ఐదేళ్ల పదవి.. అమావాస్య నాడు ప్రమాణం | GHMC Members Upset With Oath Day On Amavasya | Sakshi
Sakshi News home page

అమావాస్య రోజున ప్రమాణ స్వీకారమా?

Published Wed, Feb 10 2021 8:27 AM | Last Updated on Wed, Feb 10 2021 10:06 AM

GHMC Members Upset With Oath Day On Amavasya - Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : ఐదేళ్లపాటు ఉండాల్సిన కార్పొరేటర్‌ ప్రమాణ స్వీకార కార్యక్రమం అమావాస్య రోజున పెడతారా.. అంటూ రాజకీయపార్టీల ప్రతినిధులు అధికారుల ఎదుట అసంతృప్తి వ్యక్తం చేశారు. అది ఎన్నికల కమిషనర్‌ నిర్ణయమని, రాజ్యాంగ విధి అయినందున చేయగలిగిందేమీ లేదని ఎన్నికల అధికారి లోకేశ్‌కుమార్‌ వివరించారు. కనీసం.. రాహుకాలం ముగిసేంత వరకైనా సమయమివ్వాలని, ఉదయం 11.30 గంటల వరకు రాహుకాలం ఉంటుందని చెప్పడంతో, ఎన్నిక నిర్వహించేది ప్రిసైడింగ్‌ ఆఫీసర్‌ అని తెలిపారు. అందరూ వచ్చి, అన్ని ఏర్పాట్లు పూర్తయ్యేంతవరకు దాదాపుగా అంతే సమయమవుతుందని వారు అభిప్రాయపడ్డారు. ఈ నెల 11న జరగనున్న ప్రమాణ స్వీకారం, మేయర్, డిప్యూటీ మేయర్‌ ఎన్నికల ప్రక్రియ విధానాన్ని వివరించేందుకు జీహెచ్‌ఎంసీలో మంగళవారం రాజకీయపార్టీల ప్రతినిధుల సమావేశం నిర్వహించారు. ఆయా రాజకీయపార్టీల నుంచి ఎమ్మెల్సీ శ్రీనివాస రెడ్డి (టీఆర్‌ఎస్‌ ), ఎమ్మెల్సీ సయ్యద్‌ అమినుల్‌ జాఫ్రి (ఎంఐఎం), నిరంజన్‌ (కాంగ్రెస్‌ ), బీజేపీ నుంచి శంకర్‌ యాదవ్, దేవర కరుణాకర్‌లు హాజరయ్యారు. ఎన్నికలకు సంబంధించిన ప్రత్యేక సమావేశంలో సభ్యులు వ్యవహరించాల్సిన తీరు, తదితరమైన వాటి గురించి లోకేశ్‌కుమార్‌ వారికి వివరించారు. 

  • ప్రమాణ స్వీకారం చేయనున్న సభ్యులు 11వ తేదీన 10.45 గంటల  వరకు గుర్తింపు కార్డు, సమావేశ నిర్వహణపై జీహెచ్‌ఎంసీ జారీ చేసిన నోటీసును తీసుకొని కౌన్సిల్‌ హాల్‌కు రావాలి.  
  • సభ్యుల ప్రమాణ స్వీకారం తెలుగు, ఉర్దూ, హిందీ ఇంగ్లీష్‌ నాలుగు భాషల్లో ఉంటుంది. ఎవరికిష్టమైన భాషలో వారు చేయవచ్చు.  
  • అనంతరం మధ్యాహ్నం 12.30 గంటలకు మేయర్, డిప్యూటీ మేయర్‌ ఎన్నికలు నిర్వహిస్తారు. ఎన్నికలకు ఎక్స్‌అఫీషియో సభ్యులతో కలిపి 97  మంది సభ్యులు హాజరైతేనే పూర్తి కోరంతో మేయర్, డిప్యూటీ మేయర్‌ ఎన్నికలు జరుగుతాయి.  
  • చేతులు ఎత్తడం ద్వారా మేయర్, డిప్యూటీ ఎన్నిక జరుగుతుంది. ఎన్నికల ప్రక్రియ మొత్తాన్ని వీడియో తీస్తారు.  
  • వచ్చిన సభ్యులందరి వివరాలు సరిచూసి, హాలులోకి ప్రవేశించే ముందు సంతకాలు తీసుకోవడం, వారికి సూచనలు, సలహాలు ఇచ్చేందుకు 30 మంది అధికారులుంటారు.


బల్దియా పాలకమండలికి నేడే చివరి రోజు 
 సాక్షి, సిటీబ్యూరో : జీహెచ్‌ఎంసీ ప్రస్తుత పాలకమండలి గడువు బుధవారం (10వ తేదీతో)ముగిసిపోనుంది. 2016 ఫిబ్రవరి 11న పాలకమండలి సభ్యులు ప్రమాణం చేశారు. వారి ఐదేళ్ల గడువు పదో తేదీతో ముగిసిపోనుంది. అందువల్లే కొత్త పాలకమండలి ప్రమాణ స్వీకారం కూడా మర్నాడే ఏర్పాటు చేశారు. ప్రమాణ స్వీకారం అనంతరం మేయర్, డిప్యూటీ మేయర్ల ఎన్నికలు కూడా నిర్వహించనున్నారు. అప్పుడు..ఇప్పుడు కూడా కొత్త పాలకమండలి ఫిబ్రవరి నెల 11వ తేదీ..గురువారం కావడం యాధృచ్ఛికమే అయినా విశేషంగా మారింది.

ప్రతిపక్షం లేకుండా.. 

  •  బల్దియా చరిత్రలోనే ప్రతిపక్షం, విమర్శలు, సవాళ్లు–ప్రతిసవాళ్లు లేకుండా ఐదేళ్లు పూర్తిచేసుకున్న పాలకమండలి ఇప్పటి వరకు లేదు.  
  • అధికార టీఆర్‌ఎస్‌ నుంచే మేయర్, డిప్యూటీ మేయర్లు ఉండటం, తగినంతమంది సభ్యుల బలమున్న ఎంఐఎం మిత్రపక్షంగా వ్యవహరించడంతో ప్రతిపక్షమనేది లేకుండా పోయింది. బీజేపీ, కాంగ్రెస్‌లకు తగిన బలమే లేనందున ఏమీ చేయలేకపోయారు. 
  • ముందస్తుగా వచ్చిన ఎన్నికలతో  కొత్త కార్పొరేటర్లు వచ్చినప్పటికీ,  అధికారికంగా ప్రొటోకాల్‌ ప్రకారం కార్పొరేటర్ల హోదాల్లో కొనసాగారు. కొన్ని ప్రాంతాల్లో వివాదాలు చెలరేగాయి.  
  • ప్రతిపక్షం లేకుంటే పాలన ఎలా ఉంటుందో కూడా ఈ పాలకమండలి హయాంలోనే తెలిసివచ్చింది. ప్రజాసమస్యల గురించి ప్రశ్నించిన వారు లేరు.ఒకరిద్దరు సభ్యులున్న పార్టీలకు అవకాశమే రాలేదు. వారి వాదన విన్నవారే లేరు.   
  • కరోనా కారణంగా దాదాపు పదినెలలపాటు సర్వసభ్యసమావేశాలు జరగలేదు. చివరిసారిగా బడ్జెట్‌ సమావేశమైనా నిర్వహించాలనుకోగా, మేయర్‌ ఎన్నిక నోటిఫికేషన్‌తో కోడ్‌ అడ్డొచ్చింది.


మేయర్‌ ఎన్నికలో వీరికి ఓటు లేదు 
సాక్షి, సిటీబ్యూరో: మేయర్, డిప్యూటీ మేయర్‌ ఎన్నికల కోసం గ్రేటర్‌ పరిధిలోని అన్ని పార్టీలకు సంబంధించి ఎక్స్‌అఫీషియో సభ్యుల లెక్క ఖరారైనప్పటికీ, ఇంకా ఎవరైనా అర్హులున్నారేమోనని అధికారులు పరిశీలించారు. వివిధ పార్టీల్లోని వారు గత సంవత్సరం జనవరిలో జరిగిన మునిసిపాలిటీలు, కార్పొరేషన్లలో ఓటు వేసినట్లు ఖరారు చేసుకున్నారు. దాంతో వారిక్కడ ఓటువేసేందుకు అర్హులు కాదని తేల్చారు. ఆ వివరాలిలా ఉన్నాయి.  

ఎవరు              పార్టీ          ఎక్కడ వేశారు  
ఎ.రేవంత్‌రెడ్డి    కాంగ్రెస్‌        కొంపల్లి 
జి.రంజిత్‌రెడ్డి    టీఆర్‌ఎస్‌    నార్సింగి
 

ఎమ్మెల్సీలు 
శంభీపూర్‌ రాజు           టీఆర్‌ఎస్‌     కొంపల్లి 
కాటేపల్లి జనార్దన్‌రెడ్డి    స్వతంత్ర      తుక్కుగూడ 
కసిరెడ్డి నారాయణరెడ్డి     టీఆర్‌ఎస్‌    కోస్గి 
పల్లా రాజేశ్వర్‌రెడ్డి        టీఆర్‌ఎస్‌    నల్గొండ 
మాదిరెడ్డి శ్రీనివాస్‌రెడ్డి    టీఆర్‌ఎస్‌    ఆదిభట్ల 
ఎన్‌.రామచంద్రరావు      బీజేపీ       మక్తల్‌ 
ఎగ్గె మల్లేశం              టీఆర్‌ఎస్‌      తుక్కుగూడ 
కె.నవీన్‌కుమార్‌        టీఆర్‌ఎస్‌    పెద్ద అంబర్‌పేట 
దర్పల్లి రాజేశ్వరరావు    టీఆర్‌ఎస్‌    నిజామాబాద్‌ 
పట్నం మహేందర్‌రెడ్డి    టీఆర్‌ఎస్‌    పెద్ద అంబర్‌పేట 
ఫారూఖ్‌ హుస్సేన్‌    టీఆర్‌ఎస్‌    నారాయణ్‌ ఖేడ్‌ 

ఎమ్మెల్యేలు
గూడెం మహిపాల్‌రెడ్డి     టీఆర్‌ఎస్‌    బొల్లారం 
కేపీ వివేకానంద           టీఆర్‌ఎస్‌    కొంపల్లి 
పి.సబితా ఇంద్రారెడ్డి     టీఆర్‌ఎస్‌    తుక్కుగూడ 
టి.ప్రకాశ్‌గౌడ్‌              టీఆర్‌ఎస్‌    నార్సింగి  
 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement