దేవుడు వరమిచ్చినా..!
సాక్షి, ముంబై: ‘దేవుడు వరమిచ్చినా.. పూజారి అడ్డుపడిన ..’ చందంగా ఉంది నగరంలో ప్రముఖ లాల్‌బాగ్ చా రాజా గణేషుని దర్శనానికి వచ్చిన భక్తులు పరిస్థితి. మండలి కార్యకర్తల నిర్వాకంతో భక్తులు ఇబ్బందులు పడుతున్నారు. ఎక్కడెక్కడి నుంచి వచ్చిన భక్తులు గంటల తరబడి క్యూల్లో నిలబడి ఉంటే, కార్యకర్తలు కొందరు తమ బంధువులు, తెలిసిన వారిని క్యూలో కాకుండా నేరుగా దర్శనానికి తీసుకుపోతుండటంతో ఆగ్రహం తెప్పించింది. దీంతో అనేక మంది వారితో వాగ్వాదానికి దిగారు. అక్కడ బందోబస్తుగా విధులు నిర్వహిస్తున్న పోలీసులు ప్రేక్షక పాత్ర పోషించారే తప్ప ఎవరినీ ఏమీ అనలేకపోయారు. కనీసం భక్తులను శాంతపరిచే ప్రయత్నం కూడా చేయకపోవడం గమనార్హం.
భక్తులు, పోలీసులు అందించిన వివరాలిలా ఉన్నాయి... భక్తులకు కొంగుబంగారంగా నిలిచిన లాల్‌బాగ్ చా రాజాను దర్శించుకునేందుకు ఏటా లక్షలాది జనం తరలి వస్తుంటారు. ఇక్కడ రెండు వేర్వేరు క్యూలు ఉంటాయి. ఒకటి మొక్కుబడులు తీర్చుకునేది. రెండోది కేవలం దర్శనం చేసుకుని ముందుకుసాగేది. ప్రభుత్వ, ప్రైవేటు సంస్థలకు శని, ఆదివారాలు సెలవు కావడంతో లాలాబాగ్ చా రాజాను దర్శించుకునేందుకు శనివారం సాయంత్రం పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చారు. మండపం పరిసరాలతోపాటు పక్కనే ఉన్న రెండు మైదానాలు భక్తులతో కిక్కిరిసిపోయాయి. అప్పటికే ఆరు గంటలు భక్తులు క్యూలో నిలబడ్డారు. మరో మూడు గంటలైనా రాజా దర్శనం అయ్యే సూచనలు కనిపించడం లేదు.
అయినప్పటికీ ఎంతో ఓపిగ్గా క్యూలో నిలబడ్డారు. కాని అక్కడే విధులు నిర్వహిస్తున్న లాల్‌బాగ్ చా రాజ సార్వజనిక గణేశ్ ఉత్సవ మండలి పదాధికారులు, కార్యకర్తలు ఈ క్యూ ని అలాగే నిలిపివేసి తమ బంధువులను, పరిచయస్తులను మధ్యలోంచి నేరుగా దర్శనానికి వదలడం ప్రారంభించారు. దీంతో క్యూలో నిలబడిన భక్తుల ఆగ్రహం కట్టలు తెంచుకుంది. వారిని నిలదీసే ప్రయత్నం చేయగా మాటామాట పెరిగి చివరకు అది వాగ్వాదానికి దారితీసింది. కొద్దిసేపు కార్యక ర్తలు, భక్తుల మధ్య మాటల యుద్ధం జరిగింది. క్యూలో నిలబడిన భక్తులందరు ఏకమై గందరగోళం సృష్టించారు. పోలీసులు మాత్రం జోక్యం చేసుకోలేదని భక్తులు ఆరోపించారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చూసే బాధ్యత ఈ మండలి కార్యకర్తలపై, పోలీసులపై ఉంది.
కాని వారే ఇలా అక్రమంగా తమ బంధువులను నేరుగా దర్శనానికి అనుమతిస్తే తమ గోడు ఎవరితో చెప్పుకునేదని భక్తులు వాపోయారు. ఈ విషయంపై ఫిర్యాదు చేసేందుకు గణేశ్ ఉత్సవ మండలి అధ్యక్షుడు అశోక్ పవార్‌ను సంప్రదించే ప్రయత్నం చేశారు. కాని ఆయన సెల్ ఫోన్ లిఫ్టు చేయలేదని కొందరు భక్తులు ఆరోపించారు. అయితే ఇక్కడ కార్యకర్తలు, భక్తుల మధ్య వాగ్వాదం జరగడం కొత్తేమి కాదని, ఏటా ఇలాంటి ఘటనలు చోటుచేసుకుంటూనే ఉంటాయని భక్తులు అంటున్నారు. కాని మండలి కార్యకర్తలపై నియంత్రణ లేకపోవడంవల్ల వారి ఆగడాలు శృతిమించుతున్నాయనే ఆరోపణలు ఉన్నాయి.