‘నెహ్రూనగర్ చా రాజా’ ముంబైలో ‘తెలుగు’గణపతి
‘నెహ్రూనగర్ చా రాజా’ వర్లీ, నెహ్రూనగర్‌లో సార్వజనిక్
శ్రీ గణేశోత్సవ మండలి ఆధ్యర్యంలో ప్రతి ఏడాది ఘనంగా గణేశోత్సవాలు
మండలిని స్థాపించి 50 ఏళ్లు పూర్తైన సందర్భంగా అట్టహాసంగా ఉత్సవాలు
సాక్షి ముంబై: వర్లీలోని నెహ్రూనగర్ సార్వజనిక శ్రీ గణేశోత్సవ మండలి ఆధ్వర్యంలో గణేశోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. మండలి ఆధ్వర్యంలో ఉత్సవాలను ప్రారంభించి ఈ ఏడాదికి 50 ఏళ్లు పూర్తికానుండంటతో మరింత అట్టహాసంగా, ఉత్సాహంగా ఈ ఉత్సవాలను నిర్వహిస్తున్నారు. ఈసారి రాజ మహల్ నమూనాలో వివిధ రకాల అలంకరణలతో గణేశ్ మండలిని సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దారు.
తెలుగు మండళ్లలో ప్రత్యేక స్థానం
ముంబై మహానగరంలో వినాయక చవితి సందర్భంగా పదిరోజులపాటు ఘనంగా ఉత్సవాలను నిర్వహిస్తారనే విషయం విదితమే. చవితి వేడుకల్లో భాగంగా ప్రతి గల్లీ, రోడ్డులో వినాయక మండళ్లను ఏర్పాటుచేసి భారీ విగ్రహాలను ప్రతిష్ఠించి ఘనంగా పూజలు నిర్వహిస్తుంటారు. కుల, మత, జాతి, ప్రాంత వ్యత్యాసాలు లేకుండా ముంబైకర్లందరూ ఈ వేడుకల్లో పాల్గొంటారు. మహారాష్టక్రు ప్రత్యేకమైన గణేశోత్సవాల నిర్వహణలో తరతరాలుగా ఇక్కడే జీవనం సాగిస్తున్న తెలుగువారు కూడా ముందంజలోనే ఉన్నారు. అలాంటి తెలుగు గణేశ్ మండళ్లలో ఒకటి వర్లీ, నెహ్రూనగర్ సార్వజనిక్ శ్రీ గణేశోత్సవ్ మండల్.
ఐక్యత వల్లే, ఐక్యత కోసమే....
సొంతూళ్లను వదిలి పరాయిగడ్డలో స్థిరపడి ఇక్కడే జీవనం సాగిస్తున్న తెలుగు వారందరినీ ఒక్కతాటి మీద నిలిపేందుకు ఈ గణేశోత్సవాలు ఎంతగానో తోడ్పడుతున్నాయని మండలి అధ్యక్షుడు వాసాల గంగాధర్, ప్రధాన కార్యదర్శి తుమ్మనపల్లి శ్రీనివాస్, కోశాధికారి పొలాస తిరుపతి పేర్కొన్నారు. మండలిని స్థాపించి ఈ ఏడాదికి 50 సంవత్సరాలు పూర్తికావస్తుండటంతో గతంలో కంటే భారీ ఎత్తున్న ఉత్సవాలను నిర్వహిస్తున్నామని తెలిపారు. గణపతిని దర్శించుకునేందుకు చుట్టుపక్కల ప్రాంతాల నుంచి ప్రజలు పెద్ద సంఖ్యలో తరలివస్తున్నారని సంతోషం వ్యక్తం చేశారు.
రెండుసార్లు ఉత్తమ మండలి అవార్డు....
1975 నుంచి నిరాటంకంగా భారీ ఎత్తున నిర్వహిస్తున్న ఈ గణేశోత్సవ మండలి వర్లీ ప్రాంతంలో తెలుగువారి గణపతిగా ప్రసిద్ధి చెందింది. మారిన కాలంతో పాటే గణేశోత్సవాల రూపు రేఖలు మారిపోయాయి. పూజలతో పాటు సామాజిక సేవలు కూడా ఈ ఉత్సవాల్లో చోటు చేసుకున్నాయి. క్యాన్సర్ డిటెక్షన్ సెంటర్ల ఏర్పాటు, హెపటైటిస్ బి పరీక్షల నిర్వహణ , ఉచిత నేత్ర శిబిరాల నిర్వహణతో పాటు అన్నదాన కార్యక్రమం కూడా జరుగుతోంది. అందుకే నెహ్రూనగర్ సార్వజనిక శ్రీ గణేశోత్సవ మండలిని లోధా ఫౌండేషన్ రెండు సార్లు ఉత్తమ మండలిగా గుర్తించి అవార్డులు ప్రదానం చేసింది. సామాజిక సేవా కార్యక్రమాలతో పాటు యువకుల్లో క్రీడా స్ఫూర్తిని పెంచేందుకు ప్రతి సంవత్సరం క్రికెట్ టోర్నమెంట్లను నిర్వహిస్తున్నారు. కరోనా కాలంలో ఈ మండలి తరఫున ఉచితంగా శానిటైజర్‌లను, మాసు్కలను పంపిణీ చేశారు. వాక్సిన్‌లకు సంబంధించిన సందేహాలపై ఇంటింటికి తిరిగి ప్రజల్లో అవగాహన కలిగించారు.
వీరి ఆధ్వర్యంలోనే ఘనంగా ఉత్సవాలు
ప్రస్తుతం నెహ్రూనగర్ సార్వజనిక శ్రీ గణేశోత్సవ మండలికి అధ్యక్షుడిగా వాసాల గంగాధర్, ప్రధాన కార్యదర్శిగా తుమ్మనపల్లి శ్రీనివాస్, కోశాధికారిగా పొలాస తిరుపతి, ఉపాధ్యక్షుడుగా విక్కీ జిందం కొనసాగుతున్నారు. అదేవిధంగా కార్యవర్గ సభ్యులుగా రాజేష్ మహాదాస్, అజయ్ చక్కరకోట, అరవింద్ జిందం, గణేష్ వంగ, క్రాంతి మామిడాల, రవీ భోగ, వినయ వాసాల, వంశీ వాసాల, రాజేంద్ర భైరీ, విశాల్ వాసాల, సురేష్ గాజుల, నవీన్ వంగల, భాస్కర్ దాసరి, సలహదారులుగా వాసాల శ్రీహరి (వంశీ), జిందం భాస్కర్, సిరిపురం లక్షి్మనారాయణ, సిరిపురం వెంకటేశ్, జిందం గణేశ్ వ్యవహరిస్తున్నారు.
1975 నుంచి ప్రారంభం
నెహ్రూనగర్ గణేశోత్సవాలు 1975లో ప్రారంభమయ్యాయి. వాసాల రాజయ్య, జిందం బుచి్చబాబు, కోడం విశ్వనాథ్, సంకు అశోక్, సంకు శంకర్ తదితరులు జైకతి యువక మండలి తరపున ‘నెహ్రూనగర్‌చా రాజా’ను ప్రతిష్టించి పూజలు నిర్వహించేవారు. ఇలా స్థాపించిన సంవత్సరం నుంచి ఈ ఏడాది వరకూ నిరాటంకంగా ఉత్సవాలు జరుగుతున్నాయి. అనంతరం మారిన కాలంతో పాటు ఉత్సవాల నిర్వహణ తీరు కూడా మారింది. ఉత్సవాల సందర్భంగా పూజలు మాత్రమే కాదు సామాజిక సేవా కార్యక్రమాలను కూడా నిర్వహించడం ఆనవాయితీగా మారింది.
Comments
Please login to add a commentAdd a comment