రాజమహేంద్రవరం క్రైం : రాజమండ్రిలోని యాచిస్తూ జీవనం గడుపుతూ మరణించిన ఓ వృద్ధ సాధువు జోలె సంచిలో రూ. లక్షా 80 వేల నగదు ఉండటం చూసి స్థానికులు ఆశ్చర్యపోయారు. జోలె సంచిలో రకరకాల కవర్లలో సాధువు నగదు దాచుకున్నారు. ఆ సంచితోనే గోదావరి గట్టుపై ఆయన నిద్రించేవారు. కమల్ హాసన్ పుష్పకవిమానం సినిమాలోని సీన్ తరహాలోనే చనిపోయిన యాచకుడి వద్ద భారీ డబ్బు దొరికిందని అంటున్నారు. ఈ సంఘటన రాజమహేంద్రవరం వన్‌టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది.
వన్‌టౌన్ ఇన్‌స్పెక్టర్ త్రినా«థ్, ఎస్సై వెంకయ్య కథనం ప్రకారం.. రాజమహేంద్రవరం గోదావరి గట్టున ఉన్న మార్కెండేయ స్వామి గుడి ఎదురుగా ఉన్న ప్రాంతంలో సుమారు 75 ఏళ్ల వృద్ధ సాధువుగా గత పదేళ్లుగా భిక్షాటన చేసుకుంటూ జీవిస్తున్నట్టు స్థానికులు తెలిపారు. గురువారం మధ్యహ్న భోజనం చేసిన అనంతరం గుడి వద్దకు చేరుకొని ఒక్కసారిగా ఫిట్స్ వచ్చి కుప్పకూలిపోయాడు. పక్కనే ఉన్న ఉన్నవారు ప్రథమ చికిత్స చేసినా లాభం లేకపోయింది. అనంతరం గుండె నొప్పి వచ్చి మృతి చెందాడు.
స్థానికులు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో సంఘటన స్థలానికి చేరుకున్న వన్‌టౌన్ సీఐ త్రినా«థ్, ఎస్సై వెంకయ్యలు మృతుడి వివరాల కోసం సాధువు వద్ద ఉన్న జోలేను తనిఖీ చేయగా దానిలో రూ. 1,80,465 ఉన్నట్టు గుర్తించారు. నగదును సంఘటన స్థలంలోనే లెక్కించి స్వాధీనం చేసుకున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. వన్‌టౌన్ ఎస్సై వెంకయ్య కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మృతుడి వివరాలు తెలియాల్సి ఉంది. పేరు నాగేశ్వరరావుగా స్థానికులు చెబుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment