
క్రీస్తును శిలువ వేసిన రోజు శుక్ర వారం. అయితే ఆ శిలువ ద్వారా మానవాళికి మహత్తర సందేశం అందిన రోజుగా పవిత్ర శుక్రవా రంగా అది పరిగణింపబడింది. అందుకే ఇది ‘గుడ్ ఫ్రైడే’గా పేరొందింది. క్రైస్తవ సమాజంలో ఇది ప్రాముఖ్యం కల్గిన రోజు. ప్రభువు మరణంలో, ఒక మనిషి మరో మని షిని ప్రేమించాలి అనే సందేశం ప్రతిధ్వనిస్తోంది. ఆ ప్రేమతోనే సాటి మనిషిని క్షమిస్తాడు. తోటి మనిషి పట్ల సహనం ప్రదర్శిస్తాడు. అదే ప్రేమతో సాటివానికి సాయం చేస్తాడు. ప్రభువంతటి గొప్పవాడే ఏకంగా మనిషి కోసం మరణించాడే, మరి నేనేమి చేస్తున్నాను? అని ప్రతి వ్యక్తీ ప్రశ్నించుకుంటాడు. క్రైస్తవ సమాజంలో క్రిస్మస్‌కి, గుడ్ ఫ్రైడేకి, ఈస్టర్‌కి ప్రాముఖ్యం ఉంది. వీటినే మరో రీతిగా చెప్పుకోవలసి వస్తే, జననం, మరణం, పునరుత్థానం అని వివరించు కోవాలి. జనన పునరుత్థానాల్లో దైవిక భావన కనిపిస్తోంది. కానీ మర ణంలో మాత్రం అచ్చంగా మానవీయత కనిపిస్తోంది. మానవీయ గుణగణాల కలబోత అది. మిగిలిన రెండు పండుగలకూ సమన్వయం చేకూర్చి, క్రీస్తు తత్త్వానికి పరిపూర్ణత్వాన్ని అందించిన రోజు ఇది.
క్రీస్తు ప్రాణత్యాగం చేసిన రోజు ఇది. ఎన్నో అద్భుతాలు చేసిన క్రీస్తుకు ఈ మరణం నుంచి తప్పించుకోవడానికీ, అసలు తనకు ఆ మరణమే ఎదురుపడకుండా చేసుకోగల శక్తిసామర్థ్యాలు ఉన్నప్పటికీ తండ్రి దేవుని మాటకు విధేయత చూపి మరణాన్ని ఆహ్వానించడంలో గొప్ప సందేశం కనిపిస్తోంది. వాస్తవానికి తప్పు చేసిన మానవుణ్ణి ఈ మరణమే మాటి మాటికీ హెచ్చరిస్తోంది.
ఎన్ని ఫ్రైడేలు లేవు? కానీ, ఇది జనహితం కలిగించిన శుభకరమైన శుక్రవారం. ఇదే క్రీస్తు పవిత్రతను చాటిన పవిత్ర శుక్రవారంగా కూడా పిలువబడుతోంది. క్రైస్తవులు తెల్లటి వస్త్రాలు ధరించి ఈ రోజంతా చర్చిల్లో ప్రార్థనలు చేస్తారు. తమ పాపాలే ఈ రకంగా క్రీస్తును శిలువ వేసి మరణానికి గురిచేశాయి అనే పశ్చాత్తాప బాధతో ఉంటారు. ఇక మీదట తప్పిదాలు, దగా – మోసాలు చేయకుండా కొత్త జీవన విధానంతో ముందుకు సాగిపోతారు. క్రీస్తు మరణం విషాద భరితం. దుఃఖ పరివేదనం. అయినా ఆత్మ ప్రక్షాళనం చేసే చావు కేక. అది మానవుణ్ణి ప్రతి క్షణం మేల్కొల్పుతుంది.
– డా.దేవదాసు బెర్నార్డ్ రాజు
(నేడు ‘గుడ్ ఫ్రైడే’)