ఆ అవ్వని చూస్తే కర్ణాటక వాసి అని ఎవరూ అనుకోరు. ‘ఆఫ్రికన్’ అనే అనుకుంటారు. గోపీ సిద్దీ పూర్వీకులు వందల సంవత్సరాల క్రితం ఆఫ్రికా నుంచి ఇండియాకు తీసుకురాబడ్డారు. ఇక్కడికి వచ్చిన తరువాత స్థానిక సంస్కృతులతో కలిసిపోయినప్పటికీ, తమ మూల సంస్కృతిని కాపాడుకుంటున్నారు. సిద్దీస్ జాతి ప్రజలు రకరకాల సమస్యలను ఎదుర్కొంటున్నారు. ఆ సమస్యలతో పాటు తమ సంస్కృతిని తన కథల ద్వారా లోకానికి చాటుతోంది గోపి సిద్దీ.
తులసికొండ (కర్నాటక) ప్రాంతానికి చెందిన కుంటగని గ్రామానికి చెందిన గోపి సన్నా సిద్దీ జనాలకు ఒక వింత. ఒక పురాగాథ. విలువైన కథల చెట్టు. గోపి సిద్దీస్ అనేది ఆఫ్రికన్ సంతతికి చెందిన ఒక ప్రత్యేక జాతి. బానిసలు, కిరాయి సైనికులుగా, నావికులుగా వీరిని భారతదేశానికి తీసుకువచ్చారు. కాలక్రమంలో వీరు స్థానిక భాషలు నేర్చుకున్నారు. ఇక్కడి సంస్కృతిలో భాగం అయ్యారు. అదే సమయంలో తమ ఆఫ్రికన్ వారసత్వ మూలాలను కాపాడుకున్నారు. సంగీతం నుంచి నృత్యరూపాల వరకు అందులో ఎన్నో ఉన్నాయి.
ఈ సిద్దీలు కర్నాటక, మహారాష్ట్రలలో ఎక్కువగా కనిపిస్తారు. గోపి సిద్దీ బాల్యంలో కొత్త ప్రాంతానికి వెళితే... ‘ఆఫ్రికన్’ ‘నీగ్రో’ అని పిలిచేవారు. ‘అలా ఎందుకు పిలుస్తున్నారు?’ అని అడిగితే తమ పూర్వీకులు ఆఫ్రికా నుంచి ఇక్కడికి వచ్చారు అని తల్లి చెబుతుండేది. ఎప్పుడూ ఏవో కథలు వినిపించే గోపి సిద్దీకి ఎన్నో సమస్యలు ఉన్నాయి. భర్త ఆమెను వదిలేసి మూడు దశాబ్దాలు దాటింది. ఆక్రమణదారుల చెర నుంచి తన వ్యవసాయ భూమిని తిరిగి పొందాలి... ఎన్నో సమస్యలు ఉన్నప్పటికీ తన కథల పుస్తకాలను ప్రచురించాలనే ఉత్సాహం, ఉక్కు సంకల్పంలో మాత్రం మార్పు లేదు. తన పుస్తక ప్రచురణ కోసం నగలు కూడా తాకట్టు పెట్టింది.
తమ జాతి ఎదుర్కొంటున్న ఎన్నో సమస్యలు తనలో నుంచి రచయిత్రి బయటికి రావడానికి కారణం అయ్యాయి. ‘స్వేచ్ఛ గురించి తపించే దృఢమైన వ్యక్తిత్వం గోపి సిద్దీ సొంతం. జీవితంలో ఆమె ఎన్నో పోరాటాలు చేసింది. గోపి సిద్దీ కథల్లో బాధ మాత్రమే కాదు జ్ఞానం కూడా ఉంటుంది. పర్యావరణ స్పృహ ఉంటుంది. తన తాతల కాలం నుంచి వింటూ పెరిగిన కథలు అవి. తనకు పరిచయం అయిన వారికల్లా ఆ కథలను చెబుతుంది. ఆమె శక్తిమంతమైన రచయిత్రి’ అంటుంది ‘బుడా ఫోక్‌లోర్’ అనే స్వచ్ఛంద సంస్థ వ్యవస్థాపకు రాలైన సవితా ఉదయ్.
పది సంవత్సరాల క్రితం తన ఇంట్లో పని చేయడానికి ఒక పనిమనిషిని వెదుకుతున్న సమయంలో ఉదయ్‌కు గోపీతో పరిచయం ఏర్పడింది. మారుమూల గ్రామానికి పరిమితమైన గోపి సిద్దీ జీవిత కథను తన డాక్యుమెంటరీ ద్వారా అంతర్జాతీయ స్థాయికి తీసుకువెళ్లాడు బెంగళూరుకు చెందిన నిశాంత్ గురుమూర్తి. తన స్వచ్ఛంద సంస్థ ‘బుడా ఫోక్‌లోర్’ ద్వారా జానపదల కథానిలయమైన గోపి సిద్దీతో కర్ణాటక అంతటా పాఠశాల విద్యార్థులతో కథా సెషన్‌లు నిర్వహిస్తోంది సవితా ఉదయ్. కొంకణీ, కన్నడ భాషలలో ఆమె చెప్పే కథలకు పిల్లలు ఫిదా అవుతుంటారు.
ఆ బాధ భరించలేనంత!
భాషపరమైన అడ్డంకులు ఉన్నప్పటికి పట్నం పిల్లలు నా కథలను ఇష్టపడుతుంటారు. వారి అభిమానం చూస్తుంటే ఆశ్చర్యంగా ఉంటుంది. కథలు చెప్పడం పూర్తయిన తరువాత నన్ను ఆ΄్యాయంగా కౌగిలించుకొని వీడ్కోలు చెబుతారు. బరువెక్కిన హృదయంతో ఇంటికి వస్తాను. వారిని విడిచి ఇంటికి వస్తుంటే... ఒక్కోసారి ఆ బాధ భరించలేనంతగా ఉంటుంది. – గోపి సిద్దీ
Comments
Please login to add a commentAdd a comment