Moral lessons
-
‘ఇసుక తక్కెడ - పేడ తక్కెడ‘ : ఇది ఎలా వచ్చిందంటే!
ఒక ఊరిలో ఇద్దరు దొంగలు వుండేవాళ్ళు. ఒకని ఇల్లేమో ఉత్తరం వైపు, మరొకని ఇల్లేమో దక్షిణం వైపు. వాడు దొంగని వీనికి తెలీదు. వీడు దొంగని వానికి తెలీదు. ఇద్దరూ ఎదుటి వాళ్ళను మాటలతో బోల్తా కొట్టించి మోసం చేయడంలో ఆరితేరినవాళ్లే. ఒకసారి వాళ్ళలో ఒకడు ఒక కావడి తీసుకొని దానికి రెండు వైపులా రెండు ఇసుక కుండలు పెట్టి, అవి కనబడకుండా చిరిగిపోయిన బట్టలు కట్టి భుజానికి తగిలిచ్చుకోని ఎవరిని మోసం చేద్దామా అని వెదుక్కుంటా పోసాగాడు.సరిగ్గా అదే సమయానికి ఇంకొకడు కూడా ఒక కావడి తీసుకోని రెండు వైపులా రెండు పెండతో నింపిన కుండలు పెట్టి, అవి కనబడకుండా ఒక పాత మసిబట్ట కట్టి భుజానికి తగిలిచ్చుకోని మోసం చేయడానికి ఎవరు దొరుకుతారా అని వెదుక్కుంటా బైలు దేరాడు.వాళ్ళిద్దరూ అనుకోకుండా ఒక సత్రం వద్ద కలుసుకున్నారు. వాని మొహం వీడు గానీ, వీని మొహం వాడు గానీ ఎప్పుడూ చూల్లేదు. దాంతో ఇద్దరూ ఎదుటోడు చాలా మంచోడు అని అనుకున్నారు. ఒకరితో ఒకరు మాటల్లో పడ్డారు. మధ్యలో ఇసుక దొంగ ‘అనా.. .. అనా... ఎక్కడికి పోతావున్నావు. ఏముంది నీ కావడిలో అన్నాడు.అప్పుడు వాడు. ‘ఆ... ఏం లేదు. నేను పెద్ద రత్నాల వ్యాపారిని. ఈ రెండు కుండలనిండా మేలు జాతి రత్నాలు వున్నాయి. దారిలో దొంగల భయం ఎక్కువ గదా... అందుకని కుండలకు పాత బట్టలు కట్టినాను. మాపాప పెళ్ళీడు కొచ్చింది. ఈ రత్నాలు అమ్మి బంగారం కొని పాపకు నగలు చేపియ్యాల‘ అన్నాడు.ఆ మాటలు వినగానే ఇసుక దొంగ ‘అబ్బ... వెదకబోయిన తీగ కాలికి తగిలినట్లు వీడు కనబన్నాడు. ఎట్లాగయినా వీన్ని మోసం చేయాలి‘ అనుకున్నాడు. అంతలో పేడ దొంగ ‘అవును... నువ్వేమి చేస్తా వుంటావు. నీ కుండల్లో ఏమున్నాయి‘ అన్నాడు. దానికా ఇసుక దొంగ చిరునవ్వుతో ‘అనా... నేను నీ లాగే వ్యాపారినే. కాకపోతే నగల వ్యాపారిని. మంచి మేలు జాతి రత్నాలు కొని వాటిని బంగారంలో పొదిగి విలువైన హారాలు తయారు చేసి అమ్ముతుంటాను. ఈ రెండు కుండలనిండా బంగారం వుంది. దాన్ని అమ్మి విలువయిన రత్నాలు కొనాలని పోతున్నాను‘ అన్నాడు.