వారి పాలనలో బసంత మాసంలో పతంగుల పండగ | Sankranti Festival: Speciality Of Kite Flying | Sakshi
Sakshi News home page

వారి పాలనలో బసంత మాసంలో పతంగుల

Published Wed, Jan 6 2021 8:50 AM | Last Updated on Sat, Jan 9 2021 6:49 PM

Sankranti Festival: Speciality Of Kite Flying - Sakshi

సంక్రాంతి తెలుగు నేలపై ఒక్కోచోటా ఒక్కో తీరుగా జరిగే పండగ.. కోడి పందాలు, ఎడ్ల బండ్ల పందాలు, డూడూ బసవన్నలు.. రంగురంగుల రంగవల్లులు.. పిండి వంటకాలు.. వాటితో పాటు గాలిపటాలకు కూడా ప్రత్యేక స్థానం ఉంది. అయితే హైదరాబాద్‌ స్టయిలే వేరు.. సంక్రాంతి పండగ వచ్చిందంటే రంగుల పతంగుల సందడి మొదలైపోతుంది.  కేవలం ఓ మతానికే పరిమితం కాకుండా అన్ని వర్గాల ప్రజలు గాలిపటాలు ఎగరవేస్తారు. జనవరి ప్రారంభంతోనే నగరంలో గాలిపటాల సందడి షురూ అవుతుంది. ఈ ఏడాది ఇప్పటికే సందడి మొదలైంది. 

వందల ఏళ్ల క్రితం నుంచే..
విభిన్న సంస్కృతులు, సంప్రదాయాల నిలయం హైదరాబాద్‌. వందల ఏళ్ల క్రితం నుంచే అన్నివర్గాల ప్రజలు కలిసిమెలిసి పండగలను జరుపుకుంటున్నారు. కుతుబ్‌ షాహీల కాలం నుంచి ప్రతి ఏటా నగరంలో పతంగుల పండగ కొనసాగేదని చారిత్రక ద్వారా తెలుస్తోంది. ఆ రోజుల్లో రాజులు వారి కుమారులు పతంగులు ఎగరేసేవారట.. అంటే తరతరాలుగా పతంగుల పండగ నగరంలో కొనసాగుతుందన్నమాట. మతసామరస్యానికి చిహ్నంగా ఈ పండగ నిలుస్తుంది.  

అతిప్రాచీన వేడుక 
ఇబ్రాహీం కులికుతుబ్‌ షా హయంలో గోల్కొండ కోటలో పతంగుల పండగ బసంత్‌ నెలలో అధికారికంగా జరిగేదట. ఆ రోజుల్లో కాగితాలతో చేసిన పతంగులు, మూలికలతో చేసిన మాంజాతో పతంగుల పోటీలు కూడా జరిగేవని చరిత్రకారులు పుస్తకాల్లో రాసారు. కుతుబ్‌ షాహీల పాలన అనంతరం ఆసీఫ్‌ జాహీల పాలనలో పాతబస్తీలోని మైదానాల్లో అదే బసంత మాసంలో పతంగుల పండగ ఘనంగా నిర్వహించే వారు. ఇక ఆరో నిజాం మీర్‌ మహెబూబ్‌ అలీ ఖాన్‌ పాలనా కాలంలో పతంగుల పండగకు మరింత గుర్తింపు వచ్చింది. మైదానాల్లో పతంగుల పోటీలు నిర్వహించి ఎక్కువ పతంగులను పడగొట్టిన వారికి బహుమతులు కూడా ఇచ్చేవారు. ఈ పోటీల ప్రక్రియ ఏడో నిజాం హయంలో కూడా కొనసాగింది. హైదరాబాద్‌ సంస్థానం భారత దేశంలో విలీనం అనంతరం 1985 వరకు పాతబస్తీలో పతంగుల పోటీలు నిర్వహించే వారు.  

జోరందుకున్న విక్రయాలు 
ధూల్‌పేట్, మల్లేపల్లి, నాంపల్లితో పాటు పాతబస్తీలోని గుల్జార్‌హౌజ్, చార్‌కమాన్, డబీర్‌పురా తదితర ప్రాంతాల్లోని పతంగుల దుకాణాలు వినియోగదారులతో కిటకిటలాడుతున్నాయి. ప్రసుత్తం పతంగులన్నీ ప్లాస్టిక్‌తోనే తయారు చేస్తున్నారు.  
⇔ గతంలో కాగితంతో తయారు చేసే వారు. ప్లాస్టిక్‌తో తయారు చేయడంతో అవి తేలికగా ఉంటాయి తొందరగా ఎగరడానికి అనుకూలంగా ఉంటాయి. గతంలో ఒకే రంగులో పతంగులు అందుబాటులో ఉండేవి. ప్రసుత్తం ప్లాస్టిక్‌తో తయారు కావడంతో వీటిపై డిజైన్లతో పాటు ఫొటోలు కూడా ముద్రిస్తున్నారు.  
⇔ ప్రసుత్తం పతంగులపై రాజకీయ నేతల, సినీ నటుల ఫొటోలను ముద్రిస్తున్నారు. దీంతో పాటు కరోనా కాలంలో గో కరోనా గో అంటూ ముద్రిస్తున్నారు. అన్ని సైజుల్లో మార్కెట్లో అందుబాటులో ఉన్నాయి.  

దూల్‌పేట మాంజాకు క్రేజ్‌ 
⇔ ఎగిరే గాలిపటానికి దారం.. ఆధారం. ఎదుటి వారి పతంగులను కట్‌ చేసేందుకు మాంజా అవసరం. పతంగులు ఎగిరేసేటప్పుడు దారానికి ముందు కొద్దిగా మాంజాను ఉపయోగించడం తప్పనిసరి. మాంజా లేనిదే ఎదుటి వారి పతంగులను కట్‌ చేయలేం. అందుకే పతంగుల పండగలో మాంజాదే కీలకపాత్ర.  
⇔ మాంజా తయారీ చాలా కష్టం గాలిపటాలతో పాటు మాంజాగా పిలిచే దారాన్ని కూడా ఓల్డ్‌సిటీలోనే తయారు చేస్తున్నారు. దూల్‌పేట మాంజాకు క్రేజ్‌ ఎక్కువ. ఇక్కడి నుంచే వివిధ రాష్ట్రాలకు మాంజా ఎగుమతి అవుతుంది.  
⇔ పంతంగుల సీజన్‌లో నగరంలో దాదాపు రూ.100 కోట్ల వ్యాపారం జరుగుతుందని మార్కెట్‌ వర్గాల అంచనా. ఇక మాంజాకు ఫెమస్‌ అయిన దూల్‌పేట్‌లో మాంజా వ్యాపారం రూ.25 కోట్ల వరకు ఉంటుందని వ్యాపారులు చెబుతున్నారు. 

మంజా రకాలు 
మాంజాలను ‘గీటి’లుగా విక్రయిస్తారు. ఒక్కో గీటి 45 మీటర్లుంటుంది. మోతీయా, గంధక్, గాజర్, ఫేరొజా, టీలా, హరా, కాశ్మీ, ఎర్రగులాబి, కాలా, అండేకా తదితర రకాలుంటాయి. వీటిలో పాండా, సి–28 మాంజాలకు ఎక్కువగా గిరాకీ ఉంటుంది. చైనా నుంచి దిగుమతి అవుతున్న ప్లాస్టిక్‌ మాంజాలను ప్రభుత్వం నిషేదించడంతో స్థానిక మాంజాలకు గిరాకీ పెరిగింది.   

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement