ఆనందాన్ని వ్యక్తపరచటానికి సంకేతంగా దీపాలను వెలిగిస్తారు. లోపల ఉన్న ఆనందమనే వెలుగుని బహిర్గతం చేసి, పరిసరాలని అంతా వెలిగేట్టు చేయటం దీపం వెలిగించటంలోని ప్రధాన ఉద్దేశం. ముందురోజు నరకచతుర్దశి నాడు తెల్లవారుజామున చంద్రుడు ఉండగా నువ్వులనూనెతో అభ్యంగన స్నానం చేస్తారు. పెద్దలు యముడికి తర్పణాలు ఇస్తారు. పిండివంటలు, కొత్తబట్టలతో ఆనందంగా గడుపుతారు. మరునాడు దీపావళి. అమావాస్య పితృతిథి. పైగా దక్షిణాయనం. కనుక మధ్యాహ్న సమయంలో పితృదేవతలకు తర్పణాలు ఇస్తారు. – డా. ఎన్.అనంతలక్ష్మి -
నేడు సోమావతి అమావాస్య..కొన్ని కోట్ల గ్రహణములతో..
ఈ అమావాస్య అత్యంత శక్తిమంతమైనది. సోమవారంతో కూడిన అమావాస్య కావడంతో దీన్ని సోమావతీ అమావాస్య అని పిలుస్తారు. ఇక ఇది కొన్ని కోట్ల సూర్యగ్రహణములతో సమానమైనది. సోమవారం నాడు వచ్చే అమావాస్యకు ఎంతో ప్రాముఖ్యత వుంది. ఆ రోజున ఉపవాసం చేసి రావి చెట్టుకు 108 సార్లు ప్రదక్షిణలు చేస్తే జాతకంలో వుండే సకల దోషాలు తొలగిపోతాయని శాస్త్రం. సోమావతి అమావాస్య రోజున శివారాధన చేసి.. రావిచెట్టుకు ప్రదక్షిణలు చేసి.. సోమావతి కథను ఒకసారి గుర్తు చేసుకుని.. ఉపవాస దీక్షను తీసుకుంటే జాతక దోషాలు తొలగిపోతాయి. సోమవతీ అమావాస్య రోజున ముఖ్యంగా ఆచరించవలసినవి: ⇒ సోమావతీ అమావాస్య రోజున పేదవారికి అన్నదానం చేయాలి. ఈనాడు మౌనవ్రతం లేదా మౌనం పాటించడం ఎంతో ఫలప్రదం. ⇒ ఈ సోమావతీ వ్రతాన్ని పాటించే భక్తులు ఈనాడు ఉదయమే రావి చెట్టు చుట్టూ 108 సార్లు ప్రదక్షిణలు చేయాలి. ⇒ శని మంత్రాన్ని పఠించి, శ్రీమన్నారాయణ మూర్తిని అర్చించాలి. ⇒ గంగా నది, త్రివేణీ సంగమం లేదా ఏదైనా పుణ్యనదుల్లో ఈ సోమావతీ అమావాస్య రోజున స్నానం ఆచరిస్తే, ఐశ్వర్యం కలుగుతుంది, రోగాలు, బాధలు తొలగుతాయి, పితృదేవతలు ఉన్నత లోకాలకు వెళ్ళడానికి మార్గం ఏర్పడుతుంది. ⇒ వేదవ్యాస మహర్షి చెప్పినదాని ప్రకారం - సోమావతీ అమావాస్య నాడు పేదవారికి గుప్తదానం చేసి, పుణ్యనదుల్లో స్నానం ఆచరించిన వారికి వేయి గోవులు దానం చేసిన పుణ్యం లభిస్తుంది. సోమావతి అమావాస్య గురించి ఒక కథఉంది. పూర్వం ఒక వర్తక వ్యాపారి ఇంటికి ఒక సాధువు వచ్చేవాడు. ఆ వ్యాపారికి వివాహమైన ఏడుగురు కుమారులు, పెళ్లికాని కుమార్తె ఉంది. ఒకరోజు పెళ్ళికాని ఆ కుమార్తెను ఆ సాధువు చూసి కూడా దీవించకుండా వెళ్ళిపోతాడు. దీనికి వారు చాలా బాధపడతారు. ఈ విషయమై ఒక పురోహితుడి దగ్గరకి వెళ్లి తమ కుమార్తె జాతకాన్ని చూపిస్తుంది ఆ వర్తకుని భార్య. అది చూసి పురోహితుడు ఆమె పెళ్లైన వెంటనే భర్త చనిపోతాడని చెప్పగా.. వారు చాలా బాధపడి దీనికి ఎలాంటి పరిష్కారమూ లేదా అని అడుగుతారు. అప్పుడు పురోహితుడు సింఘాల్ ప్రాంతానికి వెల్లి అక్కడ చాకలి స్త్రీ కుంకుమ అడిగి నుదుట పెట్టుకుంటే దోషం పోతుందని చెప్తాడు. మర్నాడు వ్యాపారి కుమారుల్లో చిన్నవాడు, తన తల్లి ఆజ్ఞ మీద తన సోదరితో కలిసి ఆ ప్రాంతానికి బయలుదేరుతాడు. వీరు వెళ్తుండగా మార్గమధ్యంలో ఒక నది దాటాల్సివస్తుంది. ఆ నది ఎలా దాటాలా అని ఆలోచిస్తూ ఆ చెట్టు కిందే విశ్రాంతి తీసుకుంటారు. ఆ చెట్టుపైన ఒక రాబందు గూడు ఉంటుంది. ఆ రాబందుల జంట లేని సమయంలో ఒక పాము వచ్చి ఆ రాబందు పిల్లలను తినటం పరిపాటి. ఈ సారి కూడా అలా పాము ప్రయత్నించడం చూసిన ఈ అమ్మాయి ఆ పామును చంపేస్తుంది. దీనికి ఆ రాబందుల జంట తన పిల్లలను కాపాడినందుకు వారికి ఆ నదిని దాటడానికి సహాయ చేస్తుంది. ఆ ఇద్దరు అక్కడికి వెళ్ళి ఆమెకు కొన్ని నెలలు పాటు సేవ చేయగా.. ఈ సోమావతి అమావాస్య రోజునే ఈ కన్య నుదుటన చాకలి స్త్రీ కుంకుమ దిద్దుతుంది. ఆమె వెంటనే రావిచెట్టు దగ్గరికి వెళ్లి 108 ప్రదక్షిణలు చేస్తుంది. అంతటితో ఆమె జాతక దోషం తొలగిపోతుంది. ఇది సోమావతీ అమావాస్య కథ. అంతేగాకుండా సోమావతీ అమావాస్య రోజున పూర్వీకుల కోసం దానం చేస్తే కోపంతో ఉన్న పూర్వీకులు కూడా సంతోషించి తమ సంతతి పురోగతిని దీవిస్తారు. ఈ రోజున పిండప్రదానం చేయడం చేస్తే సంతృప్తి చెందుతారని.. తద్వారా మనకు మంచి చేస్తారని విశ్వాసం. ఈ రోజున వివాహితులు , అవివాహితులు రావిచెట్టును 108 సార్లు ప్రదక్షిణలు చేయడం ద్వారా కోరుకున్న కోరికలు తీరతాయి. ఈ రోజు శ్రీ మహాలక్ష్మీ సమేత శ్రీమన్నారాయణుని, పార్వతీపరమేశ్వరులను, పితృదేవతలను పూజించాలి. మంచి పనులు చేయాలి, వీలైతే మౌనం పాటించాలి. (చదవండి: సైన్స్ ఆగిపోయిన సమయాన ..) -
గుప్తనిధి కోసం బాలింత దహనం?
సాక్షి, బళ్లారి: ఉగాది అమావాస్య రోజున కొప్పళ జిల్లాలో ఘోరం జరిగింది. సోమవారం రాత్రి అమావాస్య ఘడియల్లో బాలింత మహిళను గుప్త నిధి కోసం కాల్చి వేసినట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. జిల్లాలో గబ్బూరు గ్రామానికి చెందిన కే.నేత్రావతి (26) అనే మహిళకు ఒకటిన్నర నెలల పసికందు ఉంది. బాలింత మహిళను బలి ఇస్తే గుప్త నిధులు బయటకు వస్తాయన్న ఆశతో కొందరు దుర్మార్గులు ఆమెను హత్య చేసి కాల్చివేశారా? లేక ప్రాణాలతో ఉన్నప్పుడే సజీవ దహనం చేశారా? అన్న విషయంలో పోలీసుల దర్యాప్తులో తేలాల్సి ఉంది. ఆమె ఇంటికి సమీపంలోనే ఈ ఘోరం చోటు చేసుకుంది. దుండగుల కోసం కొప్పళ గ్రామీణ పోలీసులు దర్యాప్తు చేపట్టారు. -
Diwali 2022: ఈ ఏడాది దీపావళిపై సందిగ్దత.. ఎప్పుడు జరుపుకోవాలి?
చెడుపై మంచి సాధించిన విజయానికి ప్రతీకగా జరుపుకునే పండుగ దీపావళి. ఇంటికి నూతన వెలుగులు తీసుకొచ్చే పండుగ. ఆశ్వయుజ బహుళ అమవాస్య రోజు దీపావళి జరుపుకుంటారు. పురాణాల్లో దీపావళి వెనక రెండు కథలు ఉన్నాయి. శ్రీకృష్ణుడు సత్యభామతో కలిసి నరకాసురుడనే రాక్షసున్ని సంహారం చేసిన మరుసటి రోజు వెలుగుల పండుగ చేసుకున్నారని చెబుతుంటారు. అదే విధంగా త్రేతాయుగంలో లంకలో రావణుడిని హతమార్చి రాముడు సతీ సమేతంగా అయోధ్యకు తిరిగి వచ్చిన సందర్భంగా ప్రజలు ఆనందోత్సవాల మధ్య దీపావళి వేడుకలు జరుపుకున్నారని రామాయణం చెబుతోంది. దీపావళి ఎప్పుడు జరుపుకోవాలి? ఈ ఏడాది దీపావళి పండుగ జరుపుకోవడంపై కొంత అయోమయం తలెత్తింది. తిథులు, నక్షత్రాల ప్రకారం ఈనెల 24న జరుపుకోవాలని కొందరు భావిస్తుంటే మరికొంతమంది నవంబర్ 25న ప్రభుత్వం దీపావళి సెలవు ప్రకటించారని కాబట్టి ఆరోజే పండుగ నిర్వహించుకోవాలని ఆలోచిస్తున్నారు.. దీంతో కాస్తా గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి. అయితే శాస్త్రం ప్రకారం అమావాస్య రాత్రి తిథి ఉండగా దీపావళి జరుపుకోవాలని పండితులు సూచిస్తున్నారు. పంచాంగం, తిథి, వారం ప్రకారం చూసుకున్నా నవంబర్ 24వ తేదీన దీపావళి వేడక నిర్వహించుకోవాలని తెలిపారు. అక్టోబర్ 24 సోమవారం రోజు చతుర్ధశి తిథి సాయంత్రం 5 గంటల లోపు ఉందని, 5 గంటల తరువాత అమామాస్య ప్రారంభమవుతుందని తెలిపారు. అక్టోబర్ 25న మంగళవారం సాయంత్రం దాదాపు 4.20 గంటలకే అమావాస్య పూర్తై పాడ్యమి మొదలవుతోంది. అంటే 25న సాయంత్రం లక్ష్మీపూజ చేసి, దీపాలు వెలిగించే సమయానికి అమావాస్య ఉండదని వెల్లడించారు. రాత్రి సమయాల్లో అమావాస్య తిథి 24వ తేదీనే ఉండటం వల్ల ఆ రోజే దీపావళి జరుపుకోవాలని స్పష్టం చేశారు. ఒక్కమాటలో చెప్పాలంటే దీపావళి ఈనెల 24 సోమవారం జరుపుకోవాలి. ఈ రోజు సూర్యోదయానికి చతుర్థశి తిథి ఉన్నప్పటికీ సూర్యాస్తమయం సమయానికి అమావాస్య వచ్చేస్తుంది. దీపావళి అంటే సూర్యాస్తమయం సమయంలో చేసుకునే పండుగ కాబట్టి అమావాస్య ఘడియలు ఉన్న సోమవారం రాత్రి ( 24 తేదీన) లక్ష్మీపూజ చేసి దీపాలు వెలిగించుకోవాలి. -
కాడెద్దుల పండుగ ఫోటోలు
-
కాడెద్దుల పండుగ.. కనుల విందుగ..
సాక్షి, ఆదిలాబాద్: ఏటా పొలాల అమావాస్య సందర్భంగా జరుపుకునే కాడెద్దుల పండుగను ఆదిలాబాద్ జిల్లాలో సోమవారం ఘనంగా నిర్వహించారు. వ్యవసాయ పనుల్లో తమకు తోడుగా నిలిచే ఎడ్లను ఉదయమే చెరువులు, వాగులు, నదుల వద్దకు తీసుకెళ్లి స్నానం చేయించారు. ఇంటికి వచ్చిన తర్వాత వాటిని నూతన వస్త్రాలు, అలంకరణ సామాగ్రితో అందంగా ముస్తాబు చేశారు. కుటుంబ సభ్యులంతా కలిసి పూజలు చేశారు. రోజంతా ఉపవాసం పాటించి తొమ్మిది రకాల నైవేద్యాలు తయారుచేసి పశువులకు తినిపించారు. అనంతరం ఉపవాసం విరమించారు. సాయంత్రం గ్రామదేవతల ఆలయాల వద్దకు ఎడ్లను తీసుకెళ్లి ఆలయాల చుట్టూ ప్రదక్షిణ చేయించారు. ఆదిలాబాద్ జిల్లా జైనథ్ మండలం పూసాయి గ్రామరైతులు ఎల్లమ్మ ఆలయం చుట్టూ ఎడ్లతో ప్రదక్షిణ చేశారు. ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని మహాలక్ష్మివాడలోని మహాలక్ష్మి ఆలయం, అశోక్ రోడ్డులోని పోచమ్మ ఆలయం, డైట్ మైదానం సమీపంలోని ముత్యాలమ్మ ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. కొన్ని గ్రామాల్లో ఎద్దులకు పోటీలు నిర్వహించారు. కాడెద్దుల పండుగ సందర్భంగా పంచాయతీల ఆధ్వర్యంలో పలు గ్రామాల్లో మామిడి తోరణాలు కట్టించారు. రంగు రంగుల బెలూన్లతో అలంకరించారు. (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) -