ఆ మాటలినగానే పేడదొంగ ‘అబ్బ.... దొరికినాడురా కావలసినోడు. వీన్ని ఎట్లాగయినా మోసం చేసి వీని దగ్గరున్న బంగారం కొట్టేయ్యాలి‘ అనుకున్నాడు. వెంటనే ‘అరెరే... మనిద్దరినీ ఆ దేవుడు ఒక్క చోట కావాలనే కలిపినట్టున్నాడు. నీకు కావలసిన బంగారం నా దగ్గరుంది. నాకు కావలసిన మేలు జాతి రత్నాలు నీ దగ్గరున్నాయి. మనం ఒకరి కావడి మరొకరు మార్చుకుంటే సరి‘ అన్నాడు. ఆ మాటలకు ఇసుకదొంగలోపల్లోపల ‘పడిందిరా పిట్ట‘ అని నవ్వుకుంటా ‘అలాగే నువ్వెలా చెప్తే నేనలాగే‘ అన్నాడు. నీ కావడిలో ఏముందో చూపించు అంటే అవతలి వాడు కూడా నీ కావడిలో ఏముందో నువ్వూ చూపించు అంటారు గదా... అందుకని ఇద్దరు గూడా మారు మాట్లాడకుండా.. ఎదుటివాన్ని మోసం చేస్తున్నాం అనుకుంటా సంబరంగా ఒకరి కావడి మరొకరు మార్చుకున్నారు.మార్చుకున్నాక మరుక్షణం గూడా ఆలస్యం చేయకుండా ఇసుకదొంగ ‘అనా... జాగ్రత్త. దారిలో దొంగలుంటారు. నీ దగ్గరున్నది బంగారం అని తెలిస్తే అంతే.. చీకటి పడకముందే తొందరగా ఇంటికి చేరుకో’’ అన్నాడు. దానికి వాడు ‘తమ్ముడూ నువ్వు కూడా రత్నాలను జాగ్రత్తగా ఇంటికి తీసుకొని పో’ అంటూ వాడు బైలు దేరాడు.ఇద్దరూ సంబరంగా పరుగు పరుగున ఇంటికి చేరుకొని కావడి మీద వున్న బట్ట తీసి చూస్తే ఇంకేముంది ఇసుక దొంగ చేతికి పేడ అంటుకుంది. పేడ దొంగ చేతికి ఇసుక వచ్చింది. ‘అమ్మో నేనే పెద్ద దొంగను అనుకుంటే, ఆవతలోడు నా కన్నా నాలుగాకులు ఎక్కువే చదివినట్లున్నాడే‘ అనుకుంటా ఇద్దరూ గమ్మున నోరుమూసుకున్నారు. ఇదీ కథ.కథ విన్నారుగా... ఈ కథ నుంచే అంతా మోసం అనే అర్థంలో... ‘ఇసుక తక్కెడ – పేడ తక్కెడ‘ అనే జాతీయం వచ్చింది.– డా.ఎం. హరికిషన్ -
‘మా అమ్మాయికి బుద్ధి చెప్పండి స్వామీ’
Moral Story: చాలా సంవత్సరాల క్రితం ఒక ఊరిలో ఒక అమ్మాయి ఉండేది. ఆ అమ్మాయి రోజంతా గాలి కబుర్లు చెప్పుకుంటూ గడిపేసేది. ఇక్కడ మాట అక్కడా, అక్కడి మాట ఇక్కడా చెబుతూ వుంటే చూసి వాళ్ళమ్మ చాలా బాధ పడేది. ఇలా గాలి కబుర్లు చెప్పడం తప్పని ఎంత చెప్పినా ఆ అమ్మాయి మట్టుకు పట్టించుకునేది కాదు. ఈ గాలి కబుర్ల వల్ల లేనిపోని తగాదాలు కూడా వచ్చేవి.ఒక రోజు ఆ ఊరికి ఒక సాధువు వచ్చాడు. ఆయన దర్శనానికి వెళ్లిన ఆ అమ్మాయి వాళ్ల అమ్మ తన బాధ చెప్పుకుంది. ‘మా అమ్మాయికి బుద్ధి చెప్పండి స్వామీ’ అని కోరుకుంది. సాధువు మర్నాడు అమ్మాయిని తన దగ్గరికి తీసుకురమ్మని చెప్పాడు.