
మృతుడు భరత్‌కు హెచ్‌ఐవీ ఉన్నట్లు భార్య బంధువుల ఆరోపణ
యశవంతపుర : కుటుంబ కలహాలతో బావిలోకి దూకి ఆత్మహత్య చేసుకున్న హాసన జిల్లా చన్నరాయపట్టణ తాలూకా కబ్బళి గ్రామానికి చెందిన తల్లీ కుమారుడు జయంతి, భరత్‌ల కేసు మలుపు తిరిగింది. కోడలితో పొసగని కారణంతో జయంతి, కొడుకుతో కలిసి ఆత్మహత్య చేసుకున్నట్లు భావిస్తుండగా అందులో వాస్తవం లేదని అంటున్నారు. భరత్‌కు హెచ్‌ఐవీ సోకిందని, దీంతో తల్లీ కొడుకు ఆత్మహత్యకు పాల్పడినట్లు మృతుడు భరత్ భార్య గీత బంధువులు అరోపిస్తున్నారు. భరత్‌కు మూడేళ్ల నుంచి హెచ్‌ఐవీ ఉందని, ఈ విషయాన్ని దాచిపెట్టి పెళ్లి చేశారని, 15 రోజులు మాత్రమే భరత్ గీతతో కాపురం చేశాడని గీతా తరఫువారు చెప్పారు.
హెచ్‌ఐవీ విషయం బయటకు పొక్కకుండా గీతపై భరత్, జయంతిలు ఒత్తిడి చేసినట్లు ఆరోపిస్తున్నారు. కాగా దంపతుల మధ్య కలహాలు వచ్చినప్పుడు పెద్దలు పంచాయితీ పెట్టగా గీత మద్యం తాగుతోందని, డ్రగ్స్ తీసుకుంటోందని భరత్ ఆరోపణలు చేశారు. దీంతో గీతను కొద్ది రోజుల పాటు బంధువుల ఇంటిలో ఉంచారు. మరోసారి పంచాయితీ చేసి గీతను అత్తింటికి పంపించారు. భరత్ రోజూ వేసుకునే మాత్రలను గీత ఫొటో తీసి తన అక్కకు పంపింది. వాటిని నర్సుకు చూపించగా హెచ్‌ఐవీ ఔషధాలని తెలిసిందని గీత కుటుంబ సభ్యులు అంటున్నారు. దీంతో భరత్‌కు వైద్య పరీక్షలు చేయించేలా పెద్దలు పంచాయితీ చేయగా ఒక తేదీని ఖరారు చేశారు. అయితే భరత్ ఆధార్ కార్డ్ ఇవ్వలేదని చెబుతున్నారు.
ఈ నెల 9న భరత్ బంధువుల ఇంటికి వెళ్లి బైక్‌లో కబ్బళిలోని ఇంటికి వెళ్లాడు. ఆపై తల్లితో కలిసి నెరలెకెరె గ్రామంలోని అవ్వ ఇంటికి వెళ్లి బంగారం, వెండి నగలు ఆమెకు అందజేసి ఆశీర్వాదం తీసుకొని 10వ తేదీ వేకువజామున 3:15 గంటలకు సమీపంలోని బావిలోకి దూకారు. కానీ గీత పెట్టిన మానసిక వేధింపులతోనే జయంతి, భరత్‌లు ఆత్మహత్య చేసుకున్నట్లు జయంతి బంధువులు ఆరోపిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment