నంద్యాల ఉప పోరులో రౌడీయిజం
- ఓటమి తప్పదని గ్రహించి రెచ్చిపోయిన టీడీపీ నేతలు
- నంద్యాలలో మైనారిటీలపై దాడులు
- వైఎస్సార్‌సీపీ నేతలు, కార్యకర్తలపై దౌర్జన్యకాండ
- పోలీసుల సాక్షిగా శిల్పా కుమారుడిపై దాడి
- భూమా కుమార్తె, కుమారుడి హల్‌చల్
నంద్యాల నుంచి ‘సాక్షి’ ప్రతినిధి: నంద్యాల ఉప ఎన్నికలో ఓటమి తప్పదని గ్రహించిన అధికార తెలుగుదేశం పార్టీ నేతలు చివర్లో రెచ్చిపోయారు. దొంగ ఓటర్లను అడ్డుకున్నందుకు వైఎస్సార్‌సీపీ నేతలు రాజగోపాల్‌రెడ్డి, శిల్పా కుమారుడు రవిచంద్ర కిషోర్‌రెడ్డి, కార్యకర్తలపై దాడి చేసి గాయపరిచారు. దీనికితోడు భూమా నాగిరెడ్డి రెండో కుమార్తె, కుమారుడు నంద్యాలలో హల్‌చల్ చేశారు. పోలీసుల అండతో టీడీపీ నేతలు సాగించిన రౌడీయిజాన్ని ప్రత్యక్షంగా చూసిన స్థానికులు భయంతో పరుగులు తీశారు. బుధవారం జరిగిన ఉప ఎన్నికలో టీడీపీ నేతలు నిజస్వరూపాన్ని బయటపెట్టారు. ఉదయం ప్రశాంత వాతావరణంలో ప్రాంభమైన ఉప ఎన్నికలో పోలింగ్ శాతం అనూహ్యంగా పెరిగింది. ప్రభుత్వంపై ప్రజా వ్యతిరేకత వల్లే పోలింగ్ శాతం పెరిగిందని గుర్తించిన టీడీపీ నేతలు సహనం కోల్పోయారు. వైఎస్సార్‌సీపీ నేతలు, ముస్లిం మైనారిటీ ఓటర్లను లక్ష్యంగా చేసుకుని దాడులకు పాల్పడ్డారు.
శిల్పా మోహన్‌రెడ్డి కుమారుడిపై దాడి
నంద్యాలలోని జగజ్జనని కాలనీలో సాయంత్రం 5 గంటల సమయంలో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. వైఎస్సార్‌సీపీ వార్డు కౌన్సిలర్ రహీం, మైనారిటీ నాయకుడు కలాంపై టీడీపీ నేత ఏవీ సుబ్బారెడ్డి తన మనుషులతో వచ్చి దాడి చేశారు. టీడీపీ నేతలు దొంగ ఓటర్లను తీసుకొచ్చి సైకిల్ గుర్తుకు వేయాలని చెప్పి పంపుతుండటాన్ని గమనించిన కౌన్సిలర్ అడ్డుకునే ప్రయత్నం చేశారు. విషయం తెలుసుకున్న టీడీపీ నేత ఏవీ సుబ్బారెడ్డి.. రహీంపై దాడి చేశారు. దాడిని అడ్డుకునేందుకు ప్రయత్నించిన వైఎస్సార్‌సీపీ కార్యకర్తలపైనా దౌర్జన్యానికి దిగారు. పరిస్థితి చేయిదాటుతోందని పోలీసులు హెచ్చరించటంతో ఏవీ సుబ్బారెడ్డి హడావుడిగా వెళ్లిపోయారు. రహీంపై దాడి జరిగిన విషయాన్ని తెలుసుకున్న శిల్పా మోహన్‌రెడ్డి కుమారుడు రవిచంద్ర కిషోర్‌రెడ్డి అక్కడికి చేరుకున్నారు.
టీడీపీ నాయకుడు అభిరుచి మధు ఐజీ ఇక్బాల్ కళ్లెదుటే శిల్పా కుమారుడిపై దాడి చేశారు. పోలీసులు శిల్పా కుమారుడిని నెట్టుకుంటూ వెళ్లారు. పోలీసులు తమకు సహకరిస్తున్నారని గ్రహించిన టీడీపీ నేతలు మరింత రెచ్చిపోయారు. పోలీసుల సాక్షిగా అభిరుచి మధు మరోసారి శిల్పా కుమారుడిపై దాడికి ప్రయత్నించారు. జగజ్జనని కాలనీలో వివాదం గురించి తెలుసుకున్న భూమా నాగిరెడ్డి కుమార్తె మౌనికారెడ్డి, కుమారుడు జగత్‌విఖ్యాత్‌రెడ్డి తమ అనుచరులతో అక్కడికి చేరుకున్నారు. పోలీసులు ఎంత వారించినా వారు వినలేదు. వైఎస్సాఆర్‌సీపీ కార్యకర్తలపై దౌర్జన్యానికి పాల్పడ్డారు. పోలీసులు బలవంతంగా పంపేసినా మళ్లీ వచ్చి రహీం వర్గంపై దాడి చేసేందుకు ప్రయత్నించారు.
డబ్బుల పంపిణీని అడ్డుకున్నందుకు...
గాంధీనగర్ పోలింగ్ బూత్ వద్ద సాయంత్రం టీడీపీ నేతలు ఓటర్లకు నగదు పంపిణీ చేపట్టారు. ఈ విషయం తెలుసుకున్న వైఎస్సార్‌సీపీ నేత రాజగోపాల్‌రెడ్డి అడ్డుకునే ప్రయత్నం చేశారు. ఆయనపై టీడీపీ నేతలు, కార్యకర్తలు ఒక్కసారిగా దౌర్జన్యానికి దిగారు. రాజగోపాల్‌రెడ్డి అనుచరులపై దాడిచేసి తీవ్రంగా గాయపరిచారు. అదేవిధంగా 75వ బూత్ వద్ద వైఎస్సార్‌సీపీ ఏజెంట్ పాస్‌లను సీఐ బలవంతంగా లాక్కొన్నారు. ఆ బూత్‌లో టీడీపీకి ఏకపక్షంగా ఓట్లు వేయించేందుకు ప్రయత్నించారు. దీంతో అక్కడ వైఎస్సార్‌సీపీ, టీడీపీ నేతల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. 16వ వార్డు వద్ద వైఎస్సార్‌సీపీ ఏజెంట్లను నియంత్రించేందుకు టీడీపీ నాయకులు రకరకాలు ప్రయత్నాలు చేశారు. ఉర్దూ అకాడమీ చైర్మన్ నౌమన్ పోలీసుల సాక్షిగా ఓటర్లను ప్రలోభపెట్టారు. వైఎస్సార్ నగర్‌లో టీడీపీ నేతలు ఓటర్లకు డబ్బులు పంచుతుండగా వైఎస్సార్‌సీపీ కార్యకర్తలు అడ్డుకున్నారు. దీంతో ఉద్రిక్త వాతావరణం నెలకొంది.
నంద్యాలలో ఆళ్లగడ్డ మనుషులు
నంద్యాల ఉప ఎన్నికలో ఎక్కడ చూసినా ఆళ్లగడ్డ వాసులే కనిపించారు. నంద్యాల నడిగడ్డ ప్రాంతంలోని పోలింగ్ కేంద్రాల చుట్టూ మంత్రి అఖిలప్రియ పర్యటించారు. ఆమె సోదరి మౌనికారెడ్డి పలు ప్రాంతాల్లో తిరుగుతూ ఓటర్లను ప్రలోభాలకు గురి చేశారు. సెయింట్ జోసెఫ్ కళాశాలలోని పోలింగ్ బూత్‌లో భూమా మౌనికారెడ్డి తన అనుచరులతో కలిసి హల్‌చల్ చేశారు. బయటకు వెళ్లాని కోరిన పోలింగ్ సిబ్బందితో వాగ్వాదానికి దిగారు. ఎన్జీఓ కాలనీ, 55, 56 వార్డుల్లో పోలింగ్ కేంద్రాల్లోకి వెళ్లి విధుల్లో ఉన్న అధికారులు, ఏజెంట్ల గుర్తింపు కార్డులు చూపించాలని డిమాండ్ చేశారు.
మీకు రూ.2 వేలు అందాయా?
57, 58, 59వ పోలింగ్ బూత్‌ల వద్ద దొంగ ఓట్లు వేసేందుకు వచ్చిన టీడీపీ కార్యకర్తలను అధికారులు అడ్డుకున్నారు. వారిని టీడీపీ ఎమ్మెల్సీ ఫరూఖ్ తన కారులో ఎక్కించుకొని తీసుకెళ్లారు. చాబోలులో అధికార పార్టీ ఓటర్లను ప్రలోభాలకు గురి చేసింది. అనపర్తి ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డి టీడీపీకి ఓటు వేసేలా ప్రలోభాలకు తెరలేపారు. సాధిక్‌నగర్‌లో ఓటు వేసేందుకు వచ్చిన ఓటర్లను ఉద్దేశించి ‘మీకు రూ.2 వేలు అందాయా?’ అని టీడీపీ కౌన్సిలర్ హారిక అడిగారు. నంద్యాల ఎస్‌బీఐ కాలనీలో ఆత్మకూరు ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖరరెడ్డి ఓటర్లను కలుసుకొని ఎన్నికల ప్రచారం నిర్వహించారు.