వాతావరణ మార్పు వల్ల కరువు, వరదలు, అధిక ఉష్ణోగ్రతలు విరుచుకుపడుతున్న నేపథ్యం ఇది. పంటల సాగు, పశుపోషణ, ఆక్వా సాగులో రైతులు అనేక కష్టనష్టాలకు గురవుతున్న కలికాలం. మనతో పాటు సకల జీవరాశి మనుగడకు నేల, నీరే మూలాధారాలు. నేలను, నీటిని ప్రాణప్రదంగా పరిరక్షించుకుంటూనే సేద్యాన్ని కొనసాగించేలా ఐక్యరాజ్యసమితికి చెందిన వ్యవసాయ ఆహార సంస్థ (ఎఫ్.ఎ.ఓ.) ప్రజలు, రైతులను చైతన్యవంతం చేస్తూ పాలకులకు దిశానిర్దేశం చేస్తూ ఉంటుంది. రసాయనాల్లేకుండా, లోతుగా దుక్కి దున్నకుండా, ఒకటికి నాలుగు పంటలు కలిపి వేసుకోవటం ద్వారా పర్యావరణ అనుకూల వ్యవసాయ పద్ధతులను అనుసరించటం ద్వారా నేలను, నీటిని సంరక్షించుకోవటం సాధ్యమవుతుందని సమాజంలో ప్రతి ఒక్కరం గుర్తించాల్సిన తరుణం ఇది. మానవాళికి 95% ఆహారాన్ని అందిస్తున్న నేలలను పరిరక్షించుకోవాలన్న స్ఫూర్తిని కలిగించడానికి ప్రతి ఏటా డిసెంబర్ 5వ తేదీన ప్రపంచ నేలల లేదా భూముల దినోత్సవాన్ని ఎఫ్.ఎ.ఓ. నిర్వహిస్తోంది. ఈ ఏడాది నినాదం: ‘నేల, నీరే జీవరాశి అంతటికీ జీవనాధారం’! ఎఫ్.ఎ.ఓ. ఇంకా ఏం చెబుతోందో చదవండి..
ఈ నెల 8,10 తేదీల్లో విశాఖ ఆర్గానిక్ మేళా
గోఆధారిత ప్రకృతి వ్యవసాయదారుల సంఘం, ఏపీ ప్రభుత్వ రైతు సాధికార సంస్థ సంయుక్త ఆధ్వర్యంలో డిసెంబర్ 8,9,10 తేదీల్లో విశాఖపట్నంలోని ఆంధ్రా యూనివర్సిటీ ఇంజనీరింగ్ కాలేజ్ గ్రౌండ్స్‌లో సేంద్రియ/ప్రకృతి వ్యవసాయ ఉత్పత్తుల ప్రదర్శన, అమ్మకం మేళా జరగనుంది. విశాఖలో జరుగుతున్న నాలుగో వార్షిక ఆర్గానిక్ మేళా ఇది. 8న ఉ. 10 గంటలకు రైతుల సమ్మేళనం, 9న గ్రాడ్యుయేట్ రైతుల సదస్సు, 10న ఇంటిపంటలపై సదస్సు, 11న సేంద్రియ ఉత్పత్తుల వ్యాపారుల చర్చాగోష్ఠి జరుగుతుందని నిర్వాహకులు కుమారస్వామి తెలిపారు. వివరాలకు.. 78934 56163, 86862 24466.
11న ప్రకృతి సేద్య కార్యకర్తల సమావేశం
ప్రముఖ ప్రకృతి సేద్య నిపుణులు పద్మశ్రీ పురస్కార గ్రహీత సుభాశ్ పాలేకర్ డిసెంబర్ 11న ఉ.10 నుంచి. మ.1 గం. వరకు హైదరాబాద్ దోమల్‌గూడలోని రామచంద్రమిషన్‌లో ప్రకృతి వ్యవసాయ వ్యాప్తికి కృషి చేసే కార్యకర్తలు, స్వచ్ఛంద సంస్థల నిర్వాహకులతో ముచ్చటిస్తారు. పర్యావరణ సంక్షోభం నేపథ్యంలో ప్రకృతి వ్యవసాయాన్ని స్వతంత్ర ఉద్యమంగా గ్రామస్థాయిలో రైతుల్లో విస్తరింపజేయటంపై చర్చిస్తారు. వివరాలకు.. సేవ్ స్వచ్ఛంద సంస్థ: 63091 11427.
14 నుంచి పల్లెసృజన శోధాయాత్ర
ప్రకృతితో మమేకమై జీవించే గ్రామీణులు ముఖ్యంగా రైతులు, వృత్తిదారులు, కళాకారుల విజ్ఞానాన్ని తెలుసుకోవటం.. అజ్ఞాతంగా మిగిలిపోయిన గ్రామీణ ఆవిష్కరణలను వెలికితేవటమే లక్ష్యంగా పల్లెసృజన స్వచ్ఛంద సంస్థ శోధాయాత్రలు నిర్వహిస్తోంది. 47వ చిన్న శోధాయాత్ర అన్నమయ్య జిల్లా రాజంపేట నుంచి వెంకట రాజంపేట వరకు డిసెంబర్ 14 నుంచి 17 వరకు జరుగుతుంది. వలంటీర్లు కాలినడకన పయనిస్తూ ప్రజలతో ముచ్చటిస్తారు. ఆసక్తి గల వారు రిజిస్ట్రేషన్ చేసుకొని యాత్రలో పాల్గొనవచ్చు. వివరాలకు.. బ్రిగేడియర్ పి.గణేశం – 98660 01678, 99666 46276, 99859 19342.
9, 10 తేదీల్లో సుందర రామన్ శిక్షణ
తమిళనాడుకు చెందిన ప్రముఖ ప్రకృతి వ్యవసాయ నిపుణులు ఎస్.ఆర్. సుందర రామన్ డిసెంబర్ 9,10 తేదీల్లో సంగారెడ్డి జిల్లా సదాశివపేటలోని కామ్యవనంలో రైతులకు రెండు రోజుల పాటు శిక్షణ ఇవ్వనున్నారు. రసాయనాలతో సాగుచేస్తున్న భూమిని ప్రకృతి వ్యవసాయంలోకి ఎలా మార్చాలి? నేలలో సేంద్రియ కర్బనం ఎలా పెంచాలి? ఉద్యాన పంటలకు పిచికారీ లేకుండా సమగ్ర పోషకాలు ఎలా అందించాలి? వంటి అనేక ప్రకృతి సేద్య పద్ధతులపై రైతులకు అవగాహన కల్పిస్తారు. ముందస్తు రిజిస్ట్రేషన్ల వివరాలకు.. 94495 96039, 99490 94730.
15న పాలేకర్ ఫైవ్ లేయర్ క్షేత్ర సందర్శన
వికారాబాద్ జిల్లా థారూరు మండలం బూరుగడ్డ గ్రామంలో సేవ్ స్వచ్ఛంద సంస్థ సంస్థ వ్యవస్థాపకులు విజయరామ్ సుభాశ్ పాలేకర్ కృషి (ఎస్.పి.కె.) పద్ధతిలో అభివృద్ధి చేసిన ఐదు అంతస్థుల ఉద్యాన పంటల నమూనా క్షేత్రాన్ని డిసెంబర్ 15 (శుక్రవారం)న ఉ. 10.–సా.5 వరకు పద్మశ్రీ పురస్కార గ్రహీత సుభాశ్ పాలేకర్ సందర్శిస్తారు. ప్రతి అంశం వెనుక గల శాస్త్రీయతను పాలేకర్ వివరిస్తారు. 4 రాష్ట్రాల రైతులు పాల్గొంటున్నారు. ప్రసంగం తెలుగు అనువాదం ఉంటుందని విజయరామ్ తెలిపారు. 3 కి.మీ. నడవగలిగిన వారే రావాలి. భోజన ఏర్పాట్లు ఉన్నాయి. నేరుగా వచ్చే వారికి ప్రవేశ రుసుం రూ. 100. హైదరాబాద్ రామకృష్ణమిషన్ దగ్గర గల సేవ్ కార్యాలయం నుంచి బస్సులో వెళ్లే వారికి రూ. 500. ముందస్తు రిజిస్ట్రేషన్ తప్పనిసరి. వివరాలకు.. 63091 11427.
Comments
Please login to add a commentAdd a comment