మర్నాడు పొద్దున్నే అమ్మ తన కూతురుని సాధువు వద్దకు తీసుకుని వెళ్ళింది. సాధువు చారుమతికి ఒక కోడిని చూపించి ‘రోజంతా ఆ కోడి ఈకలు తీసి వూరు మొత్తం చల్లమ్మా’ అని చెప్పాడు.ఎక్కడ తిడతాడో అని భయపడుతూ వచ్చిన అమ్మాయి ‘ఇంతేనా?’ అనుకుంటూ కోడి ఈకలతో వూరంతా తిరుగుతూ కనిపించిన వారందరికి కబుర్లు చెపుతూ ఇక్కడో ఈక, అక్కడో ఈక విసిరేసింది. సాయంత్రం సూర్యాస్తమయం అవుతుంటే ఆ అమ్మాయిని తల్లి మళ్ళీ ఆ సాధువు దగ్గిరకు తీసుకెళ్లింది.‘ఈ రాత్రి నిద్రపోయి మళ్ళి తెల్లవారగానే రండి’ అని పంపాడు సాధువు.మర్నాడు పొద్దున్నే వాళ్లు వెళితే సాధువు అమ్మాయితో, ‘నిన్న రోజంతా విసిరేసిన కోడి ఈకలు వెతికి తీసుకు రామ్మా’ అన్నాడు.అమ్మాయి సరేనని ఊరంతా వెతకడం మొదలెట్టింది. సాయంత్రం దాక ఊరిలో ప్రతి అంగుళం వెతికినా ఒక్క ఈక కనిపించలేదు. దిగాలుగా సాయంత్రానికి ఆ సాధువు దగ్గరకు వెళ్ళి ‘స్వామి, నన్ను క్షమిచండి. నాకు ఒక్క ఈక కూడ దొరకలేదు’ అని చెప్పింది.చదవండి: ‘నలుగురు కూతుళ్లేనా..’ కాదు డాక్టర్ డాటర్స్..!అప్పుడు సాధువు ‘చూశావా... మన మాటలు కూడా ఆ ఈకల లాంటివే. ఒక్క సారి నోరు జారితే ఆ మాటలను మనం యెన్నటికీ తిరిగి తీసుకోలేము’ అని చెప్పాడు. ‘నోరు అదుపులో ఉంటే సమయం వృధా కాదు. చేయవలసిన పనులు పూర్తవుతాయి. జీవితంలో పెట్టుకున్న లక్ష్యాన్ని సాధించవచ్చు’ అన్నాడు.ఆ రోజు నుంచి ఆ అమ్మాయి గాలి కబుర్లు మానేసి చక్కగా చదువుకుని వాళ్ల అమ్మను సంతోషపెట్టింది. -
కళ్లు తెరిచి చూడవయ్యా.. మీ గమ్యస్థానం కనిపిస్తుంది
ఈ భూమి మీద పుట్టిన ప్రతి జీవికి ఒక లక్ష్యం ఉంటుంది. చాలా జీవులు ఆ విషయాన్ని తెలుసుకోకుండానే తమ జీవితాన్ని పూర్తి చేస్తాయి. అడవిలో ఉన్న జంతువుకు దాని ప్రాణాలు కాపాడుకోవడమే అతి పెద్ద లక్ష్యం. ఆకాశంలో తిరిగే పక్షులకు, నీళ్లలో ఈదే చేపలకు ఆ పూట కడుపు నింపుకోవడమే తమ ముందున్న లక్ష్యం. మరి మెదడున్న మనిషికి మాత్రం అంతకంటే పెద్ద లక్ష్యాన్ని దేవుడు నిర్ణయించాడు. జంతువులా కాకుండా.. భిన్నంగా కొంతైనా సమాజానికి ఉపయోగపడాలని నిర్దేశించాడు. ఆ కర్తవ్య బోధను అర్థం చేసుకున్న వాడు గొప్పవాడయ్యాడు. అది అర్థమయ్యేందుకు చిన్న కథలు రెండు. మొదటి కథ ఒక కుక్క కాశీకి వెళ్దామని బయలు దేరింది. ఎలాగైనా విశ్వనాథుడిని దర్శించుకోవాలన్నది దాని లక్ష్యం. బ్రహ్మండమైన పట్టుదలతో బయల్దేరింది. దారి మధ్యలో ఒక బొక్క కనిపించింది. కాశీకి తర్వాత పోదాంలే.. ముందు బొక్క సంగతి చూద్దామనుకుంది. ఆ బొక్క నోట కరుచుకున్నాక.. పరవశమయింది. కాశీకి పోయే దారి వదిలేసి బొక్క నాకడం మొదలుపెట్టింది. ఆ తర్వాత కథ షరా మామూలే. మనిషి పాత్ర అలాగే… మనిషి పాత్ర కూడా అంత గొప్పేమీ కాదు. జీవుడు తల్లి గర్భంలో ఉన్నప్పుడు ‘దేవుడి వద్దకు చేరాలి ఈ బాధ నేను భరించలేను’ అని నిర్ణయించుకుంటాడు. తన లక్ష్యం అదే అని ఎంచుకుంటాడు. కానీ జన్మించిన తర్వాత.. భౌతిక ప్రపంచాన్ని చూస్తూ తను లక్ష్యాన్ని వదిలేస్తాడు. సుఖదుఃఖ జనన మరణాలలోనే ఉండి పోతున్నాడు. ఇలా ఎన్నో జన్మలు అనుకుంటూనే ఉన్నాడు. జన్మించిన తర్వాత మర్చిపోతూనే ఉన్నాడు. అదృష్టవంతులు కొందరు మాత్రమే దైవాన్ని చేరుకుంటున్నారు. వారే ధన్యజీవులు. రెండో కథ చదివితే మీకు మరింత స్పష్టంగా అర్థమవుతుంది. ఒక ఆవు గడ్డి మేయడానికి అడవిలోకి వెళ్లిoది. పాపం దానికి సమయం తెలియలేదు. ఇంతలో సాయంత్రం అయ్యింది చీకటిపడేలా ఉంది. ఇంతలో ఓ పులి తనవైపు పరిగెత్తుకుంటూ రావడం చూసింది. పులి నుంచి తప్పించుకోవడం కోసం అటూ ఇటూ పరుగెత్తింది. పులి కూడా అంతే వేగంగా వెంబడిస్తోంది. చివరికి ఆవుకు ఎదురుగా ఒక చెరువు కనిపించింది. పులి నుంచి తప్పించుకునే కంగారులో చెరువులోకి దూకేసింది. పులి ఆకలి మీదుంది. ఎలాగైనా ఆవుని పట్టుకోవాలన్న తాపత్రయంలో అది కూడా చెరువులోకి దూకేసింది. క్షణాల్లో మారిన ప్రాధాన్యతలు ఆ చెరువులో నీళ్ళు తక్కువగా ఉన్నాయి, పైగా అందులో లోతైన బురద ఉంది. ముందు వెనకా చూసుకోకుండా దూకడం వల్ల ఆవు పీకల్లోతున బురదలో కూరుకుపోయింది. ఆవుని చంపాలని వచ్చిన పులి కూడా అదే బురదలో చిక్కుకుంది. ఇప్పుడు రెండింటి లక్ష్యాలు మారిపోయాయి. ఆ క్షణం వరకు పులి నుంచి తప్పించుకోవాలనుకున్న ఆవుకు ఇప్పుడు బురదనుంచి బయటపడడం ముఖ్యం. పులి సంగతి కూడా అంతే. ఆవు కాకపోతే మరేదైనా తినొచ్చు కానీ ఈ బురద బారి నుంచి ఎలా బయటపడాలన్నది అర్థం కావడం లేదు. ఆవులో ఆలోచన, పులిలో ఆహంకారం ఇప్పుడు ఆవు, పులీ రెండూ ఒక దానికి ఒకటి ఎదురు ఎదురుగా కదలలేని స్థితిలో నిలబడిపోయాయి. ఇక్కడే ఆవులో ఆలోచన ప్రకాశవంతమయింది. పులి నుంచి తప్పించుకున్నానన్న ఉత్తేజం, ఈ దుస్థితి నుంచి బయటపడతానన్న నమ్మకం దానిలో ఉన్నాయి. అందుకే పులితో మాట్లాడడం మొదలెట్టింది. "నీకెవరైనా యజమాని గానీ గురువు గానీ ఉన్నారా.?” అని అడిగింది. ఎప్పుడు చస్తానో తెలియని పులికి ఇంకా బింకం పోలేదు. "నేనే ఈ అడవి అంతటికీ యజమానిని, నాకు మళ్లీ వేరేగా ఎవరు యజమాని ఉంటారు?” అంది గొప్పగా. అప్పుడు ఆవు ఇలా అంది, “నీ గొప్పదనం, నీ శక్తి ఇవేవీ కూడా ఇప్పుడు నిన్ను ఈ స్థితిలో రక్షించలేక పోయాయికదా..”అంది. అప్పుడు ఆ పులి, ఆవుతో ఇలా అంది, “నీ పరిస్థితి కూడా నాలాంటిదే కదా, నువ్వు కూడా నాలాగే పీకల్లోతులో మునిగిపోయావు, చావుకు దగ్గరలో ఉన్నావు మరి ఇప్పుడు నిన్ను ఎవరు రక్షిస్తారు.?” అంది. అప్పుడు ఆవు చిరునవ్వుతో ఇలా అంది.. “చాలా తప్పు. నాకు ఒక యజమాని ఉన్నాడు, సాయంత్రం అయ్యేసరికి నేను ఇంటికి చేరకపోతే నన్ను వెతుక్కుంటూ, ఎంత దూరమైనా వచ్చి నన్ను ఈ బురదనుంచి బయటకు లాగి క్షేమంగా ఇంటికి తీసుకెళతాడు. మరి నిన్ను ఎవరు బయటకు లాగుతారు.?” అంది. ఇలా అన్న కొద్దిసేపటికే ఆ ఆవు యజమాని నిజంగానే వచ్చాడు. వచ్చీ రాగానే పరిస్థితి గమనించాడు. జాగ్రత్తగా ఓ తాడును కట్టి ఆవుని అతి కష్టం మీద ఆ బురదగుంట నుంచి బయటకు లాగాడు. ఆ ఆవు తన యజమాని కేసి ఎంతో కృతజ్ఞతా పూర్వకంగా చూసింది. ఇక్కడ గమనించాల్సిన విషయమేంటంటే.. తలుచుకుంటే ఆ ఆవు, మరియు దాని యజమాని.. వాళ్లిద్దరూ కలిస్తే ఆ పులిని బయటకు లాగగలరు, కానీ అది వాళ్ళ ప్రాణాలకు ముప్పు అని గ్రహించి, ఆ పులిని బురదలో వదిలేసి వెళ్లిపోయారు. ఈ కథలో... ఆవు - సర్వసమర్పణ చేసిన సాధకుని హృదయo. పులి- అహంకారం నిండి ఉన్న మనస్సు. యజమాని - సద్గురువు/పరమాత్మ బురదగుంట - ఈ సంసారం/ప్రపంచం ఆవు-పులి యొక్క సంఘర్షణ : నలుగురిలో మనం మన ఉనికిని చాటుకోవడం కోసం చేసే జీవన పోరాటం. ఇందులో నీతి ఏంటేంటే.. ఎవరిమీదా ఆధార పడకుండా జీవించడం అనేది మంచి ఉద్దేశ్యమే. కానీ, “నేనే అంతా, నా వల్లే అంతా జరుగుతోంది, నేను లేకపోతే ఏమీ లేదు.. నాకు ఎవరి అవసరం లేదు, రాదు." అనే భావన ఎన్నడూ మనలో కలగరాదు. దీనినే 'అహంకారము' అంటారు. మన వినాశనానికి ఇదే బీజం అవుతుంది. ఈ జగత్తులో పరమాత్మను మించిన హితాభిలాషి , మన మంచిని కోరుకునే వారు వేరే ఉండరు. వారే అనేక రూపాల్లో వచ్చి, ఆయా సమయాల్లో మనల్ని నిరంతరం అనేక ఆపదల నుంచి రక్షిస్తూ ఉంటారు. లోకా సమస్తా సుఖినోభవన్తు! -
అమిత్‌షా వ్యాఖ్యలపై సీఎం సిద్ధు అసహనం
సాక్షి, బెంగళూరు : క్రిమినల్ కేసుల్లో సీబీఐ విచారణ ఎదుర్కొని, చివరకు వారి కరుణాకటాక్షాలతో నిర్దోషిగా బయటికొచ్చిన బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా నుంచి నీతి పాఠాలు నేర్చుకోవాల్సి న అవసరం కాంగ్రెస్ పార్టీకి లేదని ముఖ్యమంత్రి సిద్ధరామయ్య అన్నారు. బెంగళూరులో ఏర్పాటు చేసిన ‘చిత్రసంతె’ను ఆయన ఆది వారం ప్రారంభించి, మాట్లాడారు. అవినీతి దా హంతో రాష్ర్టంలో అధికారంలో కోల్పోయిన బీ జేపీ ఏనాడో నైతికతను కోల్పోయిందని అన్నారు. బీజేపీ ప్రభుత్వ హయాంలో ముఖ్యమంత్రితో సహా చాలా మంది మంత్రులు అవినీతి ఆరోపణల్లో చిక్కుకుని జైలుకు వెళ్లివచ్చారని గుర్తు చేశారు. ఏడాదిన్నరగా రాష్ర్టంలో కాంగ్రెస్ పాలన సాగుతోందని, ఈ సమయంలో ఒక్క కుంభకోణం కూడా జరగలేదని స్పష్టం చేశారు. పాలనలో అవినీతికి పునాదులు వేసిన బీజేపీకి కాంగ్రెస్ పార్టీకి నీతులు చెప్పాలన్సిన అవసరం ఎంత మాత్రం లేదని అన్నారు. కళాకారులకు పూర్తి సహాయ సహకారాలు.... ఇక ఇదే సందర్భంలో ముఖ్యమంత్రి సిద్ధరామయ్య మాట్లాడుతూ...చిత్రకళా పరిషత్‌తో పాటు కళాకారులకు ప్రభుత్వం నుంచి పూర్తి సహాయ సహకారాలు అందిస్తామని భరోసా ఇచ్చారు. అనేక రాష్ట్రాలకు చెందిన చిత్రకారులు తమ తమ చిత్రాలను ప్రజలకు పరిచయం చేసేందుకు ‘చిత్రసంతె’ ఓ ఉత్తమ వేదిక అని పేర్కొన్నారు. ఈ వేదికను కళాకారులందరూ సద్వినియోగం చేసుకోవాలని కోరారు. కార్యక్రమంలో మంత్రులు రామలింగారెడ్డి, శ్రీనివాసప్రసాద్, సాహితీవేత్తలు మరళుసిద్ధప్ప, కమలా హంపన తదితరులు పాల్గొన్నారు.