ఐదేళ్ల పదవి.. అమావాస్య నాడు ప్రమాణం
సాక్షి, హైదరాబాద్ : ఐదేళ్లపాటు ఉండాల్సిన కార్పొరేటర్ ప్రమాణ స్వీకార కార్యక్రమం అమావాస్య రోజున పెడతారా.. అంటూ రాజకీయపార్టీల ప్రతినిధులు అధికారుల ఎదుట అసంతృప్తి వ్యక్తం చేశారు. అది ఎన్నికల కమిషనర్ నిర్ణయమని, రాజ్యాంగ విధి అయినందున చేయగలిగిందేమీ లేదని ఎన్నికల అధికారి లోకేశ్‌కుమార్ వివరించారు. కనీసం.. రాహుకాలం ముగిసేంత వరకైనా సమయమివ్వాలని, ఉదయం 11.30 గంటల వరకు రాహుకాలం ఉంటుందని చెప్పడంతో, ఎన్నిక నిర్వహించేది ప్రిసైడింగ్ ఆఫీసర్ అని తెలిపారు. అందరూ వచ్చి, అన్ని ఏర్పాట్లు పూర్తయ్యేంతవరకు దాదాపుగా అంతే సమయమవుతుందని వారు అభిప్రాయపడ్డారు. ఈ నెల 11న జరగనున్న ప్రమాణ స్వీకారం, మేయర్, డిప్యూటీ మేయర్ ఎన్నికల ప్రక్రియ విధానాన్ని వివరించేందుకు జీహెచ్ఎంసీలో మంగళవారం రాజకీయపార్టీల ప్రతినిధుల సమావేశం నిర్వహించారు. ఆయా రాజకీయపార్టీల నుంచి ఎమ్మెల్సీ శ్రీనివాస రెడ్డి (టీఆర్ఎస్ ), ఎమ్మెల్సీ సయ్యద్ అమినుల్ జాఫ్రి (ఎంఐఎం), నిరంజన్ (కాంగ్రెస్ ), బీజేపీ నుంచి శంకర్ యాదవ్, దేవర కరుణాకర్‌లు హాజరయ్యారు. ఎన్నికలకు సంబంధించిన ప్రత్యేక సమావేశంలో సభ్యులు వ్యవహరించాల్సిన తీరు, తదితరమైన వాటి గురించి లోకేశ్‌కుమార్ వారికి వివరించారు. ప్రమాణ స్వీకారం చేయనున్న సభ్యులు 11వ తేదీన 10.45 గంటల వరకు గుర్తింపు కార్డు, సమావేశ నిర్వహణపై జీహెచ్ఎంసీ జారీ చేసిన నోటీసును తీసుకొని కౌన్సిల్ హాల్‌కు రావాలి. సభ్యుల ప్రమాణ స్వీకారం తెలుగు, ఉర్దూ, హిందీ ఇంగ్లీష్ నాలుగు భాషల్లో ఉంటుంది. ఎవరికిష్టమైన భాషలో వారు చేయవచ్చు. అనంతరం మధ్యాహ్నం 12.30 గంటలకు మేయర్, డిప్యూటీ మేయర్ ఎన్నికలు నిర్వహిస్తారు. ఎన్నికలకు ఎక్స్అఫీషియో సభ్యులతో కలిపి 97 మంది సభ్యులు హాజరైతేనే పూర్తి కోరంతో మేయర్, డిప్యూటీ మేయర్ ఎన్నికలు జరుగుతాయి. చేతులు ఎత్తడం ద్వారా మేయర్, డిప్యూటీ ఎన్నిక జరుగుతుంది. ఎన్నికల ప్రక్రియ మొత్తాన్ని వీడియో తీస్తారు. వచ్చిన సభ్యులందరి వివరాలు సరిచూసి, హాలులోకి ప్రవేశించే ముందు సంతకాలు తీసుకోవడం, వారికి సూచనలు, సలహాలు ఇచ్చేందుకు 30 మంది అధికారులుంటారు. బల్దియా పాలకమండలికి నేడే చివరి రోజు సాక్షి, సిటీబ్యూరో : జీహెచ్ఎంసీ ప్రస్తుత పాలకమండలి గడువు బుధవారం (10వ తేదీతో)ముగిసిపోనుంది. 2016 ఫిబ్రవరి 11న పాలకమండలి సభ్యులు ప్రమాణం చేశారు. వారి ఐదేళ్ల గడువు పదో తేదీతో ముగిసిపోనుంది. అందువల్లే కొత్త పాలకమండలి ప్రమాణ స్వీకారం కూడా మర్నాడే ఏర్పాటు చేశారు. ప్రమాణ స్వీకారం అనంతరం మేయర్, డిప్యూటీ మేయర్ల ఎన్నికలు కూడా నిర్వహించనున్నారు. అప్పుడు..ఇప్పుడు కూడా కొత్త పాలకమండలి ఫిబ్రవరి నెల 11వ తేదీ..గురువారం కావడం యాధృచ్ఛికమే అయినా విశేషంగా మారింది. ప్రతిపక్షం లేకుండా.. బల్దియా చరిత్రలోనే ప్రతిపక్షం, విమర్శలు, సవాళ్లు–ప్రతిసవాళ్లు లేకుండా ఐదేళ్లు పూర్తిచేసుకున్న పాలకమండలి ఇప్పటి వరకు లేదు. అధికార టీఆర్ఎస్ నుంచే మేయర్, డిప్యూటీ మేయర్లు ఉండటం, తగినంతమంది సభ్యుల బలమున్న ఎంఐఎం మిత్రపక్షంగా వ్యవహరించడంతో ప్రతిపక్షమనేది లేకుండా పోయింది. బీజేపీ, కాంగ్రెస్‌లకు తగిన బలమే లేనందున ఏమీ చేయలేకపోయారు. ముందస్తుగా వచ్చిన ఎన్నికలతో కొత్త కార్పొరేటర్లు వచ్చినప్పటికీ, అధికారికంగా ప్రొటోకాల్ ప్రకారం కార్పొరేటర్ల హోదాల్లో కొనసాగారు. కొన్ని ప్రాంతాల్లో వివాదాలు చెలరేగాయి. ప్రతిపక్షం లేకుంటే పాలన ఎలా ఉంటుందో కూడా ఈ పాలకమండలి హయాంలోనే తెలిసివచ్చింది. ప్రజాసమస్యల గురించి ప్రశ్నించిన వారు లేరు.ఒకరిద్దరు సభ్యులున్న పార్టీలకు అవకాశమే రాలేదు. వారి వాదన విన్నవారే లేరు. కరోనా కారణంగా దాదాపు పదినెలలపాటు సర్వసభ్యసమావేశాలు జరగలేదు. చివరిసారిగా బడ్జెట్ సమావేశమైనా నిర్వహించాలనుకోగా, మేయర్ ఎన్నిక నోటిఫికేషన్‌తో కోడ్ అడ్డొచ్చింది. మేయర్ ఎన్నికలో వీరికి ఓటు లేదు సాక్షి, సిటీబ్యూరో: మేయర్, డిప్యూటీ మేయర్ ఎన్నికల కోసం గ్రేటర్ పరిధిలోని అన్ని పార్టీలకు సంబంధించి ఎక్స్అఫీషియో సభ్యుల లెక్క ఖరారైనప్పటికీ, ఇంకా ఎవరైనా అర్హులున్నారేమోనని అధికారులు పరిశీలించారు. వివిధ పార్టీల్లోని వారు గత సంవత్సరం జనవరిలో జరిగిన మునిసిపాలిటీలు, కార్పొరేషన్లలో ఓటు వేసినట్లు ఖరారు చేసుకున్నారు. దాంతో వారిక్కడ ఓటువేసేందుకు అర్హులు కాదని తేల్చారు. ఆ వివరాలిలా ఉన్నాయి. ఎవరు పార్టీ ఎక్కడ వేశారు ఎ.రేవంత్‌రెడ్డి కాంగ్రెస్ కొంపల్లి జి.రంజిత్‌రెడ్డి టీఆర్ఎస్ నార్సింగి ఎమ్మెల్సీలు శంభీపూర్ రాజు టీఆర్ఎస్ కొంపల్లి కాటేపల్లి జనార్దన్‌రెడ్డి స్వతంత్ర తుక్కుగూడ కసిరెడ్డి నారాయణరెడ్డి టీఆర్ఎస్ కోస్గి పల్లా రాజేశ్వర్‌రెడ్డి టీఆర్ఎస్ నల్గొండ మాదిరెడ్డి శ్రీనివాస్‌రెడ్డి టీఆర్ఎస్ ఆదిభట్ల ఎన్.రామచంద్రరావు బీజేపీ మక్తల్ ఎగ్గె మల్లేశం టీఆర్ఎస్ తుక్కుగూడ కె.నవీన్‌కుమార్ టీఆర్ఎస్ పెద్ద అంబర్‌పేట దర్పల్లి రాజేశ్వరరావు టీఆర్ఎస్ నిజామాబాద్ పట్నం మహేందర్‌రెడ్డి టీఆర్ఎస్ పెద్ద అంబర్‌పేట ఫారూఖ్ హుస్సేన్ టీఆర్ఎస్ నారాయణ్ ఖేడ్ ఎమ్మెల్యేలు గూడెం మహిపాల్‌రెడ్డి టీఆర్ఎస్ బొల్లారం కేపీ వివేకానంద టీఆర్ఎస్ కొంపల్లి పి.సబితా ఇంద్రారెడ్డి టీఆర్ఎస్ తుక్కుగూడ టి.ప్రకాశ్‌గౌడ్ టీఆర్ఎస్ నార్సింగి -
అమావాస్య.. ఆగిన ఆస్తుల రిజిస్ట్రేషన్లు
సాక్షి, హైదరాబాద్ : రాష్ట్రంలో వ్యవసాయేతర ఆస్తులు, భూముల రిజిస్ట్రేషన్ల ప్రక్రియ సోమవారం నుంచి ప్రారంభమైంది. అమావాస్య కావడం, ప్రజలకు అవగాహన లేకపోవడం, రిజిస్ట్రేషన్ల ప్రక్రియలో సాంకేతిక ఇబ్బందులు, అదనపు ధ్రువపత్రాలు అవసరం కావడంతో రాష్ట్రంలోని 141 సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లోనూ తక్కువ సంఖ్య లోనే రిజిస్ట్రేషన్లు జరిగాయి. రాష్ట్ర వ్యాప్తంగా సోమవారం రిజిస్ట్రేషన్లు చేయించుకునేందుకు 107 స్లాట్లు బుక్ కాగా, అందులో 82 మాత్రమే పూర్తయ్యాయని ప్రభుత్వ వర్గాల ద్వారా తెలిసింది. వివిధ కారణాలతో 25 రిజిస్ట్రేషన్లు ఆగిపోయాయని సమాచారం. అయితే వ్యవసాయేతర భూములు, ఆస్తుల రిజిస్ట్రేషన్ల ప్రక్రియలో ఇబ్బందులు పడాల్సి వస్తోందని 3 నెలల తర్వాత తొలిరోజు ప్రా రంభమైన రిజిస్ట్రేషన్ల ప్రక్రియ వెల్లడిస్తోంది. సర్వర్లు సహకరించలేదు.. వ్యవసాయేతర రిజిస్ట్రేషన్ల విషయంలో తొలి రోజు చాలా సమస్యలు ఎదురుకావడంతో క్రయ, విక్రయదారులు ఇబ్బందులు పడాల్సి వచ్చింది. క్షేత్రస్థాయి సమాచారం ప్రకారం.. రిజిస్ట్రేషన్ల శాఖ వెబ్సైట్ ద్వారానే ప్రక్రియ పూర్తి చేస్తున్నా.. పూర్తి స్థాయిలో సాంకేతిక సమస్యలు పరిష్కారం కాలేదు. ముఖ్యంగా స్లాట్ బుకింగ్ విషయంలో సర్వర్లు సహకరించలేదు. దీనికి తోడు భవనాలు, ఫ్లాట్లు, మార్ట్గేజ్, గిఫ్ట్ డీడ్లకు మాత్రమే అవకాశం ఇవ్వగా, ఖాళీ స్థలాలకు రిజిస్ట్రేషన్ల ప్రక్రియ పూర్తి కావట్లేదు. క్రయ, విక్రయదారుల వివరాలు నమోదు చేసుకోవడం వరకే ఆగిపోయింది. స్లాట్ అప్రూవల్ కోసం ఎదురుచూడాల్సి వస్తోంది. గతంలో ఉన్న ఇంటి పన్ను, కరెంటు బిల్లు నిబంధనకు తోడు పీ టిన్ పేరుతో స్థానిక సంస్థలు ఇచ్చే నంబర్‌ను నమోదు చేస్తేనే రిజిస్ట్రేషన్ ఫీజుకు సంబంధించిన వివరాలు కన్పిస్తున్నాయి. దీంతో చాలా మంది పీ టిన్ నంబర్ లేక స్లాట్ బుక్ చేసుకోవడం కుదరలేదు. మరో సమస్య ఏంటంటే.. ధరణి పోర్టల్ ద్వారా రిజిస్ట్రేషన్ జరగకపోయినా.. ఆ పోర్టల్‌లో నమోదైన ఆస్తులు, భూముల వివరాలకు మాత్రమే రిజిస్ట్రేషన్ల శాఖ వెబ్సైట్ సహకరిస్తోంది. ఆ పోర్టల్‌లో నమోదు కాని ఆస్తులకు రిజిస్ట్రేషన్లు జరగట్లేదని తొలి రోజు రిజిస్ట్రేషన్ కార్యాలయాలకు వెళ్లిన వారు చెబుతున్నారు. ఇక పాత చలాన్ల సమస్య, ఎల్ఆర్ఎస్, బీఆర్ఎస్ లాంటి సమస్యలు, సాక్షులను మార్చుకునే అవకాశం లేకపోవడం, వేకెంట్ ల్యాండ్ ట్యాక్స్ చెల్లింపు లాంటి సమస్యలు ఎదురయ్యాయి. అయితే డాక్యుమెంట్లు అన్నీ ఉండి, వెబ్సైట్లో పక్కాగా నమోదు చేసుకుంటే ఈ ప్రక్రియ సులభంగా ఉంటుందని, 15 రోజుల్లోనే రిజిస్ట్రేషన్, మ్యుటేషన్ పూర్తయి ఈ–పాస్‌బుక్ కూడా చేతికి వస్తోందని రిజిస్ట్రేషన్ల శాఖ వర్గాలు చెబుతున్నాయి. సాంకేతిక, ఇతర సమస్యలను త్వరగా పరిష్కరించి మరింత సరళంగా రిజిస్ట్రేషన్ల ప్రక్రియ జరపాలని సాధారణ ప్రజలు కోరుతున్నారు. సమస్యలపై కేబినెట్ సబ్‌కమిటీ భేటీ.. వ్యవసాయేతర ఆస్తులు, భూముల రిజిస్ట్రేషన్ల ప్రక్రియలో ఎదురవుతున్న సమస్యలను పరిష్కరించి ప్రభుత్వానికి నివేదిక ఇచ్చేందుకు ఏర్పాటు చేసిన మంత్రివర్గ ఉపసంఘం మంగళవారం తొలి భేటీ కానుంది. రాష్ట్ర మంత్రి ప్రశాంత్‌రెడ్డి చైర్మన్‌గా ఈ కమిటీని ప్రభుత్వం ఆదివారమే నియమించింది. తొలి రోజుతో పాటు మంగళవారం కూడా ఎదురైన సమస్యలను ఈ సబ్ కమిటీ పరిశీలించనుంది. వరుసగా నాలుగైదు రోజుల పాటు ఈ సమావేశాలు జరిగే అవకాశముందని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. ఈ సమావేశాల అనంతరం వ్యవసాయేతర రిజిస్ట్రేషన్ల విషయంలో అనుసరించాల్సిన విధానాలను సిఫారసు చేస్తూ ఉపసంఘం ప్రభుత్వానికి నివేదిక ఇవ్వనుంది. ఈ నివేదిక ఆధారంగా రాష్ట్ర ప్రభుత్వం తుది నిర్ణయం తీసుకుంటుంది. డాక్యుమెంట్ రైటర్ల పరిస్థితేంటి? వ్యవసాయేతర రిజిస్ట్రేషన్ల ప్రక్రియలో ఎక్కడా డాక్యుమెంట్ రైటర్లు, స్టాంపు పేపర్ల అవసరం లేకపోవడంతో ఇప్పటివరకు సబ్రిజిస్ట్రార్ల కార్యాలయాల వద్ద డాక్యుమెంట్లు రాసుకుని జీవిస్తున్న వేలాది మంది భవితవ్యం అగమ్యగోచరంగా మారనుంది. ఏ స్థాయిలోనూ తమ అవసరం లేకపోవడం, వివరాల నమోదు మీ సేవకు అప్పగించడంతో డాక్యుమెంట్ రైటర్లు ఆందోళన చేసేందుకు సిద్ధమవుతున్నారు. మంగళవారం రాష్ట్రంలోని అన్ని సబ్‌రిజిస్ట్రార్ కార్యాలయాల ఎదుట ధర్నాలు చేయాలని డాక్యుమెంట్ రైటర్లు నిర్ణయించినట్లు సమాచారం. పాత చలాన్ చెల్లదంటున్నారు ‘రిజిస్ట్రేషన్లు నిలిచిపోకముందే నేను స్లాట్ బుక్ చేసుకున్నారు. ఈ ఏడాది సెప్టెంబర్ 5న రూ.90 వేల చలాన్ తీశాను. సెప్టెంబర్ 9 స్లాట్ ఇస్తే 8 నుంచి రిజిస్ట్రేషన్లు నిలిచిపోయాయి. మళ్లీ ఇప్పుడు పాత చలాన్ తీసుకెళ్లి రిజిస్ట్రేషన్ చేయమంటే అవి చెల్లవంటున్నారు. పాత చలాన్లో 10శాతం కట్ అయి ఆనుంచి 12 నెలల్లో ఆ సొమ్ము తిరిగి జమ అవుతుందని చెపుతున్నారు. ఇప్పుడు మళ్లీ నేను రూ.90 వేలు పెట్టాలి. ఆ డబ్బులు లేక రిజిస్ట్రేషన్ చేయించుకోలేకపోయాను.’ చొక్కారపు నర్సయ్య, హన్మకొండ నా సోదరుడి వద్ద ఏడాది కిందట ఇల్లు కొన్నా. పాత పద్ధతిలోనే రిజిస్ట్రేషన్లు జరుగుతాయని ప్రభుత్వం ప్రకటించడంతో అన్ని డాక్యుమెంట్లతో సూర్యాపేట సబ్ రిజిస్ట్రార్ ఆఫీసుకు వెళ్లా. కానీ రిజిస్ట్రేషన్ జరగాలంటే ఇంటి నంబర్, పీటీఐ నంబర్, నల్లా, కరెంట్ బిల్లులు కావాలన్నారు. అవేమీ తీసుకువెళ్లకపోవడంతో చేసేదేమీలేక వెనుదిరిగా. – చక్కెర విజయ్‌కుమార్, సూర్యాపేట ప్రధాన సమస్యలివీ.. స్లాట్లు పరిమిత సంఖ్యలోనే అనుమతి ఇస్తుండటంతో సర్వర్లు ఇబ్బందులు పెడుతున్నాయి. ఖాళీ స్థలాలకు పూర్తి పన్ను కడితేనే రిజిస్ట్రేషన్ ప్రక్రియకు అనుమతిస్తున్నారు. మార్ట్గేజ్ రిజిస్ట్రేషన్ల కోసం డీడీ నంబర్ ఇస్తే ఎంటర్ చేయడానికి అవకాశం లేదు. యజమాని మరణిస్తే వారి వారసుల పేర్లు నమోదు చేసే అవకాశం లేదు. బిల్డింగులు, ఫ్లాట్లు, మార్ట్గేజ్, గిఫ్టు రిజిస్ట్రేషన్లు మాత్రమే అవుతున్నాయి. జీపీఏలకు అవకాశం ఇవ్వలేదు. ఖాళీ స్థలాల రిజిస్ట్రేషన్లకు వివరాలు నమోదవుతున్నా.. రిజిస్ట్రేషన్ పూర్తవ్వట్లేదు. రిజిస్ట్రేషన్ జరగకపోతే చలాన్ మురిగి పోతోంది. గతంలో 6 నెలలు చాన్స్ ఉండేది. ఎన్వోసీ, బీఆర్ఎస్, బీపీఎస్, ఎల్ఆర్ఎస్, మున్సిపల్, విద్యుత్‌శాఖల బిల్లు చెల్లింపుల ధ్రువ పత్రాలుంటేనే రిజిస్ట్రేషన్‌కు అవకాశం డాక్యుమెంట్లో నిర్మాణానికి సంబంధించిన పొడవు, వెడల్పు కొలతలు ఇవ్వట్లేదు. సాక్షుల పేర్లు ముందే ఆన్లైన్లో నమోదు చేయాల్సి వస్తుండటంతో ఎవరైనా రాకపోతే ఇతరులను సాక్షులుగా మార్చుకొనే వీల్లేదు. పాత చలాన్లను అనుమతించట్లేదు. రిజిస్ట్రేషన్ పూర్తయ్యాక ప్రభుత్వం ఇచ్చే డాక్యుమెంట్, ఈ–పాస్‌బుక్ సిటిజన్ లాగిన్‌లో కనిపించట్లేదు. -
ఐదు రోజుల వెలుగుల పండుగ.. దీపావళి
సంస్కృతిని ప్రతిబింబిచేవే పండుగలు. అందులో ఆనంద ఉత్సాహాలతో జాతి, కుల, మత, వర్గ విభేదాలను విస్మరించి సమైక్యంగా జరుపుకునే వెలుగుల పండగే దీపావళి. చెడుపై మంచి సాధించిన విజయానికి గుర్తుగా దీపావళిని జరుపుకుంటారనేది పురాణ ప్రాశస్త్యం. దీపావళి పండుగ అనగానే మనం తెలియకుండానే చిన్నతనంలోకి వెళ్లి పోతాం. అయితే కొన్ని ప్రాంతాల్లో దీపావళిని అయిదు రోజుల పండుగగా జరుపుకుంటారు. ఆశ్యయుజ బహుళ త్రయోదశితో ప్రారంభమైన దీపావళి వేడుకలు, కార్తీక శుద్ద విదియ ‘భగినీహస్త భోజనం’తో ముగుస్తాయి. ధనత్రయోదశి అమృతం కోసం దేవతలు క్షీరసాగరాన్ని మధించినప్పుడు ధన త్రయోదశి రోజునే లక్ష్మీ దేవి ఉద్భవించినట్టు పురాణాలు పేర్కొంటున్నాయి. లక్ష్మీ దేవిని భార్యగా స్వీకరించిన శ్రీమహా విష్ణువు ఆమెను ‘ఐశ్వర్యానికి అధిదేవత’గా ప్రకటించాడు. ఇది ఆశ్వయుజ బహుళ త్రయోదశి. ఈ రోజును ధనాధిదేవత లక్ష్మీదేవి జన్మ దినోత్సవంగా భావించి పూజించడం వల్ల విశేష ఫలితం ఉంటుందని భక్తుల ప్రగాఢ విశ్వాసం. అందుకే దీన్ని ధన త్రయోదశి అంటారు. అందుకే ఈ రోజున కాస్తయినా బంగారం కొంటారు. లక్ష్మీ నివాస స్థానమైన విష్ణువు గుండెల మీద భృగుమహర్షి తన్నడంతో ఆమె అలిగి భూలోకంలోని కొల్హాపూర్‌కు చేరుతుంది. కుబేరుడు ఆమెను పూజించి అనుగ్రహం పొంది ఎంతో ధనవంతుడు అయ్యాడు. ఆ అమ్మ భూలోకానికి వచ్చిన రోజు కాబట్టి లక్ష్మీదేవిని పూజిస్తారు. నరక చతుర్దశి దీపావళి ముందు రోజు నరక చతుర్దశి. ఈ రోజు స్నానం చాలా పుణ్యప్రదమని హిందువుల విశ్వాసం. తెల్లవారుజామునే లేచి, నరకాసురుని బొమ్మని చేసి కాలుస్తారు. ఈ రోజు పరిశుభ్రంగా లేని ఇంట్లో ఏడాదంతా దరిద్రం తాండవిస్తుందని ప్రజల నమ్మకం. ఈ రోజు స్వాతీ నక్షత్రం ఉన్నప్పుడు నీటిలో గంగాదేవీ, నువ్వుల నూనెలో లక్ష్మీదేవి కొలువై ఉంటారు. అందుకే నువ్వుల నూనెతో తలంటుకొని స్నానం చేయాలి. కొన్ని ప్రాంతాలలో ఆడపడుచులు పుట్టింటికి వచ్చి తండ్రి, అన్నదమ్ములకు కుంకుమ బొట్టు పెట్టి, నూనెతో తలంటి హారతి ఇస్తారు. ఈ సమయంలో ఆడపడుచులకి ఆశీస్సులు, కానుకలు అందజేస్తారు. అందుకే సాధారణంగా ఈ పండుగకి కుటుంబ సభ్యులంతా కలుస్తారు. కొత్త దుస్తులు ధరించి నరకాసురుని వధ జరిగినందుకు ఆనందంగా టపాసులు కాల్చి, స్వీట్లు పంచుకుంటారు. దీపావళి ఆశ్వయుజ అమావాస్య రోజునే దీపావళి పండగ. పూర్తి అమావాస్య నాడు జరుపుకునే పండగలు రెండు ఉన్నాయి. అవి మహాలయ అమావాస్య, రెండు దీపావళి. భాద్రపద బహుళ అమావాస్య మహాలయ అమావాస్య, ఆశ్వయుజ బహుళ అమావాస్య దీపావళి. రాత్రివేళలో ఈ పండగను జరుపుకుంటారు. ఇంటిని శుభ్రం చేసి, రకరకాల పండి వంటలు తయారుచేస్తారు. తర్వాత ఇంటిని దీపాలతో అలంకరిస్తారు. మట్టి ప్రమిదలు, నువ్వుల నూనె వాడటం మంచిది. లక్ష్మీదేవికి ఇష్టమైన నువ్వుల నూనెతో దీపాలు వెలిగిస్తే అమ్మ అనుగ్రహం లభిస్తుంది. గుమ్మం, తులసి దగ్గర మాత్రం తప్పనిసరిగా మట్టి ప్రమిదలో నువ్వుల నూనె లేదా ఆవు నేతితో దీపాలు వెలిగించాలి. ప్రదోష సమయంలోనే లక్ష్మీ దేవి పూజ చేస్తారు. ధనలక్ష్మి పూజ ఈ రోజు చేస్తే ధన ధాన్యాలు, అష్టైశ్వర్యాలు సంప్రాప్తిస్తాయి. దీపావళి రోజున లక్ష్మీపూజతో తమ వ్యాపారం వృద్ధి చెందుతుందని వ్యాపారులు నమ్ముతారు. కొత్త బంగారు, వెండి ఆభరణాలు పూజలో పెడితే శుభప్రదం. ధనాధిపతి కుబేరుడినీ పూజించాలి. లక్ష్మీపూజ తర్వాత కొత్త దస్త్రాలూ, ఖాతా పుస్తకాలూ తెరవడం ఆచారం. సాయంత్రం ఏ ఇల్లు ముగ్గులు పెట్టి దీపాలతో అలంకరించి ఉంటుందో ఆ ఇంటసిరులనిచ్చే శ్రీ మహాలక్ష్మీ దేవి అడుగు పెడుతుందని భక్తుల నమ్మకం. ఈ రోజున కేదారేశ్వర స్వామి వ్రతం ఆచరిస్తే మంచిది. బలి పాడ్యమి దీపావళి మర్నాడు బలిపాడ్యమి. చతుర్దశి నాడు విష్ణుమూర్తి పాతాళానికి అణిచేసిన బలిచక్రవర్తి మళ్లీ భూమ్మీదకి తిరిగివచ్చిన రోజు ఇదేనని చెబుతారు. బలికి పూజలు చేస్తారు. మహారాష్ట్ర వాసులు ఈ రోజును ‘నవ దివస్’గా భావిస్తారు. గుజరాతీయులకు ఇది ఉగాది. నందగోపాలుడు గోవర్ధన గిరినెత్తి రేపల్లె వాసులను కాపాడిన రోజూ ఇదే. భగినీ హస్త భోజనం సోదరీ, సోదరుల ఆప్యాయతాను బంధాలకు అద్దంపట్టే ఒక సంప్రదాయం భగినీ హస్త భోజనం. భగిని అంటే సోదరి. ఆమె పెట్టే భోజనం కనుక భగినీ హస్త భోజనం అంటారు. కార్తీక శుద్ధ విదియ అంటే దీపావళి వెళ్ళిన రెండవ నాడు ఈ వేడుకను జరుపుకుంటారు.సోదరీ,సోదర ప్రేమకి అద్దం పట్టే పండుగ. దీనికి సంబంధించి అద్భుతమైన కథ ప్రాచుర్యంలో ఉంది. సూర్యభగవానుని కుమారుడు యముడు, అతడి సోదరి యమి. ఈమె తన సోదరుణ్ని ఎంతో అభిమానించేది. నిత్యమూ అతని మిత్రులతో సహా వచ్చి తన ఇంట్లో విందు చేసి పొమ్మని ఎన్నిసార్లు కోరినా ఏదో ఒక పనితో క్షణం తీరికలేక వెళ్లలేకపోయాడు. ఈ పరిస్థితిలో యమున కార్తీక శుక్ల విదియనాడు తప్పకుండా రమ్మని ఆహ్వానిస్తూ వాగ్దానం తీసుకుంటుంది. దానికి యముడు నన్నెవరూ ఇంటికి పిలవరు. అయినా నా తోబుట్టువైన ఆడపడుచు స్వయంగా, సాదరంగా ఆహ్వానించింది. కనుక వెళ్లితీరాలి అని నిర్ణయించుకుని వెళ్లాడు. అలా వచ్చిన సోదరుణ్ని చూసి సంతోషించి, అతనికి స్నానం చేయించి, తిలకం దిద్ది, స్వయంగా చేసిన పదార్థాలను ప్రేమతో కొసరి కొసరి వడ్డించింది. సంతోషాంతరంగుడైన యముడు ఆమెకు వరం ఇవ్వదలిచి కోరుకోమన్నాడు. ఏటా ఆ విధంగానే వచ్చి తన ఇంట విందు స్వీకరించమని కోరింది యమున. సోదరీ, సోదరుల మధ్య అప్యాయతకు ఈ పర్వదినం ఆదర్శంగా నిలుస్తోంది. -
