కేసీఆర్‌ సాహసం వెనుక కారణాలేంటి.. వ్యూహాలేంటి!? | KCR Strategy Behind Assembly Dissolution | Sakshi
Sakshi News home page

పక్కాగా ప్లాన్‌తో ముందస్తు కేసీఆర్‌!

Published Thu, Sep 6 2018 6:24 PM | Last Updated on Thu, Sep 6 2018 6:27 PM

KCR Strategy Behind Assembly Dissolution - Sakshi

సాక్షి, హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత తొలి ప్రభుత్వం ఏర్పాటు చేసిన కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు దాదాపు తొమ్మిది నెలల ముందే అసెంబ్లీని రద్దు చేసి ఎన్నికలకు వెళ్లాలన్న సాహసం వెనుక ఉన్న కారణాలేంటి? అందుకు పురిగొల్పిన పరిస్థితులు ఏంటి? ఆయన ఎందుకీ నిర్ణయానికి వచ్చినట్టు? ప్రభుత్వాన్ని రద్దు చేసినంత మాత్రాన ముందస్తుగా ఎన్నికలు జరుగుతాయా? ఈ విషయంలో కేసీఆర్ కు ఉన్న హామీ ఏంటి? ముందస్తుకు వెళ్లడం వల్ల గెలుపు ఓటములపై ఉన్న అవకాశాలను ఆయన ఏ విధంగా బేరీజు వేసుకున్నారు? లోక్ సభ సాధారణ ఎన్నికలతో పాటు అసెంబ్లీ ఎన్నికలు జరగొద్దని కేసీఆర్ భావించడంలో ఆంతర్యమేంటి? ఇప్పుడు ఈ అంశాలే హాట్ టాపిక్ గా మారాయి. సర్వత్రా వీటిపైనే చర్చ సాగుతోంది.

అన్ని బేరీజు వేసుకున్న తర్వాతే
వచ్చే ఏడాది ఏప్రిల్, మే నెలల్లో లోక్ సభ సాధారణ ఎన్నికలు వాటితో పాటే ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు జరగాల్సి ఉండగా, దాదాపు తొమ్మిది మాసాల ముందు ఎన్నికలకు సిద్ధపడటం వెనుక రాజకీయపరమైన అనేక అంశాలను కేసీఆర్ బేరీజు వేసుకున్నట్టు చెబుతున్నారు. పదవీ కాలం పూర్తవుతున్న మధ్యప్రదేశ్, రాజస్థాన్, మిజోరాం, చత్తీస్ గఢ్ రాష్ట్రాల అసెంబ్లీలకు డిసెంబర్ లో ఎన్నికలు జరగాల్సి ఉంది. అందుకు కేంద్ర ఎన్నికల సంఘం ప్రాథమిక కసరత్తును కూడా ప్రారంభించింది. ఈ పరిస్థితుల్లోనే కేసీఆర్ తన ఆలోచనలకు పదును పెట్టినట్టు విదితమవుతోంది. దక్షిణాది రాష్ట్రాల్లో గత మే నెలలో కర్నాటక అసెంబ్లీకి ఎన్నికలు జరిగిన విషయం తెలిసిందే. కర్నాటక అసెంబ్లీ ఎన్నికల్లో అధికారంలోకి వస్తామన్న బీజేపీ అంచనాలు తలకిందులయ్యాయి. అక్కడ కాంగ్రెస్, జేడీ (ఎస్) కూటమి ప్రభుత్వాన్ని ఏర్పాటుచేసిన సంగతి తెలిసిందే. ఇది ఇలాఉండగా, ఉత్తరాదిలో ప్రధానంగా బీజేపీ పాలిత మధ్యప్రదేశ్, రాజస్థాన్ ఎన్నికల ఫలితాలు రేపటి రోజున జరిగే లోక్ సభ సార్వత్రిక ఎన్నికలపై ఉంటుందని ఒక అంచనా. మధ్యప్రదేశ్, రాజస్థాన్ రాష్ట్రాల్లో అధికారంలో ఉన్న బీజేపీకి ప్రతికూల పవనాలు వీచి కాంగ్రెస్ పార్టీ  పుంజుకుంటే ఆ ప్రభావం జాతీయస్థాయిలో కచ్చితంగా లోక్ సభ ఎన్నికలపై పడుతుంది.

అలాంటి పరిస్థితుల్లో లోక్ సభతో పాటు అసెంబ్లీ ఎన్నికలకు వెళితే ఆ ప్రభావం తెలంగాణలోనూ ఉంటుందన్నది ఒక అభిప్రాయం. ఈ నేపథ్యమే కేసీఆర్ ను ముందస్తు ఎన్నికలకు పురికొల్పి ఉంటుందని అంటున్నారు. తెలంగాణలో టీఆర్ఎస్ కు కాంగ్రెస్ మాత్రమే ఏకైక ప్రత్యర్థిగా ఉంది. మధ్యప్రదేశ్, రాజస్థాన్ ఎన్నికల్లో కాంగ్రెస్ బలపడి, ఆ ప్రభావం జాతీయస్థాయిలో పడిన వాతావరణంలో ఎన్నికలకు వెళ్లడం కన్నా ముందస్తుగా పరీక్షకు నిలబడటం మంచిదన్న నిర్ణయానికి వచ్చినందుకే కేసీఆర్ ఒక అడుగు ముందుకేసినట్టు రాజకీయవర్గాలు విశ్లేషిస్తున్నాయి.

నాలుగు రాష్ట్రాలతో కలిసే...
ఉత్తరాది నాలుగు రాష్ట్రాల ఫలితాల ప్రభావాన్ని విశ్లేషించుకోవడానికి కేసీఆర్ కు ఏవిధంగా అయితే అవకాశం కలిగిందో ఆ నాలుగు రాష్ట్రాల ఎన్నికలే ముందస్తు ప్రణాళికకు కూడా ఉపయోగపడ్డాయి. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో అసెంబ్లీని రద్దు చేయడం వల్ల ఆ రాష్ట్రాలతో పాటు ఖాళీ అయిన తెలంగాణ ఎన్నికలను కూడా నిర్వహించకతప్పదన్న ఆలోచన మేరకు కేసీఆర్ ముందుకు నడిచినట్టు కనబడుతోంది. అలా ఎన్నికలు నిర్వహించాలంటే కేంద్ర ఎన్నికల సంఘం అందుకు పూర్తిగా సన్నద్ధమై ఉండాలి. అందుకే కేసీఆర్ ఒకటికి రెండుసార్లు ఢిల్లీ చుట్టు చక్కర్లు కొట్టి మరీ ఆ నాలుగు రాష్ట్రాలతో పాటు ఎన్నికల షెడ్యూలు విడుదలవుతుందని ఒక నిర్ధారణకు వచ్చాకే పావులు కదపడం ప్రారంభించినట్టు తెలుస్తోంది.

పదవీ కాలం పూర్తయిన మధ్యప్రదేశ్ (7-01-2019), రాజస్థాన్ (20-01-2019) మిజోరం (15-02-2019), చత్తీస్ గఢ్ (06-01-2019) రాష్ట్రాల అసెంబ్లీలకు డిసెంబర్ లోగా ఎన్నికలు పూర్తి చేయడానికి కేంద్ర ఎన్నికల సంఘం (ఈసీ) సన్నద్ధమవుతోంది. ఈ పరిస్థితులను గమనించి ముందస్తుకు వెళ్లడం వల్ల తెలంగాణను కూడా ఆ జాబితాలో చేర్చి ఎన్నికలు నిర్వహించడానికి కేంద్ర ఎన్నికల సంఘం నుంచి ఎలాంటి అభ్యంతరాలు లేవని నిర్ధారణకు వచ్చిన తర్వాత ముహూర్తం చూసుకుని మరీ అసెంబ్లీని రద్దు చేసినట్టు పార్టీ వర్గాలు చెబుతున్నాయి.

మాట తీరులోనూ...
అసెంబ్లీని రద్దు చేయాలన్న నిర్ణయం తీసుకున్న తర్వాత తెలంగాణ భవన్ లో మీడియా సమావేశం గంటకుపైగా మాట్లాడిన కేసీఆర్, కాంగ్రెస్ టార్గెట్ గా విమర్శలు ఎక్కుపెట్టారు. కాంగ్రెస్ ప్రస్తుత నాయకత్వంపైనే కాకుండా ఏకంగా జవహర్ లాల్ నెహ్రూ, ఇందిరాగాంధీలపైన కూడా ఆయన విమర్శలు గుప్పించారు. రాష్ట్రంలో టీఆర్ఎస్ కు ప్రత్యర్థి కాంగ్రెస్ పార్టీయే అయినందున ఆయన తన గురిని కాంగ్రెస్ పైనే కేంద్రీకరించినట్టు తెలుస్తోంది. ఇకపోతే నవంబర్ లో ఎన్నికలు డిసెంబర్ లో కొత్త ప్రభుత్వం ఏర్పడుతుందని కేసీఆర్ చెప్పిన మాటలను బట్టి ఇటీవలి కాలంలో ఆయన ఢిల్లీ పర్యటన సందర్భంగా ఎన్నికల నిర్వహణకు సంబంధించి అన్ని వ్యవహారాలను రూఢీగా నిర్ధారించుకున్నారని అంటున్నారు. తెలంగాణలోని మొత్తం 119 అసెంబ్లీ స్థానాల్లో ప్రభుత్వం రద్దు చేసిన రోజునే 105 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించడాన్ని బట్టి ముందస్తుకు కేసీఆర్ ముందుగానే సిద్ధమైనట్టు స్పష్టం చేస్తోంది.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement