Moral Story: చాలా సంవత్సరాల క్రితం ఒక ఊరిలో ఒక అమ్మాయి ఉండేది. ఆ అమ్మాయి రోజంతా గాలి కబుర్లు చెప్పుకుంటూ గడిపేసేది. ఇక్కడ మాట అక్కడా, అక్కడి మాట ఇక్కడా చెబుతూ వుంటే చూసి వాళ్ళమ్మ చాలా బాధ పడేది. ఇలా గాలి కబుర్లు చెప్పడం తప్పని ఎంత చెప్పినా ఆ అమ్మాయి మట్టుకు పట్టించుకునేది కాదు. ఈ గాలి కబుర్ల వల్ల లేనిపోని తగాదాలు కూడా వచ్చేవి.
ఒక రోజు ఆ ఊరికి ఒక సాధువు వచ్చాడు. ఆయన దర్శనానికి వెళ్లిన ఆ అమ్మాయి వాళ్ల అమ్మ తన బాధ చెప్పుకుంది. ‘మా అమ్మాయికి బుద్ధి చెప్పండి స్వామీ’ అని కోరుకుంది. సాధువు మర్నాడు అమ్మాయిని తన దగ్గరికి తీసుకురమ్మని చెప్పాడు.
మర్నాడు పొద్దున్నే అమ్మ తన కూతురుని సాధువు వద్దకు తీసుకుని వెళ్ళింది. సాధువు చారుమతికి ఒక కోడిని చూపించి ‘రోజంతా ఆ కోడి ఈకలు తీసి వూరు మొత్తం చల్లమ్మా’ అని చెప్పాడు.
ఎక్కడ తిడతాడో అని భయపడుతూ వచ్చిన అమ్మాయి ‘ఇంతేనా?’ అనుకుంటూ కోడి ఈకలతో వూరంతా తిరుగుతూ కనిపించిన వారందరికి కబుర్లు చెపుతూ ఇక్కడో ఈక, అక్కడో ఈక విసిరేసింది. సాయంత్రం సూర్యాస్తమయం అవుతుంటే ఆ అమ్మాయిని తల్లి మళ్ళీ ఆ సాధువు దగ్గిరకు తీసుకెళ్లింది.
‘ఈ రాత్రి నిద్రపోయి మళ్ళి తెల్లవారగానే రండి’ అని పంపాడు సాధువు.
మర్నాడు పొద్దున్నే వాళ్లు వెళితే సాధువు అమ్మాయితో, ‘నిన్న రోజంతా విసిరేసిన కోడి ఈకలు వెతికి తీసుకు రామ్మా’ అన్నాడు.
అమ్మాయి సరేనని ఊరంతా వెతకడం మొదలెట్టింది. సాయంత్రం దాక ఊరిలో ప్రతి అంగుళం వెతికినా ఒక్క ఈక కనిపించలేదు. దిగాలుగా సాయంత్రానికి ఆ సాధువు దగ్గరకు వెళ్ళి ‘స్వామి, నన్ను క్షమిచండి. నాకు ఒక్క ఈక కూడ దొరకలేదు’ అని చెప్పింది.
చదవండి: ‘నలుగురు కూతుళ్లేనా..’ కాదు డాక్టర్ డాటర్స్..!
అప్పుడు సాధువు ‘చూశావా... మన మాటలు కూడా ఆ ఈకల లాంటివే. ఒక్క సారి నోరు జారితే ఆ మాటలను మనం యెన్నటికీ తిరిగి తీసుకోలేము’ అని చెప్పాడు. ‘నోరు అదుపులో ఉంటే సమయం వృధా కాదు. చేయవలసిన పనులు పూర్తవుతాయి. జీవితంలో పెట్టుకున్న లక్ష్యాన్ని సాధించవచ్చు’ అన్నాడు.
ఆ రోజు నుంచి ఆ అమ్మాయి గాలి కబుర్లు మానేసి చక్కగా చదువుకుని వాళ్ల అమ్మను సంతోషపెట్టింది.
Comments
Please login to add a commentAdd a comment