ఆగస్టు 26 శ్రీకృష్ణ జన్మాష్టమి సందర్భంగా
బాల్యంలో వెన్నదొంగగా వన్నెకెక్కినవాడు. మన్నుతిన్నాడని గద్దించిన తల్లి యశోదకు తన నోట ఏడేడు పద్నాలుగు లోకాలనూ చూపించినవాడు. బృందావనంలో వేణుగానం వినిపిస్తూ, గోపికలను రాసలీలలతో అలరించినవాడు. దుష్టశిక్షణ శిష్టరక్షణ నెరవేర్చినవాడు. కురుక్షేత్రంలో బంధువులను తన చేతులతో చంపలేనని, యుద్ధం చేయలేనని అస్త్రాలను విడిచిపెట్టిన అర్జునుడికి భగవద్గీతను బోధించి, కర్తవ్యోన్ముఖుణ్ణి చేసినవాడు. భగవద్గీతను బోధించినందున గీతాచార్యుడిగా, జగద్గురువుగా భక్తుల పూజలు అందుకొనే శ్రీకృష్ణ పరమాత్ముడు సర్వాంతర్యామి. ఆయన జగన్నాథుడు. ఆయన ఆర్తత్రాణపరాయణుడు. శ్రీకృష్ణుడి భక్తులు ప్రపంచం నలుమూలలా ఉన్నారు. మన దేశంలో బృందావనం, మథుర, ద్వారక సహా పలు శ్రీకృష్ణ క్షేత్రాలు ఉన్నాయి. దేశవ్యాప్తంగా శ్రీకృష్ణుడికి వేలాదిగా ఆలయాలు ఉన్నాయి. ఇవే కాకుండా, విదేశాల్లోనూ శ్రీకృష్ణుడికి ఎన్నో ఆలయాలు ఉన్నాయి. ఆగస్టు 26 శ్రీకృష్ణ జన్మాష్టమి సందర్భంగా విదేశాల్లో ఉన్న శ్రీకృష్ణ ఆలయాల విశేషాలు మీ కోసం...
శ్రీకృష్ణుడి ఆరాధాన ప్రాచీనకాలంలోనే విదేశాలకు పాకింది. క్రీస్తుపూర్వం ఎనిమిదో శతాబ్దంలోనే ప్రాచీన గ్రీకులు శ్రీకృష్ణుడిని వాసుదేవుడిగా, దేవాదిదేవుడిగా కొలిచేవారు. గ్రీకు రాయబారి హిలియోడారస్ క్రీస్తుపూర్వం 113 సంవత్సరంలో మధ్యప్రదేశ్‌లోని విదిశా నగరంలో ఒక గరుడస్తంభాన్ని నాటించాడు. ఈ రాతి స్తంభంపై బ్రహ్మీలిపిలో ‘వాసుదేవుడు దేవాదిదేవుడు’, ఆయన అడుగుజాడలైన ఆత్మనిగ్రహం, జ్ఞానం, దానం అనుసరించడం వల్ల స్వర్గాన్ని చేరుకోవచ్చు’ అని రాసి ఉంది. గ్రీస్ రాజధాని ఏథెన్స్‌లో ప్రస్తుతం ‘ఇస్కాన్’ శ్రీకృష్ణ ఆలయాన్ని నిర్వహిస్తోంది.
మన పొరుగు దేశాల్లో కృష్ణాలయాలు..
బ్రిటిష్ పాలనలో ఒకటిగా ఉండి తర్వాత విడిపోయిన మన పొరుగు దేశాలు పాకిస్తాన్, బంగ్లాదేశ్, బర్మాలలోను, నేపాల్‌లోను కృష్ణాలయాలు ఉన్నాయి. బంగ్లాదేశ్‌లో ఇస్కాన్ ఆధ్వర్యంలో నడిచే కృష్ణాలయాలతో పాటు కొన్ని పురాతన ఆలయాలు కూడా ఉన్నాయి. దినాజ్‌పూర్‌లోని ‘కళియా జుయె’ ఆలయం, జెస్సోర్‌లోని రాధాకృష్ణ మందిరం, పాబ్నాలోని జగన్నాథ ఆలయం బంగ్లాదేశ్‌లోని పురాతన కృష్ణాలయాల్లో ప్రముఖమైనవి. పాకిస్తాన్‌లోని క్వెట్టా, రావల్పిండి, హరిపూర్, ఫతేజంగ్ తదితర చోట్ల పురాతన కృష్ణాలయాలు ఉన్నాయి. లాహోర్‌లో 2006లో కొత్తగా కృష్ణాలయాన్ని నిర్మించారు. పాకిస్తాన్ రాజధాని ఇస్లామాబాద్‌లో అక్కడి ప్రభుత్వ అనుమతితో కొత్తగా కృష్ణాలయ నిర్మాణం ప్రారంభమైంది. దీని నిర్మాణం ఇంకా పూర్తి కాలేదు. నేపాల్ రాజధాని కాఠ్మాండూ సహా పాటన్, నవల్‌పరాసీ, రాజ్‌బిరాజ్ తదితర ప్రాంతాల్లో పురాతన కృష్ణాలయాలు ఉన్నాయి.
ఖండ ఖండాంతరాల్లో కృష్ణాలయాలు
మన పొరుగు దేశాల్లోనే కాకుండా, ఆసియా, యూరోప్, అమెరికా, ఆస్ట్రేలియాల్లో కృష్ణాలయాలు ఉన్నాయి. మలేసియాలోని కౌలాలంపూర్‌లో అక్కడ స్థిరపడిన తమిళులు నిర్మించిన కుయిల్ శ్రీకృష్ణాలయం, పెనాంగ్‌లో శ్రీకృష్ణాలయం, రాధాకృష్ణాలయం సహా పలు కృష్ణాలయాలు ఉన్నాయి. సింగపూర్‌లో 1870 నాటి శ్రీకృష్ణాలయం ఉంది. దీనిని సింగపూర్ ప్రభుత్వం జాతీయ సాంస్కృతిక వారసత్వ నిర్మాణంగా గుర్తించింది. మయాన్మార్‌లో రాధామండలేశ్వర ఆలయం, థాయ్‌లండ్‌లో క్రీస్తుశకం ఏడో శతాబ్ది నాటికే వైష్ణవారాధన ఉండేది. థాయ్‌లండ్‌లోని శ్రీథేప్‌లో పదమూడో శతాబ్ది నాటి వైష్ణవాలయంలో గోవర్ధనగిరి పైకెత్తిన శ్రీకృష్ణుడి విగ్రహం కనిపిస్తుంది. దక్షిణ కొరియా రాజధాని సియోల్‌లో స్థిరపడిన భారతీయులు రాధా శ్యామసుందర ఆలయాన్ని నిర్మించుకున్నారు. భారత సంతతి జనాభా ఎక్కువగా ఉండే ట్రినిడాడ్ అండ్ టొబాగోలో సెయింట్ మాడలిన్ నగరంలోని కృష్ణ మందిరం, డెబె పట్టణంలోని గాంధీగ్రామంలో రాధాకృష్ణ మందిరం సహా పలు కృష్ణాలయాలు ఉన్నాయి.
బ్రిటన్ రాజధాని లండన్‌లో కృష్ణయోగ మందిరం, రాధాకృష్ణ ఆలయాలతో పాటు లివర్‌పూల్, మాంచెస్టర్, ఓల్డ్‌హామ్, స్వాన్‌సీలలో రాధాకృష్ణ ఆలయాలు, గ్లోస్టర్‌షైర్, ష్రాప్‌షైర్, కాన్వెంట్రీ, డుడ్లీ, శాండ్‌వెల్, బోల్టన్‌లలో కృష్ణ మందిరాలు చాలాకాలంగా ఉన్నాయి. ఇవే కాకుండా, బ్రిటన్‌లో పలుచోట్ల కృష్ణారాధన జరిగే ‘ఇస్కాన్’ మందిరాలు, స్వామినారాయణ్ మందిరాలు కూడా ఉన్నాయి. అమెరికాలోని బోయిజ్ స్టేట్ యూనివర్సిటీ సమీపంలో హరేకృష్ణ ఆలయం ఉంది. ఈ ఆలయంలో వైదిక సంస్కృతీ కేంద్రం కూడా పనిచేస్తోంది. హాల్‌బ్రూక్‌లో ‘బ్రజమందిర్’ పేరిట కృష్ణాలయం ఉంది. ఆస్టిన్‌లో రాధామాధవధామ్ ఆలయం, మిల్‌క్రీక్ సాల్ట్‌లేక్ సిటీలో కృష్ణాలయం, స్పానిష్‌ఫోర్క్‌లో రాధాకృష్ణాలయం, మిల్వాకీలో రాధామాధవ మందిరంతో పాటు పలుచోట్ల ‘ఇస్కాన్’ నిర్వహిస్తున్న కృష్ణాలయాలు ఉన్నాయి. భారత్ నుంచి వెళ్లి స్థిరపడిన హిందువులు ఎక్కువగా నివసించే గల్ఫ్ దేశాల్లోనూ కృష్ణాలయాలు దుబాయ్‌లో ‘శ్రీకృష్ణ హవేలి’, బహ్రెయిన్‌లో శ్రీనాథ ఆలయం, ఓమన్‌లో శ్రీకృష్ణాలయం ఉన్నాయి. ఆస్ట్రేలియాలోని బ్రిస్‌బేన్‌లో హరేకృష్ణ ఆలయంతో పాటు పలుచోట్ల ఇస్కాన్ ఆధ్వర్యంలోని కృష్ణాలయాలు ఉన్నాయి. దక్షిణాఫ్రికాలోని మార్ల్‌బ్రోలో, శాండ్‌టన్‌లలో రాధేశ్యామ్ ఆలయాలు ఉన్నాయి.
ఇవే కాకుండా, ‘ఇస్కాన్’ ఆధ్వర్యంలో ప్రపంచం నలుమూలలా దాదాపుగా అన్ని దేశాల్లోనూ కృష్ణాలయాలు ఉన్నాయి. అలాగే స్వామినారాయణ్ ఆలయాలు కూడా ఉన్నాయి. ఈ ఆలయాల్లో ఏటా శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు ఘనంగా జరుగుతాయి. వీటితో పాటు దేశ విదేశాల్లోని ఇతర వైష్ణవ ఆలయాల్లో కూడా శ్రీకృష్ణాష్టమి వేడుకలు జరుగుతాయి.
Comments
Please login to add a commentAdd a comment