విలువలే గెలవాలి! | k ramachandra murthy write artecle on political moral | Sakshi
Sakshi News home page

విలువలే గెలవాలి!

Published Sun, Aug 6 2017 3:49 PM | Last Updated on Fri, Oct 19 2018 8:10 PM

విలువలే గెలవాలి! - Sakshi

విలువలే గెలవాలి!

త్రికాలమ్‌
నంద్యాల శాసనసభ స్థానం కోసం జరుగుతున్న హోరాహోరీ పోరాటంలో ప్రతిపక్ష నాయకుడు వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఇప్పటికే నైతిక విజయం సాధించారు. తెలుగుదేశం పార్టీని వీడి వైఎస్‌ఆర్‌సీపీలో చేరాలని నిర్ణయించుకున్న శిల్పా చక్రపాణిరెడ్డికి జగన్‌మోహన్‌రెడ్డి అనూహ్యమైన పరీక్ష పెట్టారు. తెలుగుదేశం పార్టీ టికెట్టు పైన గెలుచుకున్న శాసనమండలి స్థానానికి రాజీనామా చేసి వస్తేనే పార్టీలోకి ఆహ్వానిస్తానని అన్నారు. ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి, తెలుగుదేశం అధ్యక్షుడు నారా చంద్రబాబునాయుడి మాదిరి నీతిలేని రాజకీయం చేయలేనని స్పష్టం చేశారు.

చేతిలో ఉన్న మండలి స్థానం వదులుకోవడానికి ధైర్యం కావాలి. బాగా ఆలోచించుకున్న తర్వాత మండలి స్థానానికి రాజీనామా చేసి వైఎస్‌ఆర్‌సీపీలో చేరడానికే చక్రపాణిరెడ్డి నిర్ణయించుకున్నారు. గురువారంనాడు నంద్యాలలో జరిగిన బహిరంగ సభలో తన రాజీనామా లేఖను జగన్‌మోహన్‌రెడ్డికి సమర్పించారు చక్రపాణిరెడ్డి. స్పీకర్‌ ఫార్మాట్‌లో శాసనమండలి అధ్యక్షుడిని ఉద్దేశించి రాసిన రాజీనామా లేఖను అనంతరం మండలి అధ్యక్షుడి కార్యాలయానికి పంపించారు. అరుణాచలప్రదేశ్‌ నుంచి ఆంధ్రప్రదేశ్‌ వరకూ దేశ వ్యాప్తంగా పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టం భ్రష్టుపడుతున్న తీరు చూసినవారికి వైఎస్‌ఆర్‌సీపీ పాటించిన నైతికత ఆనందం కలిగించి తీరుతుంది.

ఈ పార్టీ స్థాపించినప్పటి నుంచీ చట్టసభలలో సభ్యత్వానికి రాజీనామా చేస్తేనే పార్టీలో చేర్చుకోవాలనే నియమాన్ని పట్టింపుతో అమలు చేశారు. కాంగ్రెస్‌ నుంచి వచ్చిన శాసనసభ్యులంతా రాజీనామాలు చేసి ఉపఎన్నికలలో గెలిచారు. ఢిల్లీలో, అమరావతిలో, హైదరాబాద్‌లో అధికారంలో ఉన్న పార్టీలు పాటించని నైతిక విలువలనూ, ప్రదర్శించని రాజ్యాంగ నిబద్ధతనూ యువనాయకుడు జగన్‌మోహన్‌రెడ్డి పాటించినందుకు అభినందించి తీరాలి. నంద్యాల రణక్షేత్రంలో చక్రపాణిరెడ్డి బాసట చాలా ముఖ్యమైనది. వైఎస్‌ఆర్‌సీపీ అభ్యర్థి శిల్పా మోహన్‌రెడ్డి విజయం సాధించాలంటే అతని సోదరుడు చక్రపాణిరెడ్డి సహకారం ప్రధానం. నంద్యాల విజయం వైఎస్‌ఆర్‌సీపీకీ, జగన్‌మోహన్‌రెడ్డికీ   చాలా అవసరం. చావోరేవో తేల్చుకోవలసిన సందర్భం.

