ప్రకృతిలో ఎన్నో రకాల వృక్ష జాతులు ఉండగా, వాటిలో కొన్నింటిని మాత్రమే వినాయక పూజలో పత్రిగా ఉపయోగించడంలోని ఆంతర్యమేమిటో,ఆయుర్వేద శాస్త్ర రీత్యా ఈ పండుగ ప్రాధాన్యమేమిటో తెలుసు కుందాం.
వినాయక చవితి వర్షాకాలంలో వస్తుంది. ఎగువ ప్రాంతాలలో కురిసే వర్షాల వలన నిండిన నదులు, కాలువలలో నీరు దిగువ ప్రాతాలలోని చెరువులు, కుంటలు, దిగుడు బావులలోకి ప్రవహించే మార్గంలో అనేక మలినాలతో కూడిన చెత్తను కూడా మోసుకు వస్తుంది. ఆ నీటిని అలాగే తాగిన ప్రజలు వ్యాధుల బారిన పడే ప్రమాదం ఉంది. అందుకే ముందుచూపు కలిగిన మన మహర్షులు ప్రతి సంప్రదాయంలోనూ ప్రజలకు హితవు కలిగించే కొన్ని ప్రత్యేకమైన ఆచారాలను సూచించారు. వాటిలో భాగంగా వినాయక చవితి పర్వదినం రోజున పూజలో ఉపయోగించడానికి కొన్ని ప్రత్యేకమైన ఔషధ జాతులకు సంబంధించిన మొక్కలు, వృక్షాల ఆకులను పూజాపత్రిగా సూచించారు.
ఈ పూజాపత్రిని నిమజ్జన సమయంలో ఆయా చెరువులు, కుంటలలో వెయ్యడం వల్ల వాటిలోని నీరు శుభ్రంగా మారుతుంది. తద్వారా క్రిమివ్యాధులు వ్యాపించకుండా ఉంటాయి. వర్షాకాలంలో సాధారణంగా వచ్చే జ్వరాలు, శ్వాసకోశ, జీర్ణకోశ వ్యాధులు, చర్మవ్యాధులు వంటి సమస్యలకు విరుగుడుగా పనిచేసే ఆకులను మన పూర్వీకులు పూజాపత్రిలో భాగంగా చేశారు.
పూజాపత్రి ఔషధ గుణాలను చెప్పుకోవాలంటే, ఉదాహరణకు మాచీపత్రం (దవనం ఆకు) రసాన్ని తీసుకోవడం ద్వారా దగ్గు, ఉబ్బసం నుంచి ఉపశమనం కలుగుతుంది. బృహతీపత్రం (వాకుడు ఆకు) వాపులను తగ్గిస్తుంది. బిల్వపత్రం (మారేడు ఆకు) చర్మ సమస్యలను తగ్గిస్తుంది. దుర్వాయుగ్మం (గరిక) శరీరానికి బలం చేకూరుస్తుంది. ఇలాగే, వినాయక పూజలో ఉపయోగించే ప్రతి పత్రికి విశేష ఔషధ లక్షణాలు ఉన్నాయి. అందుకే, వీటిని మన మహర్షులు, ఆయుర్వేద పండితులు సంప్రదాయంలో భాగంగా చేశారు.
– ఆచార్య రాఘవేంద్ర
వాస్తు జ్యోతిష సంఖ్యా శాస్త్ర నిపుణులు, ఒంగోలు
Comments
Please login to add a commentAdd a comment