అమావాస్య .. అన్నదానం
సాక్షి, మహబూబాబాద్ : మానవులుగా మనకు ఎవరు ఏమి ఇచ్చినా సరే మళ్లీ కావాలంటాం.. కానీ కడుపునిండా అన్నం పెడితే మాత్రం ఏమి కావాలని అడగరని నిరూపిస్తున్నారు ‘వికాస తరంగిణి’ నిర్వాహకులు. శ్రీశ్రీశ్రీ త్రిదండి శ్రీమన్నారాయణ రామానుజ చినజీయర్‌స్వామి వారి తిరునక్షత్రోత్సవం(జన్మదినోత్సవం)ను పురస్కరించుకుని 1995 అక్టోబర్ 31వ తేదీ దీపావళి అమావాస్య నుంచి అన్నదాన కార్యక్రమం ప్రారంభించారు. వికాస తరంగిణి మహబూబాబాద్ శాఖ ఆధ్వర్యంలో పేదలకు ప్రతినెలా అమావాస్య రోజున కడుపునిండా అన్నం పెడుతున్నారు. ఇప్పటి వరకు 22 ఏళ్లుగా, 270 నెలల నుంచి కార్యక్రమం నిర్విఘ్నంగా కొనసాగుతుంది. హిందూ సంప్రదాయం ప్రకారం ధార్మికంలో అమావాస్య రోజున అన్నదానం చేస్తే ఎంతో పుణ్యఫలమని, జీయర్‌స్వామి వారి తిరునక్షత్రోత్సవం మంచిరోజని అన్నదానం చేస్తూ వస్తున్నారు. అన్నదానం రోజున 300 నుంచి 350 మంది వరకు భక్తులకు తృప్తికరంగా జిల్లా కేంద్రంలోని శ్రీరామ మందిరంలో అన్నదానం చేస్తున్నారు. కొంత కాలంగా ఈ కార్యక్రమాన్ని శ్రీరామ మందిరం నుంచి మార్వాడీ సత్రానికి మార్చారు. కాగా, శ్రీభక్తమార్కండేయ శివాలయం, శ్రీ వాసవీ కన్యకాపరమేశ్వరి దేవాలయంలో కూడా ప్రతినెల అన్నదానం చేస్తున్నారు. అన్నదానం అంటే ఏదో ఓ రకం కాకుండా అన్నం, పప్పుకూర, స్వీట్ రైస్, పులిహోర, సాంబారుతో అన్నం పెడుతుండడం విశేషం. -
అమావాస్య గ్యాంగ్ అరెస్ట్
దొడ్డబళ్లాపురం : అమావాస్య రోజే చోరీలకు పాల్పడుతూ పోలీసులకు తలనొప్పిగా మారిన అమావాస్య గ్యాంగ్‌లోని ఇద్దరు నిందితులను నెలమంగల తాలూకా దాబస్‌పేట పోలీసులు అరెస్టు చేశారు. నిందితులు తుమకూరు టౌన్ సీతకల్లు గ్రామం నివాసి గణేశ్, తుమకూరు జిల్లా కొరటగెరె తాలూకా వడ్డగెరె గ్రామం నివాసి వినయ్కుయార్లన అరెస్ట్ చేశారు. వీరు అమావాస్య రోజే బైక్ చోరీలకు పాల్పడ్డం విశేషం. నిందితులు బెంగళూరు, తుమకూరు, నెలమంగల పరిధిలోనే బైక్‌లను టార్గెట్ చేసుకుని చోరీలకు పాల్పడేవారు. చోరీ చేసిన బైక్‌లను స్నేహితుల ఇళ్లల్లో ఉంచి కస్టమర్లను వెదికి విక్రయించేవారు. రెండు రోజుల క్రితం బెంగళూరు గొట్టగెరెలో యమహ ఎఫ్‌జడ్ బైక్ చోరీ చేసి తుమకూరు వైపు వెళ్తుండగా లక్కూరు గ్రామం వద్ద దాబస్‌పేట పోలీసులు పట్టుకున్నారు. ఇద్దరినీ విచారించిన పోలీసులు వారు దాచి ఉంచిన 13 ఖరీదైన బైక్‌లను స్వాధీనం చేసుకున్నారు. ఇంకా వీరి గ్యాంగ్‌లో ఎవరెవరున్నారు?ఎ క్కడెక్కడ చోరీలు చేసారనే సమాచారం కోసం విచారణ జరుపుతున్నారు. -
హారర్ జోనర్ సినిమాలు హిట్టే
‘‘నాకు హారర్ జోనర్ అంటే ఇష్టం. అందుకే ఆ నేపథ్యంలో చాలా సినిమాలు నిర్మించాను. హారర్ జోనర్ సినిమాలు ఎప్పుడూ హిట్టే. సచిన్ మంచి నటుడు. తనకు చాలా వ్యాపారాలు ఉన్నా సినిమాపై ప్యాషన్‌తో నటిస్తున్నారు. ఆయన భార్య రైనా సచిన్జోషిగారు నిర్మాతగా మంచి విజయాన్ని అందుకోవాలి’’ అని నిర్మాత సి.కల్యాణ్ అన్నారు. సచిన్ జోషి, నర్గిస్ ఫక్రి జంటగా భూషణ్ పటేల్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘అమావాస్య’. వైకింగ్ మీడియా అండ్ ఎంటర్టైన్మెంట్ పతాకంపై రైనా సచిన్‌జోషి, దీపెన్ ఆమిన్ నిర్మించిన ఈ సినిమా ఈనెల 8న విడుదల కానుంది. ఈ సందర్భంగా హైదరాబాద్‌లో నిర్వహించిన ప్రీ రిలీజ్ ఫంక్షన్లో సి.కల్యాణ్ ముఖ్య అతిథిగా పాల్గొని చిత్ర పాటల్ని విడుదల చేశారు. సచిన్ జోషి మాట్లాడుతూ– ‘‘నేను చాలా కాలంగా హారర్ జోనర్లో ఓ సినిమా చేయాలనుకుంటన్న టైమ్‌లో భూషణ్ పటేల్ ‘అమావాస్య’ కథ చెప్పారు. ఇదొక క్లాసిక్ హారర్ మూవీ. నా గత చిత్రాలకు పూర్తి భిన్నంగా ఉంటుంది. లేటెస్ట్ టెక్నాలజీ వి.ఎఫ్.ఎక్స్. వర్క్‌ను ఉపయోగించాం. హాలీవుడ్ స్థాయి హారర్ సినిమాని ప్రేక్షకులకు అందించాలని చాలెంజింగ్‌గా తీసుకుని చేశాం’’ అన్నారు. ‘‘ఈ సినిమా క్లైమాక్స్ అందరినీ ఆశ్చర్యపరిచేలా ఉంటుంది. మా టీం అంతా చాలా కష్టపడటం వల్లే ఈ సినిమా చాలా బాగా వచ్చింది’’ అని భూషణ్ పటేల్ అన్నారు. ‘‘మొదటిసారి ఒక హారర్ సినిమాలో నటించాను’’ అని నటుడు అలీ అస్గర్ అన్నారు. ఫైట్ మాస్టర్ విజయ్ పాల్గొన్నారు. -
పోలింగ్ తేదీ కేసీఆర్‌కు కలిసొచ్చేనా!
