కళ్లు తెరిచి చూడవయ్యా.. మీ గమ్యస్థానం కనిపిస్తుంది | The ultimate goal of every living thing and the real lesson for human being | Sakshi
Sakshi News home page

కళ్లు తెరిచి చూడవయ్యా.. మీ గమ్యస్థానం కనిపిస్తుంది

Published Thu, Jul 20 2023 11:54 AM | Last Updated on Thu, Jul 20 2023 12:18 PM

The ultimate goal of every living thing and the real lesson for human being - Sakshi

ఈ భూమి మీద పుట్టిన ప్రతి జీవికి ఒక లక్ష్యం ఉంటుంది. చాలా జీవులు ఆ విషయాన్ని తెలుసుకోకుండానే తమ జీవితాన్ని పూర్తి చేస్తాయి. అడవిలో ఉన్న జంతువుకు దాని ప్రాణాలు కాపాడుకోవడమే అతి పెద్ద లక్ష్యం. ఆకాశంలో తిరిగే పక్షులకు, నీళ్లలో ఈదే చేపలకు ఆ పూట కడుపు నింపుకోవడమే తమ ముందున్న లక్ష్యం. మరి మెదడున్న మనిషికి మాత్రం అంతకంటే పెద్ద లక్ష్యాన్ని దేవుడు నిర్ణయించాడు. జంతువులా కాకుండా.. భిన్నంగా కొంతైనా సమాజానికి ఉపయోగపడాలని నిర్దేశించాడు. ఆ కర్తవ్య బోధను అర్థం చేసుకున్న వాడు గొప్పవాడయ్యాడు. అది అర్థమయ్యేందుకు చిన్న కథలు రెండు. 

మొదటి కథ 

ఒక కుక్క కాశీకి వెళ్దామని బయలు దేరింది. ఎలాగైనా విశ్వనాథుడిని దర్శించుకోవాలన్నది దాని లక్ష్యం. బ్రహ్మండమైన పట్టుదలతో బయల్దేరింది. దారి మధ్యలో ఒక బొక్క కనిపించింది. కాశీకి తర్వాత పోదాంలే.. ముందు బొక్క సంగతి చూద్దామనుకుంది. ఆ బొక్క నోట కరుచుకున్నాక.. పరవశమయింది. కాశీకి పోయే దారి వదిలేసి బొక్క నాకడం మొదలుపెట్టింది. ఆ తర్వాత కథ షరా మామూలే. 

మనిషి పాత్ర

అలాగే… మనిషి పాత్ర కూడా అంత గొప్పేమీ కాదు. జీవుడు తల్లి గర్భంలో ఉన్నప్పుడు ‘దేవుడి వద్దకు చేరాలి ఈ బాధ నేను భరించలేను’ అని నిర్ణయించుకుంటాడు. తన లక్ష్యం అదే అని ఎంచుకుంటాడు. కానీ జన్మించిన తర్వాత.. భౌతిక ప్రపంచాన్ని చూస్తూ తను లక్ష్యాన్ని వదిలేస్తాడు. సుఖదుఃఖ జనన మరణాలలోనే ఉండి పోతున్నాడు. ఇలా ఎన్నో జన్మలు అనుకుంటూనే ఉన్నాడు. జన్మించిన  తర్వాత మర్చిపోతూనే ఉన్నాడు. అదృష్టవంతులు కొందరు మాత్రమే దైవాన్ని చేరుకుంటున్నారు. వారే ధన్యజీవులు.

రెండో కథ చదివితే మీకు మరింత స్పష్టంగా అర్థమవుతుంది.

ఒక ఆవు గడ్డి మేయడానికి అడవిలోకి వెళ్లిoది. పాపం దానికి సమయం తెలియలేదు. ఇంతలో సాయంత్రం అయ్యింది చీకటిపడేలా ఉంది. ఇంతలో ఓ పులి తనవైపు పరిగెత్తుకుంటూ రావడం చూసింది. పులి నుంచి తప్పించుకోవడం కోసం అటూ ఇటూ పరుగెత్తింది. పులి కూడా అంతే వేగంగా వెంబడిస్తోంది. చివరికి ఆవుకు ఎదురుగా ఒక చెరువు కనిపించింది. పులి నుంచి తప్పించుకునే కంగారులో చెరువులోకి దూకేసింది. పులి ఆకలి మీదుంది. ఎలాగైనా ఆవుని పట్టుకోవాలన్న తాపత్రయంలో అది కూడా చెరువులోకి దూకేసింది.

క్షణాల్లో మారిన ప్రాధాన్యతలు

ఆ చెరువులో నీళ్ళు తక్కువగా ఉన్నాయి, పైగా అందులో లోతైన బురద ఉంది. ముందు వెనకా చూసుకోకుండా దూకడం వల్ల ఆవు పీకల్లోతున బురదలో కూరుకుపోయింది. ఆవుని చంపాలని వచ్చిన పులి కూడా అదే బురదలో చిక్కుకుంది. ఇప్పుడు రెండింటి లక్ష్యాలు మారిపోయాయి. ఆ క్షణం వరకు పులి నుంచి తప్పించుకోవాలనుకున్న ఆవుకు ఇప్పుడు బురదనుంచి బయటపడడం ముఖ్యం. పులి సంగతి కూడా అంతే. ఆవు కాకపోతే మరేదైనా తినొచ్చు కానీ ఈ బురద బారి నుంచి ఎలా బయటపడాలన్నది అర్థం కావడం లేదు. 

ఆవులో ఆలోచన, పులిలో ఆహంకారం

ఇప్పుడు ఆవు, పులీ రెండూ ఒక దానికి ఒకటి ఎదురు ఎదురుగా కదలలేని స్థితిలో నిలబడిపోయాయి. ఇక్కడే ఆవులో ఆలోచన ప్రకాశవంతమయింది. పులి నుంచి తప్పించుకున్నానన్న ఉత్తేజం, ఈ దుస్థితి నుంచి బయటపడతానన్న నమ్మకం దానిలో ఉన్నాయి. అందుకే పులితో మాట్లాడడం మొదలెట్టింది. "నీకెవరైనా యజమాని గానీ గురువు గానీ ఉన్నారా.?” అని అడిగింది.

ఎప్పుడు చస్తానో తెలియని పులికి ఇంకా బింకం పోలేదు. "నేనే ఈ అడవి అంతటికీ యజమానిని, నాకు మళ్లీ వేరేగా ఎవరు యజమాని ఉంటారు?” అంది గొప్పగా.

అప్పుడు ఆవు ఇలా అంది, “నీ గొప్పదనం, నీ శక్తి ఇవేవీ కూడా ఇప్పుడు నిన్ను ఈ స్థితిలో రక్షించలేక పోయాయికదా..”అంది.

అప్పుడు ఆ పులి, ఆవుతో ఇలా అంది, “నీ పరిస్థితి కూడా నాలాంటిదే కదా, నువ్వు కూడా నాలాగే పీకల్లోతులో మునిగిపోయావు, చావుకు దగ్గరలో ఉన్నావు మరి ఇప్పుడు నిన్ను ఎవరు రక్షిస్తారు.?” అంది.

అప్పుడు ఆవు చిరునవ్వుతో ఇలా అంది.. “చాలా తప్పు. నాకు ఒక యజమాని ఉన్నాడు, సాయంత్రం అయ్యేసరికి నేను ఇంటికి చేరకపోతే నన్ను వెతుక్కుంటూ, ఎంత దూరమైనా వచ్చి నన్ను ఈ బురదనుంచి బయటకు లాగి క్షేమంగా ఇంటికి తీసుకెళతాడు. మరి నిన్ను ఎవరు బయటకు లాగుతారు.?” అంది.

ఇలా అన్న కొద్దిసేపటికే ఆ ఆవు యజమాని నిజంగానే వచ్చాడు. వచ్చీ రాగానే పరిస్థితి గమనించాడు. జాగ్రత్తగా ఓ తాడును కట్టి ఆవుని అతి కష్టం మీద ఆ బురదగుంట నుంచి బయటకు లాగాడు. ఆ ఆవు తన యజమాని కేసి ఎంతో కృతజ్ఞతా పూర్వకంగా చూసింది. 

ఇక్కడ గమనించాల్సిన విషయమేంటంటే.. తలుచుకుంటే ఆ ఆవు, మరియు దాని యజమాని.. వాళ్లిద్దరూ కలిస్తే ఆ పులిని బయటకు లాగగలరు, కానీ అది వాళ్ళ ప్రాణాలకు ముప్పు అని గ్రహించి, ఆ పులిని బురదలో వదిలేసి వెళ్లిపోయారు.


ఈ కథలో... 

ఆవు -  సర్వసమర్పణ చేసిన సాధకుని హృదయo.

పులి-  అహంకారం నిండి ఉన్న మనస్సు.

యజమాని - సద్గురువు/పరమాత్మ

బురదగుంట - ఈ సంసారం/ప్రపంచం

ఆవు-పులి యొక్క సంఘర్షణ : నలుగురిలో మనం మన ఉనికిని చాటుకోవడం కోసం చేసే జీవన పోరాటం.

ఇందులో నీతి ఏంటేంటే..

ఎవరిమీదా ఆధార పడకుండా జీవించడం అనేది మంచి ఉద్దేశ్యమే. కానీ, “నేనే అంతా, నా వల్లే అంతా జరుగుతోంది, నేను లేకపోతే ఏమీ లేదు.. నాకు ఎవరి అవసరం లేదు, రాదు." అనే భావన ఎన్నడూ మనలో కలగరాదు. దీనినే 'అహంకారము' అంటారు. మన వినాశనానికి ఇదే బీజం అవుతుంది.

ఈ జగత్తులో పరమాత్మను మించిన హితాభిలాషి , మన మంచిని కోరుకునే వారు వేరే ఉండరు. వారే అనేక రూపాల్లో వచ్చి, ఆయా సమయాల్లో మనల్ని నిరంతరం అనేక ఆపదల నుంచి రక్షిస్తూ ఉంటారు.
                      
లోకా సమస్తా సుఖినోభవన్తు!

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement