ఇటీవల గణేశోత్సవాలను పురస్కరించుకుని భారీగా కానుకలు, మొక్కుబడులు సమర్పించిన భక్తులు
5.65 కోట్లు నగదుతో పాటు బంగారు, వెండి ఆభరణాలు, ఇతర వస్తువులు
బంగారు, వెండి కానుకల వేలంలో మండలికి రికార్డు స్థాయి ఆదాయం
ఈ మొత్తాన్ని వివిధ సామాజిక సేవా కార్యక్రమాలకోసం వినియోగిస్తాం- మండలి కార్యదర్శి సుదీర్ సాల్వే
ఇటీవల గణేశోత్సవాలను పురస్కరించుకుని ముంబైలోని ప్రముఖ ‘లాల్‌బాగ్‌చా రాజా’ గణేశుడికి భక్తులు భారీగా కానుకలు, మొక్కుబడులు సమర్పించుకున్నారు. ముఖ్యంగా ఈఏడాది లాల్‌బాగ్‌చా రాజా సార్వజనిక గణేశోత్సవ మండలి 91 వార్షికోవత్సవం కావడంతో భక్తులు భారీగా తరలి వచ్చారు. వీటిలో పెద్దమొత్తంలో నగదుతో పాటు బంగారు, వెండి ఆభరణాలు, ఇతర వస్తువులు కూడా ఉన్నాయి. ఈ సందర్భంగా బంగారు, వెండి కానుకలు వేలం వేశారు. భక్తుల మధ్య పోటాపోటీగా జరిగిన వేలం పాటలో మండలికి రికార్డు స్ధాయిలో ఆదాయం వచి్చంది. ఈ నిధుల్లో కొంత శాతం వివిధ సామాజిక సేవా కార్యక్రమాలకు, పేద పిల్లల చదువులకు, ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్న నిరుపేద రోగులకు మందులు, వైద్యఖర్చులకు సాయంగా అందజేయనున్నట్లు మండలి కార్యదర్శి సుదీర్ సాల్వీ తెలిపారు.
ఒక్క బంగారు ఇటుకకు వేలంలో రూ. 75.90 లక్షల ధర
ముంబైలోని లాల్‌బాగ్ ప్రాంతంలో కొలువైన లాల్‌బాగ్‌చా రాజా గణపతికి దేశ, విదేశాల్లోనూ ఎంతో పేరు. గణేశోత్సవాలు ప్రారంభమైన నాటి నుంచి నిమజ్జనోత్సవాలు ముగిసే వరకు లక్షలాది భక్తులు ఈ ఏడాది లాల్‌బాగ్‌చా రాజాను దర్శించుకున్నారు. నిమజ్జనోత్సవాలు పూర్తి కావడంతో గత రెండు రోజులుగా హుండీలో వేసిన నగదును లెక్కింపు ప్రక్రియ కొనసాగుతోంది. శనివారం లెక్కింపు ప్రక్రియ పూర్తికావడంతో మండలి పదాధికారులు వివరాలు వెల్లడించారు. మొత్తం 5.65 కోట్లు మేర నగదును భక్తులు లాల్‌బాగ్‌చా రాజాకు కానుకల రూపంలో సమర్పించుకున్నట్లు సాల్వీ తెలిపారు. అదేవిధంగా వివిధ బంగారు, వెండి ఆభరణాలు వేలం వేయగా ఒక కేజీ బంగారు ఇటుక, 10 తులాల బరువైన 13 బంగారు బిస్కెట్లు, బంగారు పూతపూసిన 909 గ్రాముల వెండి సుదర్శన చక్రం, అలాగే బంగారు కడియాలు, చైన్లు, హారాలు, ఉంగరాలు తదితర ఆభరణాలను వేలం వేయడంవల్ల రూ.2.35 కోట్లు లభించినట్లు సాల్వీ వెల్లడించారు.
ఒక్క బంగారు ఇటుకకే వేలంలో రూ. 75.90 లక్షల ధర పలికిందని ఇది రికార్డును నమోదు చేసిందని ఆయన పేర్కొన్నారు. లాల్‌బాగ్‌చారాజాను ప్రత్యక్షంగా దర్శించుకునేందుకు ముంబై రావడానికి వీలుపడని కొందరు భక్తులు తమ మొక్కుబడులను ఆన్‌లైన్ ద్వారా చెల్లిస్తారు. ఈ మొత్తం లాల్‌బాగ్‌చా రాజా సార్వజనిక గణేశోత్సవ మండలి బ్యాంకు ఖాతాలో జమా అవుతుంది. ఇంకా ఈ డిపాజిట్ల లెక్కలు తేల్చాల్సి ఉందని సాల్వీ పేర్కొన్నారు.
లెక్కించేందుకే రెండు మూడు రోజులు
ఏటా నిమజ్జనోత్సవాలు పూర్తికాగానే హుండీలో వేసిన నగదును లెక్కించడం ఆనవాయితీగా వస్తోంది. ఇందుకు కనీసం రెండు, మూడు రోజుల సమయం పడుతుంది. ఆ తరువాత మంచి ముహూర్తం చూసి లెక్కించిన కానుకలన్నిటినీ బహిరంగంగా వేలం వేస్తారు. ఈ వేలం పాటలో వేలాది మంది పాల్గొంటారు. ముఖ్యంగా వేలం పాటలో పాల్గొనే వారితోపాటు వేలం పాట ప్రక్రియను తిలకేంచేందుకు వచ్చేవారితో మండపం ఆవరణ కిక్కిరిసిపోతుంది. అనేక సందర్భాలలో ఓ వస్తువును దక్కించుకునేందుకు కొన్ని గంటల పాటు వేలం పాట కొనసాగుతుంది. దీంతో మిగిలిన వాటిని మరుసటి రోజున వేలం వేస్తారు.
Comments
Please login to add a commentAdd a comment