సాక్షి, హైదరాబాద్ : కేంద్ర ఎన్నికల సంఘం ప్రకటించిన షెడ్యూలు టీఆర్ఎస్ అధినేత కె చంద్రశేఖర్ రావుకు కలిసొస్తుందా? జ్యోతిష్య శాస్త్రాన్ని ప్రగాఢంగా విశ్వసించే కేసీఆర్‌కు కమిషన్ ప్రకటించిన పోలింగ్ తేదీ ఆయనకు అనుకూలమా? ప్రతికూలంగా ఉండబోతుందా? ఎందుకంటే తాజాగా ప్రకటించిన షెడ్యూలు ప్రకారం పోలింగ్ జరిగే డిసెంబర్ 7వ తేదీ అమావాస్య కావడమే. అమావాస్య రోజున జరగబోయో పోలింగ్ ఏ పార్టీకి కలిసొస్తుంది? అమావాస్య రోజు పోలింగ్ ఏ రాజకీయ పార్టీకి అనుకూలంగా ఎవరికి ప్రతికూలంగా ఉంటుందన్న విషయంలో ప్రస్తుతం సోషల్ మీడియాలో రకరకాల చర్చలు సాగుతున్నాయి. కేంద్ర ఎన్నికల సంఘం శనివారం ప్రకటించిన ఎన్నిక షెడ్యుల్ ప్రకారం డిసెంబర్ 7న తెలంగాణలో ఎన్నికల పోలింగ్, డిసెంబర్ 11న తుది ఫలితాలు వెలువడనున్నాయి. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత పగ్గాలు చేపట్టిన తొలి ప్రభుత్వం ఐదేళ్ల కాలపరిమితి పూర్తి చేసుకోకుండానే సెప్టెంబర్ 6న రద్దయిన విషయం తెలిసిందే. అత్యంత బలమైన గురుపుష్య యోగం.. అమృతసిద్ధి యోగం.. కేసీఆర్ అదృష్ట సంఖ్య 6.. ఇలా అన్నివిధాలా ఆలోచించాకే అసెంబ్లీ రద్దుకు కేసీఆర్ ముహూర్తం ఖరారు చేసినట్లు ప్రచారం జరిగింది. దీంతో నిర్ణీత కాలపరిమితికంటే 8 నెలల 26 రోజుల ముందే శాసనసభ రద్దయినట్లైంది. వీటితో పాటూ కేసీఆర్ అదృష్ట సంఖ్య 6 వచ్చేలా టీఆర్ఎస్ పార్టీ 105 మంది (1+0+5= 6) తమ ఎమ్మెల్యే అభ్యర్థుల జాబితాను ప్రకటించినట్టు సంఖ్యాశాస్త్రనిపుణులు పేర్కొన్నారు. ఇక్కడి వరకు అంతా బాగానే ఉన్నా.. ఎన్నికల షెడ్యుల్ ప్రకటించిన కొద్ది సేపటికే కాంగ్రెస్ పార్టీ మాజీ ఎంపీ మధుయాష్కీ మొదటగా తేదీలపై స్పందించారు. ఏ రకంగా చూసినా కేసీఆర్‌కు ఎన్నికల షెడ్యుల్ కీడు చేస్తుందన్నారు. దీనిపై సామాజిక మాధ్యమాల్లో నెటిజన్లు అనుకూల ప్రతికూల పోస్టింగులు పెడుతున్నారు. ఎన్నికల పోలింగ్ తేది డిసెంబర్ 7న రావడం ఆరోజు అమవాస్య కావడంతో శుభ సూచికం కాదని, అంతే కాకుండా తుది ఫలితాలు వెల్లడించే డిసెంబర్ 11న కూడా అంత అనుకూలంగా లేదని సోషల్ మీడియాలో నెటిజన్లు పోస్టులు పెడుతున్నారు. జ్యోతిష్యం సంఖ్యా శాస్త్రాల బలమేంటన్నది ఓట్ల లెక్కింపు తర్వాత మాత్రమే తేలనుంది. -
గ్రహం అనుగ్రహం
శ్రీజయనామ సంవత్సరం, ఉత్తరాయణం, శిశిర ఋతువు, మాఘమాసం తిథి అమావాస్య ఉ.6.35 వరకు తదుపరి ఫాల్గుణ శు.పాడ్యమి తె.4.13 వరకు (తెల్లవారితే శుక్రవారం), నక్షత్రం ధనిష్ఠ ఉ.7.56 వరకు, తదుపరి శతభిషం, వర్జ్యం ప.2.24 నుంచి 4.05 వరకు, దుర్ముహూర్తం ఉ.10.12 నుంచి 11.02 వరకు, తదుపరి ప.2.55 నుంచి 3.44 వరకు అమృతఘడియలు రా.11.28 నుంచి 12.58 వరకు సూర్యోదయం: 6.30 సూర్యాస్తమయం: 5.59 రాహుకాలం: ప.1.30 నుంచి 3.00 వరకు యమగండం: ఉ.6.00 నుంచి 7.30 వరకు -
రాఖీసావంత్ సోదరుడి దర్శకత్వంలో 'అమావాస్య'
బాలీవుడ్ గ్లామర్ తార రాఖీసావంత్ సోదరుడు రాకేష్ సావంత్ స్వీయ దర్శకత్వంలో తెలుగు, తమిళ, హిందీ భాషల్లో ‘అమావాస్య’ చిత్రం రూపొందుతోంది. ఆకాష్ హీరో. నృపుర్ మెహతా, రూబీ అహ్మద్, సోనమ్, ముమైత్‌ఖాన్, కోట తదితరులు ముఖ్యతారలు. చిత్రీకరణ పూర్తయింది. ప్రస్తుతం నిర్మాణానంతర కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఈ సందర్భంగా రాకేష్ సావంత్ మాట్లాడుతూ -‘‘ఓ దుర్మార్గుడి చేతిలో మానప్రాణాలు పోగొట్టుకున్న ఓ యువజంట ప్రేతాత్మలుగా మారి ఏ విధంగా ప్రతీకారం తీర్చుకున్నారన్నది ఈ సినిమా ప్రధాన కథాంశం. పాటల్ని త్వరలోనే విడుదల చేస్తాం’’ అని తెలిపారు. ఈ చిత్రానికి కెమెరా: ద్రిడ్ బసు, సంగీతం: సయ్యద్ అహ్మద్.