సంక్రాంతి వచ్చిందే.. తుమ్మెదా! | Sankranti Festival 2023: Shopping Sprees In Telugu States | Sakshi
Sakshi News home page

సంక్రాంతి వచ్చిందే.. తుమ్మెదా!

Published Mon, Jan 9 2023 11:59 AM | Last Updated on Mon, Jan 9 2023 1:50 PM

Sankranti Festival 2023: Shopping Sprees In Telugu States - Sakshi

సంక్రాంతి.. ఇది ఒక పండుగ మాత్రమే కాదు. ఎన్నెన్నో అనుభూతులు, మరెన్నో మేళవింపులు..భావోద్వేగాలు..ఒక మాటలో చెప్పాలంటే ఏడాదికి సరిపోయే ఎన్నో తీపి జ్ఞాపకాల సంబరం..అలాంటి పండుగ మరో వారంరోజుల్లో రానుంది.అంతకన్నా ముందే జిల్లాలో పండుగ జోష్‌ మైదలైంది. ముగ్గులతో ఇంటి ముంగిళ్లు కళకళలాడుతున్నాయి. పట్టణాల్లోని వారే కాక  గ్రామీణ ప్రాంత ప్రజలు కూడా షాపింగ్‌ కోసం ఆయా ప్రాంతా ల్లోని పట్టణాలకు పెద్దఎత్తున తరలి  వస్తున్నారు. దీంతో  ఉదయం 8 గంటల నుంచి రాత్రి  9 వరకు పట్టణంలోని  ప్రధాన రహదారులన్నీ రద్గీగా మారాయి. దుస్తుల దుకాణాలు, కిరాణా షాపులు కిక్కిరిస్తున్నాయి.సింహభాగం వ్యాపారం దుస్తులు, వంట సరుకుల ద్వారానే సాగుతున్నట్లు వ్యాపారులు చెబుతున్నారు. మహిళలు అలంకరణకు సంబంధించిన వస్తువలను  జోరుగా కొనుగోలు చేస్తున్నారు. 

రాజంపేట టౌన్‌  :  పండగంటే ఆఫర్లు....ఆఫర్లుంటేనే ఆకర్షణ. ఇదే మంత్రాన్ని అనేక మంది వ్యాపారులు పాటిస్తున్నారు.  కొంతమంది   ప్రజలను ఆకర్షించేందుకు కొన్ని రకాల దుస్తులు, మహిళలకు  సంబంధించిన వస్తువులపై,   పాదరక్షలపై  డిస్కౌంట్‌ ఆఫర్లు పెట్టారు. గత వారం రోజులుగా రోజు, రోజుకు వ్యాపారాలు ఊపందుకుంటున్నాయని వ్యాపారులు చెబుతున్నారు. సంక్రాంతి పండుగను పురస్కరించుకొని జిల్లా వ్యాప్తంగా నిత్యం  కోట్ల రూపాయిల్లోనే వ్యాపారాలు  సాగుతున్నట్లు సమాచారం. 

ఆన్‌లైన్‌లో జోరుగా కొనుగోళ్లు 
ప్రస్తుతం అందరి చేతిలో స్మార్ట్‌ ఫోన్‌ ఉంది. దీంతో చాలా మంది ఆన్‌లైన్‌ ద్వారా షాపింగ్‌ చేస్తున్నారు.  సాధారణ రోజుల్లో ఆన్‌లైన్‌లో ఎలక్ట్రానిక్‌ వస్తువులను ప్రజలు ఎక్కువగా కొనుగోలు చేస్తారు. ప్రస్తుతం సంక్రాంతి కావడంతో  పురుషులు  ఫ్యాంట్లు,  షర్ట్స్,  షూస్,  మహిళలు చీరలు, చిన్నపిల్లల దుస్తులు,  రోల్డ్‌గోల్డ్‌ అలంకరణ వస్తువులను ఆన్‌లైన్‌ ద్వారా కొనుగోలు చేస్తున్నారు. ç .హిందువులకు సంక్రాంతి పెద్దపండుగ.అందువల్ల నిరుపేదలు కూడా ఈ పండుగను  ఉన్నంతలో ఘనంగా జరుపుకుంటారు. బంధువులను, ఆడబిడ్డలను, అల్లుళ్లనువిధిగా ఆహ్వానిస్తారు. ఇంటికి వచ్చిన అతి«ధులకు వారివారి స్థోమతను బట్టి  దుస్తులు పెట్టి, ఆతిధ్యాలు ఇస్తారు. సంక్రాంతి సందర్భంగా పేదలకైనా తక్కువలో తక్కువ అంటే పదివేల రూపాయిలు  ఖర్చవుతుంది. ఎక్కువ సంఖ్యలో బంధు వర్గం కలిగిన ధనవంతులు సంక్రాంతికి  లక్ష రూపాయిలు కూడా ఖర్చు చేస్తారు. 

సంప్రదాయాన్ని పాటిస్తాం 
పెద్దపండగ సంవత్సరానికి ఒకసారి వస్తుంది. మేము చిన్నప్పటి నుంచి ఇంటిల్లిపాది సంక్రాంతికి కొత్త దుస్తులు కొంటాం. కాలం మారినా ఈ సంప్రదాయా న్ని మాత్రం పాటిస్తున్నాం.పండుగను ఉన్నంతలో సంతోషంగా జరుపుకోవాలి.     
–  సిద్దమ్మ,  వెంకటాపురం, ఓబులవారిపల్లె మండలం  

ముత్యాల ముగ్గులు..అందమైన ముంగిళ్లు
కడప కల్చరల్‌: సంక్రాంతి వస్తుందంటే ఇళ్ల ముంగిళ్లు సప్తవర్ణాల హరివిల్లులవుతాయి.  మహిళలు ఇప్పటికే ఇళ్ల ముందు అందమైన ముగ్గులను కనుల పండువగా తీర్చిదిద్దుతున్నారు. సాధారణంగా మహిళలు  తమ ముగ్గుల్లో కొత్తదనం చూపేందుకు ఉత్సాహం చూపుతుంటారు. పత్రికల నుంచి సేకరించుకున్న ముగ్గుల్లో కొద్దిమార్పులు చేసి తమదైన శైలిలో రంగులు అలంకరిస్తుంటారు. ప్రస్తుతం వారికి  సమస్య లేకుండా ముగ్గుల పుస్తకాలు మార్కెట్లలో అందుబాటులోకి వచ్చాయి. వీటికి జిల్లా అంతటా డిమాండ్‌ ఉంది.  

రంగురంగుల పుస్తకాలు 
ముగ్గు చక్కగా కుదిరితే.. దాన్ని అందరూ ప్రశంసిస్తుంటే అతివలు మురిసిపోతుంటారు. ముత్యాల ముగ్గులు వేయాలన్న తపన ఉన్నా వేయలేని వారి కోసం మార్కెట్‌లో దాదాపు 30 రకాల ముగ్గుల పుస్తకాలు అందుబాటులో ఉన్నాయి. 20 నుంచి 40 పేజీలతో ఒక పేజీకి ఒకటి నుంచి నాలుగు రంగుల ముగ్గులను ప్రచురిస్తున్నారు. ఇందులో చుక్కల ముగ్గులు, డిజైన్‌ ముగ్గులు, కాన్సెఫ్ట్‌ ముగ్గులు కూడా ఉన్నాయి. ఎన్ని చుక్కలు పెట్టాలో, ఎలా కలపాలో, రంగులు కాంబినేషన్‌ వివరాలు ఈ ముగ్గుల వద్ద రాసి ఉంటాయి. ఒకటి, రెండుసార్లు సాధన చేసి నేరుగా ‘ముగ్గు’లోకి దిగేయడమే ఆలస్యం. సంక్రాంతికి పది రోజుల ముందునుంచి ఈ పుస్తకాలకు మంచి డిమాండ్‌ ఉంటోంది. సంక్రాంతి దగ్గర పడుతుండడంతో ఇళ్ల ముందు మహిళలు పోటీల కోసం సాధన చేయడంలో భాగంగా రంగురంగుల ముగ్గులను తీర్చిదిద్దుతున్నారు.సీజన్‌ మాత్రమేగాక మిగతా రోజుల్లో కూడా ముగ్గుల పుస్తకాలకు డిమాండ్‌ ఉందని వ్యాపారులు పేర్కొంటున్నారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement