అమిత్‌షా వ్యాఖ్యలపై సీఎం సిద్ధు అసహనం
సాక్షి, బెంగళూరు : క్రిమినల్ కేసుల్లో సీబీఐ విచారణ ఎదుర్కొని, చివరకు వారి కరుణాకటాక్షాలతో నిర్దోషిగా బయటికొచ్చిన బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా నుంచి నీతి పాఠాలు నేర్చుకోవాల్సి న అవసరం కాంగ్రెస్ పార్టీకి లేదని ముఖ్యమంత్రి సిద్ధరామయ్య అన్నారు. బెంగళూరులో ఏర్పాటు చేసిన ‘చిత్రసంతె’ను ఆయన ఆది వారం ప్రారంభించి, మాట్లాడారు. అవినీతి దా హంతో రాష్ర్టంలో అధికారంలో కోల్పోయిన బీ జేపీ ఏనాడో నైతికతను కోల్పోయిందని అన్నారు.
బీజేపీ ప్రభుత్వ హయాంలో ముఖ్యమంత్రితో సహా చాలా మంది మంత్రులు అవినీతి ఆరోపణల్లో చిక్కుకుని జైలుకు వెళ్లివచ్చారని గుర్తు చేశారు. ఏడాదిన్నరగా రాష్ర్టంలో కాంగ్రెస్ పాలన సాగుతోందని, ఈ సమయంలో ఒక్క కుంభకోణం కూడా జరగలేదని స్పష్టం చేశారు. పాలనలో అవినీతికి పునాదులు వేసిన బీజేపీకి కాంగ్రెస్ పార్టీకి నీతులు చెప్పాలన్సిన అవసరం ఎంత మాత్రం లేదని అన్నారు.
కళాకారులకు పూర్తి సహాయ సహకారాలు....
ఇక ఇదే సందర్భంలో ముఖ్యమంత్రి సిద్ధరామయ్య మాట్లాడుతూ...చిత్రకళా పరిషత్‌తో పాటు కళాకారులకు ప్రభుత్వం నుంచి పూర్తి సహాయ సహకారాలు అందిస్తామని భరోసా ఇచ్చారు. అనేక రాష్ట్రాలకు చెందిన చిత్రకారులు తమ తమ చిత్రాలను ప్రజలకు పరిచయం చేసేందుకు ‘చిత్రసంతె’ ఓ ఉత్తమ వేదిక అని పేర్కొన్నారు. ఈ వేదికను కళాకారులందరూ సద్వినియోగం చేసుకోవాలని కోరారు. కార్యక్రమంలో మంత్రులు రామలింగారెడ్డి, శ్రీనివాసప్రసాద్, సాహితీవేత్తలు మరళుసిద్ధప్ప, కమలా హంపన తదితరులు పాల్గొన్నారు.