తొలి ఏకాదశి విశిష్టత? ఆ పేరు ఎలా వచ్చిందంటే..! | Toli Ekadasi 2024: Importance And Significance | Sakshi
Sakshi News home page

తొలి ఏకాదశి విశిష్టత? ఆ పేరు ఎలా వచ్చిందంటే..!

Published Wed, Jul 17 2024 8:51 AM | Last Updated on Wed, Jul 17 2024 12:50 PM

Toli Ekadasi 2024: Importance And Significance

హిందువుల తొలి పండుగ తొలి ఏకాదశి. ఈ పర్వదినంతోనే మన పండగలు మొదలవుతాయి. వరసగా వినాయక చవితి, దసరా, దీపావళి, సంక్రాంతి పండగలు వస్తాయి. హైందవ సంస్కృతిలో తొలి ఏకాదశికి విశేష స్థానముంది. దీన్ని ‘శయనైకాదశి’ అని, ‘హరి వాసరం’, ‘పేలాల పండగ’ అని కూడా పిలుస్తారు. తొలి ఏకాదశి సందర్భంగా.. ఈ పండగ విశిష్టత, పూజా విధానం గురించి సవివరంగా తెలుసుకుందాం..

ఒక ఏడాదిలో 24 ఏకాదశుల్లో వస్తాయి. వీటిలో ఆషాఢ శుద్ధ ఏకాదశిని ‘తొలి ఏకాదశిగా’గా పిలుస్తారు. పురాణాల ప్రకారం.. శ్రీమహావిష్ణువు క్షీరసాగరంలో శేషతల్పంపై నాలుగు నెలల పాటు శయనిస్తాడు. అక్టోబర్ లేదా నవంబర్ నెలల్లో వచ్చే ప్రబోధినీ ఏకాదశి ఆయన తిరిగి మేల్కొంటాడు. ఈ నాలుగు నెలల్ని చాతుర్మాసాలుగా వ్యవహరిస్తారు. తొలి ఏకాదశి నుంచి 4 నెలల పాటు చాతుర్మాసదీక్షను ఆచరిస్తారు. ఈ నాలుగు నెలలు స్వామివారు పాతాళ లోకంలో బలి చక్రవర్తి వద్ద ఉండి కార్తీక పౌర్ణమి నాడు తిరిగి వస్తాడని పురాణగాథ ఒకటి ప్రాచుర్యంలో ఉంది.

పూజకు పూజ.. ఆరోగ్యానికి ఆరోగ్యం..
ఉత్తరాయణంలో కంటే దక్షిణాయనంలో పర్వదినాలు ఎక్కువగా వస్తాయి. వాతావరణంలో మార్పులు అధికంగా సంభవించే కాలం కూడా ఇదే. కాబట్టి ఈ కాలంలో ఆరోగ్య పరిరక్షణా నియమాలు ఆచరించాలి. అందువల్ల ఈ కాలంలో పెద్దలు వ్రతాలు, పూజలు ఆచరించాలని నిర్దేశించారు. అంటే తొలి ఏకాదశి ఉపవాస దీక్ష ఆరోగ్య పరంగానూ మనకు మేలు చేస్తుందన్నమాట.

ఏకాదశి విశిష్టత..
కృతయుగంలో మురాసురుడనే రాక్షసుడు.. బ్రహ్మ వరంతో దేవతలను, రుషులను హింసించాడని మరో కథ ప్రాచుర్యంలో ఉంది. ఆ రాక్షసుడితో శ్రీమహావిష్ణువు వెయ్యేళ్లు పోరాడి, అలసిపోయి ఓ గుహలో విశ్రాంతి తీసుకుంటుండగా.. శ్రీహరి శరీరం నుంచి ఓ కన్య ఆవిర్భవించి, ఆ రాక్షసుణ్ని అంతం చేసిందట. ఇందుకు సంతోషించిన శ్రీమహావిష్ణువు ఆ కన్యను వరం కోరుకోమనగా.. తాను విష్ణుప్రియగా లోకం చేత పూజలు అందుకోవాలని కోరుకుందట. నాటి నుంచి ఆమె ‘ఏకాదశి’ తిథిగా వ్యవహారంలోకి వచ్చింది. అప్పటి నుంచి సాధువులు, భక్తులు ‘ఏకాదశి’ వ్రతం ఆచరించి విష్ణుసాయుజ్యం పొందినట్లుగా పురాణాలు చెబుతున్నాయి. అంబరీషుడు, మాంధాత, తదితర పురాణ పురుషులు ఏకాదశి వ్రతాన్ని ఆచరించినట్లు రుషులు చెబుతారు.

ఏం చేయాలి..?
ఏకాదశి రోజున ఉపవాసం ఉండాలి. ఆ రోజు రాత్రంతా జాగరణ చేయాలి. ఈ సమయంలో విష్ణుసహస్రనామ పారాయణ, విష్ణుమూర్తికి సంబంధించిన భాగవతాన్ని చదువుకోవడం లాంటివి చేయాలి. మరుసటి రోజైన ద్వాదశి నాడు సమీపంలోని దేవాలయానికి వెళ్లి ఉపవాస దీక్షను విరమించాలి. తొలి ఏకాదశి రోజున ఆవులను పూజిస్తే విశేష ఫలితాలు కలుగుతాయని చెబుతారు.

తొలి ఏకాదశి నాడు పేలాల పిండిని తప్పక తినాలని పెద్దలు చెబుతారు. పేలాలు పితృదేవతలకు ఎంతో ఇష్టమైనవి. అంతేకాకుండా మనకు జన్మనిచ్చిన పూర్వీకులను పండగ రోజున గుర్తు చేసుకోవడం మన బాధ్యత. వాతావరణ పరిస్థితుల్లో మార్పు వచ్చే కాలం కాబట్టి మన శరీరం ఆరోగ్యపరంగా అనేక మార్పులకు లోనవుతుంది. గ్రీష్మ రుతువు ముగిసిన తర్వాత వర్ష రుతువు ప్రారంభమయ్యే కాలంలో ఉష్ణోగ్రతలు ఒక్కసారిగా పడిపోతాయి. ఈ సమయంలో శరీరానికి పేలాల పిండి వేడిని కలగజేస్తుంది. అందువల్ల ఈ రోజున ఆలయాల్లో, ఇళ్లలో పేలాల పిండిని ప్రసాదంగా పంచడం ఆనవాయితీగా వస్తోంది.

ఆషాఢ మాసంలో వచ్చే శుద్ధ ఏకాదశికి తొలి ఏకాదశి అని పేరు. ఈరోజు నుంచి శ్రీమహావిష్ణువు నాలుగు నెలలపాటు యోగనిద్రకు ఉపక్రమిస్తాడు. కార్తికంలో వచ్చే ఉత్థాన ఏకాదశినాడు తిరిగి మేల్కొంటాడు. దక్షిణాయన ప్రారంభకాలంలో వచ్చే తొలి ఏకాదశి పర్వం విష్ణుభక్తులకు పరమపవిత్రం. ఉపవాస జాగరణలతో ఈ పర్వదినాన్ని భక్తిశ్రద్ధలతో జరుపుకుంటారు.

ఈ రోజు జగన్నాథుడికి స్వర్ణాలంకారం 
జగన్నాథుడి తిరుగు రథయాత్ర మొదలైన మరునాడు– అంటే, తొలి ఏకాదశి రోజున జగన్నాథుని స్వర్ణాలంకృతుని చేస్తారు. దీనినే స్థానికంగా ‘సునా బేషొ’ అంటారు. జగన్నాథుడి స్వర్ణాలంకార వేషాన్నే ‘రాజ వేషం’, ‘రాజాధిరాజ వేషం’ అని కూడా అంటారు. జగన్నాథ, బలభద్ర, సుభద్ర విగ్రహాలకు బంగారు కాళ్లు, చేతులను, ముఖాలకు బంగారు ఊర్థ్వపుండ్రాలను అలంకరిస్తారు. జగన్నాథుడి ఊర్ధ్వపుండ్రానికి వజ్రం, బలభద్రునికి కెంపు, సుభద్ర ఊర్ధ్వపుండ్రానికి పచ్చ ΄దిగి ఉంటాయి.

జగన్నాథుడి చేతుల్లో బంగారు శంఖు చక్రాలను, బలభద్రుడి చేతుల్లో బంగారు గద, హలాయుధాలను అలంకరిస్తారు. జగన్నాథ, బలభద్ర, సుభద్రలకు వజ్రాలు సహా రత్న కిరీటాలు, కర్ణకుండలాలు, నాసాభరణాలు, కంఠహారాలు, బంగారు పుష్పమాలలు, వడ్డాణాలు, రాహురేఖలను అలంకరిస్తారు. జగన్నాథుడి కిరీటంపై ప్రత్యేకంగా బంగారు నెమలి పింఛాన్ని కూడా అలంకరిస్తారు.

(చదవండి: రూ.14 వేలకే 'దివ్య దక్షిణ యాత్ర'..తొమ్మిది రోజుల్లో ఏకంగా ఏడు..!)
 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement