
'ఆకలి' దీనికి ఎవరూ అతీతులు కారు. ఆకలి వేస్తే రాజైనా.. అల్లాడిపోవాల్సిందే. ఆకలి విలువ తెలిసిన వ్యక్తి సాటి వాడిని ఆకలితో బాధపడేలా చేయడు. కనీసం ఓ బ్రెడ్ లేదా గుప్పెడు అన్నం అయిన ఇచ్చి ఆదుకునే యత్నం చేస్తాడు. ముఖ్యంగా మనదేశంలో ఆకలితో అల్లాడిపోతున్న పేద ప్రజలు ఎంతో మంది ఉన్నారు. అంతేగాదు అధికారిక లెక్కల ప్రకారం.. ఆకలి (Hunger) బాధితుల సంఖ్య 46 మిలియన్లు ఎగబాకినట్లు యునైటెడ్ నేషన్స్ ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్ నివేదికలు చెబుతున్నాయి. ఈ ఆకలిని అంతం చేసేలా పేదరికం నిర్మూలనకు నడుంకట్టేందుకు ఈ ఆకలి దినోత్సవాన్ని ఏర్పాటు చేశారు. ఈ దినోత్సవం ప్రాముఖ్యత ? విశేషాలు గురించి సవివరంగా తెలుసుకుందాం.
2011లో, ఆకలి, పేదరికాన్ని అంతం చేయడానికి ‘ది హంగర్ ప్రాజెక్ట్’ అనే లాభరహిత సంస్థ మే 28ని ‘ప్రపంచ ఆకలి దినోత్సవం’గా (World Hunger Day) ప్రకటించింది. ఈ రోజునఆహార భద్రతను ప్రోత్సహించే కమ్యూనిటీలను బలోపేతం చేయడం, పరిష్కారాలను కనుగొనడం వంటివి చేస్తుంది. ప్రతి ఏడాది ఓ థీమ్‌ని ఏర్పాటు చేసి ఆ దిశగా అభివృద్ధి కార్యక్రమాలను చేపడుతున్నారు అధికారులు. ఆకలితో అల్లాడుతున్న వారికి సాయం అందేలా ఏం చేయాలనే అనే అవగాహన కార్యక్రమాలను పెద్ద ఎత్తున చేపడతారు. ప్రపంచ వ్యాప్తంగా 811 మిలియన్ల మంది ఆకలి బాధతలో సతమతమవుతున్నట్లు నివేదికలు చెబుతున్నాయి.
ఈ ఏడాది థీమ్! "అభివృద్ధి చెందుతున్న తల్లులు, అభివృద్ధి చెందుతున్న ప్రపంచం" దీన్ని ఇతి వృత్తంగా తీసుకుని మహిళలు, తమ కుటుంబాలు సమాజాలు ఆహారభద్రతను నిర్థారించడంలో కీలకపాత్ర పోషిస్తాయని నొక్కి చెబుతోంది. యూఎన్ ప్రకారం బిలియన్ కంటే ఎక్కువ మంది మహిళలు, కౌమరదశలో ఉన్న బాలికలు పోషకాహార లోపాన్ని అనుభవిస్తున్నారు. ఈ పరిస్థితి తల్లులు, వారి పిల్లలు ఇరువురికి దారుణమైన పరిస్థితులున ఎదుర్కొనేలా చేస్తుంది. ముఖ్యంగా మహిళల ఆరోగ్యం, విద్య, ఆర్థిక అవకాశాలపై పెట్టుబడి పెట్టడం ద్వారా ఆకలి చక్రాన్ని విచ్ఛిన్నం చేసి, అభివృద్ధి చెందుతున్న సమాజాన్ని సృష్టించొచ్చు.
ప్రాముఖ్యత ..
ఈ రోజున ప్రతి ఒక్కరిని కార్యచరణకు పిలుపునిచ్చేలా..ఆహార భద్రతను ప్రోత్సహించే సంస్థలకు మద్దతు ఇవ్వడం, ఆహార భద్రతను ప్రోత్సహించే విధానాల కోసం కృషి చేయడం. తినే ఆహారానికి సంబంధించిన సరైన ప్రణాళికలు, ఆకలిని అంతం చేసేలా కృషి చేయడం తదితర కార్యక్రమాలను చేపడతారు. అందరూ కలిసి ఆరోగ్యంగా, సంతృప్తికరమైన జీవితాలను గడపడానికి అవసరమైన పౌష్టికాహారాన్ని పొందేలా సరికొత్త ప్రపంచాన్ని నిర్మించేలా చేయడం ఈ దినోత్సవం ముఖ్యోద్దేశం.
చేయాల్సినవి..
వ్యవసాయ అభివృద్ధి: రైతులు అవసరమైన వనరుల, సరైన శిక్షణ అందేలా చేయడం
విద్య: పేదరికం నిర్మూలించేలా విద్యకు ప్రాధాన్యత ఇవ్వడం
ఆరోగ్య సంరక్షణ: ఆకలి సంబంధితన అనారోగ్యాలను తగ్గుముఖం పట్టేలా ఆరోగ్య సంరక్షణ సేవలను మెరుగుపరచడం
ఆర్థిక సాధికారత: పేద ప్రాంతాలలో ఉద్యోగ అవకాశాలను సృష్టించడం, వస్థాపకతకు మద్దతు ఇవ్వడం.
(చదవండి: వరల్డ్ మెన్‌స్ట్రువల్ హైజీన్ డే : పీరియడ్స్ పరిశుభ్రత ముఖ్యం, లేదంటే చాలా ప్రమాదం)