గీతాభాస్కర్‌ సమర్పించు సంక్రాంతికి సకినాలు | Sankranti 2025 traditional sakinalu by Actress Geetha Bhaskar | Sakshi
Sakshi News home page

గీతాభాస్కర్‌ సమర్పించు సంక్రాంతికి సకినాలు

Published Mon, Jan 13 2025 10:29 AM | Last Updated on Mon, Jan 13 2025 11:50 AM

Sankranti  2025 traditional sakinalu  by  Actress Geetha Bhaskar

గీతాభాస్కర్‌ సినిమాలలో నటిస్తే నటన ఎక్కడా కనిపించదు. పూర్తిగా సహజత్వమే. ఆమె ఏ ఫిల్మ్‌ ఇనిస్టిట్యూట్‌లోనూ శిక్షణ తీసుకోలేదు. ‘డెస్టినీస్‌ చైల్డ్‌’ అనే పుస్తకం రాస్తే.... ‘పుస్తకం అంటే ఇలా ఉండాలి 
నాయనా’ అనిపిస్తుంది. ఆమె పెద్ద పుస్తకాలు రాసిన పెద్ద రచయిత్రి కాదు. నటన అయినా రచన అయినా 
వంట అయినా... ఏదైనా ఇట్టే నేర్చుకోగల సామర్థ్యం గీతమ్మ సొంతం. గీత పుట్టి పెరిగింది చెన్నైలో. అయినప్పటికీ... 

ఆమె సకినాలు చేస్తే తెలంగాణ పల్లెకి చెందిన తల్లి చేసినంత రుచిగా ఉంటాయి. పెళ్లయిన తరువాత గీత... దాస్యం గీతాభాస్కర్‌ అయింది. అత్తగారిది పక్కా తెలంగాణ. తెలంగాణ అంటే ది గ్రేట్‌ సకినాలు. ఇక నేర్చుకోకుండా ఉంటారా!  సకినాలు ఎలా చెయ్యాలి... నుంచి ఫ్యామిలి ముచ్చట్ల వరకు ‘సాక్షి’తో పంచుకున్నారు గీతాభాస్కర్‌. ఆమె మాటల్లోనే.. 

అరిసెల పిండిలానే సకినాల పిండి కూడా తయారు చేసుకోవాలి. మామూలుగా వరి పిండి అయితే గట్టిగా అయిపోతుంది. పైగా అంతకుముందు వేరే గోధుమ పిండిలాంటివి పట్టి ఉంటే... అదే గిర్నీలో ఈ పిండి పడితే సరిగ్గా ఉండదు. అదే తడి పిండి అనుకోండి వేరే పిండి ఏదీ పట్టరు... బియ్యం పిండి మాత్రమే పడతారు. అయితే అరిసెల పిండికి రోజంతా బియ్యం నానబెట్టాలి. కానీ సకినాలకి నాలుగు గంటలు నానబెడితే సరిపోతుంది.

మా ఆయన ఉన్నప్పుడు ముగ్గుల పోటీకి తీసుకుని వెళ్లేవారు. ఒకసారి గవర్నర్‌ చేతుల మీదగా బహుమతి కూడా అందు కున్నాను. పండగ రోజున మంచి మంచి ముగ్గులు వేస్తుంటాను. నా ముగ్గులన్నీ డిఫరెంట్‌గా ఉంటాయి. దసరా, సంక్రాంతి అంటే ముగ్గుల పోటీలో నేను పాల్గొనాల్సిందే. ఆయన అలా తీసుకువెళ్లేవారు.– గీతాభాస్కర్‌ 

గీతా భాస్కర్‌ వేసిన ముగ్గు

నువ్వులు ఎక్కువ వేస్తా
సకినాల పిండికి కొలతలు అంటూ ఉండవు. ఒక గ్లాసు పిండికి నేను పావుకిలో నువ్వులు వేస్తాను. నువ్వులు ఎక్కువ వేస్తే గ్యాప్‌ ఎక్కువ వస్తుంది... పైగా నువ్వుల నుంచి కూడా నూనె వస్తుంది కదా.. బాగా ఉడుకుతుంది. దాంతో సకినం కరకరలాడుతుంది. కొంతమందైతే పచ్చి నువ్వులు వేసేస్తారు. నేను చెన్నై నుంచి వచ్చినదాన్ని కదా... మాకు అక్కడ మురుకులు అలవాటు. అక్కడ వేయించిన నువ్వులు వేస్తారు. నేను సకినాల్లో అలానే వేస్తా. అసలు ఇక్కడికి వచ్చాకే నేను సకినాలు వండటం నేర్చుకున్నాను. సకినాలకి దొడ్డు బియ్యం బాగుంటుంది. నేను దాదాపు రేషన్‌ బియ్యమే వాడతాను. అవి ఎక్కువ పాలిష్‌ ఉండవు కాబట్టి సకినాలకి బాగుంటుంది. అలాగే వేరు శెనగ నూనె వాడతాను.

అమ్మ వైపు... నాన్న సైడు
మా తండ్రి, తల్లివైపు వాళ్లందరూ చెన్నైలో సెటిల్‌ అయ్యారు. నేను పుట్టింది, పెరిగిందీ అక్కడే. రెండు కుటుంబాల వాళ్లు బిగ్‌ బిజినెస్‌ పీపుల్‌. ఇక మా అమ్మగారివైపు అయితే పూర్తిగా కాస్మోపాలిటన్‌. ఆవిడ హార్స్‌ రైడ్‌ చేసేవారు. చెన్నైలో శివాజీ గణేశన్‌లాంటి స్టార్స్‌ ఉండే మలోని స్ట్రీట్‌లో మా తాత ఉండేవారు. పొలిటికల్‌గా ఆయనకు చాలా స్ట్రాంగ్‌ కనెక్షన్స్‌ ఉండేవి. నెహ్రూగారితో పరిచయం ఉండేది. మా అమ్మ బట్టలన్నీ సినిమా కాస్ట్యూమర్స్‌ కుట్టేవారు. ఇక నాన్నవైపు పూర్తిగా భిన్నం. వాళ్లు కూడా వ్యాపారవేత్తలే. నాన్న వాళ్లది పప్పుల వ్యాపారం. నాన్నగారి కుటుంబంలో అమ్మాయిలు బయటకు వెళ్లకూడదు... మగవాళ్లతో మాట్లాకూడదు... అలా ఉండేది. నేను ఇటు అమ్మవైపు అటు నాన్నవైపుఇలాంటి కాంబినేషన్‌లో పెరిగా. మా అమ్మ ఒక్కతే కూతురు. ఆమెకి ఇద్దరు బ్రదర్స్‌ ఉన్నారు. ఒక్కతే కూతురు కావడంతో రాణిలా పెంచారు. నాన్నవాళ్లు పదమూడుమంది. నాన్నమ్మ వాళ్లు బాగా ట్రెడిషనల్‌. ఇంటికి పెద్ద కోడలిగా అమ్మకి చాలా బాధ్యతలు ఉండేవి. అయితే అమ్మ ఎక్కడిది అక్కడే అన్నట్లుగా తనను మలచుకుంది. అత్తింటి విషయాలు పుట్టింటికి, అక్కడివి ఇక్కడ ఎప్పుడూ చెప్పలేదు. మా నాన్నమ్మ సైడ్‌లో పూర్తి ట్రెడిషనల్‌ పిండి వంటలు వండేవాళ్లు. అమ్మ సైడ్‌ కొంచెం డిఫరెంట్‌. అలా నాకు అమ్మ వల్ల, నాన్నమ్మ వల్ల వంటలు చేయడం అలవాటైంది. ఇక  నేను పెళ్లి చేసుకుని ఇక్కడికి (తెలంగాణ) వచ్చాక పూర్తి భిన్నమైన వంటలు వండాల్సి వచ్చింది.

అత్తింట్లోనే  సకినాలు నేర్చుకున్నా
అత్తింటికి వచ్చాకే సకినాలు చేయడం నేర్చుకున్నాను. మా అత్తగారైతే అన్ని వంటలు బాగా వండుతావు... ఈ సకినాలు ఎందుకు చేయలేకపోతున్నావు... ఇవి కూడా చేయడం వస్తది అనేవారు. మా పెద్ద ఆడబిడ్డ, చిన్న ఆడబిడ్డ సకినాలు నేర్పించారు. మామూలుగా సకినాలకు ఉల్లికారం బాగుంటుంది. మా తరుణ్‌ (హీరో–దర్శకుడు– రచయిత తరుణ్‌భాస్కర్‌) కాస్త కారంగా తింటాడు. ఉల్లికారం తనకి తగ్గట్టుగా చేస్తాను. అయితే మా అత్తవాళ్లు ఉప్పు, కారం నూరి దానిమీద పచ్చి నూనె వేసేవారు. నేను కాస్త చింతపండు వేస్తాను. పండగకి అరిసెలు కూడా వండుతాను. యాక్చువల్లీ మా అమ్మ బాగా వండేది. నాకు కుదిరేది కాదు. అత్తింటికి వచ్చాక కూడా సరిగ్గా వండలేక΄ోయేదాన్ని. అయితే నా ఫ్రెండ్‌ వాళ్ల అమ్మ నేర్పించారు. అప్పట్నుంచి అరిసెలు చక్కగా మెత్తగా వండటం నేర్చుకున్నాను. 

ఇట్లు... బొబ్బట్లు
ఒకప్పుడు బుట్టలు బుట్టలు పిండివంటలు వండేవాళ్లు. మా ఇంట్లో మా అమ్మమ్మ, నాన్నమ్మ అలా వండటం చూశా. కానీ ఇప్పుడు ఒకట్రెండు కేజీలు వండటానికే కష్టపడిపోతున్నాం. అప్పట్లో పిండి దంచి వండేవాళ్లు. ఇప్పుడు అన్నింటికీ మిషన్‌ ఉంది. అయినా చేయలేకపోతున్నాం. కానీ బయట కొనుక్కుని తింటే   అంత సంతృప్తి ఉండదు. ఇంట్లో వండితే పండగకి ఇంట్లో వండాం అనే తృప్తి ఉంటుంది. కానీ ఎందుకింత శ్రమ తీసుకుంటున్నావని తరుణ్‌ అంటుంటాడు. ఇప్పుడు తను కూడా బిజీ కాబట్టి హెల్ప్‌ చేసే వీలుండదు. కానీ నాకు పండగకి ఇంట్లో వండితేనే మనసుకి బాగుంటుంది. పోయిన గురువారం నాకు స్కూల్‌లో ఓ వర్క్‌షాప్‌ ఉంది. అలాగే కల్చరల్‌ డిపార్ట్‌మెంట్‌ వాళ్లు గవర్నమెంట్‌ సపోర్ట్‌తో ఓ నాలుగైదు ప్రోగ్రామ్స్‌ చేయమన్నారు. 

ఇంకా ‘ఇట్లు బొబ్బట్లు’ అని పిల్లలు తయారు చేస్తుంటారు. వాళ్లు పిలిస్తే వెళ్లాను. మా నాన్నగారు మాతోనే ఉంటారు. ఆయనకు 90 ఏళ్లు. ఆయన్ని చూసుకుంటూ, బయట పనులు చూసుకుని, ఇంటికొచ్చాక పిండి వంటలు మొదలుపెట్టా. ఇలా ఇంట్లో వండుకుంటే ఫీల్‌గుడ్‌ హార్మోన్‌తో మనసు హాయిగా ఉంటుంది. అది మన హెల్త్‌కి మంచిది.     

సకినాలు ఈ తరానికి నేర్పుదాం
మన యంగర్‌ జనరేషన్‌కి మనం స్ఫూర్తిగా ఉండాలనుకుంటాను. ఇప్పుడు మనం వండితే భవిష్యత్తులో అప్పట్లో మన అమ్మ అలా వండేది కదా అనుకుంటారు. సో... యంగర్‌ జనరేషన్‌కి మన కల్చర్‌ అలవాటు చేయాలి. అందుకే మనం ఇంట్లోనే వండాలి. అమ్మ కష్టపడి వంట చేస్తుంటే పిల్లలకు హెల్ప్‌ చేయాలనిపిస్తుంది. మా తరుణ్‌ ఈ మధ్య ఓ రెండు రోజులు ఇంటికి రావడానికి కూడా కుదరలేదు. ఒక సినిమాకి డైలాగ్స్‌ రాస్తున్నాడు. ఆ స్ట్రెస్‌లో ఉన్నాడు. ఇంటికి వచ్చాక ఒక గిల్ట్‌తో ‘ఇంకో రెండు మూడు పేజీలు రాయాలమ్మా... అయిపోతుంది’ అన్నాడు. ఎంత బిజీగా ఉన్నప్పటికీ సకినాలు చేయడంలో నాకు హెల్ప్‌ చేశాడు (నవ్వుతూ). 

స్ట్రెస్‌ ఉంటే తరుణ్‌ ‘చెఫ్‌’
మా తరుణ్‌కి కూడా వంటలంటే ఇష్టం. నేను చేస్తుంటే వచ్చి చేస్తుంటాడు. నేనేదైనా బాగా వండితే, ఎలా వండావు అని అడిగి తెలుసుకుంటాడు. మా ఇంటి పక్కనే మాకు బాగా పరిచయం ఉన్న ఫ్యామిలీ ఉంది. అలాగే మా ఆఫీసు ఒకటి క్లోజ్‌ చేశాం... ఆ ఆఫీసులో ఉన్న ఇద్దరు పిల్లలు మా ఇంట్లో ఉంటారు. ఇక ఆ ఫ్యామిలీ, ఈ పిల్లలు అందరూ కలిసి చేస్తుంటాం. మా నాన్న కూడా సలహాలు ఇస్తుంటారు. మా తరుణ్‌కి చాలా స్ట్రెస్‌ ఉండిందనుకోండి... అప్పుడు వంట చేస్తాడు. నా వంటిల్లు మొత్తం హైజాక్‌ అయి΄ోతుంది (నవ్వుతూ). వాడి బర్త్‌డేకి వాడికి తెలియకుండా వంటల బుక్‌ రాసి, గిఫ్ట్‌గా ఇచ్చాను. 

ఈ తరానికి నేర్పుదాం
మన యంగర్‌ జనరేషన్‌కి మనం స్ఫూర్తిగా ఉండాలనుకుంటాను. ఇప్పుడు మనం వండితే భవిష్యత్తులో అప్పట్లో మన అమ్మ అలా వండేది కదా అనుకుంటారు. సో... యంగర్‌ జనరేషన్‌కి మన కల్చర్‌ అలవాటు చేయాలి. అందుకే మనం ఇంట్లోనే వండాలి. అమ్మ కష్టపడి వంట చేస్తుంటే పిల్లలకు హెల్ప్‌ చేయాలనిపిస్తుంది. మా తరుణ్‌ ఈ మధ్య ఓ రెండు రోజులు ఇంటికి రావడానికి కూడా కుదరలేదు. ఒక సినిమాకి డైలాగ్స్‌ రాస్తున్నాడు. ఆ స్ట్రెస్‌లో ఉన్నాడు. ఇంటికి వచ్చాక ఒక గిల్ట్‌తో ‘ఇంకో రెండు మూడు పేజీలు రాయాలమ్మా... అయిపోతుంది’ అన్నాడు. ఎంత బిజీగా ఉన్నప్పటికీ సకినాలు చేయడంలో నాకు హెల్ప్‌ చేశాడు (నవ్వుతూ).

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement