సాక్షి, హైదరాబాద్ : కేంద్ర ఎన్నికల సంఘం ప్రకటించిన షెడ్యూలు టీఆర్ఎస్ అధినేత కె చంద్రశేఖర్ రావుకు కలిసొస్తుందా? జ్యోతిష్య శాస్త్రాన్ని ప్రగాఢంగా విశ్వసించే కేసీఆర్‌కు కమిషన్ ప్రకటించిన పోలింగ్ తేదీ ఆయనకు అనుకూలమా? ప్రతికూలంగా ఉండబోతుందా? ఎందుకంటే తాజాగా ప్రకటించిన షెడ్యూలు ప్రకారం పోలింగ్ జరిగే డిసెంబర్ 7వ తేదీ అమావాస్య కావడమే. అమావాస్య రోజున జరగబోయో పోలింగ్ ఏ పార్టీకి కలిసొస్తుంది? అమావాస్య రోజు పోలింగ్ ఏ రాజకీయ పార్టీకి అనుకూలంగా ఎవరికి ప్రతికూలంగా ఉంటుందన్న విషయంలో ప్రస్తుతం సోషల్ మీడియాలో రకరకాల చర్చలు సాగుతున్నాయి.
కేంద్ర ఎన్నికల సంఘం శనివారం ప్రకటించిన ఎన్నిక షెడ్యుల్ ప్రకారం డిసెంబర్ 7న తెలంగాణలో ఎన్నికల పోలింగ్, డిసెంబర్ 11న తుది ఫలితాలు వెలువడనున్నాయి. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత పగ్గాలు చేపట్టిన తొలి ప్రభుత్వం ఐదేళ్ల కాలపరిమితి పూర్తి చేసుకోకుండానే సెప్టెంబర్ 6న రద్దయిన విషయం తెలిసిందే. అత్యంత బలమైన గురుపుష్య యోగం.. అమృతసిద్ధి యోగం.. కేసీఆర్ అదృష్ట సంఖ్య 6.. ఇలా అన్నివిధాలా ఆలోచించాకే అసెంబ్లీ రద్దుకు కేసీఆర్ ముహూర్తం ఖరారు చేసినట్లు ప్రచారం జరిగింది. దీంతో నిర్ణీత కాలపరిమితికంటే 8 నెలల 26 రోజుల ముందే శాసనసభ రద్దయినట్లైంది. వీటితో పాటూ కేసీఆర్ అదృష్ట సంఖ్య 6 వచ్చేలా టీఆర్‌ఎస్ పార్టీ 105 మంది (1+0+5= 6) తమ ఎమ్మెల్యే అభ్యర్థుల జాబితాను ప్రకటించినట్టు సంఖ్యాశాస్త్రనిపుణులు పేర్కొన్నారు.
ఇక్కడి వరకు అంతా బాగానే ఉన్నా.. ఎన్నికల షెడ్యుల్ ప్రకటించిన కొద్ది సేపటికే కాంగ్రెస్ పార్టీ మాజీ ఎంపీ మధుయాష్కీ మొదటగా తేదీలపై స్పందించారు. ఏ రకంగా చూసినా కేసీఆర్‌కు ఎన్నికల షెడ్యుల్ కీడు చేస్తుందన్నారు. దీనిపై సామాజిక మాధ్యమాల్లో నెటిజన్లు అనుకూల ప్రతికూల పోస్టింగులు పెడుతున్నారు. ఎన్నికల పోలింగ్ తేది డిసెంబర్ 7న రావడం ఆరోజు అమవాస్య కావడంతో శుభ సూచికం కాదని, అంతే కాకుండా తుది ఫలితాలు వెల్లడించే డిసెంబర్ 11న కూడా అంత అనుకూలంగా లేదని సోషల్ మీడియాలో నెటిజన్లు పోస్టులు పెడుతున్నారు. జ్యోతిష్యం సంఖ్యా శాస్త్రాల బలమేంటన్నది ఓట్ల లెక్కింపు తర్వాత మాత్రమే తేలనుంది.
Comments
Please login to add a commentAdd a comment