రావణ సంహారం జరిగింది. లంకాయుద్ధం ముగిసింది. రాముడి ఆజ్ఞపై లక్ష్మణుడు విభీషణునికి లంకాధిపతిగా పట్టం కట్టాడు. రామచంద్రుని ఆశీస్సులు అందుకున్న అనంతరం విభీషణుడు సీతాదేవిని రాముని సన్నిధికి తీసుకువస్తున్నాడు. ఇంకొన్ని అడుగులలో రాముని చేరుతుందనగా రాముడి కంఠం కంగున మోగింది. ‘‘సీతా! నీ కోరిక మేరకు యుద్ధంలో రావణుని సంహరించాను. అయితే ఇంతకాలం పర పురుషుని నీడలో ఉన్నావు. ఇప్పుడు కూడా నీవు కావాలంటే విభీషణుడి పాలనలో ఉన్న లంకానగరంలో ఉండిపోవచ్చు లేదంటే కిష్కింధాధిపతి అయిన సుగ్రీవుడి సంరక్షణలో ఉండవచ్చు... ఈ ఇరువురూ కాదంటే సొంత మరుదులైన లక్ష్మణ భరత శత్రుఘ్నుల వద్ద కూడా ఉండవచ్చు. అంతేకానీ నేను మాత్రం నిన్ను యథాతధంగా ఏలుకోలేను’’ అన్నాడు. ఈ మాటలు శరాఘాతంలా తగిలాయి సీతమ్మకు. ఒక్కక్షణం కన్నులెత్తి రాముని వైపు తదేకంగా చూసి, తర్వాత లక్ష్మణునితో–‘‘లక్ష్మణా! నేను అపనిందకు గురయ్యాను.
ఇక నేను జీవించి ఉండవలసిన అవసరం లేదు. నీవు ఇక్కడ తక్షణం అగ్నిని రగుల్కొల్పు’’ అంది సీత. లక్ష్మణుడు బాధతో అన్నయ్యవైపు చూశాడు. రాముడు మౌనంగా తలదించుకున్నాడు. అన్నయ్య మౌనాన్నే అంగీకారంగా భావించిన లక్ష్మణుడు అక్కడ చితిపేర్పించాడు. మండుతున్న చితిని చూసింది సీత. రాముని చుట్టూ ప్రదక్షిణ చేసింది. అనంతరం జ్వాజ్వల్యమానంగా రగులు తున్న అగ్నితో ‘‘ఓ అగ్నిభట్టారకా! నా హృదయం సర్వకాల సర్వావస్థలలోనూ శ్రీరాముని యందే ఉంటే గనుక నన్ను రక్షించు. నేను దోషరహితురాలనైతే గనుక నన్ను కాపాడు. నా ప్రవర్తనలో తేడా ఉన్నా, మనసులో ఎటువంటి చెడు తలంపులు ఉన్నా నన్ను వెంటనే నీలో ఆహుతి చేసుకో’’ అని పలికి అక్కడున్న వారందరూ హాహాకారాలు చేస్తూండగా అగ్నిలో ప్రవేశించింది. ఆ దృశ్యాన్ని చూడలేనట్టు అందరూ కన్నులు మూసుకున్నారు. కొద్ది క్షణాలు గడిచాయి.
ఉన్నట్టుండి అక్కడ కన్నులు మిరుమిట్లు గొలిపేంత వెలుగు వచ్చింది. చితాగ్ని నుంచి అగ్నిదేవుడు పైకి వచ్చాడు. ఆయన వడిలో పుత్రికలా సీత కూచుని ఉంది. మునుపటికన్నా ఆమె మరింత కాంతిమంతంగా ఉంది. ఆమె సౌందర్యం మరింత పవిత్రంగా ఉంది. అగ్నిదేవుడు సీతను నడిపించుకుంటూ రాముని వద్దకు తీసుకు వచ్చాడు. రామా! ఈమె నిష్కళంకురాలు. నిరపరాధి. పరమ పతివ్రత. ఈమెయందు ఏ దోషమూ లేదు. నీవు ఈమెను నిస్సంకోచంగా స్వీకరించవచ్చు. ఈమెవల్ల నేను పునీతుడనయ్యాను.’’ అంటూ ఆమెను రామునికి అప్పగించాడు. ‘‘అగ్నిదేవా!’’ ఈమారు రాముని కంఠం గద్గదమైంది. ‘‘నా అర్ధాంగి సీత అమలిన చరిత అనీ, సాధ్వీమణి అనీ నాకు తెలుసు.
నా ప్రాణేశ్వరి హృదయం ఆమె ప్రాణనాథుడనైన నాకు తెలియదా! అయితే ఆమె ఇంతకాలం పరాయి రాజ్యంలో మహా కాముకుడైన రావణుని ఏలుబడిలో ఉంది. ఆమెను వెంటనే నేను స్వీకరిస్తే నన్ను లోకం తప్పుగా అనుకోదా? ఆమెను గురించిన ఒక్క నిందనైనా నేను కలలో కూడా సహించలేను. ఆమె పాతివ్రత్యం, పవిత్రత అందరికీ తెలియాలనే నేను ఈ పరీక్ష పెట్టాను. ఇక ఆమెను నా నుండి ఎవరూ వేరుచేయలేరు’’ అంటూ ముందుకు నడిచి ఆమె చేతిని తన చేతులలోకి తీసుకున్నాడు. రాముడు సీతను అనుమానించాడనేది అపప్రథ మాత్రమే. ఆమె పాతివ్రత్యం గురించి అందరికీ తెలియజెప్పాలనే ఉద్దేశ్యంతోనే రాముడామెకు అగ్నిపరీక్ష పెట్టాడన్నది యథార్థం.
– డి.వి.ఆర్. భాస్కర్
Comments
Please login to add a commentAdd a comment