lal bag cha raja
-
‘లాల్బాగ్చా రాజా’ కానుకల వెల్లువ : వేలంలో బంగారు ఇటుకకు రూ. 75.90 లక్షలు
ఇటీవల గణేశోత్సవాలను పురస్కరించుకుని ముంబైలోని ప్రముఖ ‘లాల్బాగ్చా రాజా’ గణేశుడికి భక్తులు భారీగా కానుకలు, మొక్కుబడులు సమర్పించుకున్నారు. ముఖ్యంగా ఈఏడాది లాల్బాగ్చా రాజా సార్వజనిక గణేశోత్సవ మండలి 91 వార్షికోవత్సవం కావడంతో భక్తులు భారీగా తరలి వచ్చారు. వీటిలో పెద్దమొత్తంలో నగదుతో పాటు బంగారు, వెండి ఆభరణాలు, ఇతర వస్తువులు కూడా ఉన్నాయి. ఈ సందర్భంగా బంగారు, వెండి కానుకలు వేలం వేశారు. భక్తుల మధ్య పోటాపోటీగా జరిగిన వేలం పాటలో మండలికి రికార్డు స్ధాయిలో ఆదాయం వచి్చంది. ఈ నిధుల్లో కొంత శాతం వివిధ సామాజిక సేవా కార్యక్రమాలకు, పేద పిల్లల చదువులకు, ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్న నిరుపేద రోగులకు మందులు, వైద్యఖర్చులకు సాయంగా అందజేయనున్నట్లు మండలి కార్యదర్శి సుదీర్ సాల్వీ తెలిపారు. ఒక్క బంగారు ఇటుకకు వేలంలో రూ. 75.90 లక్షల ధర ముంబైలోని లాల్బాగ్ ప్రాంతంలో కొలువైన లాల్బాగ్చా రాజా గణపతికి దేశ, విదేశాల్లోనూ ఎంతో పేరు. గణేశోత్సవాలు ప్రారంభమైన నాటి నుంచి నిమజ్జనోత్సవాలు ముగిసే వరకు లక్షలాది భక్తులు ఈ ఏడాది లాల్బాగ్చా రాజాను దర్శించుకున్నారు. నిమజ్జనోత్సవాలు పూర్తి కావడంతో గత రెండు రోజులుగా హుండీలో వేసిన నగదును లెక్కింపు ప్రక్రియ కొనసాగుతోంది. శనివారం లెక్కింపు ప్రక్రియ పూర్తికావడంతో మండలి పదాధికారులు వివరాలు వెల్లడించారు. మొత్తం 5.65 కోట్లు మేర నగదును భక్తులు లాల్బాగ్చా రాజాకు కానుకల రూపంలో సమర్పించుకున్నట్లు సాల్వీ తెలిపారు. అదేవిధంగా వివిధ బంగారు, వెండి ఆభరణాలు వేలం వేయగా ఒక కేజీ బంగారు ఇటుక, 10 తులాల బరువైన 13 బంగారు బిస్కెట్లు, బంగారు పూతపూసిన 909 గ్రాముల వెండి సుదర్శన చక్రం, అలాగే బంగారు కడియాలు, చైన్లు, హారాలు, ఉంగరాలు తదితర ఆభరణాలను వేలం వేయడంవల్ల రూ.2.35 కోట్లు లభించినట్లు సాల్వీ వెల్లడించారు. ఒక్క బంగారు ఇటుకకే వేలంలో రూ. 75.90 లక్షల ధర పలికిందని ఇది రికార్డును నమోదు చేసిందని ఆయన పేర్కొన్నారు. లాల్బాగ్చారాజాను ప్రత్యక్షంగా దర్శించుకునేందుకు ముంబై రావడానికి వీలుపడని కొందరు భక్తులు తమ మొక్కుబడులను ఆన్లైన్ ద్వారా చెల్లిస్తారు. ఈ మొత్తం లాల్బాగ్చా రాజా సార్వజనిక గణేశోత్సవ మండలి బ్యాంకు ఖాతాలో జమా అవుతుంది. ఇంకా ఈ డిపాజిట్ల లెక్కలు తేల్చాల్సి ఉందని సాల్వీ పేర్కొన్నారు. లెక్కించేందుకే రెండు మూడు రోజులు ఏటా నిమజ్జనోత్సవాలు పూర్తికాగానే హుండీలో వేసిన నగదును లెక్కించడం ఆనవాయితీగా వస్తోంది. ఇందుకు కనీసం రెండు, మూడు రోజుల సమయం పడుతుంది. ఆ తరువాత మంచి ముహూర్తం చూసి లెక్కించిన కానుకలన్నిటినీ బహిరంగంగా వేలం వేస్తారు. ఈ వేలం పాటలో వేలాది మంది పాల్గొంటారు. ముఖ్యంగా వేలం పాటలో పాల్గొనే వారితోపాటు వేలం పాట ప్రక్రియను తిలకేంచేందుకు వచ్చేవారితో మండపం ఆవరణ కిక్కిరిసిపోతుంది. అనేక సందర్భాలలో ఓ వస్తువును దక్కించుకునేందుకు కొన్ని గంటల పాటు వేలం పాట కొనసాగుతుంది. దీంతో మిగిలిన వాటిని మరుసటి రోజున వేలం వేస్తారు. -
వెళ్లి రావయ్యా.. బొజ్జ గణపయ్య 19 గంటల పాటు సాగిన శోభాయాత్ర
సాక్షి, ముంబై: ముంబైతోపాటు రాష్ట్రవ్యాప్తంగా వినాయకుడికి శాంతియుతంగా వీడ్కోలు పలికారు. గణేశోత్సవాలతోపాటు నిమజ్జనోత్సవాలు ఘనంగా నిర్వహించారు. ‘గణపతి బొప్పా మోర్యా పుడ్చా వర్షీ లౌకర్యా’ (గణపతి దేవుడా వచ్చే సంవత్సరం తొందరగా రావయ్య), ‘గణపతి గేల గావాల చైన్ పడేన హమాల’ అనే నినాదాలతో వీధులన్నీ మార్మోగాయి. ఎంతో భక్తి శ్రద్ధలతో 10 రోజులపాటు పూజలందుకున్న వినాయకుడి ప్రతిమలను భారీ ఎత్తున శోభాయాత్రల ద్వారా ఊరేగించి నిమజ్జనం చేశారు. భారీ భద్రత మధ్య మంగళవారం ఉదయం ప్రారంభమైన నిమజ్జనోత్సవాలు పలు ప్రాంతాల్లో బుధవారం వరకు కొనసాగాయి. ముంబై మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని 69 కృత్రిమ నిమజ్జన ఘాట్లతోపాటు 204 కృత్రిమ నిమజ్జన ఘాట్ల వద్ద మంగళవారం నుంచి బుధవారం ఉదయం వరకు ముంబైలో మొత్తం 37,064 వినాయకుల నిమజ్జనం జరిగాయి. వీటిలో 5,762 విగ్రహాలు సార్వజనిక గణేశోత్సవ మండళ్ల వినాయకులు, 31,105 ఇళ్లల్లో ప్రతిష్టించిన వినాయకులతోపాటు 197 గౌరీలను నిమజ్జనం చేశారు. కృత్రిమ జలాశయాల్లో 709 సార్వజనిక గణేశోత్సవ మండళ్ల వినాయకులు, 10,957 ఇళ్లల్లోని వినాయకులు, గౌరీలు ఇలా మొత్తం 11,713 విగ్రహాలున్నాయి. ముంబైలో ప్రతి సంవత్సరం మాదిరిగానే ముంబై రాజాగా గుర్తింపు పొందిన గణేశ్ గల్లీలోని ముంబైచా రాజా వినాయకుడి నిమజ్జన యాత్ర మంగళవారం ఉదయం సుమారు 8.30 గంటలకు ప్రారంభమైంది. ఈ శోభాయాత్రతో ముంబై నిమజ్జనోత్సవాలు ప్రారంభమయ్యాయని చెప్పవచ్చు. అనంతరం ముంబైతోపాటు దేశవ్యాప్తంగా కోరికలు తీర్చేదైవంగా గుర్తింపు పొందిన లాల్బాగ్చా రాజా వినాయకుని హారతి 10.30 గంటల ప్రాంతంలో జరిగింది. అనంతరం లాల్బాగ్ చా రాజా వినాయకుని శోభాయాత్ర సుమారు 11 గంటలకు ప్రారంభమైంది. ఇలా ప్రారంభమైన నిమజ్జనోత్సవాలలో ముంబైతోపాటు రాష్ట్రవ్యాప్తంగా కొన్ని చెదురు ముదురు సంఘటనలు మినహా నిమజ్జనోత్సవాలు ప్రశాంతంగా ముగిశాయి. ముంబైలోని గిర్గావ్, శివాజీ పార్క్, జుహూ, చౌపాటీ తదితర నిమజ్జన ఘాట్ల వద్దకి లక్షలాది మంది భక్తులు వినాయకుడిని సాగనంపారు. ప్రతి సారి మాదిరిగానే ఈ సారి నిమజ్జనోత్సవాలు కూడా నిఘా నీడలో జరిగాయి. నిమజ్జనాల ఊరేగింపులు ఎంత తక్కువైతే అంత తక్కువ సమయంలో పూర్తి చేయాలని పోలీసులు సార్వజనిక గణేశోత్సవ మండళ్లకు సూచనలిచి్చనప్పటికీ నగరంలో సగటున 5 నుంచి 10 గంటలపాటు నిమజ్జనాల ఊరేగింపులు కొనసా గాయి. నగరంలోని ప్రముఖ వినాయకులలో ఒకటైన లాల్బాగ్ చా రాజా వినాయకుడి నిమజ్జన ఊరేగింపు సుమారు 19 గంటలపాటు కొనసాగింది. మంగళవారం ఉదయం 11 గంటల ప్రాంతంలో ప్రారంభమైంది. లాల్బాగ్ నుంచి గిర్గావ్ చౌపాటీ వరకు జనం నీరాజనాలు పలికారు. ఇసుకవేస్తే రాలనంత జనం మధ్య ఈ నిమజ్జనోత్సవాల శోభాయాత్ర కొనసాగింది. గణపతి బొప్పా మోర్యా.. గణపతి చాల్ లా గావాలా.. చైన్ పడేనా అమ్హాలా.. అనే నినాదాలతో పరిసరాలు హోరే త్తాయి. భక్తిమయ వాతవరణం మధ్య నిమజ్జన యాత్ర కొనసాగింది. ముఖ్యంగా చిన్న పెద్ద ఆడామగ వయసుతో తేడా లేకుండా అందరూ బ్యాండుమేళాలు సంగీతానుసారం నృత్యం చేస్తూ వీడ్కోలు పలికారు. ఇలా బుధవారం ఉదయం లాల్బాగ్చా రాజా వినాయకుడిని గిర్గావ్ చౌపాటీలో నిమజ్జనం చేశారు. మరోవైపు పక్కనే ఉన్న థానే, నవీ ముంబైలలో నిమజ్జనాల ఊరేగింపులు కూడా సగటున 3 నుంచి 5 గంటలపాటు సాగాయి. ముంబై పోలీసులకు మద్దతుగా హోంగార్డులు, అగి్నమాపక సిబ్బంది, ఎస్ఆర్పీఎస్, ముంబై మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు, సిబ్బందిని మోహరించారు. అలాగే ట్రాఫిక్‌కి ఇబ్బంది కలగకుండా ముందుజాగ్రత్తగా పలు రోడ్లు బంద్ చేయడంతోపాటు వన్‌వే ల కారణంగా అంతగా సమస్య ఏర్పడలేదని చెప్పవచ్చు. అయితే నిమజ్జనాల ఘాట్లవైపు వెళ్లే రోడ్లుపై మాత్రం తీవ్ర ట్రాఫిక్ సమస్య కని్పంచింది. మరోవైపు కృత్రిమ జలాశయాల్లో కూడా భారీ ఎత్తున నిమజ్జనాలు జరగడం పర్యావరణ ప్రేమికులకు ఆనందం కలిగించింది. థానే మున్సిపల్ కార్పొరేషన్‌తోపాటు బీఎంసీ చేస్తున్న ప్రయత్నం పెద్ద ఎత్తున సఫలీకృతమైందని చెప్పవచ్చు. పుణేలో ఎప్పటిలాగానే రెండవరోజు బుధవారం మ« ద్యాహ్నం వరకు నిమజ్జనాలు జరిగాయి. అయితే ఈసారి నిమజ్జనోత్సవాలు 29 గంటలకుపైగా సమయం పట్టడం విశేషం. నగరంలో గణేశోత్సవాలకే గౌర వంగా భావించే మొదటి గణపతి ‘కస్బా పేట్’ వినాయకుడితోపాటు అయిదు గణపతు ల శోభాయాత్రలు ముందు గా ప్రారంభమయ్యాయి. పుణేలో ముఖ్యంగా కళ్లు మిరుమి ట్లు గొలిపే విద్యుత్ దీపాలంకరణలతోపాటు సంస్కృతి, సాంప్రదాయ పద్ధతిలో నిమజ్జనోత్సవాల శోభాయాత్రలు జరిగాయి. ఈ శోభాయాత్రల ను లక్షలాది మంది తిలకించారు. -
ఇప్పుడు కాకుంటే ఎప్పటికీ కాదు: దేవేంద్ర ఫడ్నవిష్
సాక్షి ముంబై: శివసేన బీజేపీని వెన్నుపోటు పొడిచిందని, వారికి శిక్ష తప్పదని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా హెచ్చరించారు. ముంబై పర్యటనపై ఉన్న ఆయన మేఘదూత్ బంగ్లాలో జరిగిన బీజేపీ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా బీజేపీ కార్పొరేటర్లు, ఆఫీసు బేరర్లకు మార్గనిర్దేశం చేస్తూ శివసేనపై తనదైన శైలిలో మండిపడ్డారు. రాజకీయాల్లో మోసం చేసేవారిని మళ్లీ నేలపైకి తీసుకువచ్చే సమయం ఆసన్నమైందన్నారు. రాజకీయాల్లో అన్ని సహించవచ్చు కానీ నమ్మకద్రోహం, వెన్నుపోటును సహించవద్దని అమిత్ షా బీజేపీ కార్యకర్తలకు పిలుపునిచ్చారు. బీఎంసీలో ఎలాగైనా పట్టు సాధించాలన్న లక్ష్యంతో కార్యకర్తలు ముందుకువెళ్లాలని అమిత్ షా పిలుపునిచ్చారు. ముఖ్యంగా బీఎంసీలో 150 స్థానాలు గెలుస్తామని ఇందుకోసం అందరూ కలిసికట్టుగా కృషి చేయాలన్నారు. అభి నహీ తో కభీ నహీ: ఫడ్నవీస్ రాబోయే ముంబై మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల అనంతరం ముంబై మేయర్ పదవిని బీజేపీ చేపడుతుందని ఉపముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ ధీమా వ్యక్తం చేశారు. బీజేపీ కార్యకర్తల మార్గదర్శన కార్యక్రమంలో ఉపముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ కూడా కార్యకర్తలకు మార్గదర్శనం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ముఖ్యంగా ‘అభీ నహీ తో కభీ నహీ’ (ఇప్పుడు కాకుంటే ఎప్పటికీ కాదు) అనే నినాదం చేస్తూ అందరూ ఈసారి ఎలాగైనా విజయం మాదేనన్న ధీమాతో ఎన్నికల బరిలోకి దిగాలన్నారు. ఇప్పుడు మన దృష్టంతా రాబోయే ముంబై మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలపై ఉంచాలన్నారు. ముఖ్యంగా బీఎంసీపై బీజేపీ జెండా ఎగురుతుందుని, ఎందుకంటే అసలైన శివసేన మనతోనే ఉందన్నారు. ఇవి చివరి ఎన్నికలుగా భావించి అందరూ గెలుపుకోసం కృషి చేయాలని ఇప్పుడు కాకుంటే ఎప్పటికీ కాదంటూ తన ప్రసంగంతో అందరిలో ఉత్తేజం నింపారు. లాల్ బాగ్చా రాజాను దర్శించుకున్న అమిత్ షా... కోరికలు తీర్చేదైవంగా ప్రసిద్ధిగాంచిన ముంబైలోని లాల్ బాగ్ చా రాజా గణపతిని హోంశాఖ మంత్రి అమిత్ షా దర్శించుకున్నారు. ముంబై పర్యటనకు వచ్చిన ఆయన ముందుగా లాల్బాగ్ చా రాజాను దర్శించుకున్నారు. ఆయనతోపాటు ముఖ్యమంత్రి ఏక్నాథ్ శిందే, ఉపముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్‌లతోపాటు ఇతర బీజేపీ నేతలు కూడా దర్శించుకున్నారు. ఈ సందర్భంగా అమిత్ షా ప్రత్యేక పూజలు నిర్వహించారు. -
దేవుడు వరమిచ్చినా..!
సాక్షి, ముంబై: ‘దేవుడు వరమిచ్చినా.. పూజారి అడ్డుపడిన ..’ చందంగా ఉంది నగరంలో ప్రముఖ లాల్బాగ్ చా రాజా గణేషుని దర్శనానికి వచ్చిన భక్తులు పరిస్థితి. మండలి కార్యకర్తల నిర్వాకంతో భక్తులు ఇబ్బందులు పడుతున్నారు. ఎక్కడెక్కడి నుంచి వచ్చిన భక్తులు గంటల తరబడి క్యూల్లో నిలబడి ఉంటే, కార్యకర్తలు కొందరు తమ బంధువులు, తెలిసిన వారిని క్యూలో కాకుండా నేరుగా దర్శనానికి తీసుకుపోతుండటంతో ఆగ్రహం తెప్పించింది. దీంతో అనేక మంది వారితో వాగ్వాదానికి దిగారు. అక్కడ బందోబస్తుగా విధులు నిర్వహిస్తున్న పోలీసులు ప్రేక్షక పాత్ర పోషించారే తప్ప ఎవరినీ ఏమీ అనలేకపోయారు. కనీసం భక్తులను శాంతపరిచే ప్రయత్నం కూడా చేయకపోవడం గమనార్హం. భక్తులు, పోలీసులు అందించిన వివరాలిలా ఉన్నాయి... భక్తులకు కొంగుబంగారంగా నిలిచిన లాల్బాగ్ చా రాజాను దర్శించుకునేందుకు ఏటా లక్షలాది జనం తరలి వస్తుంటారు. ఇక్కడ రెండు వేర్వేరు క్యూలు ఉంటాయి. ఒకటి మొక్కుబడులు తీర్చుకునేది. రెండోది కేవలం దర్శనం చేసుకుని ముందుకుసాగేది. ప్రభుత్వ, ప్రైవేటు సంస్థలకు శని, ఆదివారాలు సెలవు కావడంతో లాలాబాగ్ చా రాజాను దర్శించుకునేందుకు శనివారం సాయంత్రం పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చారు. మండపం పరిసరాలతోపాటు పక్కనే ఉన్న రెండు మైదానాలు భక్తులతో కిక్కిరిసిపోయాయి. అప్పటికే ఆరు గంటలు భక్తులు క్యూలో నిలబడ్డారు. మరో మూడు గంటలైనా రాజా దర్శనం అయ్యే సూచనలు కనిపించడం లేదు. అయినప్పటికీ ఎంతో ఓపిగ్గా క్యూలో నిలబడ్డారు. కాని అక్కడే విధులు నిర్వహిస్తున్న లాల్బాగ్ చా రాజ సార్వజనిక గణేశ్ ఉత్సవ మండలి పదాధికారులు, కార్యకర్తలు ఈ క్యూ ని అలాగే నిలిపివేసి తమ బంధువులను, పరిచయస్తులను మధ్యలోంచి నేరుగా దర్శనానికి వదలడం ప్రారంభించారు. దీంతో క్యూలో నిలబడిన భక్తుల ఆగ్రహం కట్టలు తెంచుకుంది. వారిని నిలదీసే ప్రయత్నం చేయగా మాటామాట పెరిగి చివరకు అది వాగ్వాదానికి దారితీసింది. కొద్దిసేపు కార్యక ర్తలు, భక్తుల మధ్య మాటల యుద్ధం జరిగింది. క్యూలో నిలబడిన భక్తులందరు ఏకమై గందరగోళం సృష్టించారు. పోలీసులు మాత్రం జోక్యం చేసుకోలేదని భక్తులు ఆరోపించారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చూసే బాధ్యత ఈ మండలి కార్యకర్తలపై, పోలీసులపై ఉంది. కాని వారే ఇలా అక్రమంగా తమ బంధువులను నేరుగా దర్శనానికి అనుమతిస్తే తమ గోడు ఎవరితో చెప్పుకునేదని భక్తులు వాపోయారు. ఈ విషయంపై ఫిర్యాదు చేసేందుకు గణేశ్ ఉత్సవ మండలి అధ్యక్షుడు అశోక్ పవార్‌ను సంప్రదించే ప్రయత్నం చేశారు. కాని ఆయన సెల్ ఫోన్ లిఫ్టు చేయలేదని కొందరు భక్తులు ఆరోపించారు. అయితే ఇక్కడ కార్యకర్తలు, భక్తుల మధ్య వాగ్వాదం జరగడం కొత్తేమి కాదని, ఏటా ఇలాంటి ఘటనలు చోటుచేసుకుంటూనే ఉంటాయని భక్తులు అంటున్నారు. కాని మండలి కార్యకర్తలపై నియంత్రణ లేకపోవడంవల్ల వారి ఆగడాలు శృతిమించుతున్నాయనే ఆరోపణలు ఉన్నాయి.