Significant changes
-
ఒకప్పుడు నాన్న అంటే హడల్..కానీ ఇప్పుడు..!
తండ్రి విలువను ప్రపంచానికి చాటి చెప్పాలనే ఉద్దేశంతో ఏటా జూన్ మూడో ఆదివారం ఈ దినోత్సవం నిర్వహిస్తున్నారు. మొదటిసారిగా వాషింగ్టన్లో ఓ యువతి ఇందుకు చొరవ చూపింది. తన చిన్నతనంలోనే తల్లి చనిపోవడంతో తండ్రే అన్నీ అయి ఆరుగురు కూతుళ్లను పెంచి పెద్ద చేశాడు. అందుకే ఈయన పుట్టిన రోజును తండ్రుల దినోత్సవంగా జరిపింది. కాలక్రమంలో 1966లో అధికారికంగా గుర్తింపు లభించింది. చరిత్ర: 1910లో వాషింగ్టన్లో ప్రపంచ నాన్నల దినోత్సవం ప్రారంభం అయింది. కాకపోతే 1972 లో తండ్రుల దినోత్సవానికి గుర్తింపు వచ్చింది. పిల్లల కోసం తన జీవితాన్ని ధారపోసే తండ్రుల కోసం సంవత్సరంలో ఒక రోజు ఉండాలన్న ఉద్దేశంతో ప్రపంచ ఫాదర్స్ డేను ప్రారంభించారు. తల్లులకు గౌరవంగా ప్రపంచ మాతృ దినోత్సవం ఉంది. అయితే.. తల్లులతో పాటు.. పిల్లల ఎదుగుదలలో ముఖ్య పాత్ర పోషించి బాధ్యతకు మారుపేరుగా నిలిచే తండ్రికి కూడా ఒక రోజు ఉండాలని యూఎస్‌కు చెందిన సోనోరా స్మార్ట్ డాడ్ అనే మహిళ ఈ ప్రచారాన్ని మొదలు పెట్టింది. అలా వాషింగ్టన్లో మొదటిసారి 1910లో ప్రపంచ నాన్నల దినోత్సవాన్ని జరిపారు. ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా 52 దేశాలు ప్రపంచ తండ్రుల దినోత్సవాన్ని జరుపుకుంటున్నాయి. ఆ దేశాలన్ని కలిసి జూన్ మూడో ఆదివారాన్ని ప్రపంచ తండ్రుల దినోత్సవంగా జరుపుకుంటున్నాయి. అన్నీ తానై.. ఒకప్పుడు నాన్నంటే పిల్లలకు ఎంతో భయం.. ఇప్పుడు పరిస్థితులు మారాయి. నాన్న స్నేహితుడుగా మారిపోయాడు. త్యాగానికి ప్రతిరూపమయ్యాడు. పిల్లల భవిత కోసం కొవ్వొత్తిలా కరిగిపోతున్నాడు. నాన్న మనసు మంచుకొండలా మారింది. మారాం చేసినా.. తప్పు చేసినా పాతరోజుల్లో తండ్రి మందలిస్తే నేడు ఆస్థానాన్ని అమ్మకు వదిలేసి తాను మాత్రం ఆప్యాయతనే పంచుతున్నాడు. బిడ్డ ఓటమి పాలైనా భుజాలపై చెయ్యేసి ఊరడించే అమృతమూర్తి.(చదవండి: Father's Day 2024: హాయ్..! నాన్న..!!) -
జూన్ 13 : స్పెషాల్టీ ఏంటో తెలిస్తే, వావ్..! అనాల్సిందే!
Sewing Machine Day 2024 జాతీయ కుట్టు మెషీన్ దినోత్సవాన్ని ప్రతి సంవత్సరం జూన్ 13న జరుపుకుంటారు. ఏంటి ఇదొక డే కూడా ఉందా అని ఆశ్చర్యపోతున్నారా? ఉంది.. దీని కథా కమామిష్షు తెలియాలంటే.. ఈ స్టోరీ చదవాల్సిందే.ఆది మానవుడు ఆకులు, నార వస్త్రాలు కట్టుకుని తిరిగేవాడని చరిత్ర చెబుతోంది. పరిణామ క్రమంలో వస్త్రధారణలో అనేక పరిణామా లొచ్చినప్పటికీ, కుట్టుయంత్రాన్ని తయారు చేయడం విప్లవాత్మకమైన పరిణామమని చెప్పవచ్చు. వీటన్నింటికి మాతృక కుట్టుమెషీన్‌ను కనుగొనడమే. అలా 1790లో కుట్టు మెషీన్ ఆవిష్కరణ సందర్భాన్ని జాతీయ కుట్టు యంత్ర దినోత్సవంగా జరుపుతారు. ఆంగ్ల ఆవిష్కర్త థామస్ సెయింట్ దీనికి పేటెంట్ తీసుకున్నారు. కానీ థామస్ కుట్టు యంత్రం రూపకల్పన ముందుకు సాగలేదు. దీని తొలి నమూనా 1874లో తయారైంది. విలియం న్యూటన్ విల్సన్ అనే వ్యక్తి లండన్‌లోని పేటెంట్ కార్యాలయంలో సెయింట్ డ్రాయింగ్లను గుర్తించారు. ఈ డిజైన్‌కు కొన్ని సర్దుబాట్లు చేసి వర్కింగ్ మోడల్‌ను రూపొందించారు ఈ నమూనా ఇప్పుడు లండన్ సైన్స్ మ్యూజియంలో ప్రదర్శనకు ఉంది. అయితే 1800ల తరువాత కుట్టు యంత్రాలు విస్తృతంగా అందుబాటులోకి వచ్చాయి.ఎలియాస్ హోవే ,ఐజాక్ సింగర్ కుట్టు యంత్రాలను అభివృద్ధి చేసి ప్రాచుర్యంలోకి తెచ్చారు. ఆ తరువాత సామాన్య మానవుడికి కుట్టు మెషీన్లు అందుబాటులో వచ్చాయి. ఆ తరువాత అనేక కంపెనీలకు చెందిన, మెషీన్లు ఆధునిక హంగులతో అందుబాటులోకి వచ్చాయి. విభిన్న డిజైన్లతో ఫ్యాషన్ ప్రపంచం పరుగులు తీయడానికి, కుట్టుకళకు ఇంత ప్రాధాన్యత రావడానికి కారణమైన కుట్టు యంత్రాల ఆవిష్కారం, చరిత్ర గురించి తెలుసు కోవడం చాలా అవసరం. -
'ప్రపంచ ఆకలి దినోత్సవం': ఎంతమంది బాధపడుతున్నారంటే..?
'ఆకలి' దీనికి ఎవరూ అతీతులు కారు. ఆకలి వేస్తే రాజైనా.. అల్లాడిపోవాల్సిందే. ఆకలి విలువ తెలిసిన వ్యక్తి సాటి వాడిని ఆకలితో బాధపడేలా చేయడు. కనీసం ఓ బ్రెడ్ లేదా గుప్పెడు అన్నం అయిన ఇచ్చి ఆదుకునే యత్నం చేస్తాడు. ముఖ్యంగా మనదేశంలో ఆకలితో అల్లాడిపోతున్న పేద ప్రజలు ఎంతో మంది ఉన్నారు. అంతేగాదు అధికారిక లెక్కల ప్రకారం.. ఆకలి (Hunger) బాధితుల సంఖ్య 46 మిలియన్లు ఎగబాకినట్లు యునైటెడ్ నేషన్స్ ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్ నివేదికలు చెబుతున్నాయి. ఈ ఆకలిని అంతం చేసేలా పేదరికం నిర్మూలనకు నడుంకట్టేందుకు ఈ ఆకలి దినోత్సవాన్ని ఏర్పాటు చేశారు. ఈ దినోత్సవం ప్రాముఖ్యత ? విశేషాలు గురించి సవివరంగా తెలుసుకుందాం.2011లో, ఆకలి, పేదరికాన్ని అంతం చేయడానికి ‘ది హంగర్ ప్రాజెక్ట్’ అనే లాభరహిత సంస్థ మే 28ని ‘ప్రపంచ ఆకలి దినోత్సవం’గా (World Hunger Day) ప్రకటించింది. ఈ రోజునఆహార భద్రతను ప్రోత్సహించే కమ్యూనిటీలను బలోపేతం చేయడం, పరిష్కారాలను కనుగొనడం వంటివి చేస్తుంది. ప్రతి ఏడాది ఓ థీమ్‌ని ఏర్పాటు చేసి ఆ దిశగా అభివృద్ధి కార్యక్రమాలను చేపడుతున్నారు అధికారులు. ఆకలితో అల్లాడుతున్న వారికి సాయం అందేలా ఏం చేయాలనే అనే అవగాహన కార్యక్రమాలను పెద్ద ఎత్తున చేపడతారు. ప్రపంచ వ్యాప్తంగా 811 మిలియన్ల మంది ఆకలి బాధతలో సతమతమవుతున్నట్లు నివేదికలు చెబుతున్నాయి.ఈ ఏడాది థీమ్! "అభివృద్ధి చెందుతున్న తల్లులు, అభివృద్ధి చెందుతున్న ప్రపంచం" దీన్ని ఇతి వృత్తంగా తీసుకుని మహిళలు, తమ కుటుంబాలు సమాజాలు ఆహారభద్రతను నిర్థారించడంలో కీలకపాత్ర పోషిస్తాయని నొక్కి చెబుతోంది. యూఎన్ ప్రకారం బిలియన్ కంటే ఎక్కువ మంది మహిళలు, కౌమరదశలో ఉన్న బాలికలు పోషకాహార లోపాన్ని అనుభవిస్తున్నారు. ఈ పరిస్థితి తల్లులు, వారి పిల్లలు ఇరువురికి దారుణమైన పరిస్థితులున ఎదుర్కొనేలా చేస్తుంది. ముఖ్యంగా మహిళల ఆరోగ్యం, విద్య, ఆర్థిక అవకాశాలపై పెట్టుబడి పెట్టడం ద్వారా ఆకలి చక్రాన్ని విచ్ఛిన్నం చేసి, అభివృద్ధి చెందుతున్న సమాజాన్ని సృష్టించొచ్చు. ప్రాముఖ్యత ..ఈ రోజున ప్రతి ఒక్కరిని కార్యచరణకు పిలుపునిచ్చేలా..ఆహార భద్రతను ప్రోత్సహించే సంస్థలకు మద్దతు ఇవ్వడం, ఆహార భద్రతను ప్రోత్సహించే విధానాల కోసం కృషి చేయడం. తినే ఆహారానికి సంబంధించిన సరైన ప్రణాళికలు, ఆకలిని అంతం చేసేలా కృషి చేయడం తదితర కార్యక్రమాలను చేపడతారు. అందరూ కలిసి ఆరోగ్యంగా, సంతృప్తికరమైన జీవితాలను గడపడానికి అవసరమైన పౌష్టికాహారాన్ని పొందేలా సరికొత్త ప్రపంచాన్ని నిర్మించేలా చేయడం ఈ దినోత్సవం ముఖ్యోద్దేశం. చేయాల్సినవి..వ్యవసాయ అభివృద్ధి: రైతులు అవసరమైన వనరుల, సరైన శిక్షణ అందేలా చేయడంవిద్య: పేదరికం నిర్మూలించేలా విద్యకు ప్రాధాన్యత ఇవ్వడంఆరోగ్య సంరక్షణ: ఆకలి సంబంధితన అనారోగ్యాలను తగ్గుముఖం పట్టేలా ఆరోగ్య సంరక్షణ సేవలను మెరుగుపరచడంఆర్థిక సాధికారత: పేద ప్రాంతాలలో ఉద్యోగ అవకాశాలను సృష్టించడం, వస్థాపకతకు మద్దతు ఇవ్వడం.(చదవండి: వరల్డ్ మెన్స్ట్రువల్ హైజీన్ డే : పీరియడ్స్ పరిశుభ్రత ముఖ్యం, లేదంటే చాలా ప్రమాదం) -
సోమావతి అమావాస్య అంటే.. రావిచెట్టుకి ప్రదక్షిణాలు ఎందుకు?
