పోల్ మేనేజ్‌మెంట్‌లో మనదే పైచేయి
- ఇదే ప్రతి ఎన్నికలో కొనసాగాలి
- టీడీపీ నాయకత్వ శిక్షణ శిబిరంలో చంద్రబాబు
సాక్షి, అమరావతి: ఇటీవల జరిగిన నంద్యాల ఉప ఎన్నికల పబ్లిక్, పొలిటికల్, పోల్ మేనేజ్‌మెంట్‌లో తెలుగుదేశం పార్టీదే పైచేయి అని నిరూపితమైందని ముఖ్యమంత్రి చంద్రబాబు చెప్పారు. భవిష్యత్‌లో ప్రతి ఎన్నికల్లోనూ ఇదే ఒరవడి కొనసాగాలని ఆయన ఆకాంక్షించారు. గుంటూరు జిల్లా మంగళగిరి సమీపంలోని ఓ రిసార్ట్స్‌లో నాయకత్వ శిక్షణ పేరుతో నంద్యాల, కాకినాడ ఎన్నికల్లో పనిచేసిన వారికి సోమవారం సన్మాన సభ నిర్వహించారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ నంద్యాల గెలుపుతో అనేక ప్రశ్నలకు జవాబి చ్చామని, ఈ ఫలితాల వల్ల పార్టీ శ్రేణుల్లో ఆత్మవిశ్వాసం పెరిగిందన్నారు.
రాబోయే ఎన్నికల్లో చాన్స్ తీసుకోవడానికి సిద్ధంగా లేనని, గెలుపు సాధించడమే లక్ష్యమన్నారు. నంద్యాల, కాకినాడ ఎన్నికలలో అనుసరించిన పోల్‌స్ట్రాటజీ, ప్రచారశైలి, ఎలక్షన్ ఇంజనీరింగ్, బూత్ మేనేజ్‌మెంట్ వివరాలతో ఎల్లోబుక్ రూపొందిస్తున్నామని, భవిష్యత్తుల్లో అన్ని ఎన్నికలకు అది దిక్సూ చిగా ఉంటుందన్నారు. వచ్చే సాధారణ ఎన్నికలు షెడ్యూల్ కంటే ముందే 2018 చివర్లో ఎన్నికలు వచ్చే అవకాశం ఉందని, ఇప్పటి నుంచే ప్రతి ఒక్కరూ సిద్ధంగా ఉండా లన్నారు. సమావేశంలో కాకినాడ, నంద్యా ల ఎన్నికల్లో పనిచేసిన నాయకులం దరినీ సన్మానించారు.
మండలి చైర్మన్‌గా ఫరూక్: సీఎం
శాసన మండలి చైర్మన్‌గా ఎన్‌ఎండీ ఫరూక్‌కు అవకాశం ఇవ్వనున్నట్లు ముఖ్యమంత్రి చంద్రబాబు వెల్లడించారు. నంద్యాల ఉప ఎన్నికల్లో ఫరూక్ బాగా పనిచేశారన్నారు. నంద్యాల ముస్లిం ఓట్లు కీలకం కావడంతో అప్పటికప్పుడు ఆ నియోజకవర్గానికి చెందిన ఫరూక్‌ను ఎమ్మెల్సీగా చేశారు. తాజాగా ఆయన్ను మండలి చైర్మన్‌గా ప్రకటించారు.