అమావాస్య గనుక సోమవారం నాడు వస్తే ఎంతో పుణ్యప్రదమైనది. మన దక్షిణాదిన కన్నా ఉత్తరాదిన దీనిని చాలామంది ఆచరించడం మనం చూస్తాం. హరిద్వార్‌లోని ప్రయాగలో ఈరోజు పది లక్షల మంది స్నానాలు ఆచరిస్తారు. అంత పవిత్రమైన రోజునే పాశ్చాత్య దేశాల్లో సూర్యగ్రహణం ఏర్పడుతోంది. అందువల్ల ఈ అమావాస్య మరింత విశేషమైనది. సోమావారంతో కూడిన అమావాస్య కావడంతో దీన్ని సోమావతి అమావాస్య అనిపిలుస్తారు. ఈ రోజు ఏం చేస్తారు?, ఏ దేవుడిని పూజిస్తారు? సవివరంగా తెలుసుకుందామా..!
అమావాస్యా తు_సోమేన, సప్తమీ_భానునాయుతా
చతుర్థీ భౌమవారేణ బుధవారేణ చాష్టమీ।
చతస్రస్తిథయస్త్వేతాస్సూర్యగ్రహణ సన్నిభాః
స్నానం, దానం, తథాశ్రాద్ధం సర్వం తత్రాక్షయం భవేత్ ॥
ఎప్పటి నుంచి ఆచరిస్తున్నారంటే..
దక్ష ప్రజాపతి తాను చేస్తున్న యజ్ఞానికి తన కుమార్తె సతీదేవిని అలాగే అల్లుడైన పరమశివున్ని ఆహ్వానించకుండా వారిని అవమానిస్తాడు. శివుడు వద్దన్నా వినకుండా యజ్ఞానికి ఆహ్వానం లేకుండా వెళ్లిన సతీదేవి అవమానానికి గురై శరీరాన్ని త్యాగం చేస్తుంది. సతీదేవి మరణ వార్త తెలిసి ఆగ్రహించిన శివుడు తన జటాజూటం నుంచి వీరభద్రుడిని సృష్టిస్తాడు. సమస్త ప్రమథ గణాలతో కలిసి వీరభద్రుడు దక్ష యజ్ఞాన్ని ధ్వంసం చేసి యాగానికి వచ్చిన వారందరిని చితకబాదుతాడు. శివుడిని అవమానించే కార్యక్రమంలో పాల్గొన్నందుకు శివగణాల చేతిలో చంద్రుడు కూడా చావు దెబ్బలు తింటాడు.
ఆ సమయంలో ఒంటినిండా గాయాలతో తీవ్రమైన బాధతో చంద్రుడు పరమశివున్ని శరణు వేడుకుంటాడు. చంద్రుని అవస్థను చూసి మనసు కరిగిన భోళాశంకరుడు త్వరలో రానున్న అమావాస్యతో కూడిన సోమవారం నాడు తనకు అభిషేకం జరిపిస్తే తిరిగి చంద్రుడు సంపూర్ణ ఆరోగ్యవంతుడు అవుతాడని అభయమిస్తాడు. ఆనాటి నుంచి సోముడు అంటే చంద్రుడి పేరిట సోమవారం అమావాస్య కలిసి వచ్చిన రోజును సోమవతి అమావాస్యగా మనం జరుపుకుంటున్నాం.
ఇవాళ ఉదయం అమావాస్య ఉన్నందువలన ఉదయం మనం ఆచరించే స్నాన, దానాదులకుశ్రాద్ధకర్మకు అక్షయమైన ( తరిగిపోని ) పుణ్యఫలమని మన ధర్మశాస్త్రాలు చెబుతున్నాయి. ఇవాళ ఉదయం నదీస్నానం , పితృతర్పణం, శక్తి కొలది దానము చేయాలి. ఆడవారు సోమవతీ అమావాస్య వ్రత కథ చదువుకుని,ఉపవాసముతో ఉండి అశ్వత్థ వృక్ష ప్రదక్షిణ ( రావి చెట్టు చుట్టూ ప్రదక్షిణలు ) 108 చేస్తే మంచిది. అంతేగాదు ఈ సోమావతి అమావాస్య రోజున శివారాధన చేసి.. రావిచెట్టుకు ప్రదక్షిణలు చేసి.. సోమావతి కథను ఒకసారి గుర్తు చేసుకుని.. ఉపవాస దీక్షను తీసుకుంటే జాతక దోషాలన్ని తొలగిపోతాయనేది భక్తుల నమ్మకం. ఈ రోజు విష్ణువుని, తులిసీ చెట్టుని పూజిస్తే ధనానికి లోటు ఉండదు.
చేయకూడనవి..
ఈరోజు జుట్టు గోర్లు కత్తిరించకూడదు. మహిళలు తలస్నానం చేయకూడదు. మాంసము మద్యానికి దూరంగా ఉండాలి. ఈ రోజున సొరకాయ, దోసకాయ శనగలు, జీలకర్ర, ఆవాలు, ఆకుకూరలు తినకూడదు. ఎటువంటి శుభకార్యాలు ప్రారంభించకూడదు. ఈరోజు వస్తువులు కొనడం మానుకోవాలి. గొడవలకు దూరంగా ఉండాలి.
Comments
Please login to add a commentAdd a comment