అమావాస్య గనుక సోమవారం నాడు వస్తే ఎంతో పుణ్యప్రదమైనది. మన దక్షిణాదిన కన్నా ఉత్తరాదిన దీనిని చాలామంది ఆచరించడం మనం చూస్తాం. హరిద్వార్‌లోని ప్రయాగలో ఈరోజు పది లక్షల మంది స్నానాలు ఆచరిస్తారు. అంత పవిత్రమైన రోజునే పాశ్చాత్య దేశాల్లో సూర్యగ్రహణం ఏర్పడుతోంది. అందువల్ల ఈ అమావాస్య మరింత విశేషమైనది. సోమావారంతో కూడిన అమావాస్య కావడంతో దీన్ని సోమావతి అమావాస్య అనిపిలుస్తారు. ఈ రోజు ఏం చేస్తారు?, ఏ దేవుడిని పూజిస్తారు? సవివరంగా తెలుసుకుందామా..! అమావాస్యా తు_సోమేన, సప్తమీ_భానునాయుతా చతుర్థీ భౌమవారేణ బుధవారేణ చాష్టమీ। చతస్రస్తిథయస్త్వేతాస్సూర్యగ్రహణ సన్నిభాః స్నానం, దానం, తథాశ్రాద్ధం సర్వం తత్రాక్షయం భవేత్ ॥ ఎప్పటి నుంచి ఆచరిస్తున్నారంటే.. దక్ష ప్రజాపతి తాను చేస్తున్న యజ్ఞానికి తన కుమార్తె సతీదేవిని అలాగే అల్లుడైన పరమశివున్ని ఆహ్వానించకుండా వారిని అవమానిస్తాడు. శివుడు వద్దన్నా వినకుండా యజ్ఞానికి ఆహ్వానం లేకుండా వెళ్లిన సతీదేవి అవమానానికి గురై శరీరాన్ని త్యాగం చేస్తుంది. సతీదేవి మరణ వార్త తెలిసి ఆగ్రహించిన శివుడు తన జటాజూటం నుంచి వీరభద్రుడిని సృష్టిస్తాడు. సమస్త ప్రమథ గణాలతో కలిసి వీరభద్రుడు దక్ష యజ్ఞాన్ని ధ్వంసం చేసి యాగానికి వచ్చిన వారందరిని చితకబాదుతాడు. శివుడిని అవమానించే కార్యక్రమంలో పాల్గొన్నందుకు శివగణాల చేతిలో చంద్రుడు కూడా చావు దెబ్బలు తింటాడు. ఆ సమయంలో ఒంటినిండా గాయాలతో తీవ్రమైన బాధతో చంద్రుడు పరమశివున్ని శరణు వేడుకుంటాడు. చంద్రుని అవస్థను చూసి మనసు కరిగిన భోళాశంకరుడు త్వరలో రానున్న అమావాస్యతో కూడిన సోమవారం నాడు తనకు అభిషేకం జరిపిస్తే తిరిగి చంద్రుడు సంపూర్ణ ఆరోగ్యవంతుడు అవుతాడని అభయమిస్తాడు. ఆనాటి నుంచి సోముడు అంటే చంద్రుడి పేరిట సోమవారం అమావాస్య కలిసి వచ్చిన రోజును సోమవతి అమావాస్యగా మనం జరుపుకుంటున్నాం. ఇవాళ ఉదయం అమావాస్య ఉన్నందువలన ఉదయం మనం ఆచరించే స్నాన, దానాదులకుశ్రాద్ధకర్మకు అక్షయమైన ( తరిగిపోని ) పుణ్యఫలమని మన ధర్మశాస్త్రాలు చెబుతున్నాయి. ఇవాళ ఉదయం నదీస్నానం , పితృతర్పణం, శక్తి కొలది దానము చేయాలి. ఆడవారు సోమవతీ అమావాస్య వ్రత కథ చదువుకుని,ఉపవాసముతో ఉండి అశ్వత్థ వృక్ష ప్రదక్షిణ ( రావి చెట్టు చుట్టూ ప్రదక్షిణలు ) 108 చేస్తే మంచిది. అంతేగాదు ఈ సోమావతి అమావాస్య రోజున శివారాధన చేసి.. రావిచెట్టుకు ప్రదక్షిణలు చేసి.. సోమావతి కథను ఒకసారి గుర్తు చేసుకుని.. ఉపవాస దీక్షను తీసుకుంటే జాతక దోషాలన్ని తొలగిపోతాయనేది భక్తుల నమ్మకం. ఈ రోజు విష్ణువుని, తులిసీ చెట్టుని పూజిస్తే ధనానికి లోటు ఉండదు. చేయకూడనవి.. ఈరోజు జుట్టు గోర్లు కత్తిరించకూడదు. మహిళలు తలస్నానం చేయకూడదు. మాంసము మద్యానికి దూరంగా ఉండాలి. ఈ రోజున సొరకాయ, దోసకాయ శనగలు, జీలకర్ర, ఆవాలు, ఆకుకూరలు తినకూడదు. ఎటువంటి శుభకార్యాలు ప్రారంభించకూడదు. ఈరోజు వస్తువులు కొనడం మానుకోవాలి. గొడవలకు దూరంగా ఉండాలి. -
రంగులు చల్లుకోని హోలీ గురించి తెలుసా?
ప్రకృతిలో సరికొత్త సొగసు కనుల విందు చేస్తుందంటే అది వసంత రుతువు ఆగమనానికి గుర్తింపు మాత్రమే కాదు.. మనుషుల్లో ఉత్సాహానికి కారణం కూడా. ఎందుకంటే..? ఆ రుతువులోనే ఎండిన చెట్లు, కొమ్మలు, రెమ్మలు చిగురిస్తాయి. అంతేనా ఆ కొమ్మలపైన కుహు.. కుహు.. అంటూ మనసు పులకరించేలా కోయిలమ్మ మధురగానాలతో వీనుల విందు చేస్తుంది. మరోవైపు ఆ పచ్చదనపు ప్రకృతి సోయగాలు పుష్ప పరిమళ వికాసాలు అన్నీ ఏకమై ఆవిష్కృతమవుతాయి. ఆ ఆనందభరిత సమయాన చిన్న, పెద్ద, ఆడ, మగ తేడాలు లేకుండా కులమతాలకు అతీతంగా దేశ వ్యాప్తంగా జరుపుకునే తొలి వేడుక హోలీ. హోలీ పండుగ రంగుల పండుగ.. అదో ఆనంద కేళీ… ప్రజలు ఎంతో ఇష్టంగా పాల్గొనే పండుగ. వసంతాగమనంలో వస్తుంది ఈ రంగుల హోలీ. గజగజా వణికించిన చలికి టాటా చెబుతూ.. వేసవి వెచ్చదనంలోకి అడుగుపెడుతున్న వేళ హోలీ వస్తుంది. భారతీయ పండుగల్లో హోలీ మరీ ప్రత్యేకం. చిన్న పిల్లల నుంచి వృద్ధుల వరకు హోలీని ఆనందోత్సాహాల మధ్య జరుపుకుంటారు. సంవత్సరంలో కేవలం ఒక్క సారి మాత్రమే ఘనంగా జరుపుకునే పండుగలలో హోలీ పండుగ ఒకటి. ఈ పండుగను సత్య యుగం నుంచి జరుగుతున్నట్లుగా హిందూ పురాణాలు తెలియజేస్తున్నాయి. హోళి అంటే అగ్ని లేదా అగ్నితో పునీతమైనది అని అర్థం. ఈ హోళిని హోలికా పూర్ణిమ అని కూడా అంటారు. పురాణాల ప్రకారం చూస్తే విష్ణు భక్తుడు ప్రహ్లాదుడి తండ్రి హిరణ్యకశ్యపుడు. ప్రహ్లాదుడిని చంపడానికి రాక్షసి హోలికా ప్రయత్నిస్తుంది. ప్రహ్లాదుడు విష్ణు భక్తుడు కావడం, తనని మాత్రమే పూజించాలన్నా.. తన మాట వినకపోవడంతో హిరణ్యకశ్యపుడే తన కొడుకు ప్రహ్లాదుడిని చంపాలని హోలికాకి ఆదేశాలు ఇచ్చాడు. ఎందువల్ల ఇలా చేస్తాడంటే..రాక్షస రాజు.. హిరణ్యకశ్యపుడు .. కుమారుడు ప్రహ్లాదుడు నిత్యం విష్ణుమూర్తిని స్మరిస్తూ ఉంటాడు.. అది హిరణ్యకశ్యపుడికి నచ్చదు దీంతో భక్త ప్రహ్లాదుని చంపేయాలి అనుకుంటాడు. తన సోదరి అయిన హోలికను పిలుస్తారు. ఆమెకు ఉన్న శక్తితో ప్రహ్లాదుని మంటలలో ఆహుతి చేయమని ఆమెను కోరతాడు. దీంతో ఆమె ప్రహ్లాదుని ఒడిలో కూర్చోబెట్టుకొని, మంటల్లోకి దూకుతుంది. విష్ణు మాయతో ప్రహ్లాదుడు బయటపడతాడు. హోలిక రాక్షసి మాత్రం ఆ మంటల్లో చిక్కుకొని చనిపోతుందట. మరో కథ కూడా ప్రాచుర్యంలో ఉంది. సతీవియోగంతో తపస్సులో ఉన్న శివునికి హిమవంతుని కుమార్తె అయిన పార్వతిని ఇచ్చి దేవతలు వివాహం చేయాలనుకుంటారు. కానీ తపస్సులో ఉన్న శివునికి ఎలా తపో భంగం కలిగించాలోనని ఆలోచించి మన్మథున్ని శివుని మీదకు పంపుతారు. కామదేవుడు శివుని తపస్సును భగ్నం చేసేందుకు పూల బాణాలు వదలడంతో శివుని మనస్సు పెండ్లి వైపు మరలిస్తాడు. దీంతో పార్వతీ పరమేశ్వరుల వివాహం జరుగుతుంది. మన్మథ బాణం ప్రభావం తగ్గగానే శివుడు తనకు మన్మథుడి వల్ల తపో భంగం కలిగిందని తన మూడో నేత్రంతో కామదేవుడిని భస్మం చేస్తాడు. పతీ వియోగంతో కామదేవుడి భార్య రతీదేవి శివునితో తన భర్త కామదేవున్ని బతికించమని వేడుకుంటుంది. శివుడు అనుగ్రహించి శరీరం లేకుండా మానసికంగా బతికే వరాన్ని ఫాల్గుణ శుద్ధ పౌర్ణమి రోజున ప్రసాదిస్తాడు. కాముడు తిరిగి బతికిన రోజు కావడంతో కాముని పున్నమిగా పిలుస్తారు. పూర్వం ఈ పండుగ రోజున రకరకాల పూలను ఒకరిపై ఒకరు చల్లుకుని.. అలా వారి సంతోషాన్ని వ్యక్తపరిచేవారు. కానీ ప్రస్తుతం ఉన్న పరిస్థితులలో పూల స్థానంలో రకరకాల రంగులు వచ్చాయి. ఈ రంగులను నీళ్ళలో కలుపుకొని ఒకరిపై ఒకరు చల్లుకుంటూ ఉంటారు. ఇలా చేయడం వల్ల ప్రేమ తోపాటు, సౌభాగ్యాలు వెల్లి విరుస్తాయి అని అందరూ భావిస్తారు. హోలీ ఎలా వచ్చిందంటే.. ఇక మరో కథనం ప్రకారం.. అప్పట్లో శ్రీకృష్ణుడు గోపికలతో కలసి బృందావనంలో పువ్వులు, రంగులతో ఈ ఉత్సవాన్ని జరుపుకునేవారు. ఇలా చేయడం ద్వారా ప్రేమ సౌభాగ్యాలు కలుగుతాయని నమ్మకం. పురాణ కథల ప్రకారంగా.. కృష్ణుడు ముదురు రంగులో ఉంటాడు. రాధ చాలా అందంగా ఉంటుంది. ఓ రోజు కృష్ణుడు తల్లి యశోద వద్దకు వెళ్లి రాధ గురించి చెబుతాడు. రాధ మేని మెరుపు తన ఒంటి ఛాయ పూర్తి విరుద్ధంగా ఉంది, ఆమె నా ప్రేమను అంగీకరిస్తుందా అని అడుగుతాడు. అప్పుడు యశోద బదులిస్తూ, రాధ ముఖానికి కూడా నీకు నచ్చిన రంగు పూయమని సరదాగా అంటుంది. దీంతో తల్లి యశోద సలహాను అనుసరించి, శ్రీకృష్ణుడు రాధ ముఖానికి రంగులు పూస్తాడు. అలా హోలీ మొదలైంది ఈ దినాన రాక్షస పీడ పోయే౦దుకు "హోళికా" అనే ఒక విధమైన శక్తిని ఆరాధిస్తారు. ఈ రోజునే మహాలక్ష్మీ ఆవిర్భావం.. ఆమె ప్రీతి కోస౦ అ౦దరూ కలిసి గానాలు చేయడ౦, పరిహాసాలాడడ౦ చేస్తారు. హోలికాగ్నిని రగిల్చి ఆరాధి౦చే స౦ప్రదాయ౦ ఇప్పుడు తగ్గిపోయి పరిహాసాది క్రియలే మిగిలాయి. శ్రీమహాలక్ష్మి క్షీరసాగర౦ ను౦డి ఆవిర్భవి౦చి౦దని పురాణ కథ. ఈ ఏడాది పూర్ణిమ, ఉత్తర ఫల్గుణి కలిసి వచ్చాయి. కనుక ఈ దినాన భక్తి శ్రధ్ధలతో మహాలక్ష్మిని షోడశోపచారములతో చక్కగా ఆరాధి౦చి లక్ష్మీ అష్టోత్తర శతనామాలు, కనకధారాస్తోత్ర౦, వ౦టివి పారాయణ చేయడ౦ మ౦చిది. ఈరోజున లక్ష్మిని శ్రద్ధగా అర్చి౦చే వారికి సమస్త ఐశ్వర్యాలు సిద్ధిస్తాయి. ఈరోజుననే శ్రీకృష్ణుని ఉయ్యాలలో వేసి ఆరాధి౦చాలి. దీని ’డోలోత్సవ౦’ అని అ౦టారు. ఒరిస్సావ౦టి ప్రా౦తాలలో డోలా పూర్ణిమ పేరుతో ఇప్పటికీ దీనిని ఆచరిస్తారు. నరాడోలాగత౦ దృష్ట్వా గోవి౦ద౦ పురుషోత్తమ౦! ఫాల్గుణ్యా౦ ప్రయతో భూత్వా గోవి౦దస్య పుర౦వ్రజేత్!! ఉయ్యాలలో అర్చి౦పబడిన పురుషోత్తముడైన గోవి౦దుని ఈరోజున దర్శి౦చిన వారికి వైకు౦ఠలోక౦ ప్రాప్తిస్తు౦దని ధర్మశాస్త్రాల వాక్య౦. (చదవండి: జీవితం వర్ణమయం) -
రిపబ్లిక్ డే 2024: ఈసారి థీమ్ ఏంటంటే..
భారతదేశం జనవరి 26న (శుక్రవారం) 75వ గణతంత్ర దినోత్సవ వేడుకలను జరుపుకుంటోంది. ఈ నేపధ్యంలో గణతంత్ర దినోత్సవ చరిత్ర, పరేడ్, థీమ్ తదితర విషయాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. భారత రాజ్యాంగ ప్రధాన రూపశిల్పి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఇలా అన్నారు ‘రాజ్యాంగం కేవలం న్యాయవాదులు సమర్పించిన పత్రం కాదు. ఇది దేశ ప్రజల జీవితాలను నడిపే వాహనం. దీని స్ఫూర్తి ఎల్లప్పటికీ నిలచి ఉంటుంది’ అని అన్నారు. 1950లో భారత రాజ్యాంగానికి ఆమోదం లభించింది. నేడు మనం భారతదేశ 75వ గణతంత్ర దినోత్సవాన్ని చేసుకునేందుకు సిద్ధమవుతున్నాం. గణతంత్ర దినోత్సవాలలో భారతదేశ గొప్పదనాన్ని, సాంస్కృతిక వారసత్వం, దేశ పురోగతి, విజయాలను గుర్తుచేసుకోనున్నాం. ఢిల్లీలో జరిగే పరేడ్‌లో భారత సైనిక, నౌకాదళ, వైమానిక దళాల సత్తాను చాటే ప్రదర్శనలను మనం చూడబోతున్నాం. రిపబ్లిక్ డే పరేడ్ రిహార్సల్స్, బీటింగ్ ది రిట్రీట్ వేడుకలు ఇప్పటికే అన్ని రాష్ట్రాల రాజధాని నగరాల్లో జరిగాయి. భారతదేశ రాజ్యాంగానికి 1950, జనవరి 26న ఆమోదం లభించింది. దీనికి గుర్తుగా ప్రతియేటా జనవరి 26న గణతంత్ర దినోత్సవాన్ని జరుపుకుంటాం. భారతదేశానికి 1947లో బ్రిటిష్‌వారి నుండి స్వాతంత్ర్యం లభించినప్పటికీ, 1950 జనవరి 26 నుంచి భారత రాజ్యాంగం అమలులోకి వచ్చింది. దీంతో భారత్ ఒక సార్వభౌమ అధికారం కలిగిన గణతంత్ర దేశంగా గుర్తింపు పొందింది. డాక్టర్ బీఆర్ అంబేద్కర్ రాజ్యాంగ ముసాయిదా కమిటీకి నాయకత్వం వహించారు. ప్రతీయేటా జరిగే గణతంత్ర దినోత్సవం.. ప్రజాస్వామ్యబద్ధంగా తమ ప్రభుత్వాన్ని ఎన్నుకునే భారతీయ పౌరుల శక్తిని గుర్తుచేస్తుంది. ప్రతీ సంవత్సరం దేశంలో గణతంత్ర దినోత్సవ వేడుకలు అత్యంత ఉత్సాహంగా జరుగుతుంటాయి. ఆ రోజు రాష్ట్రపతి జాతీయ జెండాను ఆవిష్కరిస్తారు. అనంతరం సైనిక, సాంస్కృతిక ప్రదర్శనలు జరుగుతాయి. గణతంత్ర దినోత్సవం నాడు భారత రాష్ట్రపతి దేశంలోని అర్హులైన పౌరులకు పద్మ అవార్డులను అందిస్తారు. వీర సైనికులకు పరమవీర చక్ర, అశోక్ చక్ర ప్రదానం చేస్తారు. రిపబ్లిక్ డే పరేడ్ ప్రత్యక్ష ప్రసారాలు దేశ ప్రజలకు అందుబాటులో ఉంటాయి. ఈ ఏడాది గణతంత్ర దినోత్సవ ధీమ్ ‘వీక్షిత్ భారత్’,‘భారత్ - లోక్తంత్ర కి మాతృక’. ఇది ప్రజాస్వామ్యాన్ని పెంపొందించే దేశంగా భారతదేశ పాత్రను నొక్కి చెబుతుంది. జనవరి 26.. శుక్రవారం ఉదయం 10:30 గంటలకు న్యూఢిల్లీలోని కర్తవ్య పథ్‌లో గణతంత్ర దినోత్సవ వేడుకలు ప్రారంభంకానున్నాయి. ఇవి 90 నిమిషాల పాటు జరుగుతాయి. ఈ ఏడాది వేడుకలకు ముఖ్య అతిథిగా ఫ్రెంచ్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మాక్రాన్ హాజరుకానున్నారు. -
నేల, నీరే జీవనాధారం!
వాతావరణ మార్పు వల్ల కరువు, వరదలు, అధిక ఉష్ణోగ్రతలు విరుచుకుపడుతున్న నేపథ్యం ఇది. పంటల సాగు, పశుపోషణ, ఆక్వా సాగులో రైతులు అనేక కష్టనష్టాలకు గురవుతున్న కలికాలం. మనతో పాటు సకల జీవరాశి మనుగడకు నేల, నీరే మూలాధారాలు. నేలను, నీటిని ప్రాణప్రదంగా పరిరక్షించుకుంటూనే సేద్యాన్ని కొనసాగించేలా ఐక్యరాజ్యసమితికి చెందిన వ్యవసాయ ఆహార సంస్థ (ఎఫ్.ఎ.ఓ.) ప్రజలు, రైతులను చైతన్యవంతం చేస్తూ పాలకులకు దిశానిర్దేశం చేస్తూ ఉంటుంది. రసాయనాల్లేకుండా, లోతుగా దుక్కి దున్నకుండా, ఒకటికి నాలుగు పంటలు కలిపి వేసుకోవటం ద్వారా పర్యావరణ అనుకూల వ్యవసాయ పద్ధతులను అనుసరించటం ద్వారా నేలను, నీటిని సంరక్షించుకోవటం సాధ్యమవుతుందని సమాజంలో ప్రతి ఒక్కరం గుర్తించాల్సిన తరుణం ఇది. మానవాళికి 95% ఆహారాన్ని అందిస్తున్న నేలలను పరిరక్షించుకోవాలన్న స్ఫూర్తిని కలిగించడానికి ప్రతి ఏటా డిసెంబర్ 5వ తేదీన ప్రపంచ నేలల లేదా భూముల దినోత్సవాన్ని ఎఫ్.ఎ.ఓ. నిర్వహిస్తోంది. ఈ ఏడాది నినాదం: ‘నేల, నీరే జీవరాశి అంతటికీ జీవనాధారం’! ఎఫ్.ఎ.ఓ. ఇంకా ఏం చెబుతోందో చదవండి.. ఈ నెల 8,10 తేదీల్లో విశాఖ ఆర్గానిక్ మేళా గోఆధారిత ప్రకృతి వ్యవసాయదారుల సంఘం, ఏపీ ప్రభుత్వ రైతు సాధికార సంస్థ సంయుక్త ఆధ్వర్యంలో డిసెంబర్ 8,9,10 తేదీల్లో విశాఖపట్నంలోని ఆంధ్రా యూనివర్సిటీ ఇంజనీరింగ్ కాలేజ్ గ్రౌండ్స్‌లో సేంద్రియ/ప్రకృతి వ్యవసాయ ఉత్పత్తుల ప్రదర్శన, అమ్మకం మేళా జరగనుంది. విశాఖలో జరుగుతున్న నాలుగో వార్షిక ఆర్గానిక్ మేళా ఇది. 8న ఉ. 10 గంటలకు రైతుల సమ్మేళనం, 9న గ్రాడ్యుయేట్ రైతుల సదస్సు, 10న ఇంటిపంటలపై సదస్సు, 11న సేంద్రియ ఉత్పత్తుల వ్యాపారుల చర్చాగోష్ఠి జరుగుతుందని నిర్వాహకులు కుమారస్వామి తెలిపారు. వివరాలకు.. 78934 56163, 86862 24466. 11న ప్రకృతి సేద్య కార్యకర్తల సమావేశం ప్రముఖ ప్రకృతి సేద్య నిపుణులు పద్మశ్రీ పురస్కార గ్రహీత సుభాశ్ పాలేకర్ డిసెంబర్ 11న ఉ.10 నుంచి. మ.1 గం. వరకు హైదరాబాద్ దోమల్‌గూడలోని రామచంద్రమిషన్‌లో ప్రకృతి వ్యవసాయ వ్యాప్తికి కృషి చేసే కార్యకర్తలు, స్వచ్ఛంద సంస్థల నిర్వాహకులతో ముచ్చటిస్తారు. పర్యావరణ సంక్షోభం నేపథ్యంలో ప్రకృతి వ్యవసాయాన్ని స్వతంత్ర ఉద్యమంగా గ్రామస్థాయిలో రైతుల్లో విస్తరింపజేయటంపై చర్చిస్తారు. వివరాలకు.. సేవ్ స్వచ్ఛంద సంస్థ: 63091 11427. 14 నుంచి పల్లెసృజన శోధాయాత్ర ప్రకృతితో మమేకమై జీవించే గ్రామీణులు ముఖ్యంగా రైతులు, వృత్తిదారులు, కళాకారుల విజ్ఞానాన్ని తెలుసుకోవటం.. అజ్ఞాతంగా మిగిలిపోయిన గ్రామీణ ఆవిష్కరణలను వెలికితేవటమే లక్ష్యంగా పల్లెసృజన స్వచ్ఛంద సంస్థ శోధాయాత్రలు నిర్వహిస్తోంది. 47వ చిన్న శోధాయాత్ర అన్నమయ్య జిల్లా రాజంపేట నుంచి వెంకట రాజంపేట వరకు డిసెంబర్ 14 నుంచి 17 వరకు జరుగుతుంది. వలంటీర్లు కాలినడకన పయనిస్తూ ప్రజలతో ముచ్చటిస్తారు. ఆసక్తి గల వారు రిజిస్ట్రేషన్ చేసుకొని యాత్రలో పాల్గొనవచ్చు. వివరాలకు.. బ్రిగేడియర్ పి.గణేశం – 98660 01678, 99666 46276, 99859 19342. 9, 10 తేదీల్లో సుందర రామన్ శిక్షణ తమిళనాడుకు చెందిన ప్రముఖ ప్రకృతి వ్యవసాయ నిపుణులు ఎస్.ఆర్. సుందర రామన్ డిసెంబర్ 9,10 తేదీల్లో సంగారెడ్డి జిల్లా సదాశివపేటలోని కామ్యవనంలో రైతులకు రెండు రోజుల పాటు శిక్షణ ఇవ్వనున్నారు. రసాయనాలతో సాగుచేస్తున్న భూమిని ప్రకృతి వ్యవసాయంలోకి ఎలా మార్చాలి? నేలలో సేంద్రియ కర్బనం ఎలా పెంచాలి? ఉద్యాన పంటలకు పిచికారీ లేకుండా సమగ్ర పోషకాలు ఎలా అందించాలి? వంటి అనేక ప్రకృతి సేద్య పద్ధతులపై రైతులకు అవగాహన కల్పిస్తారు. ముందస్తు రిజిస్ట్రేషన్ల వివరాలకు.. 94495 96039, 99490 94730. 15న పాలేకర్ ఫైవ్ లేయర్ క్షేత్ర సందర్శన వికారాబాద్ జిల్లా థారూరు మండలం బూరుగడ్డ గ్రామంలో సేవ్ స్వచ్ఛంద సంస్థ సంస్థ వ్యవస్థాపకులు విజయరామ్ సుభాశ్ పాలేకర్ కృషి (ఎస్.పి.కె.) పద్ధతిలో అభివృద్ధి చేసిన ఐదు అంతస్థుల ఉద్యాన పంటల నమూనా క్షేత్రాన్ని డిసెంబర్ 15 (శుక్రవారం)న ఉ. 10.–సా.5 వరకు పద్మశ్రీ పురస్కార గ్రహీత సుభాశ్ పాలేకర్ సందర్శిస్తారు. ప్రతి అంశం వెనుక గల శాస్త్రీయతను పాలేకర్ వివరిస్తారు. 4 రాష్ట్రాల రైతులు పాల్గొంటున్నారు. ప్రసంగం తెలుగు అనువాదం ఉంటుందని విజయరామ్ తెలిపారు. 3 కి.మీ. నడవగలిగిన వారే రావాలి. భోజన ఏర్పాట్లు ఉన్నాయి. నేరుగా వచ్చే వారికి ప్రవేశ రుసుం రూ. 100. హైదరాబాద్ రామకృష్ణమిషన్ దగ్గర గల సేవ్ కార్యాలయం నుంచి బస్సులో వెళ్లే వారికి రూ. 500. ముందస్తు రిజిస్ట్రేషన్ తప్పనిసరి. వివరాలకు.. 63091 11427. (చదవండి: ప్రపంచానికి చిరుధాన్యాల సత్తా చాటిన భారత్ !) -
ఢిల్లీ జీ 20 దేనికి? దాని ఉద్దేశాలు ఏంటి?
సాక్షి, ఢిల్లీ: జీ 20 అంటే గ్రూప్ ఆఫ్ 20. పరస్పర ఆర్థిక సహకారం కోసం ఈ గ్రూపు 1999లో అవతరించింది . 1999లో నెలకొన్న ఆర్థిక సంక్షోభం నేపథ్యంలో అగ్ర దేశాల మధ్య ఆర్థిక సహకారం కోసం ఈ గ్రూప్ 20 ఏర్పాటు చేశారు . ఈ గ్రూపులో 19 దేశాలతో పాటు యూరోపియన్ యూనియన్ సభ్యులు. అర్జెంటీనా, ఆస్ట్రేలియా, బ్రెజిల్, కెనడా, చైనా, ఫ్రాన్స్, జర్మనీ, ఇండియా, ఇండోనేషియా, ఇటలీ, జపాన్, కొరియా, మెక్సికో, టర్కీ, రష్యా, సౌదీ అరేబియా, దక్షిణ ఆఫ్రికా, యునైటెడ్ కింగ్డమ్, అమెరికా తోపాటు యూరోపియన్ యూనియన్ సభ్యులుగా ఉన్నారు. అనతి కాలంలోనే , ఇది కేవలం ఆర్థిక అంశాలపైనే కాకుండా తన ఎజెండాను విస్తరించుకుంది. కొత్తగా వాణిజ్యం, సుస్థిర అభివృద్ధి, ఆరోగ్యం, వ్యవసాయం, ఇంధనం, పర్యావరణం, వాతావరణ మార్పులు, అవినీతి నిరోధక చర్యలు ఈ అంశాల పైన పరస్పరం సహకరించుకోవాలని నిర్ణయించుకున్నాయి. ఈ జీ20 దేశాల గ్లోబల్ జిడిపి ప్రపంచంలో 85% గా ఉంది. ప్రపంచ వ్యాపారంలో 75 శాతం ఈ దేశాల వాటా ఉంది. అలాగే ప్రపంచ జనాభాలో మూడింట రెండో వంతు జనాభా జి-20 ఈ దేశాల్లోని నివసిస్తుంది. అందుకే ఈ దేశాల సదస్సు ప్రపంచ దృష్టిని ఆకర్షిస్తుంది. లోపాలున్నాయ్ అయితే ఈ జీ 20 కి సొంత సచివాలయం లేకపోవడం ఒక పెద్ద మైనస్. 24 ఏళ్ల కిందట ఈ జీ 20 గ్రూప్ ను స్థాపించిన ఇప్పటికీ సెక్రటేరియట్ లేదు. ఈ గ్రూపు నిర్ణయాలను తప్పని సరిగా అమలు చేయాలని చట్టబద్ధత లేదు. ఈ సదస్సులో పరస్పర ఏకాభిప్రాయంతోనే నిర్ణయాలను తీసుకోవాల్సి ఉంటుంది. నిర్ణయాలను అమలు చేయకపోతే పెద్దగా ఎలాంటి ఆంక్షలు గాని శిక్షలు గాని లేవు. వసుధైక కుటుంబం అనే జి-20 సదస్సుకు భారత నాయకత్వం వసుదైవక కుటుంబం అనే నినాదంతో జి20 సదస్సుకు భారత నాయకత్వం వహిస్తోంది. ప్రపంచమంతా కుటుంబం అనే భావన మన సంస్కృతిలో ఉంది అనే అంశాన్ని తెలియజేసే క్రమంలో భాగంగా ఈ నినాదాన్ని దీనికి ట్యాగ్‌లైన్ గా ఉంచారు. ఒకే ధరిత్రి, ఒకే కుటుంబం, ఒకే భవిష్యత్తు అనే లక్ష్యంతో జి20 సదస్సును భారత నిర్వహిస్తోంది. భారత సంస్కృతి సాంప్రదాయాల్లోని విలువల ఆధారంగానే ఈ జి20 శిఖరాగ్ర సదస్సును ఏర్పాటు చేశారు. ప్రపంచ దేశాలన్నీ కలిసికట్టుగా నిర్ణయాలు తీసుకుంటూనే ఈ ధరిత్రి సురక్షితంగా ఉంటుందని సందేశాన్ని భారత్ ఈ సందర్భంగా ప్రపంచానికి చాటుతోంది. ప్రతి ఏడాది రొటేషన్ పద్ధతిలో ఒక సభ్య దేశం g20 కి నాయకత్వం వహిస్తోంది. అందులో భాగంగా గత డిసెంబర్ నుంచి భారత్ ఈ గ్రూప్ కు చైర్మన్ గా వ్యవహరిస్తోంది. భారత్ జి20 చైర్మన్‌గా కొనసాగుతూ సభ్య దేశాలతో సంప్రదింపులు జరుపుతోంది.ప్రత్యేక సెక్రటేరియట్ ఏర్పాటు చేసి సభ్య దేశాలతో ఏడాది పొడవున సమావేశాలు నిర్వహించింది. ఫైనల్ గా సెప్టెంబర్ 9 10 తేదీల్లో శిఖరాగ్ర సదస్సును నిర్వహిస్తుంది. ఏడాది జి20 చైర్మన్‌గా భారత్ రెండు ట్రాక్ ల పై ప్రధానంగా పని చేసింది.. ఒకటి ఫైనాన్షియల్ ట్రాక్, రెండోది షేర్పా ట్రాక్. ఆర్థిక అంశాలపై ఆయా దేశాల ఆర్థిక మంత్రులు నేరుగా చర్చలు జరుపుతారు. షేర్పా ట్రాక్ వర్కింగ్ గ్రూప్ లో వివిధ శాఖలకు సంబంధించిన మంత్రులు ఏడాది పొడవున వివిధ సదస్సులు నిర్వహిస్తారు. ఇవే కాకుండా ఎంగేజ్మెంట్ గ్రూప్స్ ద్వారా సివిల్ సొసైటీస్, పార్లమెంటేరియన్స్ ,బ్థింక్ ట్యాంక్స్, మహిళ ,యువత, లేబర్, బిజినెస్, రీసర్చ్ తో ఈ గ్రూప్ 20 చర్చలు జరుపుతుంది వీటిని ఎంగేజ్మెంట్ గ్రూప్స్ గా పిలుస్తారు. ఈ జీ20 సదస్సును భారత్ తన ప్రతిష్టను ఇనుమడింపజేసుకునేందుకు ఉపయోగించుకుంటుంది. ప్రపంచంలో ఐదో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఎదిగిన భారత్ అతి త్వరలోనే మూడో స్థానానికి ఎదగాలని లక్ష్యాన్ని నిర్దేశించుకుంది. దీనికి అవసరమైన సహకారాన్ని జి20 సదస్సు ద్వారా భారత్ పొందనుంది. గతంలో ప్రపంచంలోనే అత్యంత సంపన్న దేశంగా వెలుగొందిన భారత్, త్వరలోనే అభివృద్ధి చెందిన దేశంగా అవతరిస్తుందని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. రష్యా , చైనా దేశాల అధ్యక్షుల గైర్హాజరు దేనికి సంకేతం ? రష్యా అధ్యక్షుడు పుతిన్, చైనా అధ్యక్షుడు జిన్ పింగ్ జి 20 శిఖరాగ్ర సదస్సుకు హాజరు కావడం లేదు. ఈ రెండు దేశాల అధ్యక్షులు హాజరు కాకపోవడం వెనుక కారణాలపై రకరకాల చర్చలు జరుగుతున్నాయి. రష్యా ఉక్రెయిన్ యుద్ధం నేపథ్యంలో అమెరికా సహా పాశ్చాత్య దేశాల వైఖరిపై అధ్యక్షుడు పుతిన్ పై తీవ్ర అసంతృప్తిగా ఉన్నారు. రష్యా సార్వభౌమాధికారాన్ని సవాల్ చేస్తున్న ఉక్రెయిన్ కు వెస్ట్ కంట్రీస్ అండగా నిలబడడంపై ఆగ్రహంగా ఉన్నారు. అలాగే ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ జస్టిస్ పుతిన్ పై యుద్ధ నేరాలకు గాను అరెస్ట్ ఆఫ్ వారెంట్ జారీ చేసింది. మరోవైపు రష్యాలో సైతం అంతర్గతంగా పరిస్థితులు కత్తి మీద సాములా ఉన్నాయి. ఇటీవల పుతిన్ తిరుగుబాటుదారు ప్రిగోజిన్ విమాన ప్రమాదంలో మృతిచెందారు. ఇలాంటి సున్నిత పరిస్థితుల మధ్యలో ఉతిన్ రష్యా దాటి బయటికి వచ్చే సాహసం చేయడం లేదు ఆయన బదులుగా విదేశాంగ శాఖ మంత్రి లాబ్రోస్ను G20 సదస్సుకు పంపుతున్నారు. తమ దేశ ప్రయోజనాలకు వ్యతిరేకంగా రష్యా ఉక్రెయిన్ యుద్ధం పై జి20 డిక్లరేషన్ చేస్తే దాన్ని బ్లాక్ చేస్తామని ఆయన ఇప్పటికే ప్రకటించారు. మరోవైపు చైనా అధ్యక్షుడు జింపింగ్ సైతం తన బదులు ప్రీమియర్ కి లియాంగును జి20 సదస్సుకు పంపుతున్నారు. ఈ రెండు ప్రముఖ దేశాల అధ్యక్షులు g20 సదస్సుకు డుమ్మా కొట్టడం వెనుక పాశ్చాత్య దేశాల వైఖరి కారణం అనే చర్చ జరుగుతుంది. అలాగే చైనా కూడా ఇటీవల కాలంలో అరుణాచల్ ప్రదేశ్ ను తన మ్యాప్ లో చూపించడం, లద్దక్ సరిహద్దుల్లో దురాక్రమణులకు ప్రయత్నించడాన్ని భారత్ తిప్పికొట్టింది. ఈ పరిణామాలు నేపథ్యంలో జిన్ పింగ్ జి20 సదస్సుకు ముఖం చాటేస్తున్నారు. సర్వాంగ సుందరంగా ఢిల్లీ జి20 సదస్సుకు ఢిల్లీని సర్వాంగ సుందరంగా ముస్తాబు చేశారు. పచ్చదనం పరిశుభ్రత పెద్దపీట వేశారు. రోడ్లకు ఇరువైపులా ల్యాండ్ స్కేపింగ్ చేసి చూడముచ్చటగా తీర్చిదిద్దారు. ఢిల్లీ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి జి20 సదస్సు జరిగే భారత మండపం వరకు పరిసరాలన్నిటిని అలంకరించారు. కోట్ల రూపాయల ఖర్చుపెట్టి భారత ప్రతిష్టను చాటేలా తయారు చేశారు. రోడ్లకు ఇరువైపులా జి20 దేశాల జెండాలు నిలబెట్టారు. భారతదేశ కళావైభవ చిహ్నాలు అన్నిటిని రోడ్ల ముఖ్య కూడలిలో అందంగా అమర్చారు. వివిధ రాష్ట్రాలకు సంబంధించిన కళారూపాల ఫ్లెక్సీలను విమానాశ్రయం వద్ద ప్రదర్శన గా పెట్టారు. ఢిల్లీకి వచ్చే అతిధులకు కనుల విందుగా పరిసరాలన్నిటిని అద్భుతంగా తీర్చిదిద్దారు. ప్రపంచ స్థాయి ప్రమాణాలకు అనుగుణంగా ఈ డెకరేషన్స్ చేశారు. జీ 20 సదస్సును ప్రగతి మైదాన్ లోని భారత మండపంలో నిర్వహిస్తున్నారు. కర్ణాటక బసవేశ్వరుడి అనుభవం మండపం స్ఫూర్తితో భారత మండపం అని నామకరణం చేశారు. దాదాపు 3 వేల కోట్ల రూపాయలతో ఈ భారత మండపం నిర్మాణం జరిగింది. భారతదేశానికి సంబంధించిన సంస్కృతి కళా వైభవాన్ని ఉట్టిపడేలా భారత మండపాన్ని తీర్చిదిద్దారు. దాదాపు 25 అడుగుల ఎత్తు ఉన్న నటరాజ విగ్రహాన్ని ఈ మండపంలో ప్రత్యేకంగా ప్రతిష్టించారు. ఈ మండపం మొత్తానికి ఇదే ఒక పెద్ద హైలెట్‌గా నిలవబోతోంది. దీనితోపాటు దేశంలోని వివిధ రాష్ట్రాలకు సంబంధించిన సాంస్కృతిక వారసత్వ వైభవ చిహ్నాలను ఇందులో అమర్చారు. ప్రజాస్వామ్యానికి భారతదేశమే తల్లి లాంటిది అనే విషయానికి గుర్తుగా మన ఋగ్వేదంలో ఉన్న విషయాలను ఇక్కడ ప్రత్యేకించి ఏర్పాటు చేశారు. బసవేశ్వరుడి అనుభవ మండపం కూడా ప్రజాస్వామ్య విలువలకు ఒక ప్రతిరూపంగా నిలుస్తుందని ఉద్దేశంతో ఆ పేరుతోనే ఈ అంతర్జాతీయ కన్వెన్షన్ సెంటర్ కి నామకరణం చేశారు. సాంస్కృతిక వైభవంతో పాటు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ను ఉపయోగించి అధునాతన సౌకర్యాలను ఈ భారత మండపంలో మేళవించారు. ఈ జీ20 సదస్సులో ఈ సమావేశ మందిరం భారత సంస్కృతికి ఒక ప్రతీక గా నిలవబోతోంది. జి 20 సదస్సుకు కనీవిని ఎరుగని భద్రత భారత్ అత్యంత ప్రతిష్టాత్మకంగా జీ20 శిఖరాగ్ర సదస్సును నిర్వహిస్తోంది. ఏ చిన్న ఆటంకం అంతరాయం లేకుండా అతిధులకు సౌకర్యాలు కల్పించేందుకు సమావేశాలు విజయవంతంగా జరిగేందుకు ప్రభుత్వం అన్ని రకాల ఏర్పాటు చేసింది. అతిధుల రక్షణ కోసం ప్రత్యేకంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ను ఉపయోగిస్తుంది. దాదాపు లక్షన్నరమంది సెక్యూరిటీ సిబ్బంది జి20 సదస్సు కోసం పనిచేస్తున్నారు. ప్రతి 100 అడుగులకు ఒక సాయుధ పోలీసును విధుల్లో ఉంచారు. సెప్టెంబర్ 8 9 10 తేదీల్లో సెంట్రల్ ఢిల్లీ పూర్తిగా లాక్ డౌన్ లో ఉండనుంది. ఈ ప్రాంతంలో ఉండే ప్రభుత్వ ప్రైవేటు కార్యాలయాలు , దుకాణాలు, మా, స్కూలు, కాలేజీలు అన్నిటిని మూసివేయాలని ఇప్పటికే ఆదేశాలు జారీ చేశారు. అమెరికా అధ్యక్షుడు జో బై డెన్ , బ్రిటిష్ ప్రధాని రిషి సునాక్ సహా 24 దేశాధినేతలు సమావేశాలకు హాజరుకానున్నారు. వీరి భద్రత పోలీసులకు ఒక పెద్ద సవాల్ గా మారింది. ఇందుకోసం గత వారం రోజుల నుంచి పోలీసులు మాక్ డ్రిల్స్ నిర్వహిస్తున్నారు. ఆ మూడు రోజులు ఢిల్లీ లాక్ డౌన్ ? సెప్టెంబర్ 8 9 10 తేదీల్లో ఢిల్లీ అనధికారిక లాక్ డౌన్ లోకి వెళ్లబోతోంది. ఢిల్లీకి వచ్చే దాదాపు 100కు పైగా రైళ్లను ఈ మూడు రోజుల్లో రద్దు చేశారు. అలాగే విమాన రాకపోకలు సైతం రద్దు చేశారు. ఈ మూడు రోజులపాటు పరిమిత సంఖ్యలోనే విమానాలు రైళ్ల రాకపోకలు ఢిల్లీలో కొనసాగుతాయి. కీలక దేశాధినేతల రాకపోకలు నేపథ్యంలో అనేక ఆంక్షలను అమలు చేస్తున్నారు. సామాన్య ప్రజల రాకపోకలను నియంత్రిస్తున్నారు. ఇక సెంట్రల్ ఢిల్లీ పూర్తిగా శత్రు దుర్భేద్యంగా మారబోతోంది. కేవలం సెంట్రల్ ఢిల్లీలో నివసించేవారు మినహా మిగిలిన వారెవరిని సెంట్రల్ ఢిల్లీలోకి అనుమతించడం లేదు. దేశాధినేతల వాహనాల రాకపోకలకు ఎలాంటి ఆటంకం లేకుండా ఉండేందుకే ఈ మూడు రోజులపాటు ఆంక్షలు విధించినట్లు అధికార వర్గాలు వెల్లడించాయి. ఫైవ్ స్టార్ హోటల్స్ కిటకిట, ఖరీదైన కార్లకు గిరాకీ జి20 దేశాల అధినేతలు, ప్రపంచ ఆర్థిక సంస్థల నేతలు ఢిల్లీకి తరలి వస్తుండడంతో ఫైవ్ స్టార్ హోటల్స్ కిటకిటలాడుతున్నాయి. అమెరికా అధ్యక్షుడు జోబైడన్‌కు ఐటిసి మౌర్యలో బస ఏర్పాటు చేశారు. ఇప్పటికే ఆయా దేశాల ఇంటలిజెన్స్ సంస్థల అధికారులు ఢిల్లీకి చేరుకొని తమ అధినేతల రాకపోకల ఏర్పాటు చేసుకుంటున్నారు. ఈ సదస్సు కోసం ప్రత్యేకించి వేల సంఖ్యలో ఖరీదైన బీఎండబ్ల్యూ మెర్సిడెస్ బెంజ్ లాంటి కార్లను ఉపయోగిస్తున్నారు. ప్రతిరోజు ఒక్కో కారు కోసం లక్ష రూపాయల అద్దె చెల్లించడానికి కూడా ప్రభుత్వం వెనకాడడం లేదు. హిందీ ఇంగ్లీష్ మాట్లాడగలిగే డ్రైవర్లను ఇందులో నియమిస్తున్నారు. జి20 కి కోతల బెడద సెంట్రల్ ఢిల్లీ అంటేనే కోతుల బెడద అధికం. ఎంపీల ఇళ్ల వద్ద, ప్రభుత్వ కార్యాలయాల వద్ద వేల సంఖ్యలో ఈ కోతులు నానా హంగామా చేస్తుంటాయి. జి20 సదస్సు కోసం ఢిల్లీని లాక్ డౌన్ చేస్తున్న కోతులను కట్టడి చేయడం అంత ఈజీ కాదు. ఎందుకోసం అధికారులు ప్రత్యేక చర్యలు తీసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. వేల సంఖ్యలో ఉన్న కోతుల తండాను నియంత్రించేందుకు కొండముచ్చులను రంగంలోకి దింపుతున్నారు. అలాగే కొండముచ్చుల అరిచే సిబ్బందిని వీటికోసం నియమించారు. హోటల్లు ప్రభుత్వ కార్యాలయాలు, చారిత్రక ప్రదేశాలు, వివిఐపీలు ఉండే నివాసస్థలాల దరిదాపుల్లోకి ఈ కోతులు రాకుండా ఉండేందుకు ప్రత్యేక సిబ్బందిని రంగంలోకి దించారు. సెంట్రల్ ఢిల్లీలో కోతులను శాశ్వతంగా పారదోలే ఉపాయం లేకపోవడంతో తాత్కాలికంగా కొండముచ్చులతో వాటిని బయటకు రాకుండా భయపెడుతున్నారు. :::నాగిళ్ళ వెంకటేష్ సాక్షి టీవీ డిప్యూటీ ఇన్ పుట్ ఎడిటర్, న్యూఢిల్లీ -
ఇండియన్ ఎకానమీకి వచ్చే పదేళ్లు అద్భుతం: నందన్ నీలేకని
న్యూఢిల్లీ: భారత్ రానున్న పది సంవత్సరాల్లో ‘‘కీలకమైన ఆర్థిక క్రియాశీలత’’ను ప్రదర్శించనుందని ఇన్ఫోసిస్ టెక్నాలజీస్ సహ వ్యవస్థాపకులు, చైర్మన్ నందన్ నీలేకని అభిప్రాయపడ్డారు. ప్రజాస్వామ్యయుతమైన రీతిలో విస్తృత ప్రాతిపదికన, ప్రజలందరి భాగస్వామ్యంతో ఈ క్రియాశీలత ఉంటుందని కూడా ఆయన విశ్లేషించారు. డిజిటల్ కామర్స్ కోసం ఓపెన్ నెట్వర్క్ (ఓఎన్డీసీ), రికార్డ్ అగ్రిగేటింగ్ సిస్టమ్, వస్తు సేవల పన్ను (జీఎస్టీ), ఫాస్ట్‌ట్యాగ్, ఈ-వే బిల్లుల వంటి ప్రభుత్వ చర్యలు భారత్ ఆర్థిక వృద్ధి బాటన దోహదపడే అంశాలుగా వివరించారు. కార్నెగీ ఇండియా నిర్వహించిన బల్ టెక్నాలజీ సమ్మిట్ 7వ సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. 2014లో 60 కోట్ల మందికి ఆధార్ గుర్తింపు ఉంటే, ప్రస్తుతం 130 కోట్ల మంది భారతీయులకు ఈ ఐడీలు ఉన్నట్లు పేర్కొన్నారు. ఇది దేశంలో ఎక్కడైనా ఉపయోగించగల ఆన్లైన్ ఐడీ అని పేర్కొంటూ, బయోమెట్రిక్స్, ఓటీపీల ద్వారా ఒక వ్యక్తి ప్రమాణీకరణకు ఇది దోహదపడుతుందని అన్నారు. (టీవీఎస్ అపాచీ స్పెషల్ ఎడిషన్, న్యూ లుక్ చూస్తే ఫిదానే!) ఇవీ చదవండి: అమెజాన్‌కు ఏమైంది? వారంలో మూడో బిజినెస్‌కు బై..బై..! ఎన్డీటీవీ: ప్రణయ్ రాయ్, రాధిక గుడ్‌బై, కేటీఆర్ రియాక్షన్ -
చైనా నుంచి భారత్‌కు పెను సవాళ్లు
వాషింగ్టన్: భారత్‌కు ప్రధానంగా డ్రాగన్ దేశం చైనా నుంచి పెనుసవాళ్లు ఎదురవుతున్నాయని అగ్రరాజ్యం అమెరికా వెల్లడించింది. వాస్తవాధీన రేఖ(ఎల్ఏసీ) వద్ద చైనా దుందుడుకు వైఖరి భారత్‌కు ఆందోళకరంగా పరిణమిస్తోందని పేర్కొంది. ఈ మేరకు ఇండో–పసిఫిక్ ప్రాంతంతో వ్యూహాత్మక భాగస్వామ్యంపై జో బైడెన్ ప్రభుత్వ విధానాన్ని వివరిస్తూ శ్వేతసౌధం తన తొలి నివేదికను శుక్రవారం విడుదల చేసింది. ఇండో–పసిఫిక్ ప్రాంతంలోని ప్రభావవంతమైన దేశం భారత్‌తో వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని మరింత పెంపొందించుకుంటామని నివేదికలో తెలియజేసింది. రెండు దేశాలు కలిసి పని చేస్తాయని అభిప్రాయపడింది. దక్షిణాసియాలో అస్థిరతకు చరమగీతం పాడాల్సిన అవసరం ఉందని తెలిపింది. ఆరోగ్యం, అంతరిక్షం, సైబర్‌స్పేస్ తదితర కీలక రంగాల్లో అమెరికా, భారత్ పరస్పరం సహకరించుకోవాలని సూచించింది. ఆర్థిక, సాంకేతిక పరిజ్ఞానం విషయంలో సహకారాన్ని మరింత ముందుకు తీసుకెళ్లాలని శ్వేతసౌధం తెలిపింది. ఇండో–పసిఫిక్ ప్రాంతంలో స్వేచ్ఛా వాణిజ్యానికి తలుపులు తెరవాల్సిన అవసరం ఉందని నొక్కి చెప్పింది. ఈ ప్రాంతంలో భారత్ ప్రబలమైన శక్తిగా ఎదిగేందుకు మద్దతిస్తామని ప్రకటించింది. భారత్ నాయకత్వ స్థానానికి చేరుకోవాలని ఆకాంక్షించింది. భారత్ తమ భాగస్వామ్య దేశమని ఉద్ఘాటించింది. దక్షిణాసియా, హిందూ మహాసముద్ర ప్రాంతంలో భారతే పెద్దన్న అని స్పష్టం చేసింది. ఇండియాతో కలిసి పనిచేస్తాం.. ఆస్ట్రేలియా, తదితర దేశాల తరహాలో కాకుండా భారత్ భౌగోళికంగా కీలకమైన స్థానంలో ఉందని, పొరుగు దేశం చైనా నుంచి పెనుసవాళ్లు ఎదురవుతున్నాయని వైట్‌హౌజ్ సీనియర్ అధికారి ఒకరు చెప్పారు. ఎల్ఏసీ వద్ద చైనా ప్రవర్తన భారత్‌పై తీవ్ర ప్రభావం చూపుతున్న మాట వాస్తమేనని అన్నారు. గత ప్రభుత్వ(డొనాల్డ్ ట్రంప్ సర్కారు) హయాంలో భారత్–అమెరికా మధ్య సంబంధాలు చెప్పుకోదగిన స్థాయిలో విస్తృతమయ్యాయని గుర్తుచేశారు. ఈ సంబంధాలను మరింత పటిష్టం చేసుకోవాలని బైడెన్ ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉందని తెలిపారు. తమలాగే మరో ప్రజాస్వామ్య దేశమైన ఇండియాతో కలిసి పనిచేసే విషయంలో ఎన్నో అవకాశాలు కళ్లెదుట కనిపిస్తున్నాయని వ్యాఖ్యానించారు. ఇండో–పసిఫిక్ ప్రాంతంలో ఇండియాతోపాటు ఇండోనేషియా, మలేసియా, మంగోలియా, న్యూజిలాండ్, సింగపూర్, తైవాన్, వియత్నాం, పసిఫిక్ దీవులతో సంబంధాలను మెరుగుపర్చుకోవడంపై ప్రత్యేకంగా దృష్టి పెట్టినట్లు పేర్కొన్నారు. ఆస్ట్రేలియాలోని మెల్బోర్న్లో ‘క్వాడ్’ మినిస్టీరియల్ సదస్సు జరిగిన రోజే ‘ఇండో–పసిఫిక్ ప్రాంతంతో వ్యూహాత్మక భాగస్వామ్యం’పై బైడెన్ ప్రభుత్వం తొలి నివేదికను విడుదల చేయడం విశేషం. -
సంక్రాంతి వచ్చింది తుమ్మెద సరదాలు తెచ్చిందే తుమ్మెద ...
