King Dambhodbhava Interesting Story In Telugu - Sakshi
Sakshi News home page

King Dambhodbhava: దంభోద్భవుడి గర్వభంగం.. అందుకే విర్రవీగకూడదంటారు

Published Mon, Jul 17 2023 4:21 PM | Last Updated on Mon, Jul 17 2023 4:47 PM

Intresting Story Of King Dambhodbhava Defeat And His Proud Attitude - Sakshi

పూర్వం దంభోద్భవుడు అనే రాజు ఉండేవాడు. మహా బలశాలి. సమస్త భూమండలాన్నీ పాలించేవాడు. అంతేకాదు, పేరుకు తగినట్లే మహా గర్విష్టి. రాజోచితంగా అలంకరించుకుని సభకు వచ్చి స్వర్ణ సింహాసనంపై ఆసీనుడయ్యేవాడు. ప్రతిరోజూ అతడు సభలోకి అడుగుపెడుతూనే వందిమాగధులు అతడి బలపరాక్రమాలను చిలవలు పలవలుగా పొగుడుతూ కీర్తనలను గానం చేసేవారు. సభాసదులు జయజయ ధ్వానాలు పలికేవారు. దంభోద్భవుడు వీనులవిందుగా వాటిని ఆలకిస్తూ, గర్వాతిశయంతో మీసాలను మెలితిప్పుకొనేవాడు. 

గుణగానాల ప్రహసనం సద్దుమణిగాక దంభోద్భవుడు గర్వాతిశయంతో సభాసదులను తిలకిస్తూ, స్వోత్కర్ష మొదలు పెట్టేవాడు. ‘ఈ భూమండలంలో నన్ను ఎదిరించి, ఓడించే వీరుడెవడైనా ఉన్నాడా? బాణ ఖడ్గ గదా యుద్ధాల్లో నన్ను మించిన వాడున్నారా? మల్లయుద్ధంలోనైనా నాతో తలపడగల వాడున్నారా? ఎవరైనా ఉంటే చెప్పండి. క్షణాల్లోనే మట్టుబెడతాను’ అంటూ గర్వంగా నవ్వుతూ భుజాలు ఎగరేసేవాడు. దంభోద్భవుడి మంత్రులు కూడా అతడికి తగిన వారే! రోజూ అతడి బల పరాక్రమాలను పొగుడుతూ కాలక్షేపం చేసేవారు. దంభోద్భవుడికి నానాటికీ అహంకారం పెరగసాగింది. ఒకరోజు కొందరు విప్రులు దంభోద్భవుడిని చూడవచ్చారు. దంభోద్భవుడు వారికి సాదరంగా స్వాగతం పలికి, అతిథి సత్కారాలు చేశాడు. వారి ఎదుట అలవాటు కొద్దీ స్వోత్కర్ష మొదలుపెట్టాడు.

పాపం ఆ విప్రులు కిక్కురుమనకుండా అతడి ప్రగల్భాలన్నింటినీ ఓపికగా ఆలకించారు. దంభోద్భవుడు తన ప్రసంగాన్ని ఆపి, ఇక మీరేమంటారు అన్నట్లుగా విప్రులకేసి చూసి కళ్లెగరేశాడు.‘రాజా! నువ్వు మహావీరుడవు, అసామాన్య శూరుడవు, పరాక్రమవంతుడవు, అమిత బలసంపన్నుడవు. భూమ్మీద ఉన్న రాజులెవరూ నిన్ను ఎదిరించి నిలువలేరు. అంతవరకు నిజమే!’ అన్నారు.‘అంతవరకు నిజమే అనడంలో అంతరార్థమేమిటి?’ కనుబొమలు ముడివేస్తూ ప్రశ్నించాడు దంభోద్భవుడు.‘రాజా! గంధమాదన పర్వతంపై నరనారాయణులనే ఇద్దరు రుషిపుంగవులు తపస్సు చేసుకుంటూ ఉన్నారు. వారిని జయించగల వీరులు ముల్లోకాలలోనూ లేరని విన్నాం. నీ పరాక్రమాన్ని చాటుకోవాలనే కోరిక ఉంటే, వారితో యుద్ధంచేసి సంగతి తేల్చుకోవచ్చు’ అన్నారు విప్రులు.విప్రులు ఆ మాట అనడంతోనే దంభోద్భవుడు ఆగ్రహంతో ఊగిపోయాడు. కాలు నేలకేసి బలంగా తాటించాడు. కత్తి తీసి ఝుళిపించాడు. మీసం మెలితిప్పాడు.

‘నన్ను మించిన వీరులా వాళ్లు, ఎంత కావరం?’ అంటూ అప్పటికప్పుడే యుద్ధానికి బయల్దేరమంటూ సైన్యాన్ని ఆదేశించాడు. సాయుధంగా రథం సిద్ధం చేసుకుని, హుటాహుటిన బయలుదేరాడు.దంభోద్భవుడు గంధమాదన పర్వతం వద్దకు చేరుకునే సరికి, కొండ మీద నరనారాయణులు ప్రశాంతంగా తపస్సు చేసుకుంటూ కనిపించారు. వారిని చూసి, తొడగొట్టి యుద్ధానికి రమ్మంటూ పిలిచాడు. పిలుపు విని నరనారాయణులు లేచి వచ్చి, అతడికి అతిథి సత్కారాలు చేయబోయారు. ‘ఇవన్నీ నాకు వద్దు. నాకు కావలసింది మీతో యుద్ధం’ అన్నాడు దంభోద్భవుడు.‘నాయనా! మేం మునులం. ఇక్కడ తపస్సు చేసుకుంటున్నాం. మమ్మల్ని తపస్సు చేసుకోనీ. నువ్వు వచ్చిన దారినే వెనక్కు వెళ్లు’ అన్నారు. దంభోద్భవుడు వినలేదు. వికటాట్టహాసం చేస్తూ యుద్ధం చేయాల్సిందేనంటూ వారిపై సంధించడానికి బాణం తీశాడు. 

నరనారాయణుల్లోని నరుడు ఒక దర్భపుల్ల తీసుకుని ప్రయోగించాడు. అది దంభోద్భవుడి బాణాన్ని తుంచేసింది. అతడు వరుస బాణాలు కురిపించాడు. అతడి సైన్యం కూడా బాణాలు ప్రయోగించింది. వాటన్నింటినీ ఆ దర్భపుల్ల తుత్తునియలు చేసింది. సైనికులను గాయపరచింది. వారు హాహాకారాలు చేస్తూ పలాయనం చిత్తగించారు. దంభోద్భవుడికి ధైర్యం సడలింది. ఆయుధాలను కిందపెట్టి, నరనారాయణుల పాదాల మీద వాలాడు. ‘మహర్షులారా! నన్ను క్షమించి అనుగ్రహించండి. నా గర్వానికి ప్రాయశ్చిత్తం జరిగింది’ అని ప్రార్థించాడు.‘నాయనా! పరాక్రమం ఉన్నవారు ఇతరుల రక్షణ కోసం ఆ పరాక్రమాన్ని ఉపయోగించాలి. ధనం ఉన్నవారు నిరుపేదలకు దానం చేయడానికి ఉపయోగించాలి. గర్వాతిశయంతో మిడిసిపడటం తగదు. నిస్సహాయులకు సహాయం చేయని జన్మ వ్యర్థం’ అని హితవు పలికారు. గర్వభంగమైన దంభోద్భవుడు వారి నుంచి సెలవు తీసుకుని వెనక్కు మళ్లాడు.
 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement