sankranti panduga
-
సంక్రాంతి వచ్చిందే.. తుమ్మెదా!
సంక్రాంతి.. ఇది ఒక పండుగ మాత్రమే కాదు. ఎన్నెన్నో అనుభూతులు, మరెన్నో మేళవింపులు..భావోద్వేగాలు..ఒక మాటలో చెప్పాలంటే ఏడాదికి సరిపోయే ఎన్నో తీపి జ్ఞాపకాల సంబరం..అలాంటి పండుగ మరో వారంరోజుల్లో రానుంది.అంతకన్నా ముందే జిల్లాలో పండుగ జోష్ మైదలైంది. ముగ్గులతో ఇంటి ముంగిళ్లు కళకళలాడుతున్నాయి. పట్టణాల్లోని వారే కాక గ్రామీణ ప్రాంత ప్రజలు కూడా షాపింగ్ కోసం ఆయా ప్రాంతా ల్లోని పట్టణాలకు పెద్దఎత్తున తరలి వస్తున్నారు. దీంతో ఉదయం 8 గంటల నుంచి రాత్రి 9 వరకు పట్టణంలోని ప్రధాన రహదారులన్నీ రద్గీగా మారాయి. దుస్తుల దుకాణాలు, కిరాణా షాపులు కిక్కిరిస్తున్నాయి.సింహభాగం వ్యాపారం దుస్తులు, వంట సరుకుల ద్వారానే సాగుతున్నట్లు వ్యాపారులు చెబుతున్నారు. మహిళలు అలంకరణకు సంబంధించిన వస్తువలను జోరుగా కొనుగోలు చేస్తున్నారు. రాజంపేట టౌన్ : పండగంటే ఆఫర్లు....ఆఫర్లుంటేనే ఆకర్షణ. ఇదే మంత్రాన్ని అనేక మంది వ్యాపారులు పాటిస్తున్నారు. కొంతమంది ప్రజలను ఆకర్షించేందుకు కొన్ని రకాల దుస్తులు, మహిళలకు సంబంధించిన వస్తువులపై, పాదరక్షలపై డిస్కౌంట్ ఆఫర్లు పెట్టారు. గత వారం రోజులుగా రోజు, రోజుకు వ్యాపారాలు ఊపందుకుంటున్నాయని వ్యాపారులు చెబుతున్నారు. సంక్రాంతి పండుగను పురస్కరించుకొని జిల్లా వ్యాప్తంగా నిత్యం కోట్ల రూపాయిల్లోనే వ్యాపారాలు సాగుతున్నట్లు సమాచారం. ఆన్లైన్లో జోరుగా కొనుగోళ్లు ప్రస్తుతం అందరి చేతిలో స్మార్ట్ ఫోన్ ఉంది. దీంతో చాలా మంది ఆన్లైన్ ద్వారా షాపింగ్ చేస్తున్నారు. సాధారణ రోజుల్లో ఆన్లైన్లో ఎలక్ట్రానిక్ వస్తువులను ప్రజలు ఎక్కువగా కొనుగోలు చేస్తారు. ప్రస్తుతం సంక్రాంతి కావడంతో పురుషులు ఫ్యాంట్లు, షర్ట్స్, షూస్, మహిళలు చీరలు, చిన్నపిల్లల దుస్తులు, రోల్డ్‌గోల్డ్ అలంకరణ వస్తువులను ఆన్లైన్ ద్వారా కొనుగోలు చేస్తున్నారు. ç .హిందువులకు సంక్రాంతి పెద్దపండుగ.అందువల్ల నిరుపేదలు కూడా ఈ పండుగను ఉన్నంతలో ఘనంగా జరుపుకుంటారు. బంధువులను, ఆడబిడ్డలను, అల్లుళ్లనువిధిగా ఆహ్వానిస్తారు. ఇంటికి వచ్చిన అతి«ధులకు వారివారి స్థోమతను బట్టి దుస్తులు పెట్టి, ఆతిధ్యాలు ఇస్తారు. సంక్రాంతి సందర్భంగా పేదలకైనా తక్కువలో తక్కువ అంటే పదివేల రూపాయిలు ఖర్చవుతుంది. ఎక్కువ సంఖ్యలో బంధు వర్గం కలిగిన ధనవంతులు సంక్రాంతికి లక్ష రూపాయిలు కూడా ఖర్చు చేస్తారు. సంప్రదాయాన్ని పాటిస్తాం పెద్దపండగ సంవత్సరానికి ఒకసారి వస్తుంది. మేము చిన్నప్పటి నుంచి ఇంటిల్లిపాది సంక్రాంతికి కొత్త దుస్తులు కొంటాం. కాలం మారినా ఈ సంప్రదాయా న్ని మాత్రం పాటిస్తున్నాం.పండుగను ఉన్నంతలో సంతోషంగా జరుపుకోవాలి. – సిద్దమ్మ, వెంకటాపురం, ఓబులవారిపల్లె మండలం ముత్యాల ముగ్గులు..అందమైన ముంగిళ్లు కడప కల్చరల్: సంక్రాంతి వస్తుందంటే ఇళ్ల ముంగిళ్లు సప్తవర్ణాల హరివిల్లులవుతాయి. మహిళలు ఇప్పటికే ఇళ్ల ముందు అందమైన ముగ్గులను కనుల పండువగా తీర్చిదిద్దుతున్నారు. సాధారణంగా మహిళలు తమ ముగ్గుల్లో కొత్తదనం చూపేందుకు ఉత్సాహం చూపుతుంటారు. పత్రికల నుంచి సేకరించుకున్న ముగ్గుల్లో కొద్దిమార్పులు చేసి తమదైన శైలిలో రంగులు అలంకరిస్తుంటారు. ప్రస్తుతం వారికి సమస్య లేకుండా ముగ్గుల పుస్తకాలు మార్కెట్లలో అందుబాటులోకి వచ్చాయి. వీటికి జిల్లా అంతటా డిమాండ్ ఉంది. రంగురంగుల పుస్తకాలు ముగ్గు చక్కగా కుదిరితే.. దాన్ని అందరూ ప్రశంసిస్తుంటే అతివలు మురిసిపోతుంటారు. ముత్యాల ముగ్గులు వేయాలన్న తపన ఉన్నా వేయలేని వారి కోసం మార్కెట్లో దాదాపు 30 రకాల ముగ్గుల పుస్తకాలు అందుబాటులో ఉన్నాయి. 20 నుంచి 40 పేజీలతో ఒక పేజీకి ఒకటి నుంచి నాలుగు రంగుల ముగ్గులను ప్రచురిస్తున్నారు. ఇందులో చుక్కల ముగ్గులు, డిజైన్ ముగ్గులు, కాన్సెఫ్ట్ ముగ్గులు కూడా ఉన్నాయి. ఎన్ని చుక్కలు పెట్టాలో, ఎలా కలపాలో, రంగులు కాంబినేషన్ వివరాలు ఈ ముగ్గుల వద్ద రాసి ఉంటాయి. ఒకటి, రెండుసార్లు సాధన చేసి నేరుగా ‘ముగ్గు’లోకి దిగేయడమే ఆలస్యం. సంక్రాంతికి పది రోజుల ముందునుంచి ఈ పుస్తకాలకు మంచి డిమాండ్ ఉంటోంది. సంక్రాంతి దగ్గర పడుతుండడంతో ఇళ్ల ముందు మహిళలు పోటీల కోసం సాధన చేయడంలో భాగంగా రంగురంగుల ముగ్గులను తీర్చిదిద్దుతున్నారు.సీజన్ మాత్రమేగాక మిగతా రోజుల్లో కూడా ముగ్గుల పుస్తకాలకు డిమాండ్ ఉందని వ్యాపారులు పేర్కొంటున్నారు. -
సింగపూర్‌లో సంబరాల సంక్రాంతి
సింగపూర్ తెలుగు సమాజం అనాదిగా నిర్వహించే సంక్రాంతి సందడి ఈ ఏడాది కూడా అంగరంగ వైభవంగా నిర్వహించింది. మన భాష, సంస్కృతి, సాంప్రదాయాలను పరిరక్షించడమే ధ్యేయంగా పనిచేస్తున్న సింగపూర్ తెలుగు సమాజం, ఈ కార్యక్రమాన్ని అంతర్జాలంలో ఎంతో సాంప్రదాయబద్ధంగా మన ఊరి పండుగ వాతావరణం ప్రతిబింబించేలా నిర్వహించారు. కోవిడ్ నిబంధనల కారణంగా భోగి పండుగకు రేగుపండ్ల ప్యాకెట్స్ ని ఉచితంగా పంపిణీ చేయలేకపోయారు. వర్చువల్‌గా నిర్వహించిన కార్యక్రమాన్ని సుమారు 5000 మంది వరకు వివిధ ప్రసార మాధ్యమాల ద్వారా వీక్షించారు. సాంస్కృతిక కార్యక్రమాలు సింగపూర్ లో నివసిస్తున్న బాలబాలికలు, యువతీ యువకులచే వైవిధ్యభరితమైన సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిచడమే కాకుండా, మహిళలచే రంగవల్లులు, చిన్నారులకు ఫ్యాన్సీ డ్రెస్ పోటీలు నిర్వహించి, కార్యక్రమ వీక్షకుల అభిప్రాయసేకరణతో విజేతలకు బహుమతులు అందజేశారు. సింగపూర్ క్యాలెండర్ ఈ సంబరాలలో సింగపూర్ కాలమానంలో గుణించిన సింగపూర్ తెలుగు 2022 క్యాలెండెర్ ను ఆవిష్కరించారు. ఆంగ్లం ఉపయోగించకుండా తెలుగులో మాత్రమే మాట్లాడే కార్యక్రమం తెలుగు పలుకులు ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఈ కార్యక్రమం అన్ని వయస్సుల వారిని ఆకట్టుకుంది. తెలుగు సంస్కృతికి పట్టుగొమ్మలు , అచ్చతెలుగు సంక్రాంతికి ఆలవాలమైన తెలుగు రాష్ట్రాల పల్లెల్లో పండుగను వీడియో ద్వారా చూపించి అందరి మన్ననలను పొందారు. ఆటపాటల విజేతలకు తెలుగు సమాజం తరఫున బహుమతులు అందజేశారు. విజేతల ప్రకటన సింగపూర్ తెలుగు సమాజం అధ్యక్షులు కోటిరెడ్డి మాట్లాడుతూ.., తెలుగు వారందరికీ సంక్రాతి శుభాకాంక్షలతో తెలిపారు. ఈ సందర్భంగా సింగపూర్ తెలుగు సమాజం కొత్త వెబ్‌సైట్‌ను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో నిర్వహించిన పోటీలకు న్యాయ నిర్ణేతలుగా వ్యవహరించిన లక్ష్మీ నారాయణ, అనిత రెడ్డి, మైత్రి, సౌందర్య, రాఘవలతో పాటు ఈ కార్యక్రమానికి వ్యాఖ్యాతగా వ్యవహరించిన స్వాతిలకు ఆయన కృతజ్ఞతలు తెలియజేశారు. సంక్రాంతి పోటీల్లో గెలుపొందిన వారి వివరాలను ప్రకటించారు. ఈ పోటీల్లో పాల్గొన్న వారందరికీ సర్టిఫికెట్లను పోస్ట్ ద్వారా పంపిస్తామన్నారను. విజేతల వివరాలు ఇలా ఉన్నాయి. ఫ్యాన్సీ డ్రెస్: కృతిక (ప్రథమ బహుమతి), డి.తస్విఖ (రెండవ బహుమతి), సంహిత (తృతీయ బహుమతి) , గర్వ్ కుండ్లియా (కన్సొలేషన్ బహుమతి), వరాహగిరి వేదాంషి (కన్సొలేషన్ బహుమతి) రంగోలి: పావని చిలువేరు (ప్రథమ బహుమతి), నీలా దేవి (రెండవ బహుమతి) మరియు పోలినేని లీలా భార్గవి (తృతీయ బహుమతి) తెలుగు పలుకులు: కొమ్మిరెడ్డి నిషాంత్ రెడ్డి (ప్రథమ బహుమతి) , లక్ష్మి శ్రీనిజ చింతలపూడి (ద్వితీయ బహుమతి), రావూరి జ్ఞాన కౌశికి (తృతీయ బహుమతి) మరియు నామ సాయి ఈశ్వర (కన్సొలేషన్ బహుమతి) కృతజ్ఞతలు ఆహ్లాదభరితంగా జరిగిన ఈ కార్యక్రమంలో పాల్గొన్న వారందరికీ, స్వచ్ఛంద సేవకులకు , కార్యవర్గానికి , కార్యక్రమానికి సహకరించిన స్పాన్సర్లకు సింగపూర్ తెలుగు సమాజం కార్యదర్శి సత్య చిర్ల కృతజ్ఞతలను తెలియజేశారు. -
సంక్రాంతి వచ్చింది తుమ్మెద సరదాలు తెచ్చిందే తుమ్మెద ...
భారతదేశంలోని హిందూ పండుగల్లో అత్యంత ముఖ్యమైన పండుగ. పైగా అందరూ ఎంతో అంగ రంగ వైభవంగ జరుపుకునే పండుగ. కొన్ని పండుగలకు బంధువుల కచ్చితంగా వస్తారని చెప్పలేం. కానీ ఈ పండుగకు మాత్రం ఎక్కడెక్కడి వాళ్లో ఒకగూటికి చేరి కబుర్లు చెప్పుకుంటూ ఆనందంగా గడుపుతారు. అందులోనూ మనదేశంలో ఈ పండుగకు మాత్రం ఎక్కడెక్కడో ఉన్నావాళ్లు తమ సోతూళ్లకి వెళ్లి చేసుకోవాలనుకుంటారు. మాములుగా ఇతర పండుగల్ని సాధారణంగా చేసుకుంటారేమో గానీ ఈ పండుగను మాత్రం తమకు ఉన్నంత మేరలో పండుగను చేసుకునేందుకు తాపత్రయపడతారు. పెద్దలు దగ్గర నుంచి చిన్న పిల్లల వరకు అందర్ని దగ్గరి చేసి అప్యాయత అనురాగాల మేళవింపు ఈ సంక్రాంతి అని చెప్పవచ్చు. అయితే అసలు సంక్రాంతి అంటే ఏమిటి? ప్రాముఖ్యత ఏమిటో చూద్దాం!. సంక్రాంతి ప్రాశస్యం... ‘సరతి చరతీతి సూర్యః’ అనగా సంచరించువాడు సూర్యుడు. భాస్కరుని సంచారం రెండు విధాలుగా ఉంటుంది. ఒకటి ఉత్తరాయణం, రెండోది దక్షిణాయణం. మనకు ఒక సంవత్సరకాలం దేవతలకు ఒక్క రోజు. ‘ఆయనే దక్షిణే రాత్రిః ఉత్తరేతు దివా భవేత’ అంటే ఆరుమాసాల ఉత్తరాయణ కాలం దేవతలకు పగలు దక్షిణాయణ కాలం వారికి రాత్రిగా పురాణలు చెబుతున్నాయి. సంక్రాంతి’ లేదా ‘సంక్రమణం’ అంటే ‘చేరడం’ లేదా ‘మారడం’ అని అర్థం. సూర్యుడు మేషాది ద్వాదశ రాశులందు క్రమంగా పూర్వరాశి నుంచి ఉత్తర రాశిలోకి ప్రవేశించడమే సంక్రాంతి. ఇతిహసాల ప్రకాం సూర్య భగవానుడు తన పుత్రుడైన శని భగవానుడి (మకర రాశికి అధిపతి) ఇంటికి స్వయంగా వెళ్ళి ప్రపంచానికి తండ్రి కుమారుల అనుబంధాన్ని చాటి చెప్పిన రోజు ఇది. అంతేకాదు రవి మకర రాశిలో ప్రవేశించినపుడు ఎవడైతే స్నానం చేయడో అలాటి వాడు ఏడు జన్మలు రోగిగా, దరిద్రునిగా ఉండిపోతాడని భావం. ఎందుకు జరుపుకుంటాం... సూర్యుడు పయనించే దిక్కును బట్టి భూమిపై వాతావరణంలో మార్పులు సంభవిస్తాయి. సూర్యుడు సంవత్సరంలో ఆరు నెలలు దక్షిణం వైపు మరో ఆరు నెలలు ఉత్తరం వైపు పయనిస్తూ ఉంటాడు. మానవులు రాత్రులు నిద్రపోయి పగలు ఏ విధంగా మేలుకుంటారో అలాగే దేవతలు కూడా ఉత్తరాయణం నందు మేలుకొని ఉంటారని, వారు మేలుకొని ఉండగా అడిగిన కోర్కెలు వెంటనే తీరుస్తారని భక్తుల నమ్మకం. అందుకే పెద్దలు ఈ విషయం అందరికీ తెలియజేయడం కోసం ఈ పండుగను జరపడం మొదలుపెట్టారు. ఈ రోజునుంచి స్వర్గ ద్వారాలు తెరిచి ఉంటాయని పురాణాలు పేర్కొన్నాయి. ఎందుకంటే ఈ మకర సంక్రమణం దేవతలకు పగటి కాలం కావడమే ప్రధాన కారణం. ప్రతీ సంక్రమణానికీ పితృతర్పణాలు ఇవ్వాలి. ఐతే పదకొండు సంక్రమణాల్లో ఇవ్వకపోయినా, ఈ మకర సంక్రమణం సందర్భంగా మాత్రం తప్పకుండా పితృతర్పణాలు ఇస్తారు. ఉత్తరాయణ పుణ్యకాలమైన సంక్రాంతి రోజున చేసే ఏ దానమైనా శ్రేష్టమైందని ఆర్యోక్తి. ఉత్తరాయణ కాలంలో చేసే దానాలలో ధాన్యం, ఫలాలు, విసనకర్ర, వస్త్రం, కాయగూరలు, దుంపలు, నువ్వులు, చెరకు మొదలైనవి ఉత్తమమైనవి. దేశమంతటా విభిన్నరీతుల్లో జరుపుకోబడే ఈ 'పెద్ద పండుగ' ప్రతి విభిన్నతలోనూ ఒక విశిష్టతని కనబరుస్తోంది. కేవలం ఆధ్యాత్మిక దృష్టి, ఉపాసనా ప్రశస్తి మాత్రమే కాక, కుటుంబపరమైన అనుబంధాలకీ, సామాజికపరమైన సమైక్యతకు ఈ పండుగ వేదిక. అసలు మన సంస్కృతిలో చాలా పండుగలు ఆధ్యాత్మిక ప్రాధాన్యంతో పాటు, వ్యక్తి సర్వతోముఖ వికాసానికి ఆలంబనగా ఉంటాయి. ప్రాంతాల వారిగా జరపుకునే విధానం.. ఆంధ్రులకు, తమిళులకు పెద్ద పండుగ సంక్రాంతి. ఇది కొన్ని ప్రాంతాలలో మూడు రోజులు ( భోగి, మకర సంక్రమణం, కనుమ) కొన్ని ప్రాంతాలలో నాలుగు రోజులు (నాలుగోరోజు ముక్కనుమ ) జరుపుతారు కావున దీన్ని పెద్ద పండుగ అంటారు. ముఖ్యంగా పంట చేతికొచ్చిన ఆనందంలో రైతులు ఈ పండుగ జరుపుకుంటారు కాబట్టి రైతుల పండుగగా కూడా దీన్ని అభివర్ణిస్తారు. అంతేకాదు ఈ పండుగ రోజున గాలిపటాలు ఎగరువేయడం కొన్ని చోట్ల ఆచారం. ఏది ఏమైన ఈ కరోనా మహమ్మారితో ప్రజలంతా సామాజిక దూరాన్ని పాటిస్తూ జరుపుకోవాల్సి రావడం ఒకింత బాధకరం. -
గొబ్బిపాటల నుంచి పేడనీళ్ల వరకు అంతా రెడీమేడ్
మదనపల్లె సిటీ(చిత్తూరు జిల్లా): ఒకప్పుడు సంక్రాంతి నెల ప్రారంభమైందంటే ప్రజలు పండుగకు ఏర్పాట్లను ప్రారంభించేవారు. ప్రధానంగా మదనపల్లె పరిసర ప్రాంతాల పల్లెలు వ్యవసాయమే జీవనాధారం. ఎటుచూసినా పశుసంపద ఉండేది. ఇందువల్ల ప్రతీది ప్రకృతి సహజసిద్ధంగా లభించేంది. ఇప్పుడంతా ఆధునిక యుగం. దీనికి తోడు ప్రతిఒక్కరిది ఉరకులు పరుగుల జీవనం. దీంతో సంక్రాంతి వంటి పెద్ద పండుగను రెడీమేడ్ వస్తువులతో జరుపుకోవాల్సి వస్తోంది. కనిపించని గొబ్బెమ్మ పాటలు.. గొబ్బియాళ్లో, గొబ్బియళ్లో అంటూ ఇళ్ల ముందు గొబ్బిపాటలు పాడే వారు కనుమరుగయ్యారు. మదనపల్లె మండలం గొల్లపల్లిలో గొబ్బిపాటలు పాడే వారు ఉన్నారు. కాలక్రమేణా వీరు కూడా తగ్గిపోయారు. దీంతో నామమాత్రంగా ఇళ్ల వద్దకు వస్తున్నారు. పేడకు బదులు రంగు పౌడర్.. ఒకప్పుడు ఇంటి ముంగిట పేడనీళ్లు చల్లి ముగ్గులు వేసేవారు. ప్రస్తుతం పశు సంపద తక్కువ అయినందున మదనపల్లె పట్టణంలో రంగు పౌడర్ అమ్మకాలు జరుగుతున్నాయి. ఒక రోజుకు సరిపోయే ప్యాకెట్ కేవలం రూ.5 మాత్రమేకావడంతో అనేక మంది పేడ నీళ్ల కలర్ పౌడర్‌తో తమ ఇంటి లోగిళ్లను అలంకరించుకుంటున్నారు. అలాగే ముగ్గుకు బదులు ముగ్గుపిండి, ఇసుకలో కలిపిన రంగులు సైతం రెడీమేడ్‌గా మార్కెట్లో లభ్యమవుతున్నాయి. ముత్యాల ముగ్గులు.. సంక్రాంతిని తెలుగువారు పెద్ద పండువగా భావిస్తారు. ముగ్గులు లేని సంక్రాంతిని ఊహించలేం. ముగ్గులన్నా, ముగ్గులు వేయడమన్నా ఇష్టపడని మహిళలుండరు. తీరిక వేళల్లో తమ సృజన, నైపుణ్యాలను ప్రదర్శిస్తూ రంగురంగుల ముగ్గులను తళుకుమనిస్తుంటారు. సంక్రాంతి ముందుగానే మదనపల్లె పట్టణంలో పలు సంస్థలు ముగ్గుల పోటీలు నిర్వహించి బహుమతులను అందజేస్తున్నారు. -
వారి పాలనలో బసంత మాసంలో పతంగుల పండగ
సంక్రాంతి తెలుగు నేలపై ఒక్కోచోటా ఒక్కో తీరుగా జరిగే పండగ.. కోడి పందాలు, ఎడ్ల బండ్ల పందాలు, డూడూ బసవన్నలు.. రంగురంగుల రంగవల్లులు.. పిండి వంటకాలు.. వాటితో పాటు గాలిపటాలకు కూడా ప్రత్యేక స్థానం ఉంది. అయితే హైదరాబాద్ స్టయిలే వేరు.. సంక్రాంతి పండగ వచ్చిందంటే రంగుల పతంగుల సందడి మొదలైపోతుంది. కేవలం ఓ మతానికే పరిమితం కాకుండా అన్ని వర్గాల ప్రజలు గాలిపటాలు ఎగరవేస్తారు. జనవరి ప్రారంభంతోనే నగరంలో గాలిపటాల సందడి షురూ అవుతుంది. ఈ ఏడాది ఇప్పటికే సందడి మొదలైంది. వందల ఏళ్ల క్రితం నుంచే.. విభిన్న సంస్కృతులు, సంప్రదాయాల నిలయం హైదరాబాద్. వందల ఏళ్ల క్రితం నుంచే అన్నివర్గాల ప్రజలు కలిసిమెలిసి పండగలను జరుపుకుంటున్నారు. కుతుబ్ షాహీల కాలం నుంచి ప్రతి ఏటా నగరంలో పతంగుల పండగ కొనసాగేదని చారిత్రక ద్వారా తెలుస్తోంది. ఆ రోజుల్లో రాజులు వారి కుమారులు పతంగులు ఎగరేసేవారట.. అంటే తరతరాలుగా పతంగుల పండగ నగరంలో కొనసాగుతుందన్నమాట. మతసామరస్యానికి చిహ్నంగా ఈ పండగ నిలుస్తుంది. అతిప్రాచీన వేడుక ఇబ్రాహీం కులికుతుబ్ షా హయంలో గోల్కొండ కోటలో పతంగుల పండగ బసంత్ నెలలో అధికారికంగా జరిగేదట. ఆ రోజుల్లో కాగితాలతో చేసిన పతంగులు, మూలికలతో చేసిన మాంజాతో పతంగుల పోటీలు కూడా జరిగేవని చరిత్రకారులు పుస్తకాల్లో రాసారు. కుతుబ్ షాహీల పాలన అనంతరం ఆసీఫ్ జాహీల పాలనలో పాతబస్తీలోని మైదానాల్లో అదే బసంత మాసంలో పతంగుల పండగ ఘనంగా నిర్వహించే వారు. ఇక ఆరో నిజాం మీర్ మహెబూబ్ అలీ ఖాన్ పాలనా కాలంలో పతంగుల పండగకు మరింత గుర్తింపు వచ్చింది. మైదానాల్లో పతంగుల పోటీలు నిర్వహించి ఎక్కువ పతంగులను పడగొట్టిన వారికి బహుమతులు కూడా ఇచ్చేవారు. ఈ పోటీల ప్రక్రియ ఏడో నిజాం హయంలో కూడా కొనసాగింది. హైదరాబాద్ సంస్థానం భారత దేశంలో విలీనం అనంతరం 1985 వరకు పాతబస్తీలో పతంగుల పోటీలు నిర్వహించే వారు. జోరందుకున్న విక్రయాలు ధూల్‌పేట్, మల్లేపల్లి, నాంపల్లితో పాటు పాతబస్తీలోని గుల్జార్‌హౌజ్, చార్‌కమాన్, డబీర్‌పురా తదితర ప్రాంతాల్లోని పతంగుల దుకాణాలు వినియోగదారులతో కిటకిటలాడుతున్నాయి. ప్రసుత్తం పతంగులన్నీ ప్లాస్టిక్‌తోనే తయారు చేస్తున్నారు. ⇔ గతంలో కాగితంతో తయారు చేసే వారు. ప్లాస్టిక్‌తో తయారు చేయడంతో అవి తేలికగా ఉంటాయి తొందరగా ఎగరడానికి అనుకూలంగా ఉంటాయి. గతంలో ఒకే రంగులో పతంగులు అందుబాటులో ఉండేవి. ప్రసుత్తం ప్లాస్టిక్‌తో తయారు కావడంతో వీటిపై డిజైన్లతో పాటు ఫొటోలు కూడా ముద్రిస్తున్నారు. ⇔ ప్రసుత్తం పతంగులపై రాజకీయ నేతల, సినీ నటుల ఫొటోలను ముద్రిస్తున్నారు. దీంతో పాటు కరోనా కాలంలో గో కరోనా గో అంటూ ముద్రిస్తున్నారు. అన్ని సైజుల్లో మార్కెట్లో అందుబాటులో ఉన్నాయి. దూల్‌పేట మాంజాకు క్రేజ్ ⇔ ఎగిరే గాలిపటానికి దారం.. ఆధారం. ఎదుటి వారి పతంగులను కట్ చేసేందుకు మాంజా అవసరం. పతంగులు ఎగిరేసేటప్పుడు దారానికి ముందు కొద్దిగా మాంజాను ఉపయోగించడం తప్పనిసరి. మాంజా లేనిదే ఎదుటి వారి పతంగులను కట్ చేయలేం. అందుకే పతంగుల పండగలో మాంజాదే కీలకపాత్ర. ⇔ మాంజా తయారీ చాలా కష్టం గాలిపటాలతో పాటు మాంజాగా పిలిచే దారాన్ని కూడా ఓల్డ్‌సిటీలోనే తయారు చేస్తున్నారు. దూల్‌పేట మాంజాకు క్రేజ్ ఎక్కువ. ఇక్కడి నుంచే వివిధ రాష్ట్రాలకు మాంజా ఎగుమతి అవుతుంది. ⇔ పంతంగుల సీజన్లో నగరంలో దాదాపు రూ.100 కోట్ల వ్యాపారం జరుగుతుందని మార్కెట్ వర్గాల అంచనా. ఇక మాంజాకు ఫెమస్ అయిన దూల్పేట్లో మాంజా వ్యాపారం రూ.25 కోట్ల వరకు ఉంటుందని వ్యాపారులు చెబుతున్నారు. మంజా రకాలు మాంజాలను ‘గీటి’లుగా విక్రయిస్తారు. ఒక్కో గీటి 45 మీటర్లుంటుంది. మోతీయా, గంధక్, గాజర్, ఫేరొజా, టీలా, హరా, కాశ్మీ, ఎర్రగులాబి, కాలా, అండేకా తదితర రకాలుంటాయి. వీటిలో పాండా, సి–28 మాంజాలకు ఎక్కువగా గిరాకీ ఉంటుంది. చైనా నుంచి దిగుమతి అవుతున్న ప్లాస్టిక్ మాంజాలను ప్రభుత్వం నిషేదించడంతో స్థానిక మాంజాలకు గిరాకీ పెరిగింది. -
గ్రాము బంగారంతో గొబ్బెమ్మ
తెనాలి (గుంటూరు): సంక్రాంతి పండుగను పురస్కరించుకుని గ్రాము బంగారంతో ముగ్గు, గొబ్బెమ్మ, రెండు చెరకు గడలు రూపొందించాడు గుంటూరు జిల్లా తెనాలికి చెందిన బంగారు పని కార్మికుడు ఎం. సురేష్. అలాగే, మరో గ్రాము బంగారంతో పడవ, తెడ్డును కూడా తయారు చేశాడు. వీటి తయారీకి మూడు రోజుల సమయం పట్టిందని, 2011లో ప్రపంచ క్రికెట్ పోటీల సందర్భంగా వరల్డ్ కప్పును బంగారంతో రూపొందించానని చెప్పుకొచ్చాడు సురేష్. ఈ కళాకారుడి ప్రతిభను పలువురు మెచ్చుకున్నారు.