భారతదేశంలోని హిందూ పండుగల్లో అత్యంత ముఖ్యమైన పండుగ. పైగా అందరూ ఎంతో అంగ రంగ వైభవంగ జరుపుకునే పండుగ. కొన్ని పండుగలకు బంధువుల కచ్చితంగా వస్తారని చెప్పలేం. కానీ ఈ పండుగకు మాత్రం ఎక్కడెక్కడి వాళ్లో ఒకగూటికి చేరి కబుర్లు చెప్పుకుంటూ ఆనందంగా గడుపుతారు. అందులోనూ మనదేశంలో ఈ పండుగకు మాత్రం ఎక్కడెక్కడో ఉన్నావాళ్లు తమ సోతూళ్లకి వెళ్లి చేసుకోవాలనుకుంటారు. మాములుగా ఇతర పండుగల్ని సాధారణంగా చేసుకుంటారేమో గానీ ఈ పండుగను మాత్రం తమకు ఉన్నంత మేరలో పండుగను చేసుకునేందుకు తాపత్రయపడతారు. పెద్దలు దగ్గర నుంచి చిన్న పిల్లల వరకు అందర్ని దగ్గరి చేసి అప్యాయత అనురాగాల మేళవింపు ఈ సంక్రాంతి అని చెప్పవచ్చు. అయితే అసలు సంక్రాంతి అంటే ఏమిటి? ప్రాముఖ్యత ఏమిటో చూద్దాం!. సంక్రాంతి ప్రాశస్యం... ‘సరతి చరతీతి సూర్యః’ అనగా సంచరించువాడు సూర్యుడు. భాస్కరుని సంచారం రెండు విధాలుగా ఉంటుంది. ఒకటి ఉత్తరాయణం, రెండోది దక్షిణాయణం. మనకు ఒక సంవత్సరకాలం దేవతలకు ఒక్క రోజు. ‘ఆయనే దక్షిణే రాత్రిః ఉత్తరేతు దివా భవేత’ అంటే ఆరుమాసాల ఉత్తరాయణ కాలం దేవతలకు పగలు దక్షిణాయణ కాలం వారికి రాత్రిగా పురాణలు చెబుతున్నాయి. సంక్రాంతి’ లేదా ‘సంక్రమణం’ అంటే ‘చేరడం’ లేదా ‘మారడం’ అని అర్థం. సూర్యుడు మేషాది ద్వాదశ రాశులందు క్రమంగా పూర్వరాశి నుంచి ఉత్తర రాశిలోకి ప్రవేశించడమే సంక్రాంతి. ఇతిహసాల ప్రకాం సూర్య భగవానుడు తన పుత్రుడైన శని భగవానుడి (మకర రాశికి అధిపతి) ఇంటికి స్వయంగా వెళ్ళి ప్రపంచానికి తండ్రి కుమారుల అనుబంధాన్ని చాటి చెప్పిన రోజు ఇది. అంతేకాదు రవి మకర రాశిలో ప్రవేశించినపుడు ఎవడైతే స్నానం చేయడో అలాటి వాడు ఏడు జన్మలు రోగిగా, దరిద్రునిగా ఉండిపోతాడని భావం. ఎందుకు జరుపుకుంటాం... సూర్యుడు పయనించే దిక్కును బట్టి భూమిపై వాతావరణంలో మార్పులు సంభవిస్తాయి. సూర్యుడు సంవత్సరంలో ఆరు నెలలు దక్షిణం వైపు మరో ఆరు నెలలు ఉత్తరం వైపు పయనిస్తూ ఉంటాడు. మానవులు రాత్రులు నిద్రపోయి పగలు ఏ విధంగా మేలుకుంటారో అలాగే దేవతలు కూడా ఉత్తరాయణం నందు మేలుకొని ఉంటారని, వారు మేలుకొని ఉండగా అడిగిన కోర్కెలు వెంటనే తీరుస్తారని భక్తుల నమ్మకం. అందుకే పెద్దలు ఈ విషయం అందరికీ తెలియజేయడం కోసం ఈ పండుగను జరపడం మొదలుపెట్టారు. ఈ రోజునుంచి స్వర్గ ద్వారాలు తెరిచి ఉంటాయని పురాణాలు పేర్కొన్నాయి. ఎందుకంటే ఈ మకర సంక్రమణం దేవతలకు పగటి కాలం కావడమే ప్రధాన కారణం. ప్రతీ సంక్రమణానికీ పితృతర్పణాలు ఇవ్వాలి. ఐతే పదకొండు సంక్రమణాల్లో ఇవ్వకపోయినా, ఈ మకర సంక్రమణం సందర్భంగా మాత్రం తప్పకుండా పితృతర్పణాలు ఇస్తారు. ఉత్తరాయణ పుణ్యకాలమైన సంక్రాంతి రోజున చేసే ఏ దానమైనా శ్రేష్టమైందని ఆర్యోక్తి. ఉత్తరాయణ కాలంలో చేసే దానాలలో ధాన్యం, ఫలాలు, విసనకర్ర, వస్త్రం, కాయగూరలు, దుంపలు, నువ్వులు, చెరకు మొదలైనవి ఉత్తమమైనవి. దేశమంతటా విభిన్నరీతుల్లో జరుపుకోబడే ఈ 'పెద్ద పండుగ' ప్రతి విభిన్నతలోనూ ఒక విశిష్టతని కనబరుస్తోంది. కేవలం ఆధ్యాత్మిక దృష్టి, ఉపాసనా ప్రశస్తి మాత్రమే కాక, కుటుంబపరమైన అనుబంధాలకీ, సామాజికపరమైన సమైక్యతకు ఈ పండుగ వేదిక. అసలు మన సంస్కృతిలో చాలా పండుగలు ఆధ్యాత్మిక ప్రాధాన్యంతో పాటు, వ్యక్తి సర్వతోముఖ వికాసానికి ఆలంబనగా ఉంటాయి. ప్రాంతాల వారిగా జరపుకునే విధానం.. ఆంధ్రులకు, తమిళులకు పెద్ద పండుగ సంక్రాంతి. ఇది కొన్ని ప్రాంతాలలో మూడు రోజులు ( భోగి, మకర సంక్రమణం, కనుమ) కొన్ని ప్రాంతాలలో నాలుగు రోజులు (నాలుగోరోజు ముక్కనుమ ) జరుపుతారు కావున దీన్ని పెద్ద పండుగ అంటారు. ముఖ్యంగా పంట చేతికొచ్చిన ఆనందంలో రైతులు ఈ పండుగ జరుపుకుంటారు కాబట్టి రైతుల పండుగగా కూడా దీన్ని అభివర్ణిస్తారు. అంతేకాదు ఈ పండుగ రోజున గాలిపటాలు ఎగరువేయడం కొన్ని చోట్ల ఆచారం. ఏది ఏమైన ఈ కరోనా మహమ్మారితో ప్రజలంతా సామాజిక దూరాన్ని పాటిస్తూ జరుపుకోవాల్సి రావడం ఒకింత బాధకరం. -
పాసైతేనే పైతరగతికి!
సాక్షి, మంచిర్యాల : పాఠశాల విద్యా వ్యవస్థలో పలు కీలక మార్పులు రానున్నాయి. వ్యవస్థలో ఉన్న లోపాలను సరి చేసి.. విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించేందుకు కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. ముందుగా విద్యాహక్కు చట్టంలో ఉన్న లోపాలను సరిదిద్దే పనిలో పడింది. ఈ క్రమంలో ఒకటి నుంచి ఏడో తరగతి వరకు చదివిన ప్రతీ విద్యార్థి ఉత్తీర్ణత పొందితేనే పైతరగతికి పంపాలని యోచిస్తోంది. మధ్యలో చదువు మానేసినా.. సదరు విద్యార్థి ఏ తరగతిలో చదువు ఆపారో ఆ తరగతిలోనే చేరే విధంగా సంస్కరణలు అమలులోకి తేబోతోంది. ప్రాథమిక విద్యే వ్యక్తి భవిష్యత్‌కు కీలకమని భావించిన కేంద్ర ప్రభుత్వం పాఠశాల విద్యను బలోపేతం చేస్తేనే అతడికి ఉజ్వల భవిష్యత్ ఉంటుందని భావిస్తోంది. ఇప్పటికే విద్యాహక్కు చట్టాన్ని సవరించడంతో పాటు నూతన బిల్లుకు రూపకల్పన చేసింది. కేంద్ర నిర్ణయాన్ని ఉపాధ్యాయ వర్గాలు స్వాగతిస్తున్నాయి. ‘కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని ఇప్పటికే 14 రాష్ట్రాలు అంగీకరించాయి. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వమూ కేంద్ర నిర్ణయంపై సానుకూలంగా స్పందించింది. ఇది అమలైతే పాఠశాలల్లో విద్యాప్రమాణాలు పెరగడంతో పాటు విద్యార్థులకు నాణ్యమైన విద్య అందుతుంది’ అని టీయూటీఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు ఎం.స్వామిరెడ్డి అభిప్రాయపడ్డారు. మార్పునకు కారణాలివే! ఇరవై ఏళ్ల క్రితం.. సర్కారు పాఠశాలల్లో ఒకటి నుంచి ఎనిమిదో తరగతి వరకు విద్యార్థులు కింది స్థాయి తరగతిలో ఉత్తీర్ణత సాధిస్తేనే (వార్షిక పరీక్షల్లో 35 మార్కులొస్తేనే) పై తరగతికి వెళ్లేవారు. ఆ తర్వాత ప్రభుత్వాలు విద్యార్థులపై చదువు ఒత్తిడి త గ్గించాలనే ఉద్దేశంతో.. ఆయా తరగతుల్లో ఉత్తీర్ణత పొందకున్నా ప్రతీ ఒక్కరిని పై తరగతులకు పంపాలని నిర్ణయించాయి. ఇప్పటికీ ఇదే అమలవుతూ వస్తోంది. చదివినా.. చదవకున్నా పాసవుతామనే ఉద్దేశంతో చాలా పాఠశాలల్లో విద్యార్థులు చదువుపై ఆసక్తి చూపడం లేదు. విద్యాప్రమాణాలతో పాటు ఫలితాలూ పడిపోతున్నాయి. ఉపాధ్యాయుల పాత్ర నామమాత్రంగా ఉంటోంది. విద్యార్థుల తల్లిదండ్రులూ ఎలాగైనా పైతరగతికి వెళ్తారనే ఉద్దేశంతో తమ పిల్లల చదువుపై అశ్రద్ధ చూపుతున్నారు. టీసీలు లేకున్నా ప్రవేశం! విద్యాహక్కు చట్టం ప్రకారం.. 6-14 సంవత్సరాల వయస్సు ఉన్న ప్రతీ ఒక్కరు స్కూళ్లో ఉండాలనే నిబంధన ఉండడంతో మూడో తరగతి (ఉదాహరణ) చదివి బడిమానేసి మూడేళ్ల తర్వాత మళ్లీ స్కూల్‌కు వచ్చిన విద్యార్థులకు టీసీలు లేకున్నా వారి వయస్సు (ఆధార్ కార్డును చూసి)కు తగ్గట్లు నేరుగా ఆరో తరగతిలో ప్రవేశం కల్పిస్తున్నారు. ప్రధానోపాధ్యాయులు ఆ ఆదేశాలు అనుసరిస్తూ వస్తున్నారు. టీసీ సమస్య లేకపోవడంతో.. పలుచోట్ల విద్యార్థులు ఇష్టం వచ్చినప్పుడల్లా స్కూళ్లు మారుతున్నారు. ప్రైవేట్‌లో చేరి.. ఫీజులు చెల్లించలేక విద్యా సంవత్సరం మధ్యలోనే ప్రభుత్వ పాఠశాలల్లో చేరుతున్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో చేరిన కొందరు పుస్తకాలు, యూనిఫాంలు తీసుకున్న తర్వాత ప్రైవేట్ స్కూళ్లలో చేరుతున్నారు. ఏదేమైనా పై నిబంధనలతో మధ్యలో చదువు మానేసి తిరిగి స్కూళ్లో చేరిన విద్యార్థులు అంతంత జ్ఞానంతోనే చదువులు ముగించి తొమ్మిదో తర గతిలో అడుగుపెడ్తున్నారు.