శాసనమండలి స్థానం వదులుకోవడానికి చక్రపాణిరెడ్డి అంగీకరించకపోతే ఆయన వైఎస్‌ఆర్‌సీపీలో చేరే అవకాశం లేదు. నంద్యాలలో విజయావకాశాలు ఆ మేరకు దెబ్బతినేవి. ఇది తెలిసి కూడా సీటు వదులుకోవాలని జగన్‌మోహన్‌రెడ్డి షరతు విధించడం విశేషం. ఒక విధంగా నంద్యాల ఉప ఎన్నికలో విజయం కన్నా నైతికత, రాజ్యాంగ స్ఫూర్తి పాటించడమే తనకు ముఖ్యమని జగన్‌ చాటి చెప్పినట్టు అయింది. దేశంలో నెలకొన్న ప్రత్యేక పరిస్థితులలో ఈ అంశం చర్చనీయాంశం కాకపోవచ్చు. పత్రికలూ, వార్తా చానళ్ళూ ప్రాముఖ్యం ఇవ్వకపోవచ్చు. జాతీయ స్థాయిలో చానళ్ళ, పత్రికల దృష్టి వేరే అంశాలపైన ఉండవచ్చు. స్థానిక మీడియా సంగతి సరేసరి. తగినంత ప్రచారం లభించకపోయినప్పటికీ ఇది అన్ని రాజ కీయ పార్టీలూ గమనించవలసిన పరిణామం. విలువలు పాటించే విషయంలో అధికార పార్టీకీ, ప్రతిపక్షానికీ ఉన్న వ్యత్యాసాన్ని ప్రజలు గుర్తిస్తారో లేదో మరి. ఇది కారుమబ్బుల్లో తళుక్కున కనిపించిన కాంతిరేఖ.

గెలుపే ప్రధానం
చంద్రబాబు ఎన్నికల వ్యూహ రచనలో దిట్ట. మూడు దశాబ్దాలకు పైగా అనేక ఎన్నికలలో పోరాడిన అనుభవం ఆయనది. ముఖ్యమంత్రికి గెలుపే ప్రధానం. ఏ విధంగా గెలిచామన్నది అప్రధానం. లక్ష్యం ముఖ్యం. మార్గం కాదు. తెలుగుదేశం అధికారంలో ఉన్నప్పుడు ఎక్కడ ఉప ఎన్నిక జరిగినా విజయం సాధిం చేందుకు చంద్రబాబు శక్తివంచన లేకుండా కృషి చేస్తారు. నైతిక విలువలతో పనిలేదు. రాజకీయ విలువలకు పాతర వేసినా పర్వాలేదు. గెలవాలి. తిమ్మిని బమ్మిని చేసైనా సరే, ఆరు నూరైనా సరే, ఎంత ఖర్చు అయినా సరే విజయం సాధించి తీరాలి. ఉపఎన్నికలో ఒక సీటు గెలిచినా ఓడినా ప్రభుత్వ సుస్థిరతకు భంగం లేదు.

చట్టసభలలో స్పష్టమైన మెజారిటీ ఉన్నప్పటికీ ఉపఎన్నిక జరుగుతున్న ఒక్క స్థానం గెలుచుకోవడంపైనే తన రాజకీయ భవిష్యత్తు ఆధారపడి ఉన్నట్టు సర్వశక్తులూ వొడ్డి పోరాడటం చంద్రబాబు స్వభావం. ప్రత్యర్థులతో పోల్చుకొని ప్రతిరోజూ బేరీజు వేసుకోవడం, ప్రతి పోటీలో తనదే పైచేయి కావాలనుకోవడం, విజయం కోసం అన్ని రకాల నియమాలనూ ఉల్లంఘించి, అడ్డదారులు తొక్కడం ఆయనకు అలవాటు. ఇప్పుడు నంద్యాలలోనూ అదే చూస్తున్నాం.

భూమా నాగిరెడ్డి మరణం తర్వాత చంద్రబాబు ప్రణాళికలో నంద్యాల అత్యధిక ప్రాముఖ్యం సంతరించుకున్నది. వైఎస్‌ఆర్‌సీపీ అభ్యర్థి శిల్పా మోహన్‌రెడ్డి సమర్థుడూ, స్థానికంగా విశేషమైన ప్రాబల్యం కలిగిన వ్యక్తీ కావడంతో చంద్రబాబు పని మరింత కష్టభూయిష్టౖమైపోయింది. భూమా నాగిరెడ్డి భార్య శోభ 2014 ఎన్నికల ప్రచారంలో కారు ప్రమాదంలో దుర్మరణం పాలైన కారణంగా సానుభూతి పవనాలు వీచినప్పటికీ టీడీపీ అభ్యర్థి మోహన్‌రెడ్డి కంటే వైఎస్‌ఆర్‌సీపీ అభ్యర్థి నాగిరెడ్డి (శోభ భర్త)కి స్వల్ప మెజారిటీ (3,604 ఓట్లు) లభించింది. నాగిరెడ్డికి 82,194 (46.97 శాతం) ఓట్లు రాగా, మోహన్‌రెడ్డికి 78,590 ( 44.91శాతం) ఓట్లు వచ్చాయి.

ఎన్నికలైన తర్వాత వైఎస్‌ఆర్‌సీపీకి చెందిన శాసనసభ్యులను తెలుగుదేశంలోకి చేర్చుకోవడానికి ముఖ్యమంత్రి అధికార దుర్వినియోగం చేశారు. ప్రతిపక్ష సభ్యులను వేధించారు. బెదిరించారు. ప్రలోభపెట్టారు. వారి బలహీనతలు తెలుసుకొని వారితో ఆడుకున్నారు. నాగిరెడ్డిపైన పోలీసులను ప్రయోగించారు. ఎస్‌సీ,ఎస్‌టీ అట్రాసిటీస్‌ కేసు పెట్టించారు. రౌడీషీట్‌ తెరిపించారు. పద్నాలుగు రోజులు జైల్లో పెట్టించారు. చతుర్విధ ఉపాయాలు ప్రయోగించి ఆయన చేత తప్పు చేయించారు.

పార్టీ ఫిరాయించే వరకూ ఆయనను వేధిస్తూనే ఉన్నారు. ఒక వైపు పోలీసు కేసులతో వేధించడం, మరో వైపు మంత్రి పదవి చూపించి ఊరించడం. ఆ విధంగా నాగిరెడ్డి సహా 21 మంది వైఎస్‌ఆర్‌సీపీ శాసనసభ్యుల చేత పార్టీ ఫిరాయింపజేశారు. వారిలో ఒక్కరంటే ఒక్కరు కూడా శాసనసభ స్థానానికి రాజీనామా చేయలేదు. నాగిరెడ్డి వ్రతం చెడినా ఫలం దక్కలేదు. మంత్రి పదవి అందని ద్రాక్షే అయింది. మానసికంగా కుంగిపోయారు. మండలి ఎన్నికలలో తన అభీష్ఠానికి భిన్నంగా పని చేయాలని నాగిరెడ్డిపైన ఒత్తిడి పెరిగింది. చంద్రబాబు అమరావతికి పిలిపించుకొని నాగిరెడ్డిని మందలించారు. అపరాధభావంతో, అవమానభారంతో భూమా గుండెపోటు వచ్చి మరణించారు. ఆ క్షణం నుంచీ నంద్యాల స్థానం ఎట్లా నిలబెట్టుకోవాలో చంద్రబాబు ఆలోచిస్తున్నారు.

నువ్వా–నేనా?
భూమా నాగిరెడ్డి మరణం తర్వాత మంత్రివర్గంలోకి నలుగురు ఫిరాయింపుదారులను చంద్రబాబు తీసుకున్నారు. భూమా కుమార్తె అఖిలప్రియ వారిలో ఒకరు. నంద్యాల స్థానం తమ కుటుంబానికే చెందాలని అఖిలప్రియ కోరుకోవడం సహజం. ఆ స్థానం గెలుచుకునేందుకు టీడీపీ టికెట్టు తనకే దక్కాలని 2014లో స్వల్ప తేడాతో ఎన్నికలలో ఓడిపోయిన శిల్పామోహన్‌రెడ్డి ఆశించడం ధర్మం. ఎవరినీ వదులుకోలేని డోలాయమాన స్థితిలో చంద్రబాబుని చూసిన శిల్పా మోహన్‌రెడ్డి వైఎస్‌ఆర్‌సీపీలో చేరాలని నిర్ణయించుకున్నారు.

ఆ విధంగా వైఎస్‌ఆర్‌సీపీకీ బలమైన అభ్యర్థి లభించారు. పెరుగుతున్న జగన్‌మోహన్‌రెడ్డి ప్రాబల్యంతో మోహన్‌రెడ్డి సొంత బలం తోడైతే విజయం సాధ్యం. ఎట్లాగైనా నంద్యాల స్థానం నిలబెట్టుకోవాలన్న సంకల్పంతో చంద్రబాబు తనకు తెలిసిన విద్య ప్రదర్శించడం ప్రారంభించారు. మూడేళ్ళలో నంద్యాల ప్రజలకు కనిపిం చని చంద్రబాబు తరచూ తమ మధ్యకు రావడం, అడగని వరాలు గుప్పించడం, అన్ని వర్గాల ప్రజలతో చనువు ప్రదర్శించడం ప్రజలకు ఆశ్చర్యం కలిగించింది. నంద్యాలలో వైశ్యులు గణనీయంగా ఉన్నారు కనుక వారికి అవసరమైన భవనం కట్టిస్తానని వాగ్దానం చేశారు. అడిగినవారికీ, అడగనివారికీ రకరకాల పథకాలు మంజూరు చేశారు. ఎన్నికల షెడ్యూల్‌ ప్రకటించక ముందే అన్ని వర్గాలకీ అన్ని రకాల వాగ్దానాలు చేశారు.

నంద్యాల పట్టణంలో ముస్లింలు 70 వేల పైచిలుకు ఉంటారు. వారిని ప్రసన్నం చేసుకోవాలంటూ మాజీ మంత్రి ఫారుఖ్‌ని పట్టుకోవాలి. 2014 ఎన్నికల సమయంలో నంద్యాల టిక్కెట్టు ఆశించిన ఫారుఖ్‌కి చంద్రబాబు ఇంటర్వ్యూ దొరకటం కష్టమైంది. అప్పటి నుంచి ముఖ్యమంత్రికీ, పార్టీకీ దూరంగా ఉంటున్న మాజీ మంత్రిని పిలిపించుకొని ఆయనకు శాసనమండలి సభ్యత్వమే కాకుండా శాసనమండలి అధ్యక్ష పదవి కూడా ఇస్తానంటూ వాగ్దానం చేసి ఆయనను రంగంలో దింపారు.

చక్రపాణి పదవీ విరమణ అనంతరం మండలి అధ్యక్ష స్థానం ఖాళీగా ఉంది. ఇదే అధ్యక్ష పదవి చక్రపాణిరెడ్డికి చంద్రబాబు ఇవ్వజూపారు. అది మోహన్‌రెడ్డి వైఎస్‌ఆర్‌సీపీలో చేరక మందు ముచ్చట. చక్రపాణిరెడ్డి టీడీపీలో కొనసాగినప్పటికీ అన్నకి వ్యతిరేకంగా ఎంత శక్తిమంతంగా పని చేయగలరనే విషయంపై తెలుగుదేశంలో భిన్నాభిప్రాయాలు ఉన్నాయి. పైగా, నంద్యాలలో గెలవాలంటే చక్రపాణిరెడ్డి మద్దతు కంటే ఫారుఖ్‌ మద్దతు అవసరమని భావించిన చంద్రబాబు ఫారుఖ్‌ని మండలి అధ్యక్ష పదవి చూపించి సుముఖం చేసుకున్నారు. చంద్రబాబు మాట నిలబెట్టుకుంటారన్న విశ్వాసం లేకపోయినప్పటికీ ఫారుఖ్‌ యాంత్రికంగా తెలుగుదేశం అభ్యర్థి బ్రహ్మానందరెడ్డి తరఫున ముస్లిం సమాజంలో ప్రచారం చేస్తున్నారు. ముస్లింలలో వైఎస్‌ రాజశేఖరరెడ్డి పట్ల ఆరాధనాభావం ఉన్నది. నాలుగు శాతం రిజర్వేషన్లు ఇప్పించింది వైఎస్‌ఆర్‌ అనే విషయం ముస్లింలు తరచుగా ప్రస్తావిస్తూ ఉంటారు. చంద్రబాబు చేస్తున్న హడావుడి చూసి నంద్యాల ప్రజలు నివ్వెరపోతున్నారు. ఆయన ప్రభుత్వం పట్ల ప్రజలలో వ్యతిరేకత ఉంది. అది ఎంతమేరకు ఉన్నదనే విషయంలో అభిప్రాయ భేదాలు ఉండవచ్చు.

సాధారణ పరిస్థితులలో, 174 స్థానాలతో కలిపి నంద్యాల స్థానానికి కూడా ఎన్నిక జరిగి ఉంటే వైఎస్‌ఆర్‌సీపీ విజయం ఖాయం. ఫిరాయించిన ఇతర ఇరవై మంది ఎంఎల్‌ఏలు రాజీనామా చేసి ఉప ఎన్నికలు జరిగి, వాటితో పాటుగా నంద్యాల ఉప ఎన్నిక కూడా జరిగి ఉన్నట్లయితే వైఎస్‌ఆర్‌సీపీకి విజయావకాశాలు స్పష్టంగానే ఉండేవి. కానీ ఒక్క నంద్యాలలోనే ఎన్నికలు జరగడం, ప్రభుత్వ యంత్రాంగాన్నీ, టీడీపీ యంత్రాంగాన్ని పూర్తి స్థాయితో చంద్రబాబు నంద్యాల నియోజకవర్గంలో దింపడంతో పోటీ నువ్వా–నేనా అన్నట్టు సాగుతోంది. ఏ రోజు చూసినా నంద్యాలలో అరడజను మందికి తక్కువ కాకుండా మంత్రులు మకాం వేసి ఉంటున్నారు.

శాసనసభ్యులు సరేసరి. డబ్బు విచ్చలవిడిగా ఖర్చు చేయడానికి టీడీపీ ఏర్పాట్లు చేసుకున్నది. వైఎస్‌ఆర్‌సీపీ చేతిలో అధికారం లేదు. నిధులు లేవు. అయినప్పటికీ చక్రపాణిరెడ్డి చేరికతో వైఎస్‌ఆర్‌సీపీ పట్ల సానుకూలత పెరిగింది. తొమ్మిదో తేదీ నుంచి ఎన్నికల ప్రచారం ముగిసే వరకూ నంద్యాలలోనే ఉంటానంటూ జగన్‌మోహన్‌రెడ్డి ప్రకటించారు. ఎన్నికల సంఘం మాజీ సలహాదారు కేజే రావు ఎలక్షన్‌ వాచ్‌ ఆధ్వర్యంలో నంద్యాలలో పర్యటించబోతున్నారు. ఒక సార్వత్రిక ఎన్నికకు ఉండే ప్రాముఖ్యం నంద్యాల ఉప ఎన్నిక సంతరించుకోవడం విశేషం. నంద్యాల ఎన్నిక రాబోయే ఎన్నికల కురుక్షేత్రంలో వైఎస్‌ఆర్‌సీపీ విజయానికి నాంది పలుకుతుందేమో చూడాలి. ఫలితం ఏ విధంగా ఉన్నప్పటికీ ఇది చారిత్రక ఉపఎన్నిక కాబోతున్నది. రాజకీయ విలువలకూ, నైతికతకూ ప్రజలు ఎంత ప్రాధాన్యం ఇస్తారో ఈ ఎన్నికలో నిర్ధారణ అవుతుంది.

కె. రామచంద్రమూర్తి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement