భారతదేశంలోని హిందూ పండుగల్లో అత్యంత ముఖ్యమైన పండుగ. పైగా అందరూ ఎంతో అంగ రంగ వైభవంగ జరుపుకునే పండుగ. కొన్ని పండుగలకు బంధువుల కచ్చితంగా వస్తారని చెప్పలేం. కానీ ఈ పండుగకు మాత్రం ఎక్కడెక్కడి వాళ్లో ఒకగూటికి చేరి కబుర్లు చెప్పుకుంటూ ఆనందంగా గడుపుతారు. అందులోనూ మనదేశంలో ఈ పండుగకు మాత్రం ఎక్కడెక్కడో ఉన్నావాళ్లు తమ సోతూళ్లకి వెళ్లి చేసుకోవాలనుకుంటారు. మాములుగా ఇతర పండుగల్ని సాధారణంగా చేసుకుంటారేమో గానీ ఈ పండుగను మాత్రం తమకు ఉన్నంత మేరలో పండుగను చేసుకునేందుకు తాపత్రయపడతారు. పెద్దలు దగ్గర నుంచి చిన్న పిల్లల వరకు అందర్ని దగ్గరి చేసి అప్యాయత అనురాగాల మేళవింపు ఈ సంక్రాంతి అని చెప్పవచ్చు. అయితే అసలు సంక్రాంతి అంటే ఏమిటి? ప్రాముఖ్యత ఏమిటో చూద్దాం!.
సంక్రాంతి ప్రాశస్యం...
‘సరతి చరతీతి సూర్యః’ అనగా సంచరించువాడు సూర్యుడు. భాస్కరుని సంచారం రెండు విధాలుగా ఉంటుంది. ఒకటి ఉత్తరాయణం, రెండోది దక్షిణాయణం. మనకు ఒక సంవత్సరకాలం దేవతలకు ఒక్క రోజు. ‘ఆయనే దక్షిణే రాత్రిః ఉత్తరేతు దివా భవేత’ అంటే ఆరుమాసాల ఉత్తరాయణ కాలం దేవతలకు పగలు దక్షిణాయణ కాలం వారికి రాత్రిగా పురాణలు చెబుతున్నాయి. సంక్రాంతి’ లేదా ‘సంక్రమణం’ అంటే ‘చేరడం’ లేదా ‘మారడం’ అని అర్థం. సూర్యుడు మేషాది ద్వాదశ రాశులందు క్రమంగా పూర్వరాశి నుంచి ఉత్తర రాశిలోకి ప్రవేశించడమే సంక్రాంతి. ఇతిహసాల ప్రకాం సూర్య భగవానుడు తన పుత్రుడైన శని భగవానుడి (మకర రాశికి అధిపతి) ఇంటికి స్వయంగా వెళ్ళి ప్రపంచానికి తండ్రి కుమారుల అనుబంధాన్ని చాటి చెప్పిన రోజు ఇది. అంతేకాదు రవి మకర రాశిలో ప్రవేశించినపుడు ఎవడైతే స్నానం చేయడో అలాటి వాడు ఏడు జన్మలు రోగిగా, దరిద్రునిగా ఉండిపోతాడని భావం.
ఎందుకు జరుపుకుంటాం...
సూర్యుడు పయనించే దిక్కును బట్టి భూమిపై వాతావరణంలో మార్పులు సంభవిస్తాయి. సూర్యుడు సంవత్సరంలో ఆరు నెలలు దక్షిణం వైపు మరో ఆరు నెలలు ఉత్తరం వైపు పయనిస్తూ ఉంటాడు. మానవులు రాత్రులు నిద్రపోయి పగలు ఏ విధంగా మేలుకుంటారో అలాగే దేవతలు కూడా ఉత్తరాయణం నందు మేలుకొని ఉంటారని, వారు మేలుకొని ఉండగా అడిగిన కోర్కెలు వెంటనే తీరుస్తారని భక్తుల నమ్మకం. అందుకే పెద్దలు ఈ విషయం అందరికీ తెలియజేయడం కోసం ఈ పండుగను జరపడం మొదలుపెట్టారు.
ఈ రోజునుంచి స్వర్గ ద్వారాలు తెరిచి ఉంటాయని పురాణాలు పేర్కొన్నాయి. ఎందుకంటే ఈ మకర సంక్రమణం దేవతలకు పగటి కాలం కావడమే ప్రధాన కారణం. ప్రతీ సంక్రమణానికీ పితృతర్పణాలు ఇవ్వాలి. ఐతే పదకొండు సంక్రమణాల్లో ఇవ్వకపోయినా, ఈ మకర సంక్రమణం సందర్భంగా మాత్రం తప్పకుండా పితృతర్పణాలు ఇస్తారు. ఉత్తరాయణ పుణ్యకాలమైన సంక్రాంతి రోజున చేసే ఏ దానమైనా శ్రేష్టమైందని ఆర్యోక్తి. ఉత్తరాయణ కాలంలో చేసే దానాలలో ధాన్యం, ఫలాలు, విసనకర్ర, వస్త్రం, కాయగూరలు, దుంపలు, నువ్వులు, చెరకు మొదలైనవి ఉత్తమమైనవి.
దేశమంతటా విభిన్నరీతుల్లో జరుపుకోబడే ఈ 'పెద్ద పండుగ' ప్రతి విభిన్నతలోనూ ఒక విశిష్టతని కనబరుస్తోంది. కేవలం ఆధ్యాత్మిక దృష్టి, ఉపాసనా ప్రశస్తి మాత్రమే కాక, కుటుంబపరమైన అనుబంధాలకీ, సామాజికపరమైన సమైక్యతకు ఈ పండుగ వేదిక. అసలు మన సంస్కృతిలో చాలా పండుగలు ఆధ్యాత్మిక ప్రాధాన్యంతో పాటు, వ్యక్తి సర్వతోముఖ వికాసానికి ఆలంబనగా ఉంటాయి.
ప్రాంతాల వారిగా జరపుకునే విధానం..
ఆంధ్రులకు, తమిళులకు పెద్ద పండుగ సంక్రాంతి. ఇది కొన్ని ప్రాంతాలలో మూడు రోజులు ( భోగి, మకర సంక్రమణం, కనుమ) కొన్ని ప్రాంతాలలో నాలుగు రోజులు (నాలుగోరోజు ముక్కనుమ ) జరుపుతారు కావున దీన్ని పెద్ద పండుగ అంటారు. ముఖ్యంగా పంట చేతికొచ్చిన ఆనందంలో రైతులు ఈ పండుగ జరుపుకుంటారు కాబట్టి రైతుల పండుగగా కూడా దీన్ని అభివర్ణిస్తారు. అంతేకాదు ఈ పండుగ రోజున గాలిపటాలు ఎగరువేయడం కొన్ని చోట్ల ఆచారం. ఏది ఏమైన ఈ కరోనా మహమ్మారితో ప్రజలంతా సామాజిక దూరాన్ని పాటిస్తూ జరుపుకోవాల్సి రావడం ఒకింత బాధకరం.
Comments
Please login to add a commentAdd a comment