
వినాయకుని అనుగ్రహం పొందేందుకు మనం ప్రతియేటా భాద్రపద శుద్ధ చవితినాడు వినాయక చవితి పర్వదినం జరుపు కుంటాం. అయితే తలపెట్టిన ఏ పనీ ముందుకు సాగక, జీవితంలో అన్నింటా విఘ్నాలు ఎదురవుతూ, అశాంతి, శారీరక, మానసిక రుగ్మతలు, రుణబాధలు వంటి కష్టాలు కలుగుతూ ఉన్నప్పుడు, దుష్టగ్రహాల పీడతో నానా బాధలు అనుభవించే వారు ప్రతి మాసంలోనూ సంకటహర చతుర్థినాడు యథాశక్తి విఘ్నేశునికి పూజలు జరిపితే ఈ కష్టాలన్నీ తొలగి సుఖ సంతోషాలతో పాటు కార్యజయం కలుగుతుందని శాస్త్రం చెబుతోంది.
వేదకాలం నుంచి ఆధునిక కాలం వరకు గణపతి ఆరాధన విస్తృతంగా జరగటం తెలిసిందే. వినాయక శబ్దానికి విశిష్టమైన వాడని, నాయకులు లేనివాడని అర్థం. గణపతి గురించి గణేశ పురాణం, స్కాంద పురాణం, ముద్గల పురాణం, బ్రహ్మవైవర్త పురాణం, శివ పురాణంలో కనిపిస్తుంది. ఋగ్వేదంలో సైతం గణపతి ప్రస్తావన ఉంది. గణపతిని జ్ఞానానికి అధిదేవత అని ఋగ్వేదం కొనియాడింది. గణాల అధిపతిగా గణపతి పేరు సార్థకమయ్యింది. మానవులందరికీ మంచి చేసేవారిని గణపతి అని అంటారు. మానవునిలోని చెడును హరించే వాడికి గణపతి అని, వినాయకుడని పేరు. వినాయకునికి రోగహర శక్తి ఉందని గణేశ పురాణం చెబుతోంది.
గణపతితో సమానమైన పేరుగల బ్రాహ్మణస్పతిలేదా బృహస్పతి గురించి ఋగ్వేదంలో ప్రస్తావన కనిపిస్తుంది. తనను ఆరాధించేవారిని గణపతి ఎల్లవేళలా కాపాడుతుంటాడని ఋగ్వేదం వివరించింది. బ్రహ్మచర్యం అవలంబించి, వేద వేదాంగ శాస్త్రాలను అధ్యయనం చెయ్యవలసిన విద్యార్థులకు గణేశుడు ఆశ్రయ దాత, పోషకుడు.
సంకట విమోచక గణపతి స్తోత్రం..
నారద ఉవాచ
ప్రణమ్య శిరసాదేవం గౌరీపుత్రం వినాయకం
భక్తావాస స్మరేన్నిత్యం ఆయుఃకామార్థ సిద్ధయే
ప్రథమం వక్రతుండం చ ఏకదంతం ద్వితీయకం
తృతీయం కృష్ణపింగాక్షం గజవక్త్రం చతుర్థకం
లంబోదరం పంచమం చ షష్టం వికటమేవచ
సప్తమం విఘ్నరాజంచ ధూమ్రవర్ణం తథాష్టమం
నవమం ఫాలచంద్రం చ దశమంతు వినాయకం
ఏకాదశం గణపతిం ద్వాదశాంతు గజాననం
ద్వాదశైతాని నామాని యః పఠేత్ శ్రుణుయాన్నిత్యం
నచ విఘ్నభయం తస్యసర్వసిద్ధికరం ప్రభోః
విద్యార్థీ లభతే విద్యాం ధనార్థీ లభతే ధనం
పుత్రార్థీ లభేత్ పుత్రం మోక్షార్థీ లభేత్ గతిం
జపేద్గణపతి స్తోత్రం షడ్భిర్మాసైః ఫలం లభేత్
సంవత్సరేణ సిద్ధించ లభతే నాత్ర సంశయః
అష్టభ్యో బ్రాహ్మణేభ్యశ్చః లిఖిత్వాయత్సమర్పయేత్
తస్య విద్యా భవేత్సర్వా గణేశస్య ప్రసాదతః
సంకటహర చతుర్థి ఎప్పుడు వస్తుంది?
ప్రతిమాసంలోనూ వచ్చే బహుళ చతుర్థి (బహుళ చవితి)ని సంకటహర చతుర్థి లేదా సంకట విమోచక చతుర్థిగా పిలుస్తారు. జాతకంలో కేతు మహర్దశ నడుస్తున్నవారు, కష్టాలను అనుభవించేవారు, తరచు కార్యహానితో చికాకులకు లోనవుతున్నవారు ఈ వ్రతం చేయడం మంచిది. ఆ రోజున పగలంతా ఉపవాసం ఉండి సాయంత్రం గుడికెళ్లి గరికపై ప్రమిదనుంచి దీపారాధన చేసి, గరికపోచలు, పుష్పాలు, పత్రితో గణపతిని పూజించి, లడ్డూలు లేదా ఉండ్రాళ్లు నివేదించి ఆ ప్రసాదాన్ని స్వీకరించాలి. ప్రతి మాసంలోనూ వచ్చే సంకటహర చతుర్థినాడు ఇదేవిధంగా ఆచరించగలిగితే సకల దోషాలూ పోయి, కార్యజయం కలుగుతుంది. ప్రతి బహుళ చతుర్థినాడూ వినాయక చవితిరోజు చేసినట్లే పత్రితోనూ, పుష్పాలతోనూ గణపతికి పూజ చేస్తే అన్నివిధాలుగా అభివృద్ధి చెందుతారు. కష్టాలతోనూ, సమస్యలతోనూ బాధపడేవారు సంకటహర చతుర్థి వ్రతంతోపాటు సంకట విమోచక గణపతి స్తోత్రాన్ని విడవకుండా ఆరుమాసాలపాటు పఠించడం వల్ల చక్కటి ఫలితం ఉంటుంది. వ్రతాన్ని ఆచరించలేనివారు కనీసం సంకటహర గణపతి స్తోత్రాన్ని నాలుగుసార్లు పారాయణ చేసినా మంచిదే. ఈ వ్రతాచరణ వల్ల విఘ్నాలు తొలగి, పనులు సజావుగా సాగుతాయి. కేతుగ్రహ బాధలు తొలగుతాయి.
-డి.వి.ఆర్. భాస్కర్