పోల్‌మేనేజ్‌మెంట్ చేయలేదు
భవిష్యత్‌లో నంద్యాలను మోడల్ నియోజకవర్గంగా తీర్చిదిద్దుతానని అన్నారు. నంద్యాల ఎన్నికల విషయంలో ఎన్నికల కమిషన్ కూడా పక్షపాతంగా వ్యవహరించిందని, ఇరుపక్షాలను సమానంగా చూడలేదని చెప్పారు. ప్రతిపక్ష నేత పదమూడు రోజులు నంద్యాలలో ఉండి ఓటర్లను భయపెట్టారని, ప్రలోభాలకు గురిచేశారని, విచ్చలవిడిగా డబ్బులు పంపిణీ చేశారని.. వాటికి ప్రజలు లొంగకుండా తమ పార్టీకి ఓటు వేశారని పేర్కొన్నారు. భూమా నాగిరెడ్డి చాలా మంచివారని, చనిపోయే ముందురోజు కూడా వచ్చి తనను నియోజకవర్గ అభివృద్ధికి సాయం చేయాలని అడిగారని వెల్లడించారు.
భూమా బ్రహ్మానందరెడ్డి యువకుడని, అందరికీ ఆమోదయోగ్యమైన వ్యక్తిగా ఉంటారని అభిప్రాయపడ్డారు. తనకు ఇలాంటి ఎన్నికలు కొత్త కాదని, ఎన్నో ఎన్నికలు చూశానని, ప్రతిపక్ష పార్టీకే కొత్త అని, అందుకే తత్తరపాటుకు గురయ్యారని చెప్పారు. తనకు పదే పదే ఎన్నికలు రావడం ఇష్టం లేదని, తరచూ ఎన్నికలు వస్తుంటే అభివృద్ధి కుంటుపడుతుందని, అందుకే జమిలి ఎన్నికలు నిర్వహించాలని కోరుకుంటున్నట్టు చెప్పారు. ఒక ముఖ్యమంత్రిపై ప్రతిపక్ష నేత చేసిన వ్యాఖ్యలు ప్రజలు గమనిస్తూనే ఉన్నారన్నారు. తాను రాజకీయాల్లో ఇందిరాగాంధీ, రాజీవ్‌గాంధీ లాంటి వాళ్లతో పోరాటం చేశానని చెప్పారు.