సాక్షి, మంచిర్యాల : పాఠశాల విద్యా వ్యవస్థలో పలు కీలక మార్పులు రానున్నాయి. వ్యవస్థలో ఉన్న లోపాలను సరి చేసి.. విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించేందుకు కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. ముందుగా విద్యాహక్కు చట్టంలో ఉన్న లోపాలను సరిదిద్దే పనిలో పడింది. ఈ క్రమంలో ఒకటి నుంచి ఏడో తరగతి వరకు చదివిన ప్రతీ విద్యార్థి ఉత్తీర్ణత పొందితేనే పైతరగతికి పంపాలని యోచిస్తోంది.
మధ్యలో చదువు మానేసినా.. సదరు విద్యార్థి ఏ తరగతిలో చదువు ఆపారో ఆ తరగతిలోనే చేరే విధంగా సంస్కరణలు అమలులోకి తేబోతోంది. ప్రాథమిక విద్యే వ్యక్తి భవిష్యత్‌కు కీలకమని భావించిన కేంద్ర ప్రభుత్వం పాఠశాల విద్యను బలోపేతం చేస్తేనే అతడికి ఉజ్వల భవిష్యత్ ఉంటుందని భావిస్తోంది. ఇప్పటికే విద్యాహక్కు చట్టాన్ని సవరించడంతో పాటు నూతన బిల్లుకు రూపకల్పన చేసింది.
కేంద్ర నిర్ణయాన్ని ఉపాధ్యాయ వర్గాలు స్వాగతిస్తున్నాయి. ‘కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని ఇప్పటికే 14 రాష్ట్రాలు అంగీకరించాయి. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వమూ కేంద్ర నిర్ణయంపై సానుకూలంగా స్పందించింది. ఇది అమలైతే పాఠశాలల్లో విద్యాప్రమాణాలు పెరగడంతో పాటు విద్యార్థులకు నాణ్యమైన విద్య అందుతుంది’ అని టీయూటీఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు ఎం.స్వామిరెడ్డి అభిప్రాయపడ్డారు.
మార్పునకు కారణాలివే!
ఇరవై ఏళ్ల క్రితం.. సర్కారు పాఠశాలల్లో ఒకటి నుంచి ఎనిమిదో తరగతి వరకు విద్యార్థులు కింది స్థాయి తరగతిలో ఉత్తీర్ణత సాధిస్తేనే (వార్షిక పరీక్షల్లో 35 మార్కులొస్తేనే) పై తరగతికి వెళ్లేవారు. ఆ తర్వాత ప్రభుత్వాలు విద్యార్థులపై చదువు ఒత్తిడి త గ్గించాలనే ఉద్దేశంతో.. ఆయా తరగతుల్లో ఉత్తీర్ణత పొందకున్నా ప్రతీ ఒక్కరిని పై తరగతులకు పంపాలని నిర్ణయించాయి.
ఇప్పటికీ ఇదే అమలవుతూ వస్తోంది. చదివినా.. చదవకున్నా పాసవుతామనే ఉద్దేశంతో చాలా పాఠశాలల్లో విద్యార్థులు చదువుపై ఆసక్తి చూపడం లేదు. విద్యాప్రమాణాలతో పాటు ఫలితాలూ పడిపోతున్నాయి. ఉపాధ్యాయుల పాత్ర నామమాత్రంగా ఉంటోంది. విద్యార్థుల తల్లిదండ్రులూ ఎలాగైనా పైతరగతికి వెళ్తారనే ఉద్దేశంతో తమ పిల్లల చదువుపై అశ్రద్ధ చూపుతున్నారు.
టీసీలు లేకున్నా ప్రవేశం!
విద్యాహక్కు చట్టం ప్రకారం.. 6-14 సంవత్సరాల వయస్సు ఉన్న ప్రతీ ఒక్కరు స్కూళ్లో ఉండాలనే నిబంధన ఉండడంతో మూడో తరగతి (ఉదాహరణ) చదివి బడిమానేసి మూడేళ్ల తర్వాత మళ్లీ స్కూల్‌కు వచ్చిన విద్యార్థులకు టీసీలు లేకున్నా వారి వయస్సు (ఆధార్ కార్డును చూసి)కు తగ్గట్లు నేరుగా ఆరో తరగతిలో ప్రవేశం కల్పిస్తున్నారు. ప్రధానోపాధ్యాయులు ఆ ఆదేశాలు అనుసరిస్తూ వస్తున్నారు.
టీసీ సమస్య లేకపోవడంతో.. పలుచోట్ల విద్యార్థులు ఇష్టం వచ్చినప్పుడల్లా స్కూళ్లు మారుతున్నారు. ప్రైవేట్‌లో చేరి.. ఫీజులు చెల్లించలేక విద్యా సంవత్సరం మధ్యలోనే ప్రభుత్వ పాఠశాలల్లో చేరుతున్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో చేరిన కొందరు పుస్తకాలు, యూనిఫాంలు తీసుకున్న తర్వాత ప్రైవేట్ స్కూళ్లలో చేరుతున్నారు. ఏదేమైనా పై నిబంధనలతో మధ్యలో చదువు మానేసి తిరిగి స్కూళ్లో చేరిన విద్యార్థులు అంతంత జ్ఞానంతోనే చదువులు ముగించి తొమ్మిదో తర గతిలో అడుగుపెడ్తున్నారు.
పాసైతేనే పైతరగతికి!
Published Mon, Dec 29 2014 3:02 AM | Last Updated on Thu, Jul 11 2019 5:01 PM
Advertisement