ఇద్దరు పోప్‌లకు సెయింట్ హోదా
పోప్ ఫ్రాన్సిస్ ప్రకటన
పోప్ 23వ జాన్, పోప్ రెండో జాన్‌పాల్‌లకు అరుదైన గౌరవం
కార్యక్రమానికి హాజరైన రిటైర్డ్ పోప్ పదహారో బెనెడిక్
వాటికన్ సిటీ: పోప్ 23వ జాన్, పోప్ రెండో జాన్‌పాల్‌లకు సెయింట్ హోదాను కల్పిస్తూ పోప్ ఫ్రాన్సిస్ ఆదివారం అధికారికంగా ప్రకటించారు. ఆదివారం వాటికన్ సిటీలోని సెయింట్ పీటర్స్ స్క్వేర్‌లో జరిగిన కార్యక్రమంలో పోప్ ఫ్రాన్సిస్ వారికి సెయింట్ హోదాతో అరుదైన గౌరవం కట్టబెట్టారు. పోప్ ఫ్రాన్సిస్ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమానికి రిటైర్డ్ పోప్ పదహారో బెనెడిక్ట్ కూడా రోమన్ కేథలిక్ మతాధికారులతో కలిసి హాజరు కావడం విశేషం. ఇంతకుముందెప్పుడూ పోప్, రిటైర్డ్ పోప్ ఇలాంటి బహిరంగ కార్యక్రమంలో పాల్గొనలేదు. వేలాది మంది భక్తుల సమక్షంలో జరిగిన ఈ కార్యక్రమంలో పోప్ ఫ్రాన్సిస్ తొలుత సెయింట్ హోదా కల్పించే ప్రక్రియను లాటిన్‌లో పఠించారు. అనంతరం 23వ జాన్, రెండో జాన్‌పాల్‌లు ఇక సెయింట్‌లు అని, వారిని ఇకపై చర్చి ఆరాధిస్తుందని ప్రకటించారు.
దీంతో సెయింట్ పీటర్స్ స్క్వేర్ నుంచి టైబర్ నది దాకా ఒక్కసారిగా భక్తుల కరతాళ ధ్వనులు మిన్నంటాయి. గతేడాది రిటైర్ అయిన తర్వాత అజ్ఞాతంలోనే ఉంటానని పోప్ బెనెడిక్ట్ ప్రకటించినప్పటికీ ఈ కార్యక్రమంలో పాల్గొనాల్సిందిగా పోప్ ఫ్రాన్సిస్ కోరారు. అయితే కేథలిక్ చర్చి ఐక్యతను చాటేలా ఇద్దరు పోప్‌లు ఈ కార్యక్రమంలో పాల్గొనడం పోప్‌లకు సెయింట్ హోదాపై వివాదాలకు తావు లేకుండా చూడాలనేదానికి సంకేతంగా నిలిచింది. కాగా పోప్ 23వ జాన్ 1958 నుంచి 1963లో పరమపదించేదాకా పోప్ పదవిలో ఉన్నారు. పోప్ రెండో జాన్‌పాల్ 1978-2005లో పరమపదించేదాకా పోప్ పదవిలో కొనసాగారు.
కే రళ కేథలిక్కుల సంబరాలు: కేరళను సందర్శించిన ఏకైక పోప్ అయిన పోప్ రెండో జాన్‌పాల్ అంటే కేరళలోని కేథలిక్కులకు ప్రత్యేక అభిమానం. 1986లో ఆయన రెండు రోజులు కేరళలో పర్యటించారు. సిస్టర్ అల్ఫోన్సా, కురియకోస్ ఎలియాస్ చవరా అచెన్‌ల బీటిఫికేషన్ కోసం కేరళకు వచ్చిన ఆయన పర్యటనకు ముందు మళయాళం నేర్చుకుని మరీ విచ్చేశారు. ఆయనకు సెయింట్ హోదా ప్రకటించడంతో కేరళలోని కేథలిక్కులు సంబరాల్లో మునిగారు.