సాక్షి, హైదరాబాద్ : ముందస్తు ఎన్నికల్లో టీఆర్‌ఎస్ ప్రచారం జోరు పెంచుతోంది. ప్రచార సరళి ఎలా ఉండాలి.. ప్రజలకు ఏం వివరించాలనే అంశంపై టీఆర్‌ఎస్ అధినేత కె.చంద్రశేఖర్‌రావు ప్రత్యేక వ్యూహం రూపొందించారు. ప్రచార ప్రణాళికను అభ్యర్థులకు వివరించేందుకు ఆదివారం మధ్యాహ్నం 2.30 గంటలకు 105 మంది అభ్యర్థులతో తెలంగాణ భవన్‌లో ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేశారు. ప్రచారంలో అభ్యర్థులు చెప్పాల్సిన విషయాలు.. రాష్ట్ర నేతలు ఏం మాట్లాడాలి.. స్వయంగా తానేం చెప్పాలనే విషయాలపై అభ్యర్థులకు స్పష్టత ఇవ్వనున్నారు. ఇప్పటివరకు నిర్వహించిన ప్రచార సరళిని తెలుసుకోవడంతో పాటు నియోజకవర్గాల వారీగా ఇక నుంచి అమలు చేసే ప్రచార వ్యూహాన్ని అభ్యర్థులకు వివరిస్తారు. 100 స్థానాల్లో టీఆర్‌ఎస్ గెలుపు లక్ష్యంగా కేసీఆర్ ప్రచార ప్రణాళికను రూపొందించారు. టీఆర్‌ఎస్ ప్రభుత్వ హయాంలో చేసిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ప్రజలకు పూర్తి స్థాయిలో వివరించాలని.. స్థానికంగా చేసిన అభివృద్ధిని, ఆయా గ్రామాల్లో ప్రభుత్వ పథకాలతో లబ్ధిపొందిన వారి వివరాలను ప్రచారంలో తప్పకుండా ప్రస్తావించాలని అభ్యర్థులకు సూచిస్తారు.
బలం మేనిఫెస్టో..
గత ఎన్నికల తరహాలోనే ఈసారీ మేనిఫెస్టోపైనే టీఆర్‌ఎస్ ఎక్కువ దృష్టి పెట్టింది. బంగారు తెలంగాణ నినాదంతో గత ఎన్నికల్లో టీఆర్‌ఎస్ విజయం సాధించింది. ఇప్పుడు అభివృద్ధి కొనసాగింపు నినాదంతో ముందుకు వెళ్తోంది. ప్రస్తుత మేనిఫెస్టోలోనూ రూ.లక్ష రుణమాఫీ, రైతు బంధు సాయం పెంపు, నిరుద్యోగ భృతి, ఆసరా పింఛన్ల పెంపు, ఎస్సీ, ఎస్టీలకు ప్రత్యేక అభివృద్ధి పథకాలను ప్రజలలో బాగా తీసుకెళ్లాలని టీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ నిర్ణయించారు. సీఎం కేసీఆర్ శనివారం సైతం పలువురు అభ్యర్థులతో ఫోన్‌లో మాట్లాడారు. ప్రచార సరళిపై పలు సూచనలు చేశారు. తాను పాల్గొనబోయే సభల్లో ఎలాంటి అంశాలను బలంగా చెప్పాలో సూచించాలని అడిగారు. పూర్తిస్థాయి మేనిఫెస్టోలో మరెన్నో ప్రజాకర్షక హామీలు ఉంటాయని, ప్రజలు ఆదరించేలా ప్రచారం సాగాలని సూచించారు. సెప్టెంబర్ 6న 105 మంది అభ్యర్థులను టీఆర్‌ఎస్ ప్రకటించిన అనంతరం అందరూ ప్రచారం ప్రారంభించారు. అయితే ఎవరికివారుగా ప్రచారం చేసుకుంటున్నారు. పరిస్థితులను బట్టి టీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ వీరితో ఫోన్‌లో మాట్లాడుతున్నారు. ఇప్పుడు అందరినీ పిలిచి ఒకేసారి సూచనలు ఇవ్వాలని నిర్ణయించారు. మరోవైపు ఒకరి అనుభవాలు మరొకరికి ఉపయోగపడతాయనే ఉద్దేశంతో ఈ సమావేశం నిర్వహిస్తున్నారు.
ఇక ఊపు..
ముందస్తు ఎన్నికల వ్యూహాల్లో ప్రత్యర్థి పార్టీల కంటే ముందున్న టీఆర్‌ఎస్ ఇదే పంథా కొనసాగిస్తోంది. అభ్యర్థులన ప్రకటించడంతో పాటు అసమ్మతికి బుజ్జగింపుల ప్రక్రియ దాదాపుగా ముగిసింది. ఒకట్రెండు సెగ్మెంట్లలో ఎవరైనా పార్టీకి వ్యతిరేకంగా పనిచేస్తే కఠినంగా వ్యహరిస్తోంది. టీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ సెప్టెంబర్ 7న హుస్నాబాద్‌లో నియోజకవర్గ స్థాయి ఎన్నికల సభలు నిర్వహించారు. అనంతరం నిజామాబాద్, నల్లగొండ, వనపర్తిలో ఉమ్మడి జిల్లాల స్థాయి బహిరంగ సభలు జరిగాయి. వరంగల్, ఖమ్మం ఉమ్మడి జిల్లాల సభల తేదీలను ప్రకటించి వాయిదా వేశారు. మరోవైపు ప్రచారంలో భాగంగా యాభై రోజులలో వంద బహిరంగసభలు నిర్వహించనున్నట్లు సీఎం కేసీఆర్ స్వయంగా ప్రకటించారు. ఇప్పడు ఈ ప్రక్రియ మొదలుకానుంది. సీఎం కేసీఆర్ ప్రచార షెడ్యూల్‌పైనా ఈ సమావేశంలో స్పష్టత ఇవ్వనున్నట్లు తెలిసింది. ఉమ్మడి జిల్లాల వారీగా ఎన్నికల ప్రచార వ్యూహాల అమలు, అభ్యర్థులతో సమన్వయ బాధ్యతలను పార్టీ ఎంపీలకు, ఎమ్మెల్సీలకు బాధ్యతలు అప్పగించాలని టీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ నిర్ణయించారు. ప్రస్తుత ఎన్నికల్లో పోటీ చేయని ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి, మహమూద్‌అలీ, నాయిని నర్సింహారెడ్డిలకు కీలక బాధ్యతలను అప్పగించనున్నారు.
ఆ అభ్యర్థులపై తేల్చుతారా..
టీఆర్‌ఎస్ ఇంకా 14 అసెంబ్లీ స్థానాలు అభ్యర్థులను ప్రకటించాల్సి ఉంది. ఈ స్థానాల్లో ఎవరిని బరిలో దింపాలనే విషయంలో టీఆర్‌ఎస్ అధిష్టానం ఇప్పటికే నిర్ణయించింది. అయితే మహాకూటమి సీట్ల పంపకం తేలిన తర్వాతే ప్రకటించే అవకాశం ఉందని సమాచారం. ప్రచారంలో ఇబ్బంది రాకుండా ఉండేందుకు పలువురికి ప్రత్యేకంగా ఆదేశాలు ఇచ్చారు. అధికారిక ప్రకటనతో సంబంధం లేకుండా ప్రచారం చేసుకోవాలని సూచించారు. వీరిని సైతం అభ్యర్థుల భేటీకి ఆహ్వానించినట్లు తెలిసింది. అయితే ఎక్కువ నియోజకవర్గాల్లో ఇద్దరి కంటే ఎక్కువ నేతలను ఈ సమావేశానికి ఆహ్వానించనట్లు తెలిసింది. దీంతో అభ్యర్థులు ఎవరనే విషయంలో అస్పష్టత కొనసాగుతోంది. ఆదివారం నాటి సమావేశంలో పెండింగ్ అభ్యర్థులపై స్పష్టత ఇస్తారని ఆశావాహులు ఎదురు చూస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment