వాషింగ్టన్: భారత్‌కు ప్రధానంగా డ్రాగన్ దేశం చైనా నుంచి పెనుసవాళ్లు ఎదురవుతున్నాయని అగ్రరాజ్యం అమెరికా వెల్లడించింది. వాస్తవాధీన రేఖ(ఎల్‌ఏసీ) వద్ద చైనా దుందుడుకు వైఖరి భారత్‌కు ఆందోళకరంగా పరిణమిస్తోందని పేర్కొంది. ఈ మేరకు ఇండో–పసిఫిక్ ప్రాంతంతో వ్యూహాత్మక భాగస్వామ్యంపై జో బైడెన్ ప్రభుత్వ విధానాన్ని వివరిస్తూ శ్వేతసౌధం తన తొలి నివేదికను శుక్రవారం విడుదల చేసింది. ఇండో–పసిఫిక్ ప్రాంతంలోని ప్రభావవంతమైన దేశం భారత్‌తో వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని మరింత పెంపొందించుకుంటామని నివేదికలో తెలియజేసింది. రెండు దేశాలు కలిసి పని చేస్తాయని అభిప్రాయపడింది.
దక్షిణాసియాలో అస్థిరతకు చరమగీతం పాడాల్సిన అవసరం ఉందని తెలిపింది. ఆరోగ్యం, అంతరిక్షం, సైబర్‌స్పేస్ తదితర కీలక రంగాల్లో అమెరికా, భారత్ పరస్పరం సహకరించుకోవాలని సూచించింది. ఆర్థిక, సాంకేతిక పరిజ్ఞానం విషయంలో సహకారాన్ని మరింత ముందుకు తీసుకెళ్లాలని శ్వేతసౌధం తెలిపింది. ఇండో–పసిఫిక్ ప్రాంతంలో స్వేచ్ఛా వాణిజ్యానికి తలుపులు తెరవాల్సిన అవసరం ఉందని నొక్కి చెప్పింది. ఈ ప్రాంతంలో భారత్ ప్రబలమైన శక్తిగా ఎదిగేందుకు మద్దతిస్తామని ప్రకటించింది. భారత్ నాయకత్వ స్థానానికి చేరుకోవాలని ఆకాంక్షించింది. భారత్ తమ భాగస్వామ్య దేశమని ఉద్ఘాటించింది. దక్షిణాసియా, హిందూ మహాసముద్ర ప్రాంతంలో భారతే పెద్దన్న అని స్పష్టం చేసింది.
ఇండియాతో కలిసి పనిచేస్తాం..
ఆస్ట్రేలియా, తదితర దేశాల తరహాలో కాకుండా భారత్ భౌగోళికంగా కీలకమైన స్థానంలో ఉందని, పొరుగు దేశం చైనా నుంచి పెనుసవాళ్లు ఎదురవుతున్నాయని వైట్‌హౌజ్ సీనియర్ అధికారి ఒకరు చెప్పారు. ఎల్‌ఏసీ వద్ద చైనా ప్రవర్తన భారత్‌పై తీవ్ర ప్రభావం చూపుతున్న మాట వాస్తమేనని అన్నారు. గత ప్రభుత్వ(డొనాల్డ్ ట్రంప్ సర్కారు) హయాంలో భారత్–అమెరికా మధ్య సంబంధాలు చెప్పుకోదగిన స్థాయిలో విస్తృతమయ్యాయని గుర్తుచేశారు. ఈ సంబంధాలను మరింత పటిష్టం చేసుకోవాలని బైడెన్ ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉందని తెలిపారు.
తమలాగే మరో ప్రజాస్వామ్య దేశమైన ఇండియాతో కలిసి పనిచేసే విషయంలో ఎన్నో అవకాశాలు కళ్లెదుట కనిపిస్తున్నాయని వ్యాఖ్యానించారు. ఇండో–పసిఫిక్ ప్రాంతంలో ఇండియాతోపాటు ఇండోనేషియా, మలేసియా, మంగోలియా, న్యూజిలాండ్, సింగపూర్, తైవాన్, వియత్నాం, పసిఫిక్ దీవులతో సంబంధాలను మెరుగుపర్చుకోవడంపై ప్రత్యేకంగా దృష్టి పెట్టినట్లు పేర్కొన్నారు. ఆస్ట్రేలియాలోని మెల్‌బోర్న్‌లో ‘క్వాడ్’ మినిస్టీరియల్ సదస్సు జరిగిన రోజే ‘ఇండో–పసిఫిక్ ప్రాంతంతో వ్యూహాత్మక భాగస్వామ్యం’పై బైడెన్ ప్రభుత్వం తొలి నివేదికను విడుదల చేయడం విశేషం.
Comments
Please login to add a commentAdd a comment