జియాగూడ: విద్యుత్ తీగలకు తట్టుకున్న గాలిపటాన్ని తీసేందుకు యత్నించిన ఓ బాలుడు విద్యుదాఘాతంతో మృతి చెందిన సంఘటన కుల్సుంపురా పోలీస్‌స్టేషన్ పరిధిలో మంగళవారం సాయంత్రం చోటుచేసుకుంది. కుల్సుంపురా ఇన్‌స్పెక్టర్ పి.శంకర్ తెలిపిన వివరాల ప్రకారం పోలీస్‌స్టేషన్ పరిధిలోని కేశవస్వామినగర్‌లో ఉంటున్న సంతోష్, మీనాక్షిల కుమారుడు కృష్ణ(12) మంగళవారం ఇంటి మొదటి అంతస్తుపై స్నేహితులతో కలిసి పతంగులు ఎగరవేస్తున్నారు. కాగా ఇంటి పక్కనే ఉన్న విద్యుత్ తీగలకు పతంగి తట్టుకోవడంతో అక్కడే ఉన్న ఇనుప రాడ్డుతో పతంగిని తీసేందుకు కృష్ణ యత్నించాడు. దీంతో కరెంటు షాకు తగిలి అక్కడికక్కడే మృతిచెందాడు. పక్కనే ఉన్న స్నేహితుడు శత్రుకు కూడా కొంత మేరకు గాయాలయ్యాయి. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు పోస్టుమార్టం నిమిత్తం కృష్ణ మృతదేహాన్ని తరలించి, శత్రుకు వైద్యసేవలు అందిస్తున్నట్లు తెలిపారు.
గాలిపటం కోసం వెళ్లి రైలు ఢీకొని మృతి...
కాచిగూడ: రైలు ఢీకొని ఓ యువకుడు మృతి చెందిన సంఘటన కాచిగూడ రైల్వే పోలీస్‌స్టేషన్ పరిధిలో జరిగింది. రైల్వే హెడ్‌కానిస్టేబుల్ ఆర్ లాల్యా నాయక్ తెలిపిన వివరాల ప్రకారం... బండ్లగూడ బాబానగర్ ప్రాంతానికి చెందిన మహబూబ్ కుమారుడు షేక్ షరీఫ్ (36) చికెన్ సెంటర్‌లో వర్కర్‌గా పనిచేస్తుంటాడు. మంగళవారం కాచిగూడ – విద్యానగర్ రైల్వే స్టేషన్ల మధ్య దారం తెగిన గాలిపటాన్ని పట్టుకొనేందుకు షరీఫ్‌తో పాటు మరికొందరు రైలు పట్టాలపై పరుగులు తీస్తుండగా విద్యానగర్ నుంచి ఫలక్‌నుమా వైపు వెళ్తున్న ఎంఎంటీఎస్ రైలు ఢీకొని షరీఫ్ అక్కడికక్కడే మృతిచెందాడు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా మార్చురీకి తరలించారు. రైల్వే పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
పతంగి ఎగురవేస్తూ కిందపడిన బాలుడి మృతి...
సనత్‌నగర్: పండగ రోజు స్నేహితులతో కలిసి గాలిపటం ఎగురవేస్తూ ప్రమాదవశాత్తూ భవనంపై నుంచి కిందపడి ఓ యువకుడు మృతి చెందిన సంఘటన సనత్‌నగర్ పోలీస్‌స్టేషన్ పరిధిలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..పశ్చిమ బంగాకు చెందిన సమరేష్ దోలాయ్ (18) ఎర్రగడ్డలో ఉంటూ ఓ ప్రైవేటు సంస్థలో కార్మికుడిగా పనిచేస్తున్నాడు. సంక్రాంతి నాడు స్నేహితులు కలిసి గాలి పటం ఎగురవేస్తుండగా తాను కూడా వారితో కలిసి భవనం పైకి ఎక్కాడు. గాలి పటం ఎగురవేస్తూ ప్రమాదవశాత్తూ కాలుజారి కింద ఉన్న రేకుల షెడ్డుపై పడ్డాడు. తీవ్రంగా గాయపడిన అతనిని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందాడు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చయేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment