హిందువుల తొలిపూజలు అందుకునే గణపతి చిత్రం ఇతర దేశాల నగదు నోటుపై ముద్రించడం విశేషమే. ఇండోనేషియా దేశంలోని రూ. 20 వేల నోటుపై గణపతి చిత్రం ముద్రించి ఉండటం మనకు ఆసక్తి కలిగించే అంశమే. ఆ దేశం ఒక ఇస్లామిక్ దేశం. ఇప్పటి వివరాల ప్రకారం ఆ దేశంలో 88 శాతంపైగా ముస్లింలు ఉండగా మూడు శాతం మంది మాత్రమే హిందువులు ఉన్నారు. కానీ కొన్ని వేల సంవత్సరాల ముందు ఆ దేశం హిందూ మతానికి చాలా ప్రాముఖ్యమైన ప్రదేశంగా వెలుగొందింది. అక్కడవున్న ఎన్నో పురాతన దేవాలయాలు ఇప్పటికీ దేశ, విదేశీయులకు ప్రముఖ దర్శనీయ స్థలాలుగా వెలుగొందుతున్నాయి.
ఒకటవ శతాబ్దం నుంచి ఆ దేశంలో ఎక్కువగా హిందూ మతం ఉన్నదని భావిస్తారు. ఆ దేశానికి చెందిన రూ. 20వేల (రూపియా) కరెన్సీ నోటు మీద జ్ఞానాన్ని ప్రసాదించే విజ్ఞాన గణపతి చిత్రాన్ని చిహ్నంగా ముద్రించబడి ఉంటుంది. అదే నోటు మీద ఆ దేశంలోని పిల్లలందరికీ విద్య అందించడానికి విశేష కృషి చేసిన ఇండోనేషియా జాతీయ విద్యా పితామహుడిగా పిలువబడిన ప్రముఖ స్వాతంత్య్ర సమరయోధుడు హజర్ దేవంతర చిత్రం ప్రచురించబడి వుంటుంది. తదనంతర క్రమంలో (1950) ఆయన ఆ దేశ విద్యాశాఖ మంత్రిగాను పనిచేశారు. ఆయన విద్యాభివృద్ధికి చేసిన కృషికి ఫలితంగా ఆయన పుట్టినరోజును జాతీయ విద్యాదినోత్సవంగా జరుపుకుంటున్నారు.
ఈ విధంగా ఆ నోటుపై జ్ఞానాన్ని అందించే విద్యాగణపతి, విద్యాభివృద్ధికి కృషి చేసిన ప్రముఖుని చిత్రాలతోపాటు, ఆ నోటు వెనుక తరగతి గదిలో వున్న పిల్లల చిత్రం ముద్రించబడి వుండటం విశేషం.
Comments
Please login to add a commentAdd a comment